వొకానొక తాళం చెవి
కవిత్వాన్ని అకవిత్వీకరించే మరో సాధనం - సంభాషణ. మామూలు సంభాషణలోని తేలిక మాటలనే తీసుకొని, వాటికి అసాధారణమయిన శక్తినివ్వడం. డెబోరా కీనాన్ కవిత్వం చదువుతున్నప్పుడు ఇదెలా సాధ్యమో అర్ధమవుతుంది. ఆమె కొత్త కవిత్వ సంపుటి "గుడ్ హార్ట్" నించి వొక కవిత ఇది.

వొకానొక తాళం చెవి

ఏకాంతమా, అమ్మా! నా జీవితాన్ని మళ్ళీ చెప్పమ్మా!
- డీ మీలోజ్ఇల్లు విడిచి
ఏ పొద్దో వాలకముందే
ఆ వొడ్డు దాకా వొక్క నిమిషం నడిచి వెళ్లాలని.


లేదా,
అప్పుడప్పుడే పొద్దు వాలినప్పుడయినా సరే.


వెండి అలల్ని దాటి
నల్ల డాల్ఫిన్లు బారులు తీరడానికి
ఎగబడుతున్నప్పుడు.


తాళంలో చెవి తిప్పి
నా అడుగుల చప్పుడు వింటూ

తెల తెల్లని ఇసక దారి
సంద్రంలోకి లాగుతున్నప్పుడు.


మూసుకు పోయిన దారంటా
వీధి చివరంటా నడిచెళ్లే ఆ పిల్లలా.

అందరూ మంచి వాళ్ళే అనే
అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే అనే
కుటుంబ బాదరబందీ నించి

వొకానొక ఏకాంతపు కౌగిలిలోకి
నిదానంగా నడక.


వుండి పోవాలని వెళ్లిపోవాలని
తాళం చెవి బాగు చేయించాలని దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని
ఇసక మీదనో రాళ్ళ మీదనో నడవాలని
అలల మీద స్వారీ చేయాలని తేలిపోవాలని
దారి చివరంటా పోవాలని

తాళం చెవి సరిగ్గా వేయాలని
దాని అర్థం తేల్చుకోవాలని.

ఇవాళ

వొకానొక గాలి తరగ దాని వొంటరి క్షణంలో
నా దక్షిణం వైపు కిటికీని తట్టి వెళ్తోంది

అది మోసుకు వెళ్లే తాళం చెవి నాకు తెలుసు
అది మందలింపు కాదు, పొడుపు కథ కాదు,
వాగ్దానమూ కాదు.

3 comments:

SCULPTING THOUGHTS said...

chaala baagundi sir.
"వెండి అలల్ని దాటి
నల్ల డాల్ఫిన్లు బారులు తీరడానికి
ఎగబడుతున్నప్పుడు."
ee lined naaku oka everlasting image ni create chesaye.

మంచికంటి said...

అన్ని ద్వారాలకు తాళం చెవులు వేసుకుని ఒంటరి తిరాల్ని వెతుక్కోవడం,వెతుక్కుంటూ వెతుక్కుంటూ దారి తప్పి పోవడం నిజంగా మనుషుల్లా బతకాలనుకునే వారికి చిరకాల వాంచలా మిగిలి పోతున్న ఈ రోజుల్లో అస్సలు తాళాలే లేకపోవడం నిజమైన స్వప్నం .ఆ స్వప్నదారుల వెంట నడిచి నడిచి పోతూ వుంటే కదా జీవితానికి అర్థం తెలిసేది.
-manchikanti

Afsar said...

రోహిత్, మంచికంటి:

మంచి మాటకి ధన్యవాదాలు

అవును, మంచికంటి, అదే మన కల.

Web Statistics