1
కవిత్వం యెందుకు
చదవాలి అన్న ప్రశ్నలోంచి మొదలవుతున్న వెతుకులాట యిది.
కొత్త వాక్యం కోసం
ప్రతిసారీ ప్రశ్నించుకుంటూ, చుట్టూ వున్న జీవితాన్నీ, మనుషుల్నీ, పుస్తకాల్నీ
శోధించుకుంటూ కొన్ని వ్యక్తీకరణ సాధనాల్ని సమకూర్చుకునే సాధనలో భాగం కూడా-
సమాధానాలు
రాబట్టానన్న తృప్తి నాకు లేదు. ఆమాటకొస్తే, యింకా మిగిలి వుండి, నన్ను రంపాన
పెడ్తున్న నొప్పిలోంచే యిప్పటికిప్పుడు యిలా రాస్తున్నాను.
రాస్తున్నాను అనే
కంటే “చెప్పుకుంటున్నాను” అనే క్రియ/ ప్రక్రియ యిక్కడ కచ్చితంగా అనిపిస్తోంది. మీ
నలుగురి మధ్య కూర్చొనో, మీతోపాటు నడుస్తూనో, తింటూనో, తాగుతూనో నన్ను
నేను వెతుక్కుంటున్న కొన్ని ఘడియల అక్షర రూపం యిదంతా-
మొదటి కవిత అనే
పొద్దు పొడుపు నేనెప్పుడు అనుభవించానో, ఆ మొదటి వాక్యం నన్ను ఎప్పుడు ఆవహించిందో
చెప్పలేను గుర్తు లేదు కాబట్టి-
బహుశా మొదటి వాక్యం
వొక అర్థం లేని అసంబద్ధ కూని రాగమై వుంటుంది. లేదూ, అర్థం
వెతుక్కోలేక పడిన నానావిధ అవస్థల వొంకర టింకర అయ్యి వుంటుంది. వొక్కటి మాత్రం
చెప్పాలి, నాలో పుట్టిన ఆ మొదటి వాక్యపు పొద్దుకి
నేనెప్పుడూ వంద వందనాలు చెప్పుకుంటాను. ఆ పొద్దే లేకపోతే యీ బతుక్కి వొక అర్థమేమీ
వుండేది కాదేమో!
అప్పటి నించీ వొక
ప్రశ్న నన్ను నిలువునా దహిస్తూనే
వుంది. అట్లా అనుకోకుండా పొడిచిన ఆ
వాక్యపు పొద్దులో యింకా నేను మిగిలే వున్నానా అని!
2
ప్రశ్నలు అడగడం
సులువు. తేలికపాటి సమాధానాలు అంటే యీ పూటకి అన్నం తిని, నిద్రపోయే సుఖాన్నిచ్చే సమాధానాలు యిచ్చుకోవడమూ/
యివ్వడమూ కూడా తేలికే కావచ్చు. కాని, నిద్ర పట్టనివ్వని, యీ పూటకి అన్నం మెతుకు ముట్టనివ్వని ప్రశ్నలు
వుంటాయి. కవిత్వానికి సంబంధించి ముఖ్యంగా వొక కవి తనని తాను నిలదీసుకొని అడిగే
ప్రతి ప్రశ్నా అలాంటిదే- యెవరైనా ఆ ప్రశ్న అడక్క ముందు తనకి తానే నిలువద్దంలో
నిలబడే సత్తా యెంత మందిలో వుంటుందో చెప్పలేం. కనీసం కొన్ని బలహీనమైన సమాధానాలు తన
దగ్గిర వున్నాయన్న కవులు యెంత మంది వుంటారో కూడా చెప్పలేం. యిక్కడ యింకో అసుఖం
కూడా వుంది. అసలు అట్లా ప్రశ్నించుకొని, సమాధానాలు
వెతుక్కునే వెసులుబాటు రోజువారీ బతుకు యిస్తుందో లేదో కూడా చెప్పలేం. యిప్పటికిప్పుడు అది కష్టమే! కత్తి మీద సాము
అంటారే, పునరుక్తి దోషం అంటినా సరే, అట్లాగే అనుకోవాలి
యీ అవస్థని-
మొదటి ప్రశ్న
యెప్పుడూ వొక్కటే: అసలు కవిత్వం యెందుకు చదవాలి?
కవిత్వమే యెందుకు? మిగిలిన అనేక వచన కవిత్వేతర రూపాలు వుండగా వొక్క కవిత్వం
దగ్గిరే యెందుకు మాటిమాటికీ తచ్చాడుతూ వుండడం?!
నా మటుకు నాకు
వొక్కటే అనుభవం: ప్రతి కవితా యేదో నాదే అయిన ఆత్మీయ సందర్భంలోకి నన్ను తీసుకువెళ్తుంది. అక్కడ నన్ను నేను చూస్తూ నిలబడ్తాను, నదిలో ప్రతిబింబాన్ని చూస్తున్నట్టే! యీ పని
మిగతా సాహిత్య రూపాలు చేయలేవా అంటే చేయలేవనే అంటాను. బహుశా, కొంత తీక్షణంగా, లోతైన
ఆలోచనతో రాసిన దగ్గరి స్నేహితుడి లేఖ అలాంటి పని చేయచ్చు. అందుకే, కవిత్వం చాలా సార్లు నా కోసమే రాసిన సన్నిహిత
లేఖలాగా అనిపిస్తుంది కూడా.
అయితే, యీ సందర్భంలో యింకో ప్రమాదాన్ని గురించి
హెచ్చరించకుండా వుండలేను. కవితని కేవలం అలాంటి వ్యక్తిగతమైన కోణం నించి మాత్రమే
చదువుకుంటూ వెళ్తే, ఆ కవిత ఆవిష్కరిస్తున్న యితర అనేక లోకాలు మనకి
తెలీకుండా పోవచ్చు. మొదట “నేను” అనేది యెంత అవసరమో, కవిత
మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు ఆ “నేను” ని దాటుకుంటూ వెళ్లిపోవాలి నాలోని చదువరి.
అప్పుడు కవితలోని “ప్రపంచ” బాధ కూడా నా కోసం తలుపు తీసుకొని, నన్ను యింకో లోకంలోకి తీసుకువెళ్తుంది. నిజానికి
అలాంటి యింకో లోకపు చీకటి వెలుగులు తెలుసుకోవడం కోసమే నేను చదువుతాను.
నేను యిలాంటి వెతుకులాటలో వున్నప్పుడే యీ మధ్య ది అట్లాంటిక్
అనే పత్రిక పేజీలు వూరికే
అలా తిరగేస్తూ వుంటే, మార్క్
యకీష్ అనే అమెరికన్ కవి నా కోసమే అన్నట్టు యిలా అన్నాడు:
Try to meet a poem on its terms
not yours. If you have to “relate” to a poem in order to understand it, you aren’t
reading it sufficiently. In other words, don’t try to fit the poem into your
life. Try to see what world the poem creates. Then, if you are lucky, its world
will help you re-see your own.
నాకూ యీ
ప్రపంచానికీ మధ్య యేవో మాటలు నడుస్తూ వుంటాయి. నా చుట్టూ వుండే మనుషులు నాతో
నిరంతరం యేదో మాట్లాడుతూనే వుంటారు. నన్ను రకరకాలుగా కదిలిస్తూ అదిలిస్తూ వుంటారు.
అలాగే, నాకూ నా చుట్టూ వుండే కవులకూ మధ్య యేదో వొక
తెలియని అవగాహన వుంటుంది. వాళ్ళూ నేనూ అదేపనిగా యేదో తవ్వుకుంటూ వుంటాం. యీ మధ్య
వొక కవితలో రాసుకున్నాను అదే-
వొక నువ్వూ ప్రతి నేనూ
వొకటేదో పురావస్తు తవ్వకంలో
నిమగ్నమైన పనిముట్టులాగా-
కాని, యీ తవ్వకం పని గురించి యెట్లా మాట్లాడాలి
యిప్పటికిప్పుడు?
నేను కలిసిన
వ్యక్తుల్లోంచి కవిత్వ సందర్భాలు చెప్పాలి. చదువుతున్న పుస్తకాల్లోంచి నెమలీకల్ని, యీ క్షణాల్ని వెలిగించే వెల్తురు పిట్టల్ని
ఎగరేసి చూపించాలి. యిప్పుడే ఆలోచనల్లో మెదిలిన నిప్పు కణికని అరచేతుల్లో బంధించి
స్నేహితుడికి దాని వేడిని తాకి చూడమని
చెప్పాలి. అవన్నీ యిప్పటికిప్పుడు జరిగి తీరాలని నా కోరిక.
ఆ కోరికలోంచి
యిదిగో “యిప్పటికిప్పుడు” యిలా.
*
2 comments:
ఇలా... ఒక్కచోట ఉండటం బావుంది. వరుసగా ఒకపుస్తకంలా చదువుకోవచ్చు వ్యాసాలన్నీ. మీ మిగతా భాగాలకోసం వెయిటింగ్ అఫ్సర్ సాబ్..
ఒక్కోసారి అనుకోకుండా చదివే మంచి కవిత - అప్పటికప్పుడు వెళ్ళి ఆ కవిత రాసిన చేయి పట్టి అభినందించాలని అనిపిస్తుంది నాకు - మీకిప్పటికిప్పుడు ఈ పోస్ట్ రాయాలనిపించినట్లు :)
Post a Comment