అలాగే ఉండనీ కొన్ని రోజుల్ని,.....



No automatic alt text available.
అఫ్సర్ రాసిన ఈ కింది కవితను జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు చదవండి.

- అలాగే వుండనీ కొన్ని రోజుల్ని,
నువ్వేమీ వాటి పొరల పొరల్ని తవ్వి తీయకుండా-
కొండంత నిశ్శబ్దంలోనో, గోరంత ఎండలోనో 
వాటికి మాత్రమే అర్ధమయ్యే ఏదో సాంధ్య భాషలో.
- అలాగలాగే వుండనీ కొందరిని,
నువ్వేమీ వాళ్ళ లోపలికి ప్రశ్నల కొలమానాలు గుచ్చకుండా-
కొంత చీకట్లోనో ఇంకొంత మసక వెల్తురులోనో
వాళ్లకి మాత్రమే తెలిసి వచ్చే ఆనుభవిక వలయంలో.
- అలాగలా గలాగే వుండనీ 
ఎదురొచ్చే చెట్లనీ, ఎగిరెళ్ళే పక్షుల్నీ 
వాటి వాటి ఊహల వూపిరి తీవెల మీద నీ పాదమేమీ మోపకుండా-
తెగని యీదురు గాలుల్లోనో, పలకని మాటల హోరులోనో 
వాటిని మాత్రమే తడిపే 
కాసిని తొలకరి చినుకుల జడిలో.
- ఇలాగిలాగే వుండాలి 
కొంత కాలం, కొంత దూరం 
కొన్ని స్థలాలూ కొన్ని ప్రాణాలూ.
విరిగిరిగి పడే వుద్విగ్నపుటల వొకటి 
కాస్తయినా తేలిక పడే దాకా.
నీకూ వాటికీ మధ్యా 
వొక 
శాంత స్థిమిత 
పవనమేదో 
నెమ్మదించి వీచే దాకా.(అఫ్సర్)

ఈ కవితలో కవి వ్యక్తం చేసిన ఆలోచన ఆసక్తి దాయకం. జీవితం పట్ల, తోటి మనుషుల పట్ల ఉద్ధరింపు ధోరణి కలిగి ఉండి, చైతన్యవంతమైన మానవులుగా తమను తాము పరిగణించుకునే వారికి సున్నితమైన సునిశితమైన వారింపు కనిపిస్తుందిక్కడ. తొందరగా అందరినీ, అన్నిటినీ బాగుపరచాలి, అన్ని సంక్లిష్టతల్నీ, సందిగ్ధాలనీ, సంబంధాల అపార్ధాలనీ స్పష్టీకరించాలి, తక్షణం తేల్చిపారేయ్యాలి అనుకునే వాళ్ళు సమయ సందర్భాలనూ, అవతలి వారి స్వతంత్రతనూ, అనుభవలనూ , ఎరుకనూ పట్టించుకోరు. అలాంటి వారిని వారిస్తూ నడిపిన ఉద్వేగపూరిత సంవాదమే మొత్తం కవిత. 'Not a hasty stroke , like that which sends him to the dusty grave' అని William Cowper అన్నట్లు కాలక్రమంలో అనుభవాలు జీర్ణమయ్యేకొద్దీ ఒక స్పష్టత, ఒక సమంజసత్వం సాధ్యమవుతాయి కాబట్టి , అందకా సంయమనం వహించటమే సహజమని సూచిస్తూ కవిత ముగుస్తుంది.

ఈ ఇతివృత్తాన్ని కవితగా మలచటానికి కవి ఉపయోగించిన నిర్మాణ పద్ధతీ , కళా సాంకేతికత ఈ కవితను ఉన్నతస్థాయి కవిత్వానికి ఉదాహరణగా నిదర్శనంగా నిలిపాయి. విషయాన్ని ప్రకంపనగా వ్యాకులతాత్మక చిత్ర పరంపరగా మనో సంవేదనగా ప్రవేశపెట్టడంలోనే ఈ ఆర్ట్ ఉంది. వ్యాకులతకూ అదుర్దాకూ భౌతిక రూపాన్ని ఇవ్వడం ఎలాగో యువక వులు నేర్చుకోవడానికి అఫ్సర్ వాడిన టెక్నిక్ ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది.
అలాగే ఉండనీ కొన్ని రోజుల్ని,
నువ్వేమీ వాటి పొరల పొరల్ని తవ్వి తీయకుండా-
కొండంత నిశ్శబ్దం లోనో, గోరంత ఎండలోనో
వాటికి మాత్రమే అర్ధమయ్యే ఎదో సాంధ్య భాషలో
సమయ సందర్భాలను ముందు వాటికంటూ ఉన్న గోప్యతకు వాటిని వదిలిపెట్టమని చెప్పటానికి , కొండంత నిశ్శబ్దంలోనో గోరంత ఎండలోనో'', అని పద చిత్రాల్ని వాడుతున్నాడు కవి.గోప్యత అనే భావం అలా భౌతిక రూపం సంతరించుకుంది. ఇంకా ముందుకుపోతే
అలగలాగే ఉండనీ కొందరిని.
నువ్వేమీ వాళ్ళ లోపలికి ప్రశ్నల కొలమానాలు గుచ్చకుండా
కొంత చీకట్లోనో ఇంకొంత మసక వెల్తురు లోనో
వాళ్ళకి మాత్రమే తెలిసివచ్చే అనుభవిక వలయంలో
ప్రశ్నల కొలమానాలూ, కొంత చీకట్లోనో, ఇంకొంత మసక వెల్తుర్లోనో, ఇవన్నీ ఎదుటి వాళ్ళను వాళ్ళ మానాన వాళ్ళని వుండనివ్వటానికి చెందిన కాంక్రీట్ రూపాలు. ఇలా మనుషుల తాలూకు , సందర్భాల తాలూకు స్వతంత్ర అస్తిత్వాన్నీ స్వేచ్చనీ గౌరవించాలనే సూచనను తత్సంబంధ వస్తుజాలాన్ని అమర్చడం ద్వారా , ఉద్దేశించిన ఆలోచనని ఫీలింగ్ గా అనుభవంగా మార్చగలిగాడు కవి. ఈ వస్తుగతీకరణ తారాస్థాయికి చేరిన వ్యక్తీకరణను ఇప్పుడు గమనించండి.
ఎదురొచ్చే చెట్లనీ, ఎగిరెళ్లె పక్షుల్నీ
వాటి వాటి ఊహల ఊపిరి తీవెల మీద
నీ పాదమేమీ మోపకుండా-
తెగని ఈదురు గాలుల్లోనో, పలకని మాటల హోరుల్లోనో
వాటిని మాత్రమే తడిపే
కాసిని తొలకరి చినుకుల జడిలో
ఎదురొచ్చే చెట్లూ, ఎగిరెల్లే పక్షులూ వచ్చే సత్సంబంధాలనీ పోయే సంబంధాలని లేక సుఖదుక్ఖాల్నీ వస్తుగతీకరిస్తే- 
ఈదురు గాలులు, పలకని మాటల హోరులు ,తొలకరి చినుకుల జడలు స్వానుభవాల సంక్షోభాన్ని పట్టి చ్చిన పద చిత్రాలు. జనాన్ని అనుభవాలనుంచి నేర్చుకోనివ్వకుండా అప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని వారిమీద పులమాలనే సోకాల్డ్ చైతన్యపరులను తగిన రీతిలో కౌన్సిల్ చెయ్యడానికి వాడిన బాహ్య వస్తు సముదాయం ఇక్కడ స్పష్టమయింది.
చెప్పదలుచుకున్న విషయానికి తత్సంబంధ పద చిత్రాల ద్వారా బాహ్య వస్తువుల అమరిక ద్వారా ఒక వైబ్రేటింగ్ మానసిక వాతావరణం సృజించటమే ఇక్కడ అఫ్సర్ వాడిన టెక్నిక్. ఇదే objective correlative అనిTS Elliot అంటాడు. తెలుగులో దీన్ని వస్తు సత్సంబంధి అని పిలుస్తున్నాం. అలాగలాగలాగే అని పదేపదే రిపీట్ చేయడంలో అపర ఉద్దారకుల మీద కావచ్చు పరిస్థితుల అవాంఛనీయత మీద కావచ్చు విసుగునీ వ్యంగ్యాన్నీ ధ్వనించటం పసిగట్టొచ్చు.
కవితలో ఇలా ఒక ఎగ్జిస్టన్సియల్ angst , అస్తిత్వ పరివేదన వ్యక్తమౌతుంది. "Humans go in accordance with their experiences rather than the definitions and theories the world imposes on them. Their credo is existence not the essence." అని గట్టిగా వాదించిన జియో పాల్ స్సార్త్ర్ తత్వం బలంగా ఈ కవితలో వ్యక్తమయ్యింది. అంతే కాదు , since man is a conscious being one cannot afford to change him automatically అని Edmund Husserl చేసిన హెచ్చరిక ఈ కవిత లో ప్రతిబింబించింది. మార్పు పరస్పరత ను సూచిస్తూ అఫ్సర్ ఏమన్నాడో చూడండి.
ఇలాగిలాగే ఉండాలి
కొంతకాలం కొంత దూరం
కొన్ని స్థలాలూ కొన్ని ప్రా ణాలూ
విరిగిరిగిపడే ఉద్విగ్నపుటల ఒకటి
కాస్తయినా తేలిక పడే దాకా
నీకూ వాటికీ మధ్య 
ఒక శాంత స్థిమిత
పవనమేదో
నెమ్మదించి వీచే దాకా
విషయాన్ని గురించి కవితాత్మకంగా మాట్లాడటం కాకుండా విషయం కవిత్వంగా పరిణమించటానికి కావాల్సిన కవిత్వ నిర్మాణ పద్ధతిని అనితర సాధ్యంగా ఉపయోగించాడు అఫ్సర్. కవితకు ఎదో పెర్సొనల్ , సోషల్ సందర్భమో ప్రేరణగా నిలిచివుంటే ఉండొచ్చు. దాన్ని ఒక తాత్విక సారంగా సాధారణీకరించటం మామూలు విషయం కాదు.
అయితే ఈ struture తాలూకు ఆకర్షణ , ఎత్తుగడ, సంవిధానం తాలూకు చొచ్చుకుపోయే స్వభావం ఎందుకో శ్రీ శ్రీ 'సాహసి' కవితను గుర్తు చేస్తుంది.
ఎగిరించకు లోహ విహంగాలను
కదిలించకు సప్త భుజంగాలను
ఉండనీ
మస్తిష్క కూలయంలో
మనో వల్మీకంలో
అంతరాల భయంకర
ప్రాంతరాలనా నీ విహారం
ముళ్ళ దారినా నీ సంచారం
పలికించకు మౌన మృదంగాలను
కెరలించకు శాంత తరంగాలను
హృదయంలో దీపం పెట్టకు
మంత్ర నగరి సరిహద్దులు ముట్టకు (శ్రీ శ్రీ)
ఎత్తుగడ ,సంవిధానంలోనే కాదు objective correlative టెక్నిక్ విషయంలోనూ అఫ్సర్ కవితకీ శ్రీ శ్రీ కవితకూ సామ్యం కనిపిస్తుంది. కాకపోతే శ్రీ శ్రీ మార్చాలని ప్రయత్నించే చైతన్య పరుల్ని కాదు విమర్శిస్తుంది. మారని మధ్య తరగతి పౌరుల్ని. హృదయంలో దీపం పెట్టటం ఇష్టం లేని వాళ్ళని. శ్రీ శ్రీ కాలానికి ,అఫ్సర్ కాలానికి ఉన్న వ్యత్యాసం వారి కవితల్లో రిఫ్లెక్ట్ అయిన దృష్టికోణాల వ్యత్యాసాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు.
Do not go gentle into that good night
Rage rage against the dying of the light
అని రాస్తాడు Dylan Thomas. ఇతనిదీ ఇదే ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడల్ని వాటి అత్యంత గరిష్ట స్థాయికి అఫ్సర్ తీసుకెళ్లాడనటంలో సందేహం లేదు.

‘ఇంటివైపు’ ముచ్చట: ఒక కానుక



-శ్రీరామోజు హరగోపాల్
~


ఈ కవి అన్వేషణ అనంతం. తనను తాను వెతికిపట్టుకునే దారిలో బాటసారి. ఎడతెగని ముచ్చట దారితో, తనతో.  

కవిత్వం కవి తనతో, కవి లోకంతో చేసే సంభాషణ కదా. 

ఇంటివైపు ‘ఫనా’ కవిత్వం.
‘‘ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిరబైరాగినవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో
ఇదీ వొక ఆటేకదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి’’

ఒక మార్మికతను మోస్తున్న ఆలోచన...వ్యవధిలేకుండా లోపల తిరుగుతున్న తలపు తరగల నూగు కలల ముత్యాలనౌక... తాను లేకుండానే... కవిత్వంగా మారిపోతున్న వేళ ఇంటివైపు....
‘‘But I am he who has been exiled beyond the wall and the gate
Take me under your eyes
Take me wherever you are
Take me however you are
I will return to myself the color of my face and body
The light of heart and eye
The salt of bread and a melody
The flavor of the soil and the homeland’’ 
Darwīsh, in his poem “ʿĀshiq min Filasṭīn” (“A Lover from Palestine”) speaks about place and addresses his lover, the soil.

ఇంటి నుంచి దూరమైన మనిషి ప్రవాసవేదన తను పుట్టిన మట్టిని, తన ప్రియురాలిని మరువలేనితనం... ఈ కవిత. 

దర్వీష్ ను చదివితే అఫ్సర్ బాగా అర్థమవుతాడంటాడు నారాయణస్వామి. అఫ్సర్ కవిత్వంలో ఎన్నోన్నో విభిన్నమైన కోణాలున్నాయి. తన కవిత్వంలోలోతుల్లో కొత్తస్వరం వినిపిస్తుంటుంది. ఆ స్వరానికి సంగీతకర్త లెవ్వరు? తన జీవితానుభవాలే కదా... తనకు జీవితాన్నిచ్చిన, ఇంకా జీవితమైన వారినే అడగాలి. అఫ్సర్ లోపల పీఠమేసుకుని కూర్చున్న బైరాగి ఎవరని?

రెండురెక్కలపక్షి కాడు ఈ కవి. బహుపక్షాలున్నవాడు. తనమీద తనజీవితమంత విస్తారమైన ప్రభావాలున్నాయి. వామపక్షభావజాలం, సూఫీతత్వం, ప్రేమతత్వం... కొన్ని వొదిలించుకున్నవి, కొన్ని కౌగిలించు కున్నవి తనను లీడ్ చేస్తుంటాయి. కాకపోతే ఈ కవి బాగా ఆలోచించి రాస్తుంటాడు. ఆ ఆలోచనల చిక్కుల్లోకి పోతే మనం కూడా చిక్కుకుంటాం. ఆ ఆలోచనలు ప్రపంచకవులందరిని చదవడం వల్ల వచ్చినవనుకుంటాను. ఇంతకు ముందు తను రాసిన కవితలకు ఇప్పటి కవితలకు తేడాలు తెలుస్తుంటాయి.
అఫ్సర్ కవితలు మంచి బంగారు పనివాడి డిజైన్లలా కొత్త,కొత్తవిగా వుంటాయి. చాలా అందమైన కవిత్వం. చదవగానే మోహపరిచే గుణముంది ఈ కవిత్వానికి. ఒకదిక్కు కన్నీళ్ళు పెట్టిస్తూనే మరొకదిక్కు హాయిగా నవ్విస్తుందీ కవిత్వం.

జీవితాన్ని ఆటంటారు, నాటకమంటారు, కల అంటారు, కాని, ఆనందమనరు... బతుకుతున్న ప్రతిక్షణం కలిగే ప్రతి అనుభవంవల్ల దొరికే ఎరుక అంతా ఆనందమే కదా... కన్నీరు చిప్పిల్లే నవ్వు... అనుభూతులతో ముప్పిరిగొనే మనసు... ఇంటివైపు అంటేనే ఆనందం. బాధలే పడ్డామో, నవ్వులే కూడబెట్టుకున్నామో, పొందిన అనుభవాల చందనాల మాలవేసి ఆహ్వానిస్తుంది ఇల్లు. ఇంటిది పేగుబంధం. అమ్మ. అమ్మలెక్క ఇల్లు.

‘‘యేమేం తీసుకెళ్తాను ఇంటికి,
నా వూరికి
ఆ తొలిరక్తపు సెలయేటికి
కష్టంగా వుంటుంది
యీ లోకపు కొలమానాల కానుకల్ని చూస్తే
అర్థాలు మారిపోయిన విలువల్ని నిలువెల్లా చూస్తే
చివరికేమీ తేల్చుకోలేక
మనసు కూడా ఇరుకనిపించే సంతోషాన్నో
మళ్ళీ వదులుకుని రావాలన్న దిగులునో
కాస్త ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను
యేమై వస్తానో ముందే తెలిసిపోయినట్టూ వుంటుంది.
యేమీ 
తెలియనట్టూ వుంటుంది.’’

ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన వారిలో ముందుగా రాసిన ‘ఎంతెంత దూరం’లో స్వాతికుమారి ఉదహరించిన గులాం అలీ కవితనే చెప్పుకోవాలి ఇక్కడ..

‘నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా’... ఇంటిబాట మరిచిపోయామా మనం? మరుపుతెరలు పడ్డాయా, మనమే కప్పుకున్నామా... ఏదో కానీ వెతుకులాటలోనైతే వున్నాం కనుక బతికే వున్నాం.

If I touch the depths of your heart.
If I come back
Use me as wood to feed your fire
As the clothesline on the roof of your house
Without your blessing
I am too weak to stand.
I am old
Give me back the star maps of childhood
So that I
Along with the swallows
Can chart the path
Back to your waiting nest అంటాడు దర్వీష్. ఇది పునరాగమన కాంక్ష. ఇది ఆశ. కవి అన్వేషణ అట్లాంటిదే.
ఈ కవిని భౌతికంగా చూస్తే ముస్లిం. తనదేశంలోనే పరాయివాడుగా చూడబడుతున్నవాడు. బతుకు తెరువు కోసం ప్రవాసంలో వున్నవాడు. దేశంలో మతప్రవాసం. బయట బతుకు ప్రవాసం. తనంతట పోయినా Exiలే కదా. Carrying a lonely road … arrested himself into himself…ఎక్లాచలోరే...

‘నిన్ను వోడించే యుద్ధం’ అనే కవితలో

‘నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని
దాన్ని భక్తిగా తర్జుమా చేసుకోలేను ఎప్పటికీ
నువ్వు క్షమించకపోయినా సరే
నాకు యే దేహమైనా
అన్నంపళ్ళెంలాగే కనిపిస్తుంది యెప్పుడూ
యే దేశమైనా
ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ
యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ
అక్కడ ఆ గరీబు వొంట్లోనూ
వొకే ఆకలికేక
వొకే వెతుకులాట’ అంటాడు అఫ్సర్.
నోరు,చెయ్యీ అను ఆ రెండు దేశాలు అనే కవితలో కవి
‘ చెయ్యి వొకదేశం
నోరు వొకదేశం
నువ్వూ నేనూ శరీరఖండాలం
ఇంకా తెగిపోతాం సరిహద్దులు తెంపిపోతాం
వొకేవొక్క అన్నంమెతుకు నా వునికి
మిన్ను విరిగి మీదనేపడనీ
భూమిబద్ధలయితే బద్ధలవ్వనీ 
మరి 


లి’ 
ఏ దేశమైనా పేదరికాన్ని లేకుండా చెయ్యదు. ఏ గరీబు ఆకలినీ పట్టించుకోదు. ప్రజలు చెయ్యొక దేశంగా, నోరొక దేశంగా తెగిపోతూనేవుంటారు...మారదు దేశం..మారదు లోకం.

‘కొత్తపదాల అందాన్ని అద్ది హత్యని లించింగ్ అన్నారు.యింకోసారి అది ఎన్కౌంటర్ కావచ్చు. చట్టరాహిత్యపుటడవిలో పేరు తెలియని చెట్లకు వేలాడేసి, ప్రాణాల్ని చివరంటా వేటాడవచ్చు. నగరం నడిమధ్యలోనే యేదో వొక నిషిద్దమాంసం ఎరగా విసిరి యేకంగా మనిషినే నిషిద్ధపదార్థం చేయచ్చు. పదమొక్కటే మార్తుంది. వేట అదే. హత్యా అదే.

....................
యింకా కొన్ని పేజీల తరవాత అదే కథ మనదాకా వస్తుంది.
...................
నీ మానవజాతి చరిత్ర సమస్తం
హత్యచేయబడ్తున్న హోరు చూస్తున్నావా నువ్వు?’........... 
కవి అంతరంగంలో ఈ హోరు వుంది.నిస్సహాయవేదన వుంది. మానవీయత వుంది...కాని, ఎట్లా ఈ దుఃఖాన్ని వొదిలేయడం. ఎట్లా మనిషి మనగలగడం? దేన్ని మనుగడ అనాలి. 
‘‘నువ్వు గొంతు సవరించుకునేలోగా
నా వొళ్ళుపొంగి దండమయిపోయిందిలే
ఇన్నాళ్ళూ నిన్ను పీరీలాగామోశానా
ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే
చరిత్రచొక్కాను తిరగేసి తొడుక్కుంటున్నా
నన్ను దాచేసిన చిరుగుకంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా
కలల కళల మాయాదర్పణమా, కాసేపు పగిలిపో
రోజ్ రోటీ నా అద్దం
దాంట్లోంచి రాస్తున్నా కొత్తచరిత్ర’’ ఇది కవిగా తన స్పందన. కవులేం చేస్తారు అని శివారెడ్డి అన్నట్టు అఫ్సర్ ఒక కొత్త పద్యం రాసియిచ్చాడు.
కవిగా అఫ్సర్ కవిత్వం మోడర్న్ ఎక్స్ ప్రెషన్. కవితానిర్మాణ, నిర్వహణలు కొత్తబాటలో...ఊహించని విధంగా కవితను మొదలుపెట్టడంలోగాని, ముగించే టపుడుగాని...సాంప్రదాయిక వచనకవితారీతులను వొదిలిపెట్టాడనిపిస్తుంది. ఈ సంకలనంలోని ఏ కవితను చూసినా తెలిసిపోతుంది.ఒక్క కవితలో అనేకకవితల్ని నింపి రాయడం తనప్రత్యేకత. భావసంక్లిష్టత. వస్తువే తన కవితాశిల్పాన్ని నిర్మించుకుంటుంది. ఎంత శబలమైన మాటలను వాడుతాడో అంతే నిగూఢమైన భావాలను దట్టిస్తాడు. 
ఈ కవి కవికాడనిపిస్తుంది.ఉత్త ప్రేమబైరాగి.
గాలిబ్ ‘దాతలగు వారి చేతులను చూతునోయి’ అన్నట్టు అఫ్సర్ కూడా తనకవిత్వం చదివేవారి లోతులను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఏకకాలంలో బహుముఖభావవ్యక్తీకరణ చేయడం ద్వారా ఈ కవిత్వం చదివేవాళ్ళకు కావలసినదేదో దొరికేటట్టు చేస్తాడు.
శివారెడ్డిగారు అఫ్సర్ లో పాలస్తీనా కవి,ప్రవాసి దర్వీష్ ను చూస్తే, చినవీరభద్రుడు రూమీని చూసాడు. అఫ్సర్ కవిత్వంలో చింతకాని నుంచి అమెరికా వెళ్ళిన ప్రవాసి కనిపించాడు శివారెడ్డికి. అంతరాంతరాలలోని ద్వైధీయమానసం నుంచి బైరాగిగా బయటపడ్తున్న ఫనా కవిత్వం రాసిన సూఫీని చూసాడు వీరభద్రుడు. అనేకపార్శ్వాలతో సింగిడిలెక్క అగుపించే అఫ్సర్ కవిత్వాన్ని దర్శించడం మామూలు కాదు. దార్శనికత కావాలి. ఆ యిద్దరు దార్శనికులే కదా. వారి కన్నా ఇంకా గొప్పగా నేను చెప్పగలిగిందేమున్నది?
“Listen to the story told by the reed,
of being separated.
“Since I was cut from the reedbed,
I have made this crying sound.
Anyone apart from someone he loves
understands what I say.
Anyone pulled from a source
longs to go back.”…….జలాలుద్దీన్ రూమి అంటున్నాడు... ఇంటివైపుకు ఇంతకన్నా నిర్వచనముంటుందా? తనను తన ఉనికి నుంచి వేరుచేసి తూట్లుపొడువబడ్డ పిల్లంగోవి దుఃఖస్వరమే పాడుతుంది, తిరిగి తనను తనవెదురుపొదను చేర్చేదాక. మనిషి అంతే.
‘‘కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీలోపల శిథిలమయిపోనీ నిబ్బరంగా’’...అంటాడు అఫ్సర్ రూమీలెక్కనె.
అంతేకాదు అఫ్సర్, ‘‘ కాలాన్ని నిలువునా చీల్చిన తరవాత, నువ్వు నిజంగా పరమయోగివే’’ నంటాడు. 
‘‘అయిదువాక్యాల్లో అన్నీ చెప్పి
నాలోపలి గుహలన్నీ తొలిచి
నీ కంటి ముందు వొలిచి పెట్టాలని అనుకున్నా
ఆ అయిదువాక్యాలేమిటో చెప్పేలోగా
నా వంతుకొచ్చిన క్షణాలు జారిపోయాయ్
చివరికి నీకేమీ చెప్పలేదు’’
రూమి ప్రేమికులను విడివడని దేహం,ప్రాణాలవలెనె చూస్తాడు.
Laz Slomovits అనే రచయిత ఒక ఇరానియన్ సింగర్,పెయింటర్ Sepideh Vahidiని రూమి ప్రేమగురించి ఏం చెప్పాడో చెప్పమంటే, ఆమె“To be in love, to be in love and to be in love.” అన్నది. ప్రేమకు హద్దులు లేవని రూమి ఎరుగడా.
‘‘Lovers don’t finally meet somewhere
they’re in each other all along’’. అంటాడు రూమి.
నీలోనే అనే కవితలో,
‘‘నీలోనే లీనమయ్యే చప్పుడునై
నీలోపల సుడులు తిరిగే మౌనమై
నిన్ను దాటి వెళ్ళలేని అలనై
కొన్ని జీవితకాలాలు నీలోనే...’’ అవును కదా..
‘‘యిప్పుడంతా నీ లేతపదాల పద్యాన్ని నేను
నీపెదవుల మీద ననలెత్తే బోసి అక్షరాల వోనమాలు దిద్దుకుంటూ, నీలోంచి యింకో భాషని తోడుకొచ్చి, నా పసిదనాల పిల్లకాలవల్లోకే నా కాలాన్నంతా మళ్ళిస్తా...
నీ క్షణ,క్షణ పుట్టినరోజుల పునర్జన్మల్లో ప్రతిసారీ నాకు నేనే మెలకువ.
నువ్వే మేల్కొపలుపు.
రా,
యిద్దరికీ
యిది ఆటసమయం..’’ క్రీడామాత్రంగా జీవితం. ప్రేమికులు శాశ్వతమైనవాళ్ళు.
అఫ్సర్ కవితల్లో ప్రేమకవితలు ప్రత్యేకం. అవి తనవే కావు, సమస్తమానవాళి ప్రేమానుభవాల్లెక్కనె వినిపిస్తాయి. తన కవితలు చాలామట్టుకు వ్యాఖ్యానాలు అక్కరలేనివే. తనకవితారూపాలన్నీ రూపకాలే. 
తనకవిత్వం గురించి ఒక్కసారి రాస్తే మనసునిండదు.

‘ఇంటి వైపు’ ఒక ప్రయాణికుడి నిరంతర తాత్విక సంభాషణ

-నారాయణ స్వామి వెంకటయోగి 
~

1992 లో నా కల్లోల కల మేఘం వచ్చినప్పుడు, ఆంధ్ర భూమి లో అనుకుంటా ఒక రివ్యూ వచ్చింది. హరనాద్ చేసిండు. చాల అన్యాయమైన రివ్యూ అది. ఆయనకు శివారెడ్డి గారి మీద దేవి ప్రియ మీద న్న వ్యతిరేకతను వెళ్ళబుచ్చడానికి వాళ్లకు ఇష్టమైన, వాళ్ళను ఇష్టపడే నన్ను నా కవిత్వాన్ని చీల్చి చెండాడాడు . నిజానికి ఆ రోజుల్లో నా మీద శివారెడ్డి గారి కవిత్వ ప్రభావం ఉండేది కానీ దేవి ప్రియ గారిది కాదు. అదేదీ పట్టకుండా, నా కవిత్వం లో మంచీ చెడు చెప్పకుండా కేవలం తిట్టడమే పరమావధిగా ఆయన రివ్యూ రాసిండు. ముందు ఆయనెవరో నేను పోల్చుకోలేదు. తర్వాత తెల్సింది ఆయనే విశాలాంధ్ర బుక్ హౌస్ లో ఉండే హరనాద్ అని. ఆ రివ్యూ చూసి చాల డిస్టర్బ్ ఐన. ఇంకా అప్పటికీ రివ్యూలను ఎట్లా తీసుకోవాలో , యే మెచూరిటీ తో అర్థం చేసుకోవాలో తెలవదు నాకు. శివారెడ్డి గారి దగ్గర గుడ్లల్ల నీళ్ళు తీసుకున్న. భలేవాడివయ్యా ఆయనెవరో అన్యాయంగా రాస్తే నువ్వు దానికి ఫీల్ కావాలా ఏమిటి అని ఓదార్చిండ్రు సారు. కొంచెం మనసు స్తిమితపడ్డా లోలోపల బాధ తొలుస్తూ ఉండింది.

సరిగా తర్వాత వారమే ఆంధ్రభూమిలోనే హరనాద్ రాసిన రివ్యూకు బదులుగా సమాధానంగా ‘నారాయణస్వామి పావు కాదు పావురమే ‘ అని మరో రివ్యూ వచ్చింది. అందులో హరనాద్ రాసినదానికి బలమైన రిజాయిండర్ ఉన్నది. ఎవరబ్బా రాసింది అని చూస్తె, కింద పేరు అఫ్సర్ అని ఉంది. ఒకటికి రెండు సార్లు చదివిన. అద్భుతంగా రాసిండు. హరనాద్ లేవనెత్తిన అర్థం పర్థం లేని వాదనలను పూర్వపక్షం చేస్తూ, అయన అభిప్రాయాలు ఎట్లా పక్షపాత దురభిప్రాయాలో నీళ్ళు నమలకుండా స్పష్టంగా చెప్పిండు అఫ్సర్ తన వ్యాసం లో. బాగ నచ్చింది. అద్భుతంగా ఉంది. ఐతే వెంటనే ఫోన్ చేసి చెప్తామంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు. తన ఫోన్ నాకు తెలియదు. హడావిడిగా ఆంధ్రభూమి పేపర్ కొనుక్కొని శివారెడ్డి సార్ దగ్గరకు పోయిన. నన్ను చూడగానే సార్ ‘అఫ్సర్ అదరగొట్టిండు చూసినవా’ అన్నరు. చూసిన సార్ అని నేను పేపర్ తీసి చూపించిన. చాల సేపు ఆ వ్యాసం గురించి, హరనాద్ రాసిన రివ్యూ గురించి మాట్లాడుకున్నాం సారూ నేనూ. ఎట్లా సార్ అఫ్సర్ ను కాంటాక్ట్ చేసేది అని అడిగితె తను విజయవాడలో ఉన్నడయ్యా – ఉత్తరం రాయి అన్నారు సార్. అట్లే రాస్తాను అన్న – 

అప్పటికే అఫ్సర్ చాల మంచి కవిగా పేరున్న వాడు. మంచి సాహిత్య విమర్శకునిగా కూడా పేరుంది. న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్ గా, కాలమిస్టు గా కూడా ప్రసిద్ధుడే. రక్తస్పర్శ, ఇవాళ కవితా సంకలనాలు , క్రితం తర్వాత అని తను ఇతర కవులతో కలిసి రాసిన దీర్ఘ కవిత వచ్చి ఉన్నాయి. తను ఖమ్మం అని తెలుసు. సుధాకిరణ్ తో అనేక సంభాషణల్లో అఫ్సర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. సాధారణంగా ఖమ్మం లో సాహిత్య వాతావరణం గురించి మాట్లాడినప్పుడల్లా అఫ్సర్ ప్రసేన్ సీతారం యాకూబ్ అన్నల పేర్లు రాకుండా ఉండడం అసంభవం. అప్పటికే యాకూబ్ అన్న అన్వర్ ఉల్ లూం కాలేజిలో లెక్చరర్ గా చేస్తున్నారు. నేను వాసవీ లో చేస్తున్న. మల్లె పల్లి లో తన కాలేజి. మాకు దగ్గరే. అప్పుడప్పుడు వెళ్ళేది కూడా. ఐతే అఫ్సర్ను వ్యక్తిగతంగా కలిసింది చాల తక్కువ. ఒక సారి 1988 లో ఖమ్మ లో పీ డీ ఎస్ యూ సభలైనప్పుడు (నేనూ విద్యా కల్సి వెళ్ళిన మొదటి సభలవి) అక్కడ తను కలిసినట్టు గుర్తు. తను పీ డీ యేస్ యూ కు దగ్గర గ ఉంటాడు అని కూడా విన్న. ఆ రోజుల్లో అఫ్సర్ ను గురించి గానీ ఖమ్మం విజయవాడ కేంద్రంగా ఉన్న కవుల ‘గ్యాంగ్’ గురించి విన్నప్పుడు గానీ నాకు చాల అసూయగా ఉండెడిది. వాళ్ళంతా కలిసి సంయుక్త దీర్ఘ కవితలు రాయడం, కవిత్వం లో ‘రెబెల్స్’ గా ఉండడం, కొత్త మార్గాలు వెతకడం, వగైరా వార్తలు విన్నపుడల్లా వెంటనే విజయవాడో ఖమ్మమో పోవాలి అన్నంత ఆవేశం కలిగేది. హైదరాబాదు లో శివారెడ్డి సార్ దేవిప్రియ సార్ వీ వీ సార్ విమలక్క లాంటి కవుల సాంగత్యం మాకుంది లే అన్న గర్వం మరో వైపు.

అట్లా ఎక్కువ సార్లు కలవకపోయినా అఫ్సర్ నేనూ బాగా సన్నిహితమయ్యాము. మంచి దోస్తులమైనం.
తరవాత 2005 జులై లో తానా సభల సాహిత్య కార్యక్రమానికి ఆరి సీతారామయ్య గారు పిలిస్తే వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళా కలిసిండు అఫ్సర్ ఈ సారి కల్పనతో. ఆ రెండు మూడు రోజులు చాల ఆత్మీయంగా గడచినాయి. ఇంక అప్పటినుండి అమెరికా లో నాకు అఫ్సర్ అత్యంత ఆత్మీయుడైన గొప్ప స్నేహితుడూ కవీ. నేను ఇంకొంత మంది మిత్రులతో ‘ప్రాణహిత’ నడిపినప్పుడూ, తనూ రవీ ముందు ‘వాకిలి’, తర్వాత తనూ కల్పనా ‘సారంగ’ నడిపినప్పుడూ ఇద్దరం మాట్లాడుకోని రోజు లేదు. మా సంభాషణల్లో కవిత్వమూ, సాహిత్యమూ, సాహిత్య విమర్శా, సమకాలీన రాజకీయాలు , అస్తిత్వాలు ఉద్యమాలు, తెలంగాణా , ప్రవాసమూ – దొర్లని అంశం లేదు. మా సంభాషణలు అట్లా నడుస్తూనే ఉన్నాయి. తను ఒక గొప్ప కవే కాదు లోతైన ఆలోచన పరుడు, చదువరి, గొప్ప మేధావి. తన నుంచి ఎన్నో నేర్చుకున్న. ముఖ్యంగా సారంగ కోసం రాయమని తను నన్నడిగినప్పుడు, నాకు మంచిగా రాయడం, వచనం లో క్లుప్తత గాంభీర్యత ఎట్లా తీసుకురావాలో నేర్పింది తనే. నా సందుక తీసుకురావాలి అనుకున్నప్పుడు కవితలన్నింటినీ చదివి ఎడిట్ చేసి కొన్నింటికీ శీర్షికలు పెట్టిందీ తనే. నాకు శీర్షికలు పెట్టడం రాదు. అందులో తను దిట్ట. అట్లే వానొస్తద కవితలు కూడా. నిజానికి రెండు మూడు పేర్ల మధ్య ఊగిసలాడుతూ యే పేరుపెట్టాలి అని తననడిగితే వానొస్తద అని సూచించిందీ తనే! ఇప్పటికీ నా ప్రతి పోయెం కూ మొదటి పాఠకుడు తనే.

మొన్న డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహా సభలకు హైదరాబాద్ పోయినప్పుడు అఫ్సర్ తన పుస్తకం తీసుకొస్తున్నాడని తెల్సు. అంతకు ముందు శివారెడ్డి సార్ దగ్గర ముందు మాటకోసం ఎదిరిచూస్తున్నాడని తెలుసు. సార్ తో మాట్లాడిన ప్రతి సారి ముందు మాటనే గుర్తు చేసేటోన్ని. రాస్తున్న నాన్నా ఇదిగో ఈ నెలాఖరు లోగ ఇస్తా అని సార్ అనడం నేను అఫ్సర్ కు చెప్పడం. ఓ సారి సార్ ను హైదరాబాదు లో కలిసినప్పుడు అన్నాడు అఫ్సర్ అందరి లాంటి పోయేట్ కాదు కదా నాన్న తొందరగా రాసెయ్యడానికి - తను చాల డిఫికల్ట్ పోయేట్ కదా – తన ఇంతకు ముందు పుస్తకాలు కూడా తెప్పించుకున్న తిరగేస్తున్నా అన్నారు. అప్పుడే సార్ కు పాలస్తీనా మహాకవి దార్వీష్ ‘బటర్ ఫ్లై బర్డెన్’ పుస్తకం ఇచ్చిన. యే కవిత్వ పుస్తకమైన ఆనందంగా తెసుకుని కళ్ళకద్దుకుంటారు సార్. దార్వీష్ పుస్తకం చూడంగానే సార్ కండ్లలో ఆనంద బాష్పాలు. అద్భుతం నాన్న అన్నారు సార్. పుస్తకాలూ అదీ కవిత్వ పుస్తకాలూ గిఫ్ట్ గా ఇస్తే ఆనందంగా కండ్ల నీళ్ళురాల్చేడిది నాకు తెలిసి సార్ ఒక్కరే. తర్వాత మాట్లాడి మల్లా అఫ్సర్ ముందు మాట గుర్తు చేస్తే ‘దొరికింది నాన్నా ఒక మార్గం దొరికింది – దార్వీష్ చూపించిండు మార్గం, ఇంకెంత మరో రెండు మూడు వారాల్లో వచ్చేస్తది’ అన్నారు సార్. అన్నట్టుగానే అద్భుతమైన ముందు మాట రాసిండ్రు సార్. తర్వాత పుస్తకం వాకిలి ప్రచురణగా అద్భుతంగా రావడం, ఆవిష్కరణ జరగడం ఆ సభకు నేను వెళ్ళడం జరిగిపోయినయి.

తర్వాత ‘ఇంటివైపు’ ను చదువుతున్నప్పుడల్లా నేను దార్వీష్ నే గుర్తు తెచ్చుకున్న. నా దగ్గరున్న బటర్ ఫ్లై బర్డెన్ సార్ కు ఇచ్చిన కదా మరొకటి కొనుక్కున్న – మల్ల చదివిన. అఫ్సర్ నూ దార్వీష్ నూ పక్క పక్కన పెట్టుకొని చదివిన. నిజమే సార్ చెప్పింది. సార్ తన ముందుమాటలో అంతగా వెతకలేదు కానీ (ముందు మాటకు ఉండే స్కోప్ వేరు కదా) దార్వీష్ ను చదివితే అఫ్సర్ ఇంకా బాగా అర్థమవుతాడు. అట్లా అని అఫ్సర్ అర్థం కాని కవి అని నా ఉద్దేశ్యం కాదు. ప్రతి కవికీ అనేక కోణాలుంటాయి. అనేక పరిమాణాలుంటాయి. అనేక పార్శ్వాలుంటాయి. మరీ ముఖ్యంగా ఎన్నో యేండ్ల నుండీ కవిత్వ వ్యవసాయం దీక్షగా చేస్తున్న కవి. అనేక అంశాల మీద విస్తారంగా రాస్తున్న కవి. ఊరికే రాయడం కాదు విశ్లేషణతో రాస్తున్న కవి. అఫ్సర్ ను అల్లాటప్పా గా చదివేసి నాకు అర్థమైండు- ఆయన కవిత్వమంతా నాకు తెలిసిపోయింది అనుకోవడానికి వీలు లేదు. అది అంత సులభం కాదు. పైగా అఫ్సర్ ఊరికే కవిత్వం రాసి పడేయ్యడంలేదు. తనను తను ప్రతి సారి పుటం పెట్టుకుంటున్నాడు. ప్రపంచ కవుల్ని ఔపోసన పట్టి వాళ్ళ కవిత్వాన్ని విశ్లేషణాత్మకంగా చదివి తన కవిత్వంలోకి గుణాత్మకంగా ఇంకిన్చుకున్నాడు. అది సూఫీ కవులు కావచ్చు అదొనిస్ కావచ్చు దార్వీష్ కావచ్చు మార్క్ స్త్రాండ్ కావచ్చు టొమాస్ ట్రాన్ట్రోమ్మర్ కావచ్చు. అఫ్సర్ తో ఒక గంట మాట్లాడితే ఎందరొ కవుల్ని పరిచయం చేస్తాడు. అయన కవిత్వం చదివితే ముఖ్యంగా ఇంటి వైపు చదివితే వర్తమాన ప్రపంచ సాహిత్యం మీ ముందు ప్రత్యక్షమై, మీ కండ్లలోకి మనసులోకి చివరికి మెదడు లోకీ శాశ్వతంగా ఇంకిపోతుంది. అట్లా ఇంకిపోయినట్టు మనకు తెలవదు కూడా.

ముందు చెప్పినట్టు అఫ్సర్ లో అనేక పార్శ్వాలున్నాయి. ఆయనకు ఆయన కవిత్వానికి (నిజానికి ఆయనంటే ఆయన కవిత్వమే) అనేక పరిమాణాలు (Dimensions) ఉన్నాయి. పాఠకునికి ఎవరికీ కావాల్సింది అది అయన కవిత్వలో దొరుకుతుంది. ఎవరికీ కావాల్సింది వాళ్ళు ఆయన ‘ఇంటి వైపు’ వెళ్లి సంపాదించుకోవచ్చు. ఆ అద్భుత అనుభూతి లో మునిగి తేలవచ్చు. ఐతే ప్రదానంగా ‘ఇంటి వైపు’ లో అఫ్సర్ ఒక తాత్విక సంభాషణ చేస్తుండు. ‘ఇంటి వైపు’ ఆయన ప్రయాణమంతా (నిజానికి చదివే మన ప్రయాణం కూడా) ఒక సంభాషణే. ఒక ఎడ తెగని సంభాషణ. అది ఒక కవిత తో ఐపోదు. ఒక కవిత చదవంగానే ఇది ఐపోయింది మరో కవిత చదువుదాం అనుకున్నట్టు కాదు. ఒక కవిత నుండి మరో కవితకు దాని నుండి మరో కవితకు (పైగా ఆ కవితలన్నీ అదే సంభాషణ క్రమంలో ఉండవు ఈ పుస్తకంలో – అయినా ఏమీ పరవా లేదు ఆ క్రమాన్ని మనం తేలికగానే పోల్చుకోవచ్చు ). యే ఒక్క కవితకూ భౌతికమైన ముగింపే తప్ప లాజికల్ ముగింపు ఉండదు. మొత్తం ఇంటి వైపుకూ లాజికల్ ముగింపు ఉండదు. అందుకే అది నిరంతర సంభాషణ. నిరంతర ప్రయాణం. ప్రయాణం లాంటి సంభాషణ . ఐతే ఈ సంభాషణకు ముగింపు లేకపోవడం మాత్రమే కాదు, ఇందులో ఒక యెడ తెగని శోకం ఉన్నది. ఒక గోస ఉన్నది. ఒక జాలి ఉన్నది. కొన్ని సార్లు సంభాషణ తీవ్రమైనప్పుడు ఆగ్రహం అనిపిస్తుంది కానీ నిజానికది ఆగ్రహం కాదు. జాలి. శబ్దం లోంచి నిశ్శబ్దం లోనికి ప్రవహించి శబ్దానికీ నిశ్శబ్దానికీ మధ్య కొన్ని జా గాలు సృష్టించి అందులో మనలను ఒంటరి వాళ్ళనీ దిక్కు తెలవనివాళ్ళనీ చేసి ఏదీ శాసించకుండా ఏదీ పురమాయిన్చకుండా అతి మెత్తగా తన గాయాల్ని చూపించి సుతారంగా తన కన్నీళ్లను మనకు నెత్తురు లాగా పూసి మనలని ఒక భయ విహ్వాలతకు గురి చేసి మళ్ళీ తనే మెల్లగా తన చిటికెన వేలు అందించి తోడుగా మరో పద్యం లో కలుద్దాం లే అక్కడ నేను ఉంటాలే అని అర్దాన్తరంగా వదిలేస్తడు అఫ్సర్. అందుకే ఎంత తేలికగా కనబడతాడో అంత కష్టమైన కవి. ఎంత సౌమ్యునిలా కనబడతాడో అంత కఠిన మైన కవి. ఆ ఈ సారి మనకు దొరుకుతాడు లే అనుకున్న ప్రతిసారి తన కవిత్వం లో దొరకకుండా మాయమవుతాడు. ఐతే ఆ మాయమవడం అస్పష్టతోనో అర్థం కాక పోవడమో కాదు.

అఫ్సర్ ది అంతు చిక్కని బాధ. అంత తేలికగా దొరకని శోకం. మనకు తెలుసు అఫ్సర్ కవిత్వంలో సూఫీ తత్వముందని. అదొక అవిభాజ్య పాయగా ఆయన కవిత్వమో అల్లుకుపోయిందని. ఐతే సూఫీ గాయకులను మీరెప్పుడన్నా వింటే వాళ్ళు చాలా పై శ్రుతిలో ఎక్కువగా పాడతారు. వాళ్ళ గానంలో ఒక ఆవేశం, తన్మయత్వం, పాషన్ , ఒక తీవ్ర ఉద్వేగం ఉంటై. అవనీ తారా శృతి లో పలుకుతాయి. కానీ అఫ్సర్ అవన్నీ అదే మోతాదులో ఉన్నా మంద్ర స్థాయిలో పాడే సూఫీ గాయకుడు. ఇది ఒక పారడాక్స్ లాగ వినపదవచ్చు. నిజమే అఫ్సర్ కవిత్వం ఒక అద్భుతమైన పారడాక్స్,

ఆయన ప్రతి కవిత ఒక మంద్రస్థాయి సూఫీ గీతం.
అఫ్సర్ దాదాపు ప్రతి కవితలో ఒక నువ్వు ఉంటాడు. అంటే కవి ఎవరితోనో మాట్లాడుతుండు. సంభాషిస్తుండు. ఎవరా మరొకరు? మనకు తెలిసినోల్లెనా? లేక కవికి మాత్రమే తెలిసినోళ్ళా? ఎవరైనా ఒక జెనెరిక్ పర్సనాలిటీనా? నాకు మాత్రం అది అఫ్సరే అనిపిస్తుంది. తన ప్రతి కవితలో తనతో తనే మాట్లాడుకుంటున్నాడు కవి. ఈ కవులకు తమతో మాట్లాడుకునే ‘multiple personality disorder’ (మంచి అర్థం లోనే ) ఉంటుందేమో? కవి భావనలకు, ఆలోచనలకు మరో భావాలతో ఆలోచనల్తో సంఘర్షణ జరగాలి కదా? ఒకానొక తీవ్ర స్థాయి ఉద్వేగం లో వొణికి పోయి, జ్వరం తో చలించి తర్వాత నిదానించి ఆ ఉద్వేగానికి కారణమైన భౌతిక పరిస్తితులతో సంభాషిస్తూ సంఘర్షిస్తూ మంద్ర స్థాయిలో పాడుతున్న పాట కదా అఫ్సర్ కవిత. ఆ సంఘర్షణ ఎవరితో మరి? ఆ సంభాషణ ఎవరితో మరి?ఐతే ‘ఇంటి వైపు’ పూర్తిగా చదివితే దీన్ని జనరలైజ్ చెయ్యలేము. ప్రతి కవిత లోనూ ఉండే ‘నువ్వు’ ఒక్కడే అని చెప్పలేము. ఇక్కడ అనేక ‘నువ్వులు’ ఉన్నరు. భిన్న రూపాల్లో ఉన్నారు. భిన్న పరిమాణాల్లో ఉన్నారు.

చిత్రమేమిటంటే ఇక్కడ అఫ్సర్ కూడా ఒక్కడే కాదు. కవిగా అఫ్సర్ ఒక్కడే ఒకటే పర్సనాలిటీ ఒకడే వ్యక్తీ అనుకుంటే మనకు ‘ఇంటి వైపు’ అర్థం కాదు. ఇందులో అనేక అఫ్సర్ లు ఉన్నారు. అందరి మూలసూత్రమూ అన్ని సార్లూ ఒకటే కాక పోవచ్చు. నాస్టాల్జిక్ గా, ఒక తీరని రందితో ‘ఇంటి వైపు’ పోవాలనుకుని సంభాషిస్తున్న/పాడుతున్న కవి అఫ్సర్ అనుకుంటే తనను సరిగా అర్థం చేసుకోలేము. అఫ్సర్కు అనేక రందులున్నాయి. అనేక వెతలున్నాయి. అనేక ఫికర్లు ఉన్నాయి. ఒక అఫ్సర్ లో వలస పెత్తనానికి గురవుతున్న తెలంగాణా వాది ఉన్నాడు. అతడు వలస పెత్తనాన్ని ఎదిరించి సంకెళ్ళు తెంచుకుని విముక్తి కోసం పోరాడుతున్న ప్రాంతీయ అస్తిత్వం వాది ఉన్నాడు. ఒక అఫ్సర్ లో జాతీయంగా అంతర్జాతీయంగా వివక్షకు, అణచివేతకు గురవుతున్న ముస్లిం ఉన్నాడు. తన ఊరునుంచి, వేర్ల నుంచి దూరంగా అమెరికా లో నివసిస్తూ తాను కోల్పోయిన తల్లి ప్రేమనూ, ఇంటి ప్రేమనూ ఊరి ప్రేమను తలుచుకుంటూ ఆ పాత రేగుపళ్ళ వాసనలను యాది చేసుకుంటూ రంది పడుతున్న అఫ్సరూ ఉన్నాడు. ఇంత మంది కలయిక ఈ ‘ఇంటి వైపు’ అఫ్సర్. ఇన్ని అనేక అఫ్సర్ల కలయిక ఈ కవిత్వ లో ఉన్నది. ముఖ్యంగా ఇవన్నీ ఈ శతాబ్డం లో వచ్చిన కవితలు. ఈ శతాబ్దం దుఃఖం, ఒంటరి తనం, గ్లోబలైజేషన్ లో అస్తిత్వం కోల్పోయి తిరిగి ఆ ప్రాంతీయత నుండే ఆ ప్రాంతీయ అస్తిత్వం నుండే, ఆ ముస్లిం అస్తిత్వం నుండే, ఆ సూఫీ తత్త్వం నుండే తననుండి వేర్లనూ జీవితాన్నీ దూరం చేసిన ప్రపంచీకరణను ధిక్కరిస్తున్న బహుళ అస్తిత్వ వాది ఉన్నాడు. అఫ్సర్ ది ఒక అస్తిత్వం కాదు. అనేక అస్తిత్వాలు కలగలిసినా యే అస్తిత్వానికదే స్పష్టంగా వేరుగా కనబడే కవిత్వమూ, వ్యక్తిత్వమూ అఫ్సర్ ది. అదే తన కవిత్వంలో కనబడుతుంది. వినబడుతుంది. తన ఆకాంక్షలను, వెతలను, రోదనలను, గోసగా మంద్రంగా విన్పిస్తాడు ప్రతి కవితలోనూ – ఎడతెగకుండా – నిరంతరంగా – ఒక organic continuity తో. అందుకే యే కవితా దానికదే కాదు. అట్లా అని స్వంతంగా ఉండకా పోదు. 

ఇక ప్రతి కవితలోనూ ఒక నువ్వు ఉన్నాడు (ఉన్నది) కదా. అదెవరో తెల్సుకోవాలంటే కొంచెం కష్టపడాలి. అంత తేలికగా దొరకడు. కవిత లో అస్తిత్వ ప్రకటన చేసిన చోట, ధిక్కార ప్రకటన చేసిన ఆ ‘నువ్వు ‘ సాధారణన్గా ఆ అస్తిత్వానికి వ్యతిరేకమో, అడ్డం పడ్డ వారో, లేదా కనీసం పట్టించుకోకుండా నిర్లిప్తత ప్రకటించిన వారో అయి ఉంటారు. కానీ తన రంది గురించి చెప్పినప్పుడు, వెతల్ని చెప్పినప్పుడు. అన్ని అస్తిత్వాలకు సాధారణమైన కల గురించి, ఒక కొత్త సమాజం గురించిన కల గురించి చెప్పినప్పుడు, తన ఇంతో గురించి ఊరి గురించి వలస గురించి చెప్పినప్పుడు ఆ ‘నువ్వు’ మాత్రం అఫ్సరే అనుకుంటున్న. అఫ్సర్ కవి దే మరో పార్శ్వం. మరో కోణం. తన ఆల్టర్ ఇగో. ప్రముఖ పోర్చుగీస్ కవి ఫెర్నార్దో పెస్సోయ తన పేరుతో కాక మరో మూడు పేర్లతో కవిత్వం రాసిండు. మూడూ విభిన్న వ్యక్తిత్వాలు. తనను ముగ్గురు విభిన్న మనుషుల్లాగే భావించుకుని మొత్తంగా నాలుగు పేర్లతో కవివం రాసిండు పెసోయా. ఐతే ఇక్కడ అఫ్సర్ కూ పెసోయ కు పోలిక లేదు. కేవలం తన ప్రతికవితలో కనబడే ‘నువ్వు’ అందరూ ఒకరు కారనీ , ఒక్కొకరు ఆయా సందర్భాలలో ఆయా ఆలోచనల మేరకు కవితో సంభాషిస్తున్న లేదా కవి సంభాషిస్తున్న బహుశా మరో కవిలోనిదే మరో వ్యక్తిత్వం అని నేను అనుకుంటున్నా.

ఇంత చెప్పీ అఫ్సర్ కవిత్వ రూపం లో సాధించిన విజయాల గురించి చెప్పక పొతే అసంపూర్తిగా ఉంటుంది. ‘ఇంటి వైపు’ కవితలలో ఒక ప్రత్యేకమైన శిల్పం ఉంటుంది. సాంప్రదాయ సాహిత్య పరికరాల కన్నా కొత్తవి వాడుకున్నాడు కవి వీటిలో. మనం సాధారణంగా కవిత్వ భాష అనుకునేదాన్ని విసర్జించి కొత్త బాష, శబ్ద నిరాడంబరమైన , నిరలన్కారమైన భాషను కనుక్కున్నాడు. కవిత లో భాష కన్నా పదాల కన్నా తనే వెనుక మాటలో చెప్పుకున్నట్టు భావమే అలంకారం. భావమే జీవం. అఫ్సర్ ‘ఇంటి వైపు’ లో చాలా కవిత్వ భాషనూ, డిక్షన్ నూ, శబ్దాలనూ అన్ లర్న్ చేసిండు. అది అంత తేలిక కాదు. ఏంటో చదివితే తప్ప యెంతో కష్ట పడితే తప్ప అన్ లర్న్ చెయ్యలేము. ఐతే నాకు కనిపించిన మరో రూప విశేషం. దాదాపు ప్రతి కవితలోనూ ఇది కనబడుతుంది. కవితలో అధ్యాయలుంటాయి (chapters). కొన్నిటిలో మొదటిది కవిత మధ్యలో ప్రారంభమవుతుంది. అంటే అంతకు ముందుది ఉపోద్ఘాతమన్న మాట. నా మట్టుకు నాకు ప్రతి కవిత ఒక నాటిక లాగా (play) అనిపిస్తుంది. అట్లా అనుకున్నప్పుడు ప్రతి అధ్యాయం ఒక అంకం లాగా అనిపిస్తుంది. అందులో సంభాషణలు. కవికీ మరో ‘నువ్వు’ కు మధ్య. చిత్రమేమిటంటే కవి ఇక్కడ అనేకమే ‘నువ్వూ’ అనేకమే. ఏదీ ఒంటరి కాదు ఏదీ ఏకాకి కాదు.

మొత్తం కవిత్వమంతా అనేకుల మధ్య సంభాషణ. తీవ్రమైన వెతలనీ, రందుల్నీ, దుఃఖాన్నీ, శోకాన్నీ, దిక్కారాన్నీ, ఆకాంక్ష లనీ, ఒక కల నేరవేరాలన్న మొక్కవోని పట్టుదలనూ అతి మంద్రంగా పాడిన సూఫీ తాత్విక సంగీతం అఫ్సర్ కవిత్వం.

తా.క : ఇందులో ‘ఇంటి వైపు’ లోని కవితా పాదాలను ఉటంకించకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. నేను చెప్పిన విషయాలు మీరే పోల్చి చూసుకోండి. నేను పొరపాటుగా అర్థం చేసుకుంటే నన్ను సరి చెయ్యండి. ఉతికి ఆరెయ్యండి. నేను తప్పైనా రైటైనా అఫ్సర్ కవిత్వం మిమ్మల్ని ‘ఇంటి వైపు’ తీసుక పోవడం ఖాయం.

*

అఫ్సర్‌ కవిత్వానికి ప్రేమలేఖ!



- ఒమ్మి రమేష్‌బాబు
~

నాలో ఒక అలజడి మొదలైంది. కొత్త కాంతిపుంజం తలుపు తట్టింది. వింత సందడితో మది నిండిపోయింది. కుండపోత వంటి జలపాతం కింద తడిసిన ఒకానొక ఉద్విగ్న ప్రకంపన కమ్ముకున్నది.
ఇంతటి ఆనందానికి సహేతుకమైన కారణం వుంది.
***
అప్పటివరకూ నిర్లిప్తతలోకి తొణికిన క్షణాలు సెలవు తీసుకున్నాయి. బలమైన విద్యుత్తరంగాలు తాకి స్మృతిపేటిక తెరుచుకుంది. వేళ్ల నుంచి సారమందుకున్న రెమ్మ మొగ్గ తొడిగింది. ఈ సడిలోనే ఒక కవి గొంతుక నాలో నాతో సంభాషణ మొదలుపెట్టింది.
ఆ గొంతు ఎవరిదో నాకు బాగా బాగా బాగా యెరుకే!
***
ఆ ఆనందానికి కారణం "ఇంటి వైపు'' కవిత్వం. ఆ గొంతుక నా ప్రియతమ కవి అఫ్సర్‌ది. మది గదిలో విరిసే భావానికి.. ఒక ఆప్తవచనం జోడింపు.. ఇదే అఫ్సర్‌ కవిత్వ చిరునామా! నాలుగు పదుల సాహిత్యప్రస్థానంలో తనే కవిత్వంగా మారిపోయిన నేటి తరం కవి అఫ్సర్‌. తనని అతి సమీపంగా యెరిగిన వారందరికీ ఈ కవిత్వోత్సవం తెలిసిన వైభవమే!
ఎంత తెలిసినా... అఫ్సర్‌ని మళ్లీ మళ్లీ తెలుసుకోవడం, కవిత్వవనంలో తిరిగి తిరిగి తనని కలుసుకోవడం కొత్తగానే అనిపిస్తుంటుంది! ఒక భావాన్ని కవిత్వ నాళికలోకి వేసి బొమ్మ కట్టించడంలో బహు నేర్పరి అఫ్సర్‌. ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా దానిలోని క్లిష్టతని తనే చెరిపేసి తేలికపరుస్తాడు. అందుకే తన ప్రతి కవితా ఒక పటంగా భాసిల్లుతుంది. "ఇంటి వైపు'' సంపుటాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక్కో పుటనీ పలుకరించి, అందున్న కవిత్వ పరీమళాన్ని మనసుకి అద్దుకుంటే అఫ్సర్‌ కవిత్వానికే ప్రత్యేకమైన ఇలాంటి నిర్మాణ రహస్యాలెన్నో ఒకటొకటిగా అవగతమవుతాయి.
***
అఫ్సర్‌ రాసిన ఏ కవిత అయినా తీసుకోండి. కొనసాగుతున్న ఒక సుదీర్ఘ సంభాషణలో ఒక అంకం కొత్తగా తెరుచుకున్నట్టుగా మొదలవుతుంది. ఎప్పుడో పరిచయమున్నవారిని మళ్ళీ పలుకరించినంత చనువుతో కవిత గొంతు విప్పుతుంది. చదువరిపైకి తొలుత తేలిక పదాలతో కూడిన ఒక వాక్యాన్ని విసురుతాడు కవి. తదుపరి తనే చేయందించి ఆ భావ ప్రవాహం లోపలికి మెల్లగా నడిపించుకు వెళతాడు. చివరంటా వెళ్లాక కలుగుతుంది అసలు దర్శనం! చిరుచినుకులతో మొదలైన వాన తుపానుగా మారి తీరం దాటడాన్ని కళ్లారా చూసిన అనుభూతికి లోనవుతాం!! "వెళ్లడానికి కాళ్ళకి ఇంకే అడుగూ తోచక/ నా వేపు నడుచుకుంటూ వస్తావ్‌ నువ్వు''... ఇది ఒక కవితకి తొలి చరణం. ఇలా ప్రారంభించి "స్నేహితుడి దిగులు''ని అలలు అలలుగా వర్ణిస్తూ మన లోపలి గట్టుని తాకుతాడు కవి. "నా దాకా ప్రవహించడానికి/ నువ్వు యెన్ని/ దాటుకుంటూ రావాలి?'' (జ్వరసమయం)- ఇది మరో కవితకి మొదటి వాక్యం. "అప్పుడప్పుడూ నీ వెక్కిళ్ళ చప్పుడు నీకే వినపడనీ..'' (అప్పుడప్పుడూ) ఇది ఇంకో కవితకి ద్వారబంధం. "యెన్నిసార్లయినా అడుగుతూనే వుండాలి కలల్ని, కాసేపు వుండిపొమ్మని-'' ఇలా ప్రారంభమవుతుంది మరో కవిత నడక! కవిత్వ నిర్మాణంలో ఎత్తుగడ అనేది ఎంతో కీలకాంశం. ఏ కవిత అయినా సరే తలుపు తెరిచి అతిథిని సాదరంగా స్వాగతించాలి తనలోకి. అప్పుడే ఆ భావధారలోకి పాఠకుడు సంలీనమవుతాడు. కవికీ పాఠకుడికీ మధ్య వుండాల్సిన ఈ బంధుత్వం ఎంత బలీయంగా వుంటే ఆ కవిత్వం అంతగా సార్థకమవుతుంది. అఫ్సర్‌ కవిత్వంలో ఈ సుగుణానికి ఏ లోటూ లేదు.
***
ఇంటి వైపు సంపుటిలోని కవిత్వం "రేగిపళ్ల వాసనలోకి'', "దూరాల మాటే కదా'', "యెటో చెదిరిన పడవనై..'' అనే మూడు పాయలుగా ప్రవహించింది. ఏ పాయ అందం ఆ పాయదే. ఏ పాయ లోతు, విస్తృతీ ఆ పాయదే. "మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం/ యీ వొక్క ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది'' అంటూ ఇంటి వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు కవి. గంభీరంగా మొదలై కొన్ని అనుభవాల మెట్లపైకి నడిపించి, నిబ్బరమైన నడకతో ముందుకేగి, తరలిపోయిన రుతుగానాల్ని, కొన్ని గాయాలని జ్ఞాపకచిత్రాలుగా చూయిస్తూ, రేపటి కోసం మోగే భేరీ ధ్వనుల్ని మనకీ వినిపింపచేస్తాడు కవి.
అఫ్సర్‌ మృధువు మనిషి. ఆ స్వభావమే తన కవిత్వానికీ అబ్బింది. అంత మాత్రాన మొహమాటాలూ, భరించటాలు చేస్తాడని కాదు. అలాంటి సందర్భాలే వస్తే- అఫ్సర్‌ నిప్పుకణికే అవుతాడు. ఈ సంపుటిలో రోహిత్‌ గురించి రాసిన కవితే ఇందుకు దాఖలా. ఎవరి పైకి గురిపెట్టాడో వారినే చెళ్ళున తాకింది ఆ చర్నకోలా! "నా దేశభక్తిని నువ్వు ద్వేషంతోనే కొలుస్తావ్‌'' (యింకో ద్వేషభక్తి గీతం) అంటాడు మరోచోట. తను కోరుకుంటున్న ప్రపంచానికీ, జరుగుతున్న కొన్ని సామాజిక దుర్మార్గాలకీ మధ్య కొనసాగుతున్న నిరంతర ఘర్షణే అఫ్సర్‌ కవిత్వం. ఇదే అతని కవిత్వానికి ముడిసరుకు! "వెనుక నీడలు కూడా ముసుగు వేసుకున్నాయి.. '' (తీరాలూ వాటి గమ్యాలూ..) ఇదీ తన కవిత్వం ద్వారా అఫ్సర్‌ చేస్తున్న ముందస్తు హెచ్చరిక! "మాటని కాస్త తెరిచి వుంచు'' (నీ లోపలే)- ఇదీ అతని తాత్విక ఉద్బోధ! "బాధని తవ్వి మొలకెత్తే పదం పద్యం/ నొప్పి లేని చోట పైపూత దేనికి?'' (ఎరీనా) అని కవిలోకంపైకీ ఓ ప్రశ్నని సంధించాడు కవి. ఎవరికి వారే చెప్పుకోక తప్పదు బదులు!
***
కవిగా అఫ్సర్‌ గొంతెత్తిన తొలినాళ్లలో తెలుగు నేలపై పరిస్థితి వేరు. వామపక్ష ఉద్యమ దుందుభి నలుచెరగులా మోగుతుండేది అప్పట్లో. ఎర్రపతాకల మెరుపులు దండుకట్టేవి. వర్గ ప్రధానమైన రాజకీయ చర్చలకే సిద్ధాంతాలు పరిమితమయ్యేవి. అనంతర కాలంలో ప్రవాహం దిశ మార్చుకుంది. ఉద్యమ గళంలో కొత్త నినాదాలు ప్రభవించాయి. దళిత, మైనారిటీ, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వ వాదాలతో తెలుగు సాహిత్యం పలు శాఖల తరువుగా పెరిగింది. ఈ క్రమంలో ప్రతి దశ, ప్రతి మలుపు, ప్రతి వెలుగు అఫ్సర్‌ కవిత్వంలో దర్శనమిస్తాయి. ఎప్పటికప్పుడు తనని తాను అప్‌డేట్‌ చేసుకోగలిగిన శక్తివంతమైన కవి అఫ్సర్‌. ఈ కారణంగానే ఈనాటి మేటి కవిత్వానికి తన తాజా సంపుటిలోని ప్రతి కవితా ఒక ప్రమాణంగా భాసిల్లుతోంది.
***
స్వభావసిద్ధంగా అఫ్సర్‌ మందిమనిషి. మనుషులని అవ్యాజంగా ప్రేమిస్తాడు. తన చుట్టుపట్ల ఉన్నవారితో అంతగానూ ప్రేమించబడతాడు. ఒకసారి పరిచయమైతే తనని మనలో ఓ గుర్తుగా వదిలిపెడతాడు. తనూ అంతే- బృందగానంలా సాగిపోతుంటాడు. ఈ సమష్టీయమైన వ్యక్తిత్వం వల్లే స్వస్థానాన్ని వదిలి దూరదేశానికి వెళ్లినా... తన ప్రతి స్నేహబంధమూ పచ్చపచ్చగానే మిగుల్చుకోగలిగాడు. "జీవితం యెప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు/ కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!'' (కాసింత సంతోషం) అఫ్సర్‌కి. చిరు సంతోషాన్ని కూడా వేడుక చేసుకోగలడు కనుకనే అఫ్సర్‌ ఇష్టుడైపోతాడు ఇతరులకి.
అఫ్సర్‌ స్నేహితులంతా సాహిత్య పరివారమే! నాకు తెలిసి.. ఉద్యమసంస్థల్లో రాటుదేలిన నాయకుల మాదిరే తనికీ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. దీనికి కారణం తనని తాను ఒక సాహిత్యోద్యమకారుడుగా మలచుకోవడమే! కవిత్వమే అఫ్సర్‌లో వెలిగే ప్రాణదీపం! 1987- 88 మధ్య కాలంలో అఫ్సర్‌తో పరిచయమైన తర్వాత తన పరివారంలోకి మమ్మల్ని చేర్చేసుకున్నాడు. స్నేహానికి మించిన కవిత్వబంధంతో తనకి కట్టేసుకున్నాడు. పెద్దన్న మాదిరి మా గుండెల్లో కొలువుదీరాడు. కంజిర మిత్రులుగా నన్ను, నామాడి శ్రీధర్‌ని, శశిని హత్తుకున్నాడు. హైదరాబాద్‌లోని న్యూఎక్సైజ్‌ కాలనీలో కొన్నాళ్లు రూమ్మేట్స్‌గా వున్నప్పుడు అనేక రాత్రులను కవిత్వంతో అలంకరించాం. అనేక పగళ్లకి మా భావాలతో రంగులద్దాం. కథలు, కవిత్వం, నాటకాలు, పాటలు, రాతలే మాకు తిండీతిప్పలు. కొన్నాళ్లకి న్యూఎక్సైజ్‌ కాలనీకి దగ్గరలోనే మరో అద్దెఇంటికి అఫ్సర్‌ మారాడు. అక్కడున్నప్పుడే అఫ్సర్‌, శ్రీధర్‌, ఎమ్మెస్‌నాయుడు, పెద్ది రామారావు, నేను కలిసి "అతడు ఆమె మేము'' అనే దీర్ఘకవిత రాశాం. అచ్చువేశాం. ఆంగ్లంలోకి అనువదితమై ఇండియన్‌ లిటరేచర్‌లో ఆ కవిత ప్రచురితమైంది. నిజానికి ఈ స్మృతుల చిట్టా నా గుండెలోతుల్లో ఎక్కడో ఏ మూలనో దాగిపోయింది. ఇదిగో ఇప్పుడు అఫ్సర్‌ కవితా సంపుటి "ఇంటి వైపు''ని స్పర్శించగానే ఆ జ్ఞాపకాలన్నీ వెకువజామున రెక్క విదిల్చి కువకువలాడే పిట్టల గుంపుమల్లే నాలో పండుగ చేస్తున్నాయి. మళ్లీ నన్ను ఆనాటి రోజుల ఆనంద క్షణాల్లోకి నడిపించిన అఫ్సర్‌కి తన కవిత్వం సాక్షిగా రాసుకున్న ప్రేమలేఖ ఇది.
*

దూరాల మాటే కదా!

'ఇంటి వైపు' పార్ట్-II



-సురేంద్ర దేవ్ 


; 'యిరవై ఏడు లేత కన్నీళ్లు'
'లెక్క తేలదు ఎప్పటికీ, ఎక్కడా...వొక్కో ప్రాణంలో...యెన్ని ప్రాణాలున్నాయో!'
Everything you can imagine is real
-Pablo Picasso గుర్తుకొచ్చింది.
---> 'నెత్తుటి చొక్కా స్వగతం'
(I) 'యింకో తురకని కనబోతున్న ఆ తురకదాని గర్భంలో పిండాన్ని శూలంతో పొడిచేశాం.జై హింద్!'
-వాడెవడో సెంటర్లో కూర్చొని మనల్ని 'హఠావో' అనగానే భయంతో 'బచ్చావో' అనే రోజులకు చరమగీతం రాయాలి. ఇప్పటికి ఇప్పుడు కలాన్ని సానపెట్టి సిద్ధంగా ఉండాలి. ఈ 'పరివార్...సేన'లు ఎన్ని పుట్టుకొచ్చి, ఊచకోతకు తెగబడితే 'మన అక్షరం చాలు'.
---> 'నిన్ను వోడించే యుద్ధం'
'నాకు యే దేహమైనా...అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది యెప్పుడూ...యే దేశమైనా... మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ'--- chiefdomని తన దేహమంతా పరుస్తుంది ఏ రాజ్యమైనా సరే, అదే The Rise of Modern Society; The Undercurrent Fire of Updated Colonialism.
---> 'Poor Couple in a Cafe'
'మళ్ళీ మళ్ళీ.. చెప్పాలని వుంటుంది... జీవితం నాకేమీ తెలియదని-చెప్పగలనా , పెదవి విప్పి!?'
నేను cafe loungeలో కూర్చుని 'ఇంటివైపు'ని ఆశ్వాదిస్తుంటే, Sublevel elevationలో ఫూత్ పాత్ పై ఇదే దృశ్యం...దృశ్యాలుగా కనిపించింది.
---> 'అంతకన్నా'
మీ నీరెండ వేళ్లు నన్ను తడమడానికి తరుముతున్నాయి...మీ భావాల్లో ఓడిపోతే , అనుభూతుల్ని పోగేసుకోవచ్చు అని అనిపించింది అఫ్సర్ గారు.
---> 'చార్మినార్ స్యూర్యుడికెదురుగా'
'వెయ్యిమందికి పైనే...ఈ రోడ్డుని తొక్కి వెళ్ళిపోయారు... ఎవరికెవరూ కనిపించకుండా'
'Spend Twenty years there and
you ask yourself
How there can still be strangers with so many familiar faces
Its probably that cities generate strangers continuously'
-Frederik Peeters (Blue Pills A +very Love Story)
---> 'హైదరాబాద్: కొన్ని వానలూ కొన్ని చలిగాలులూ'
'వాన మధ్యాహ్నమే మొదలయ్యిందో...పొద్దుటినించీ పడుతూందో తెలియదు. మధ్యాహ్నం మొదలయ్యే బతుక్కి...వుదయాలూ తెలియవు.'
కవి ఏ టైం జోన్ ని ఫాలో అవ్వడు...విచిత్రం ఏమిటంటే, ఎవరి బతుకు ఎప్పుడు, ఎలా మొదలవుతుందో ఎవరికి ఎరుక? అందరూ ఫిప్ట్ వైస్ జీవిస్తున్నారు, ప్రేమను ఆశ్వాదించడం మరిచిపోయినంత.
---> 'పదహోరో సదికి మళ్ళీ చలో'
'నిన్న మొన్న గాలికి కొట్టుకొచ్చిన నీకు...యీ గల్లీల గుండెచప్పుళ్ళు వినిపిస్తయా?'
Commercial Scale పై నడిచే main stream mediaకి ఏం తెలుసు 'వేదన' అంటే ఏమిటోనని. 'పోరాటం' మూలాల గురించి రిపోర్ట్ చెయ్యడం మానేసి చాలా కాలమైంది...'జనజీవనం నిలిచిపోయింది...' అంటూ చాలా అందంగా confusion create చేస్తుంది.
---> 'ఎరీనా'
'కొన్ని పిట్టలూ కొందరు మనుషులూ కొన్ని మొక్కలూ...
యివి లేని ఆకాశం నాకెందుకు?..అని గాలి చల్లగా గోల చేసింది.' మనిషికి Space Xలో Aliens కోసం వెతుక్కుంటూ ఖాళీ దొరకదు, ఇంక గాలి గోల వినిపిస్తుందా? అందుకే గాలికి roaring sound add on toppingలా అనిపించింది.
---> 'స్నేహితుడి దిగులు'
కవి fraction of a secondలో strangerని కూడా మిత్రుడిగా మార్చుకుంటాడు. బాధ Bulk Amount అనుకుంటా, అందుకే REGS Transfer చేస్తారు అక్షరంలోకి.
---> 'యిప్పుడిప్పుడే యింకొంచెం'
'నీలోపల ఈదుతూ ఈదుతూ...నేనెక్కడికి చేరానో యింకా చూసుకోలేదు గాని' Eastern Hemlock చెట్ల కింద మీరు ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటారు కదా! ఆ క్షణం మీ దాకా నా ఈత ఆగదు అఫ్సర్ గారు.
---> 'నా పేరు'
'దేశాలు లేనివాణ్ణిరా...కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా' MF Hussain జ్ఞాపకంగా మెరిసారు.
ఇకపై Name boards మీద degreesతో పాటు
My Last name reflects Muslimhood
But, I'm Not A Terrorist అని రాసుకోవాలేమో!
పార్ట్-IIIతో మళ్ళీ కలుసుకుందాం...అతి త్వరలో!
**నేను పోస్ట్ చేసింది 1% కూడా కాదు...'ఇంటివైపు' పుస్తకం పూర్తిగా చదవండి..ఎన్నో రహస్యాలు చాలా అమాయకంగా.. గట్టిగా వినిపిస్తుంది... సున్నితంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది.

"ఇంటి వైపు" నాలో నాతో సంభాషణ

- సురేంద్ర దేవ్ 
 డియర్ అఫ్సర్ సార్...

'ఊరి చివర' కవిత్వాన్ని గత యాడాది వైజాగ్ బుక్ ఫేర్ లో అరసవల్లి కృష్ణ Arasavilli Krishna గారు ఇచ్చారు. అంతకంటే ముందు, నన్ను మీకు పరిచయం చేసిన మావయ్య కెక్యూబ్ వర్మకు Kumar Varma K K ధన్యవాదాలు. 'ఊరి చివర' చదివాక నా అనుభూతులను లేఖ ద్వారా అమెరికా పంపించాను. ఇప్పుడు 'ఇంటివైపు'తో మమ్మల్ని పలకరించారు, మీ కవిత్వంలో మేజిక్ ఎల్లప్పుడూ beyond the infinity. ఈసారి కూడా నా అనుభవాలను అక్షరీకరించి 'ఇంటివైపు' పంపించాను, అయితే ఆ లేఖ మీకు అందడానికి కస్టమ్స్ దాటుకుని రోజులు పట్టవచ్చు. అందుకే నా భావాలను Fb wall మీద షేర్ చేస్తున్నాను సార్.

'ఇంటివైపు'
*రేగిపళ్ళ వాసనలోకి'
---> 'అన్నింటా'లో

'యింకా నువ్వు ఎదో వొకటి...రాస్తున్నావని అనుకుంటూ... ప్రతి అడుగునీ అడుగుతూ వస్తూ వుంటాను...సాయంత్రప్పూట..' - కవి రాసిన ఏ వొక అక్షరము, అనుభవము అతని private సొత్తు మాత్రమే అనుకుంటే ఎలా? 'ఇంటివైపు' పుస్తకము తెరిచి కాసేపు కూడా కాలేదు, అప్పుడే నా నీడలు ధైర్యంగా నా ముందుకు వచ్చి, చేతులు వస్తాదిలా కట్టుకుని... రొమ్ము విరిచి... కన్నుల్లో చింతనిప్పులు నింపుకుని మౌనంగా నా వైపు రెప్పలు వేయకుండా చూస్తున్నట్లుంది. నా నీడలే కదా! అనుకుంటూ నేనేదో మాట్లాడే ప్రయత్నం చేసాను, ఊహకు అందకుండా నన్ను ఏకాంత ద్వీపంలోకి నెట్టాయి. Timelineని rewind చేసాయి.
నిన్నటి రోజుల్లో రుషికొండ తీరం నుండి నా హృదయం పై వాలిన messenger migration bird మళ్ళీ నాతో సంభాషిస్తున్నట్లుంది.

---> 'అడగాల్సిన ఆ రెండు మాటలూ..అటెటో..రివ్వుమంటాయి..రెండు ఎండుటాకుల్లా గాలిలో' బహుశా ఆ రెండు ఎండిన ఆకులు 'బాగున్నారా?' 'ఎప్పుడొస్తారు?' అనే కదా! అనిపించింది సార్.
---> 'ఇంటివైపు' సాక్షిగా 'యెన్ని ప్రయాణాలు ఎన్ని దూరాలకి వెళ్లి వుంటానో...అటు ఆకాశంలోనూ యిటు నేల మీదా...నా అడుగులు యెన్ని పడి వుంటాయో' పుట్టిన ఊరు...ఆ స్వచ్ఛమైన మనుషులు...పచ్చిక బైళ్ళు తలుచుకున్నప్పుడల్లా, దశాబ్దం క్రితం పై చదువుల కోసం నేను విడిచి వెళ్ళిన నా ఇళ్ళు గుర్తుకొచ్చింది.
'నా వుద్వేగాల తొలి ఆనవాళ్ళకి' అందుకే లంబసింగి దాటుకుంటూ చింతపల్లి అటవీప్రాంతంలో నన్ను నేను వెతుక్కుంటూ వెళ్ళాను. కురుపాం అయినా కొమరాడ అయినా ఖమ్మం అయినా canopy of trees కదా!
దారి పొడవునా 'మిగిలిన అన్ని ప్రయాణాలు లోకం కోసం...యీ వొక్క ప్రయాణమే నాది నా లోపలికీ అనిపిస్తుంది.'
---> 'ఆకుపచ్చా పచ్చాని నేను....'
'యింకా కొంత పసితనపు అలలాంటిదేదో...నీలోనో నాలోనో వుండిపోయినందుకు...కాస్త బాధ...యింకాస్త జాలి అప్పుడప్పుడు' ప్రపంచంలో ఎవరి డైరీలో అక్షరాలను తడిమి తడిమి చూస్తే, ఆ ప్రతీ వాక్యం వెనుకా ఈ నాలుగు లైన్స్ మాత్రమే కారణం. ఈ దాగుడుమూతల మూలాలు చెప్పలేక ' వొంటరి ద్వీపమై....యే కన్నీటి ఖండంలోనో రాలిపోతాను.'
---> 'గాలి మోసుకెళ్ళే పాట'
‌ 'నీకి చెప్పాలనే వుంటుంది...కలిసిన రెండు చేతుల‌ మధ్య పుట్టిన రహస్యాన్ని'
‌'యీ రెండు చేతులే, గాల్లో ఎగిరితే పక్షులు...నేలన వాలితే రెండు నదులు...రెండీటి మధ్యా గుడి కడితే ఇంద్రచాపాలు' ప్రతీ నాలుగు రోడ్ల కూడలిలో decision making సమయంలో ఇట్లాగే అనిపిస్తుందేమో అఫ్సర్ గారు.
---> 'వొక చేరువ- వొక క్షమాపణ'
'అవన్నీ క్షమించలేని గుర్తులే...నీ కంటి కింద కాంతిని అపహరించి‌‌‌...జీవితం ముందు నిన్ను పరాజితగా మిగిల్చిన గాయాలే!
యిప్పుడు తలచుకునే గుర్తులే,
కాదనను.'
అయినా 'వొక క్షమాపణ తరువాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు.'
అంటూ వాస్తవిక సమాజాని, తనలో తాను దాచుకున్న రహస్య అపహాస్యాని బహిర్గతం చేసారు. అందుకే క్షమాపణ నా దృష్టిలో అవుట్ డేట్ అయిన Boot Cut Pant లాంటిది.
---> 'దగ్గిరా దూరం!'
'దగ్గిరగా వున్నప్పుడు... తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ... తెలుసు అనుకుంటాం కానీ, ఏమీ తెలియదు నిజంగా' - దూరం చాలా దగ్గర అయిన్నప్పుడు చాలా impactful పాఠం నేర్పుతుంది. మార్గ మధ్యలో Silent Sea నడిబొడ్డున విసిరేస్తుంది, ఆకాశంలో Albatross వచ్చి రెక్కలు అతికించి వెళ్ళవు కదా! ఎదురీదడమే కాదు, అప్పుడప్పుడు ప్రవాహంతో కొట్టుకుపోవాలి Survival Techniqueని పాటించాలి.
---> 'చీకటి చివరి క్షణంతో వెళ్ళిపోతూ ఆమె అన్నది కదా,
"యిక నీ వొక్కడిదే అయిన...యీ పగటి జీవితపు తెలియని అంధకారాన్ని కూడా...యిలాగే వెలిగించుకో..నేను లేనప్పటి చీకట్లోనూ!" బాబోయ్...మీలో ఏదో సహజమైన Thoughts Scanner ఉన్నట్లుంది, నన్ను ఉండచుట్టి యేళ్ల వెనక్కి విసిరేస్తున్నారు మీరు.
---> 'పాడేటప్పుడు'
'యెలా తుడిచేస్తానో దాటిన కాలాన్ని...నన్ను ఎటూ కదలనివ్వని గాయాల్ని..అందంగా తెరుచుకున్న రహస్య ద్వారాల్ని!?' కొన్ని ద్వారాలు check-in deny చేస్తే బాగుండు, మరికొన్నింటికి Entry ఉండాలి గానీ Exit ఉండకుండా ఉంటే దిల్ సే ఖుషీ!
---> 'నీలోనే'
'నీలోనే...లోలోనే...మునిగిపోయే పడవని నేను...వొడ్డుకి చేరాలనే వుండదు...యెప్పటికీ...యెంతకీ' మీ కవిత్వపు లోతుల్లో ఏ Nemoలానో SpongeBobలానో ఉండిపోవాలని ఉంది.
--- > 'వొక్క పూవై నేను'
ఆ సాయంత్రం ఆస్టిన్ లో మీకు diagonalగా నిల్చున్నట్లు ఉంది. మీ Eardrumsని ఆ గాత్రం తాకినప్పుడు, మీ పెదాలపై మొలిచిన నవ్వును నేను చూస్తున్నట్లుంది సార్.
----> 'తెంపుకొచ్చిన నీలిమలు కొన్ని'
'అయినా‌‌‌‌..యెందుకో..తెంపుకొస్తూనే వుంటాం...నీ పూలు నువ్వూ‌‌‌‌...నా ఆకాశాలు నేనూ'
జీవితంలో ఎవరి 'నడిచే దారిలో' వాళ్ల నడుస్తుంటారు. అయినప్పటికీ నా ఆకాశాలు ఎప్పటికీ నావే!
మిగిలిన భాగాన్ని త్వరలోనే పోస్ట్ చేస్తాను....coming up!
A house without books is like a room without windows.
-Horace Mann
Category: 0 comments
Web Statistics