నా పంద్రాగస్టులన్నీ...
జీవచ్చవానికి ఆత్మ వుంటుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక స్మశాన వాటిక
నన్నంటి పెట్టుకునే యెందుకుంటుందో తెలీదు
భుజాలు మారుతున్న కాల పేటికలో
మృతశరీరంలో కదులుతున్న కొస ప్రాణం
నా చరిత్రంతా.

నా పాఠాల వెనక
రేపటికి తవ్విన సమాధుల్ని
నిన్నటి నా పసికళ్లెపుడూ మరచిపోవు
బట్టీయం పడ్తున్న పద్యాల పంక్తుల మధ్యలో
పంతులు గారి బెత్తం విరుగుతూనే వుంటుంది
సంస్కృత శబ్ద మంజరి ఖంగున మోగుతున్నంత సేపూ
నాలోని భాష నిశ్శబ్దమయి రోదిస్తూనే వుంటుంది.
ఎప్పుడూ లెక్కతప్పే నాకు
చరిత్రలో మాత్రం నిరంతర జయకేతనం
ఎంత విషాదం!
ఏ చరిత్రా లేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం!
నాకు మతం లేదు
కులం లేదు
జాతి లేదు
జాతీయం అంతకన్నా లేదు
గతం లేదు
వర్తమానం లేదు
భవిష్యత్తు అంతకన్నా లేదు
అయినా
నా చరిత్ర పాఠాలు
నేను మరచిపోలేని పాత పద్యాలు...
2
బడి వెనక ఖబరస్తాన్
సమాధి వొళ్ళో ఆకుపచ్చ జెండా
జెండా చివర్లలో జరీ మెరుపు
ఓ వెంటాడే కల....ఎప్పుడూ!

సమాధుల మధ్య నిశ్శబ్దంలో
మొలిచిన తంగేడు పూల పరిమళ రాహిత్యం
తెంపిన తులసి ఆకులూ
రేగు ముల్లూ నాలిక ఎరుపెరుపు
విరిగిన కిటికీ రెక్క టపటప బాదుకుంటున్నప్పుడల్లా
లోపలి చెవి మీద సమాధులు నడిచొచ్చేవి
చరిత్ర వొక్కటేనా? కాదు, కాదు....
ఆ సమాధి కూడా
చెక్కుచెదరని పద్య జ్నాపకమే నాకు....
3
కాళ్ళ కింద నేల వుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక గాలి కెరటం
నన్ను చుట్టుముట్టే ఎందుకుంటుందో తెలీదు
నేనొఠ్టి శరీరాన్నయి ఇక్కడ సంచరిస్తున్నానని
అందరికీ అనుమానం...
తెగి ఎటో పడిపోయిన
ఖండిత దేహాన్నని అందరికీ గట్టి నమ్మకం.
4
గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాల మీద
ఎప్పుడూ
మోగే బెత్తానికి నా చరిత్ర తెలుసు.
నా కాలం తెలుసు
నేను తెలుసు
ఈ పద్యంలో
చివరి పాదం వొట్టి కొయ్య కాలేననీ తెలుసు.
వందేమాతరంలో నా తరం లేదు
జనగణమణలో నా జనం లేరు
కంఠ నాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు.
నా పంద్రాగస్టులన్నీ
స్మశాన వాటికలోనే...!

25 ఆగస్టు 1998. (“వలస” నుంచి)
Category: 3 comments

3 comments:

Uma Jiji said...

interesting.. to note it is chaudah August.. impressed..

Rohith said...

good poem to unzip my day sir. Happy independence day :)

Unknown said...


భుజాలు మారుతున్న కాల పేటికలో
మృతశరీరంలో కదులుతున్న కొస ప్రాణం
నా చరిత్రంతా.
Nijam sir
excellent poem sir

Web Statistics