కొన్ని తలపోతలు..


(తల్లి వొడిలో చిన్నారి బార్త్)


ఈ మధ్య నన్ను బాగా కదిలించిన పుస్తకం రోలాండ్ బార్త్ "మౌర్నింగ్ డైరీస్" 1977 అక్టోబరు 25 న అతని తల్లి చనిపోయింది. ఈ లోకంలో తనకి "నా" అన్న వొకే వొక్క మనిషి పోయింది. ఆ విషాదంలో బార్త్ రాసుకున్న డైరీ ఇది. అందులో వాక్యాలు కొన్ని అయినా తెలుగు చేద్దామని ఈ విఫల ప్రయత్నం.



అక్టోబర్ 27
-"నీకు స్త్రీ దేహం అంటూ తెలుసా?"
-తెలుసు. వొకే వొక్క స్త్రీ దేహం...అమ్మ దేహం...జబ్బు పడి, చనిపోతూ...


నవంబరు 4
సాయంత్రం ఆరు గంటలు
గది వెచ్చగా దీపకాంతిలో ఆహ్లాదంగా

నేనే పట్టుబట్టి
గదిని అలా మార్చాను (వొక చేదు ఆహ్లాదం)

ఓ, ఇక నించి నేనే నాకు అమ్మని!


నవంబరు 11
ఏకాకితనం అంటే
"బయటికి వెళ్తున్నాను.
ఫలానా టైమ్ కి మళ్ళీ వస్తాను.
లేకపోతే ఫోన్ చేస్తాను"

ఇంటికి వస్తూనే
"వచ్చేశాను.."

అని చెప్పడానికి
ఎవరూ లేకపోవడం!

నవంబరు 26

మరణానంతర విషాదం
మరీ దారుణం
తెగదూ
ముడిపడదూ

జనవరి 16

నా లోకం
బల్లపరుపు

యేమీ వినిపించదు
ప్రతిధ్వనించదు
గడ్డకట్టదు
కరగదు.


మార్చి 22

ఉద్వేగం తగ్గిపోతుంది
బాధ మిగిలిపోతుంది.
Category: 5 comments

5 comments:

Anonymous said...

మీ అనువాదం చక్కగా వుంది. భావం ప్రస్ఫుటంగా వచ్చింది. ముఖ్యంగా నవంబరు 11 వ తేదీ రాసినది, మనసులో ఎక్కడో కలుక్కుమనేట్టు చేసింది. ఈ మొత్తం లైన్లలో అక్టోబరు 27 నాడు తప్పితే, ఎక్కడా అమ్మ ప్రశక్తి లేదు. అయితే, అసలు డైరీలో ఉండే ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు వీలైతే, ఆ వాక్యాలు కూడా అనువదించి ఇక్కడ రాయండి. చదువుకోడానికి చక్కగా వుంటుంది. నాకు నచ్చాయి ఈ వాక్యాలు. సరళంగా, గూఢార్థాలు లేకుండా, స్పష్టంగా వున్నాయి. ఇంకా రాయండి ఇలాంటివి, దయ చేసి.

Afsar said...

ధన్యవాదాలు. నిజానికి ఈ వాక్యాలు స్పష్టంగా సూటిగా వుండడం వల్ల అనువాదం కష్టంగా వుంది. వచ్చే వారం మరికొన్ని అనువదిస్తాను. చదివి చెప్పండి.

అమ్మ అనే మాట బార్త్ వేరే వాక్యాల్లో వాడాడు. ఆ వాక్యాలు తరవాత వినిపిస్తాను.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండీ... ఏకాకితనం గురించి చదువుతుంటే.. గుండెలో సుడులు తిరిగిన బాధ కనుల తీరందాటి చొక్కా జేబును తడిపి తిరిగి గుండెలోతుల్లోకి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసింది.

సామాన్యుడు said...

జనవరి 16 వాక్యాలు బాగా కదిలించాయి. ఒంటరితనాన్ని బాగా పట్టాయి.

నవంబర్ 26 కోల్పోయిన దాని విలువను తెలియజేసాయి. ఎప్పుడూ గుండె పొరల్లో ఎక్కడో దాగిన ఆ తడి ఎంతకూ ఆరదు అని చెప్పి చెమర్చాయి..

ధన్యవాదాలు సార్..

Buchchi Raju said...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Web Statistics