Not in Anyone’s Name!


1
యిప్పుడు నేనేమీ వణికిపోవడం లేదు. నన్ను భయం చాపలో చుట్టి నువ్వు యెక్కడికో విసిరేయనూ లేవు. వొక చలికాలపు మసక చీకటిగా మసిలే వాణ్ణి కాదు నేను. నా భుజమ్మీద నీ చేతుల్ని మనసారా చుట్టడం సరే, కనీసం నీ చేతి నీడ కూడా యేనాడూ పడలేదు కనుక నాలోపల మెలితిరుగుతున్న నిప్పు సముద్రాల అలికిడి నీకు తెలీదు.

2
నువ్వు అచ్చోసి వదిలేసిన కాగితాలో, ఇరవైనాలుగ్గంటల నీ దృశ్య పహరాలో , వూరేగిస్తున్న వెయ్యి నాల్కల నోళ్లో , ఆ నోటి మాటల మంటలో , ఆ మాటల్లోని విషమో నన్ను కనికట్టు చేస్తూ వుంటాయని అనుకుంటూ వుంటావ్. నేనో కొత్త దృశ్యాన్ని రచిస్తూ వుంటానని, కొత్త మాటని వూహిస్తూ వుంటానని, నీ వూహకేమాత్రం తోచని సమూహమై వస్తానని అనుకోలేదు కదా! వొక్క నిప్పు తునక చేతికందితే చాలు నేను లావాని. వొక్క నీటి చుక్క తాకితే చాలు నేను సునామీని.

3
నీకంటూ ఏమీ మిగల్లేదు, నువ్వొక రంగువో పేరువో యింకేదో తప్ప నువ్వు యెప్పుడూ యేమీ కాదు. పుట్టిన మట్టిలోని అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టినవాడివి, మా నమ్మకాల విత్తనాల్లో విషం పోసి ద్వేషాన్ని పండిస్తున్న వాడివి, లోపలి నెత్తురంతా తోడిపోసి ప్రతి శరీరాన్నీ యెండిపోయిన దిగుడు బావి చేస్తున్న వాడివి – యివాళ నీ పేరు వొక రక్కసి మోళీ.

4
నువ్వూహించని రంగుతో రాస్తున్నా నా పేరు.
*

0 comments:

Web Statistics