ఓ పొద్దుటి రైలు




1
వూరు మసక చీకటిలోకి
సగం కన్ను తెరచి
మూత పెట్టుకుంది ఇంకోసారి.

దూరంగా రైలు కూత
నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది.

2
పట్టాల పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే.
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది.

3
వూరు వెనక్కో ముందుకో
ముందుకో వెనక్కో
వొక పరుగులాంటి నడకతో-
ఎవరంటారులే , వూరిది నత్త నడక అని!
అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు.

4

అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు
అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని
రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది
కూతవేటు దూరంలో.
Category: 10 comments

సగం కలలోంచి...అజంతా!

".....బెంజిమన్ మాస్టరు మాదిరిగానే అజంతా గారు కూడా తన యంత్ర నగరి (మంత్ర నగరి కూడా!) రహస్యాలు నా కళ్ల ముందు అలా పరిచేసే వారు. బెంజిమన్ గారు తన స్టేషనులో యంత్రాలు చూపించినట్టే, అజంతా గారు కలిసినప్పుడల్లా విదేశీ కవిత్వ పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. “ఒరేయ్ అబ్బాయ్! ఇదిగో మిలాన్ కుందేరా! ఈ పుస్తకం నీదేరా!” అనే వారు. నేను ఆ పుస్తకం మైకంలో పడిపోయి కళ్ళు తేలవేసినప్పుడు, వొకటికి పది సార్లు ఆ రచయిత గురించి, అతని/ఆమె వాక్య విన్యాసం గురించి చెబ్తూ వుండిపోయినప్పుడు, అంతా విని, నిశ్శబ్దంగా నవ్వి, నోటికి నిలువుగా చూపుడు వేలు ఆడిస్తూ, “ ఒరేయ్ అబ్బాయ్! నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మంది కవుల్నీ మహాకవుల్నీ కలిసినా, నీ పుస్తకం నీదేరా! నీ కవిత్వం నువ్వే రానిగూఢమయిన కవిత్వ గుహల్ని నా చేతి వేళ్ళతోనే తెరిపించిన వ్యక్తిత్వం – అజంతా...."

(మిగిలిన కథ ఆవకాయ లో...)
Category: 0 comments

రాజన్ తెలుపూ నలుపు కవిత్వం!


అసలు ఫోటో ఎప్పుడయినా కవిత్వం అవుతుందా? ఒక కవిత కలిగించే గాఢమయిన అనుభూతి ప్రభావాన్ని వొక ఫోటో కలిగించగలదా?

- ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు రాజన్ బాబు నలుపూ తెలుపూ ఫోటోలు చూసి తీరాలి. కెమెరా నిజంగా మూడో కన్నే అని రుజువు చేసి, ఆ మూడో కన్నుని తెలుగు పల్లెల మూల మూలలా తిప్పి, అద్భుతమయిన ఫొటోల్లో తెలుగు బతుకు వర్ణాల్ని అనువదించిన రాజన్ బాబు ఇక లేరంటే బాధగా వుంది, వొక అందమయిన ఆల్బంలోంచి కొన్ని అరుదయిన ఫోటోలు వున్నట్టుండి ఎటో మాయమయిపోయినట్టుగా వుంది. జీవితంలోని కాసింత అందాన్ని వొడిసిపట్టుకుంటున్న వ్యక్తిని పట్టుకెళ్లిపోయిన మృత్యువు మీద చెడ్డ కసిగా వుంది.

ప్రపంచం అనేది కేవలం నలుపూ తెలుపుగా వుండదని, అది అనేక వర్ణాల మయం అని సిద్ధాంత స్థాయిలో విశ్వసించే నాకు, తెలుపు నలుపు అంటే అపరిమితమయిన ప్రేమ పుట్టించిన ఛాయాచిత్రకారుడు రాజన్ బాబు. ఖమ్మంలో నేను హైస్కూల్ లో వున్న రోజుల్లో రాజన్ బాబు తెలుపు నలుపు ఫోటోలు ప్రతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోనూ కనిపించేవి. రాజన్ బాబు తీసిన ఫోటో పత్రికలో పడిన ఆదివారం పూట ఆ రోజంతా నేనూ, నా మనోనేత్రం ఆ చిత్రం చుట్టూ ఈగలా తిరిగేవి. వొక వారం పాటు ఆ ఫోటో నా మనోనేత్రం లో నిలిచిపోయేది.

అదే సమయంలో నేను వచన కవిత్వంలోకి అనువాదమయ్యే ప్రయత్నంలో వున్నా. నా తొలినాళ్ళ కవిత్వం నిండా కొత్త రకం పదచిత్రాలు, పల్లె ప్రతీకలూ కనిపిస్తున్నాయని తరవాత తీరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు అర్ధమయ్యేది. నా పల్లె బతుకు నాదే. అందులో అనుమానం అణువంత కూడా లేదు. కానీ, వొక అనుభవాన్ని తట్టిలేపడానికి ఏదో వొక తక్షణ ప్రేరకం పనిచేస్తుంది. అది ఆ కాలంలో నాకు సినిమా రూపంలో సత్యజిత్ రే "పథేర్ పాంచాలి", చిత్రాల రూపంలో దామెర్ల రామారావు, ఛాయాచిత్రాల రూపంలో రాజన్ బాబు! ఇప్పుడు ఆ ముగ్గురూ లేరు! కానీ, ఆ ముగ్గురూ నాలోపల ఎప్పటికీ వుంటారు! నా అక్షరాల నీడల కింద వాళ్ళ వెలుగులు ఎప్పుడూ వుంటాయి.

ఇప్పుడే నేను నా ముఖపుస్తకంలో రాసుకున్నాను -

Rajan Babu, one of the great photographers from Andhra is no more! Rajan's black and white pictures haunt me forever. He taught me to see many colors in a black and white photo. He taught me to see any ordinary aspect of life from an extraordinary angle. His camera is a real third eye and his vision has no death! We all miss you Rajan Babu..


రాజన్ బాబు గురించి నా కంటే బాగా ఆత్మీయంగా, వివరంగా చెప్పగలిగిన వ్యక్తి కవీ, రచయిత ఫణికుమార్ గారు. ఫణి కుమార్ గారి క్లాసిక్ 'గోదావరి గాథలు' ముఖచిత్రం వొక సారి చూడండి. అది ఫణి కుమార్ గారు తీసిన ఫోటో కానీ, ఆ ఫోటో మీద రాజన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ఫణి కుమార్ గారు రాసిన నివాళి, మా మిత్రుల కోసం ఇదిగో ఇక్కడ...



ఆప్తుడూ, గురువూ
- ఫణికుమార్

రాజన్‌బాబు పోయారంటే నమ్మలేకపోవడానికేముంది? డెబ్భై మూడేళ్ల మనిషి, అనారోగ్యంతో కొన్నేళ్లుగా బాధపడుతున్న మనిషి ఆసుపత్రిలో రెండు వారాలుగా వెంటిలేటరు గొట్టాల పాశాలపై బంధింపబడిన మనిషి వెళ్లిపోయారంటే నమ్మకుండా పోవటానికేముంది? ఆయనలాంటి కళాకారుడూ, ఆప్తుడూ, గురువూ మళ్లీ పుడతాడంటే నమ్మలేం గానీ, ఆయన పోవడంలో నమ్మశక్యం కాని విషయమేముంది!

కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎక్కడ? హైదరాబాద్‌లో నిజాం నవాబు నీరాజనాలందుకున్న ఛాయాచిత్రకారుడు రాజాత్రయంబక రాజ్‌బహదూర్‌గారి సాహచర్యమెక్కడ? పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వాడు హఠాత్తుగా ఫోటోగ్రాఫర్ కావాలనుకోవడమేమిటి, ఆ కళలో ప్రపంచఖ్యాతి పొందడమేమిటి? ఆల్‌ఫ్రిడ్ స్టీగ్లిడ్జ్‌లాగా చిత్రకళపై యుద్ధాన్ని ప్రకటించి ఫోటోగ్రఫీ వేర్పాటువాదాన్ని ప్రతిపాదించడమేమిటి? ఈ విచిత్రాలన్నీ రాజన్‌బాబు గారి జీవితంలో జరిగినవే.

గీతలు పడ్డ చెత్తనెగిటివ్ నుంచీ పురస్కారాలందుకునీ కళాఖండాల్ని సృష్టించాలనే రాజా సాబ్ ఆదేశాన్ని శిరసావహించి, అలాంటి నెగెటివుల నుంచీ ఫెలో ఆఫ్ రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ, అఊఐఅ్క ఫెలో (ఫ్రాన్స్)గా ఎన్నికయ్యాడు కాలేజీ గుమ్మం కూడా ఎక్కని రాజన్‌బాబు. కాలేజీ డిగ్రీ వుంటే ఒూఖ్ఖీ ఫోటోగ్రఫీ శాఖకు అధిపతి అయ్యేవాడు, ప్రిన్సిపాల్ అయ్యేవాడు. బహుశ వైస్‌ఛాన్స్‌లర్ అయ్యేవాడు. కానీ యింత మంచి ఛాయాచిత్రాలు యిన్ని తీసివుండేవాడు కాదు. రాష్ట్రమంతటా యింత మంది శిష్యులను తీర్చిదిద్ది వుండేవాడు కాదు.

ఏమీ చదవని రాజన్‌బాబుకు తెలిసినంత కెమిస్ట్రీ మరెవరికీ తెలియదు. ముందు కాంతి లక్షణాన్ని అర్ధం చేసుకో అని చెప్పాడొకసారి నాకు. ఫిల్ము డెవలప్ చేయడానికి నేను కొడాక్‌వారి మైక్రోడాల్-ఎక్స్ వాడడాన్ని తప్పుపట్టాడు. ఎవరి డెవలపర్ వారే తయారు చేసుకోవాలి. నలుపు తెలుపుల తేడాను మరీ కొట్టొచ్చినట్టు చూపించే హ్రైడోక్వినాన్ అనే రసాయనం డెవలపర్‌లో వుంటుంది. సూర్యరశ్మిలేని పాశ్చాత్యదేశాల వారికది అవసరం కానీ మనక్కాదు, మనకు కేవలం మెటాల్ చాలు అనేవాడు. హైడ్రోక్వినాన్ ముట్టుకోకుండా రాజన్‌బాబు, ఆయన శిష్యులూ అద్భుత కళా ఖండాలను సృష్టించారు. మరి ఆయన చదువుకోలేదు అనుకోవాలా? "చదువులలో సారమెల్ల'' ఆయనకు తెలుసు ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ.

రెండు దశాబ్దాల క్రింద కలర్ ఫిలింను కడిగి గంటలో ప్రింట్లు యిచ్చే లేబోరేటరీలు, 'హాడ్‌షాడ్' కెమెరాలు బహుళంగా వుపయోగంలోకి వచ్చినప్పుడు వీణ, సితార్ లాంటి ఘనవాయిద్యాలపై సింథసైజ్‌ర్ దాడిచేసినట్టు బాధపడ్డాడు. స్కాప్‌షాడోకీ ఫోటోకి తేడా తెలియని రసికులు ఫోటోగ్రఫీ కళనే నిర్మూలిస్తారని భయపడ్డాడు. ఇంతలో డిజిటల్ యుగం వచ్చింది.

ఏ కెమెరాతో ఏ దృశ్యాన్నైనా తీసి 'ఫోటోషాప్'లో లేని హంగులు కల్పించి అందరూ రఘురామ్‌లూ, రాజన్‌బాబులూ అవ్వొచ్చు. కళలలో దారిద్య్రరేఖ దిగువన వున్న వాళ్లని పథకాల ద్వారా పైకి తేవడం కుదరదు. ఆ పని ఫోటోషాప్ కూడా చేయలేదు. కళలలో రాచరికముంటుంది. ఒక సింహాసనం వుంటుంది. కిరీటాన్ని తన ఖడ్గంతో తీసుకుని శిరస్సుపై వుంచుకునే పొగరుమోత్తనం వుంటుంది. ఆ లక్షణాలు ఉన్నవారు డిజిటల్ యుగం కల్పించే సమానత్వ భ్రమను సహించరు. అలాంటి యుగంలో జీవించడం కంటే తప్పుకోవడమే నయమను కుంటారు, మా గురువు గారు రాజన్‌బాబు గారిలాగా.

- ఫణికుమార్


(ఆంధ్రజ్యోతి నుంచి)
Category: 8 comments

నా పంద్రాగస్టులన్నీ...




జీవచ్చవానికి ఆత్మ వుంటుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక స్మశాన వాటిక
నన్నంటి పెట్టుకునే యెందుకుంటుందో తెలీదు
భుజాలు మారుతున్న కాల పేటికలో
మృతశరీరంలో కదులుతున్న కొస ప్రాణం
నా చరిత్రంతా.

నా పాఠాల వెనక
రేపటికి తవ్విన సమాధుల్ని
నిన్నటి నా పసికళ్లెపుడూ మరచిపోవు
బట్టీయం పడ్తున్న పద్యాల పంక్తుల మధ్యలో
పంతులు గారి బెత్తం విరుగుతూనే వుంటుంది
సంస్కృత శబ్ద మంజరి ఖంగున మోగుతున్నంత సేపూ
నాలోని భాష నిశ్శబ్దమయి రోదిస్తూనే వుంటుంది.
ఎప్పుడూ లెక్కతప్పే నాకు
చరిత్రలో మాత్రం నిరంతర జయకేతనం
ఎంత విషాదం!
ఏ చరిత్రా లేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం!
నాకు మతం లేదు
కులం లేదు
జాతి లేదు
జాతీయం అంతకన్నా లేదు
గతం లేదు
వర్తమానం లేదు
భవిష్యత్తు అంతకన్నా లేదు
అయినా
నా చరిత్ర పాఠాలు
నేను మరచిపోలేని పాత పద్యాలు...
2
బడి వెనక ఖబరస్తాన్
సమాధి వొళ్ళో ఆకుపచ్చ జెండా
జెండా చివర్లలో జరీ మెరుపు
ఓ వెంటాడే కల....ఎప్పుడూ!

సమాధుల మధ్య నిశ్శబ్దంలో
మొలిచిన తంగేడు పూల పరిమళ రాహిత్యం
తెంపిన తులసి ఆకులూ
రేగు ముల్లూ నాలిక ఎరుపెరుపు
విరిగిన కిటికీ రెక్క టపటప బాదుకుంటున్నప్పుడల్లా
లోపలి చెవి మీద సమాధులు నడిచొచ్చేవి
చరిత్ర వొక్కటేనా? కాదు, కాదు....
ఆ సమాధి కూడా
చెక్కుచెదరని పద్య జ్నాపకమే నాకు....
3
కాళ్ళ కింద నేల వుందో లేదో తెలీదు
ఎప్పుడూ వొక గాలి కెరటం
నన్ను చుట్టుముట్టే ఎందుకుంటుందో తెలీదు
నేనొఠ్టి శరీరాన్నయి ఇక్కడ సంచరిస్తున్నానని
అందరికీ అనుమానం...
తెగి ఎటో పడిపోయిన
ఖండిత దేహాన్నని అందరికీ గట్టి నమ్మకం.
4
గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాల మీద
ఎప్పుడూ
మోగే బెత్తానికి నా చరిత్ర తెలుసు.
నా కాలం తెలుసు
నేను తెలుసు
ఈ పద్యంలో
చివరి పాదం వొట్టి కొయ్య కాలేననీ తెలుసు.
వందేమాతరంలో నా తరం లేదు
జనగణమణలో నా జనం లేరు
కంఠ నాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు.
నా పంద్రాగస్టులన్నీ
స్మశాన వాటికలోనే...!

25 ఆగస్టు 1998. (“వలస” నుంచి)
Category: 3 comments

నీ అడుగులు తలుపు దగ్గిర




మూతపడిన ఆ తలుపు దగ్గిరకే వెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ.

ఆ అగాధమయిన నిద్రలోంచి నువ్వు వొస్తావనీ,

తలుపు తీసి నవ్వుతావనీ పోనీ కోపంగా తిట్టిపోస్తావనీ.


వొక్క సారి దుఖంలోకి వొరిగిపోయానా అంతే
నేను వొక దిగులు దిగుడుబావిలోకి
జారుకుంటూ వెళ్లిపోతాను,

తలుపు దగ్గిర చెవులూ కళ్ళూ కాపలా పెట్టి.

2

ఊహూ...ఎవరూ రారు
అసలేవరూ అలా రాలేదు
ఎవరూ లేరు
అసలీ నిశ్శబ్దపు అంతిమ వీధిలో ఇంకెవరూ మలుపు తిరగరు

నువ్వు నేనూ పిచ్చి మొహాలేసుకుని,
అలసిపోయిన వడలిపోయిన దేహాలేసుకుని,
రాలిపోని ఎదురు చూపుల మాలలు గుచ్చుకుంటూ

రికామీ గాలికి శూన్యపు ముద్దులు ఇచ్చుకుంటూ

ఎలాగోలా వస్తూనే వుంటాం ఈ వీధి చివరకి.

ఈ చివరి వీధికి.

3

వస్తావయ్యా రామయ్యా
అంటూ ఆ వెర్రిబాగుల పాటగాడు అప్పటి నించీ
ఆ పాటని అట్లా మోసుకు తిరుగుతూనే వున్నాడు.


రామయ్య రాలేదు రాడు

4

అన్నీ అన్నీ మూతపడిన తలుపులే ఎదురవుతున్నాయి

వొక్క పెదవీ విచ్చుకోని అసుర సంధ్యలో.

5

ఈ పూట కూడా నువ్వలాగే

పెదిమ కింద తొక్కిపెట్టిన పకపక నవ్వుల ఉప్పెనలా

వెళ్లిపో నిశ్శబ్దంలోకి
వీధి చివరి కొండంత మౌనంలోకి.

Category: 14 comments

ఒక 0% లవ్ స్టోరీ

(ఈ వ్యాసం ఈ నెల "పాలపిట్ట'లో నా శీర్షిక 'కాలి బాట" నుంచి)





కొన్ని సార్లు కవిత్వమూ, కథా, నవలా లేదా వొక గొప్ప తాత్విక గ్రంథమూ చేయలేని పని వొక సినిమా చేస్తుందని అనిపిస్తుంది. అయితే, పాఠకుడికీ, వీక్షకుడికీ అవగాహనలో, అనుభూతిలో తప్పక కొన్ని తేడాలున్నాయి. పఠిత ఆగి ఆగి చదవచ్చు, చూస్తున్న సినిమాని కూడా రెవైండ్ చెయ్యవచ్చు కానీ, ఆగి ఆగి చదవడంలో వున్న సౌలభ్యం రెవైండ్ చెయ్యడంలో లేదనుకుంటా. వీక్షక పాత్రలో వున్నప్పుడు మనం వొక నిరంతరాయమయిన కొనసాగింపు (కాంటిన్యూటీ)ని కోరుకుంటాం. పుస్తకం చదివేటప్పుడు ఆగి ఆగి చదవడం వల్ల ఆ కొనసాగింపు పెద్దగా కుంటుపడదు.కానీ, సినిమాకీ, సాహిత్యానికీ వొకే రకమయిన విమర్శ సాధనాలు వాడే కాలంలో ఇప్పుడు వున్నాం. ఆ దృష్టి కోణం నించే నేను ఈ మధ్య సినిమాలు చూస్తున్నాను.
ఈ నెల మాడిసన్ లో జరుగుతున్న సినిమా పండగలో భాగంగా వొక గ్రీస్ సినిమా “ఆటెన్బెర్గ్” చూశాను. ఈ సినిమా చూడడంలో వొక “స్థానిక” ఆనందం కూడా వుంది. ఈ సినిమా తీసిన రేచల్ సంగారి కొన్నాళ్లు మా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో సినిమా పాఠాలు చెప్పింది. నా సాహిత్య కోర్సులలో అప్పుడప్పుడూ నేను సినిమా పాఠాలు (పథేర్ పాంచాలి, సంస్కార, ఏక్ చారాసీ కీ మా లాంటి సినిమాలు చూపించినందుకు ఇప్పటికీ మా విద్యార్థులు కలిసినప్పుడల్లా థాంక్స్ చెప్తారు) కూడా కలిపేస్తూ వుంటాను కాబట్టి, క్యాంపస్ లో జరిగే కొన్ని పండగల్లో, గోష్టి సమావేశాల్లో ఆవిడని కలిసే అదృష్టమూ దొరికింది. అసలు ఎంత పాత ఫ్రేమ్ ని అయినా మరీ కొత్తగా ఎలా చూడవచ్చో ఆమె ప్రతి వ్యాఖ్యలోనూ కనిపించేది. ఆవిడ మాటలు వింటునప్పుడు ఊహాశక్తి ఇంత దూరం వెళ్తుందా అని ఆశ్చర్యపోయే వాణ్ని. ఈ సినిమా చూశాక, “అవును, ఊహా శక్తి ఎంత దూరమయినా వెళ్తుంది!’ అని ఖాయంగా అనిపించింది. లేకపోతే, ఎక్కడో గ్రీసులో వొక పారిశ్రామిక వాడలో తీసిన/ జరిగిన ఈ సినిమా కథ తెర మీద చూస్తున్నంత సేపూ నేను ఏ గోదావరిఖనిలోనో, కొత్తగూడెం పారిశ్రామిక వాడలోనో వున్నట్టు అనుభూతి కలిగించింది సంగారి దర్శక ప్రతిభ! అన్నిటికీ మించి, ఈ సినిమా అంతా వొక పోస్ట్ మాడ్రన్ కొల్లజ్ చూస్తున్నట్టు కూడా అనిపించింది. వొక వాస్తవికతని ఇంత బాగా వ్యాఖ్యానించవచ్చా అన్న ఆశ్చర్యం ఈ సినిమా చూసిన వెంటనే కలుగుతుంది.

ప్రేమా, సెక్సూ, పొగ గొట్టాలూ, చావు

ఈ సినిమా వొక ఇరవై మూడేళ్ళ అమ్మాయి కథ. ప్రేమ అంటే ఏమిటో, సెక్స్ అంటే ఏమిటో అని వెతుక్కుంటూ వుండే అమాయకమయిన పిల్ల మరీనా. వొక పారిశ్రామిక వాడలో డ్రైవర్ గా పని చేసే ఆ అమ్మాయికి వొక తండ్రి, వొక చిన్ననాటి స్నేహితురాలు తప్ప ఇంకో లోకం తెలియదు. ఆ చిన్ననాటి స్నేహితురాలు, మరీనా మాటల్లో చెప్పాలంటే, కనిపించిన ప్రతి మగవాడితోనూ వెళ్లిపోతూ వుంటుంది. తండ్రికి ఆధునిక నాగరికత నచ్చదు. కానీ, తప్పని సరయి, ఆ పారిశ్రామిక వాడలో బతుకు! “ఈ పరిశ్రమాలూ, ఈ ఆధునికత ఇదా విప్లవం? ఏం చేశాం మనం? మన గొర్రెల్ని చంపి ఈ పొగ గొట్టాలు నిలబెట్టాం!’ అని ఎప్పుడూ కోపిస్తూ వుంటాడు. సినిమాకి నిజానికి ఆ పొగ గొట్టాలే పెద్ద సెట్టింగ్. అనారోగ్యం వల్ల తండ్రి చావుకి దగ్గిర పడడం వల్ల మరీనా వొక విధమయిన వొంటరి తనంలోకి వెళ్లిపోతుంది. స్నేహితురాలి విశృంఖల శృంగారం, తండ్రి ఆధునికతా నిరసనల మధ్య మానసికంగా నలిగిపోతుంది. ఆ దశలో ఆమెకి డేవిడ్ అటెంబరో జంతువుల మీద తీసిన టీవీ డాక్యుమెంటరీలూ, పాప్ మ్యూజిక్ కొండంత ఆసరా అవుతాయి. ఆ సంగీతాన్ని, ఆ జంతువుల్ని అనుకరించడంలో ఆమెకి వొక మానసిక ఆనందమూ, కాలక్షేపమూ దొరుకుతాయి.

ఈ లోపు వొక ఇంజనీరుతో పరిచయం అవుతుంది. ప్రేమా, సెక్సు కి సంబంధించి ఆమె తనకి వున్న అన్ని సందేహాలూ తీర్చుకోడానికి, ప్రయోగాలు చెయ్యడానికి అతనొక లాబ్ లాగా ఉపయోగ పడతాడు ఆమెకి! అదెలా సాధ్యమయ్యింది అన్నదే ఈ సినిమాలో కథ! స్త్రీ పురుషుల సంబంధాల గురించి తలెత్తుతున్న కొత్త ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ఈ తరం అమ్మాయి మరీనా. ఆధునిక జీవితం అంటే ప్రేమా సెక్సూ, నాగరికతా, పరిశ్రమలూ, కొత్త ఆర్ధిక సంబంధాలూ ఇవే అనుకుంటే, వాటి విశ్వ రూపం, వాటి అంతిమ రూపం కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి.

వొక అమ్మాయి, వొక నాన్న, వొక దేశమూ!

వొక అమ్మాయి మానసిక, శారీరక ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరించడంలో సంగారి చాలా కష్టపడిందని ఈ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ అనిపిస్తుంది. ఈ సినిమా వొక అమ్మాయి కథ కాదనీ, ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగంలో కొత్త విప్లవాలకి నాంది పలుకుతున్న గ్రీసు దేశపు ఆత్మ కథ అని విమర్శకులు దీన్ని వ్యాఖ్యానించారు. నిజమే, తండ్రి పాత్రతో పలికించిన సంభాషణలన్నీ వొక దేశం వొక స్థితిలోంచి ఇంకో స్తితిలోకి ప్రయాణిస్తూ తనని తాను వెతుక్కునే ప్రయత్నమే.
చివరి రోజు తనని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న మరీనతో అంటాడు తండ్రి – “ ఈ ఇరవయ్యో శతాబ్దాన్ని నేను బాయ్ కాట్ చేస్తున్నా. కొత్త శతాబ్దంలోకి వెళ్తున్న నీకు యేమీ ఇవ్వలేకపోతున్నా, యెమీ నేర్పలేకపోతున్నా. “
కానీ, అన్నిటికీ మించి ప్రేమ, సెక్సు గురించి తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సంభాషణలు ఈ చిత్రంలో చాలా విశేషంగా అనిపిస్తాయి.
“నాన్నా, నువ్వు నన్ను ఎప్పుడయినా నగ్నంగా వూహించుకున్నావా’’ అని అడుగుతుంది మరీనా తండ్రిని వొక సారి.
తండ్రి అదోలా చూస్తాడు.
“నేను వూహించుకున్నాను లే! నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఆ శిశ్నమ్ అనేది లేకపోతే నువ్వు ఇంకా బాగుండే వాడివి!”
“అలా వూహించకూడదు నువ్వు!”
“ఏం? టాబూనా?”
“అవును, కొన్ని అలా టాబూ కావడం మంచిది!”
“ఏమో, నేను అలా ఆలోచించకుండా వుండలేకపోతున్నా”
స్నేహితురాలు వొక పెద్ద ప్రశ్నార్థకం మరీనాకి. ఆ స్నేహితురాలు శిస్నాలని అనేక భంగిమల్లో వర్ణించు చెబుతూ వుంటుంది మరీనకి.
వొక రోజు మరీనా అంటుంది ఆమెతో – “నువ్వు శిస్నాలని అలా అనేక రకాలుగా వూహించుకుంటూ వుంటావ్. కానీ, నాకు వక్షోజాలంటేనే ఇష్టం. స్విమ్మింగ్ చేశాక, ఆ గదిలోకి వెళ్తే, అద్దాల ముందు నిలబడ్డ ఆడవాళ్ళవి చూడు. ఎన్ని రకాల వక్షోజాలో!”
సెక్సుకి సంబంధించి ఈ ఇద్దరి మధ్యనే కాకుండా, తండ్రితోనూ, తన ప్రియుడితోనూ మరీనా చెప్పే మాటలు వినడానికి కొంత కొత్తగా వుంటాయి. కానీ, వాస్తవంగానే ఈ తరం ఆడపిల్లలు అలా మాట్లాడున్నారేమో అనీ అనిపిస్తుంది. అది ఎంత వరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, కొన్ని అసహజమయిన ప్రశ్నలు అని కూడా అనుకుంటే, ఆ సహజ/ అసహజాల మధ్య చర్చ పెట్టడమే ఈ సినిమాలో వొక కథ. జంతువుల డాక్యుమెంటరీలు చూస్తూ, ప్రతి సారీ మరీనా అవి చాలా సహజంగా బతుకుతున్నాయనీ, ఆధునిక పొగ గొట్టాల మధ్య వుక్కిరిబిక్కరవుతున్న మనిషి చివరికి తన చావు తానే రాసి పెట్టుకుంటున్నాడని వొక వ్యాఖ్యానం ఈ సినిమాలో వుంది. వొక అమ్మాయి వొంటరి ప్రేమరాహిత్యపు ప్రేలాపనల్లోంచి వినిపించడం వల్ల ఈ సినిమా చాలా మటుకు ఆ వ్యాఖ్యానానికి బలమయిన దృశ్య రూపం ఇచ్చింది. అలాగే, మనం వ్యక్తిగతం అనుకునే కథలు వొక జాతి చరిత్రనే చెబుతాయన్న అత్యాదునిక శిల్ప రహస్యమూ వుంది ఈ సినిమాలో!
*
Category: 6 comments

కాదే'మో'!


1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు -


2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత కోపమొచ్చేసే గడియారపు
బుడి బుడి నడక వొంటి మీద మెత్తగా
గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.


6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ...
Category: 7 comments

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా...!



"చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.


ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది."

మహాకవి ఆరుద్రతో జ్నాపకాలు చదవండి ఆవకాయలో....
Category: 0 comments
Web Statistics