పునరపి జననమేమో గానీమరణం మాత్రం ఖాయం –
ఈ వాక్యం రాసిన మూడేళ్ళకే గుడిహాళం మరణ వార్త వినాల్సి వస్తుందని తెలీదు.
కానీ, తనకి ఈ వార్త ముందే తెలిసినట్టుంది. తన మరణాన్ని ముందే దర్శించాడు కనుకనే వొక తెగింపుతో, చావో రేవో అన్న కసితో విసవిసా వెళ్లిపోయాడా రఘు?!
ఇవాళ ఇద్దరు మిత్రుల నోటి వెంట ఈ మరణ వార్త విన్నాక ఏం మాట్లాడాలో తెలీక గుడిహాళం రాసిన కొన్ని కవితల్ని నెమరేసుకుంటూ వుండిపోయాను. “ఒక జననం ఒక మరణం” అనే కవిత మేం “అనేక” కోసం అతని దగ్గిర నించి తీసుకున్నాం. ఆ కవిత మరణం గురించే, అంతకంటే ఎక్కువగా జననం గురించి! అంతకంటే మరీ ఎక్కువగా అది గుడిహాళం రాసుకున్న ఆత్మ కవిత.
గుడిహాళం యుద్ధ కవి.
యుద్ధాలు లేని కాలంలో యుద్ధ కవులు వుంటారా అని తెలుగు దేశపు ఆకుపచ్చ నిర్గుణ కవి పుంగవులు/ నపుంసక విమర్శక శిఖామణులు ఎవరేనా అడగవచ్చు.
ఈ నిర్గుణ అనే మాట గుడిహాళందే! రాజకీయాలు పట్టని ఆకుపచ్చ కవిగాళ్ల గురించి గుడిహాళం ఎప్పుడూ “వాళ్ళు నిర్గుణులేవోయ్” అనే వాడు నిస్సంకోచంగా.
ఉగ్రులమై
ఆగ్రహంతో వణకాలి, వణికించాలి
అన్న గుడిహాళం వాక్యం విన్న వెంటనే ఈ నిర్గుణ కవివిమర్శకులకి జ్వరం పట్టుకుంటుంది. అందులో పదచిత్రాలూ, ప్రతీకలూ, మెటఫర్లూ లేవు లేవని పొర్లి పొర్లి ఏడుస్తారు తాయిలం చిక్కని పసి కాయల్లా.
కవులు పద సౌందర్యానికి బానిసలై పోయిన కాలం లో బాధనీ, ఆగ్రహాన్నీ, నిరసననీ, నిరాశనీ తీవ్ర వాక్యంగా మలచి సావధానమయిన తుపాకిలా గురిపెట్టిన వాడు గుడిహాళం.
మొదటి సారి గుడిహాళం పేరు ఎక్కడ విన్నానో ఎప్పుడు విన్నానో గుర్తు లేదు. ఎన్ని సార్లు అతన్ని కలిశానో కూడా సరిగా లెక్క చెప్పలేను. అజంతానీ అకాడెమీ వేదిక ఎక్కించిన వాడు గుడిహాళమే. సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీ కలిసి ఏర్పాటు చేసిన “కవి సంధ్య”లో అజంతాతో పాటు కవిత్వం చదవడం వొక తీయని జ్నాపకం. ఆ రెండు రోజుల్లో రెండు సార్లు నన్ను వేదిక ఎక్కించాడు గుడిహాళం. మొదటి సభ పోస్ట్ మోడ్రనిజమ్ మీద - ఆ సందర్భంగా దాదాపు వొత్తిడి పెట్టి మరీ నాతో ప్రసంగం ఇప్పించడమే కాకుండా, ఆ ప్రసంగం రాతలో పెట్టేంత వరకూ రంపాన పెట్టాడు మొండి వాడు గుడిహాళం.
గుడిహాళం ముఖ్యంగా బుద్ధిజీవి. అతని కవిత్వం అతని నిగూఢమయిన ఆలోచనలకి కప్పిన ఉద్వేగభరితమయిన దుప్పటి. అతని వాక్యాల నీడలో అనేక రకాల ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటాయి. అందుకే అతను కవిత్వం చదివాక/ లేదా అతని కవిత మనం చదివాక – ఒక ఆలోచనలో నిమగ్నం అవుతాం.
గుడిహాళం సామూహిక జీవి కూడా – అతని కవిత్వం వొంటరీతనపు లోతయిన నిట్టూర్పు లో మొలిచినట్టుగా వుంటుంది. కానీ, ఆ వొంటరి తనం కింద మన విఫలమయిన సామూహికత కనిపిస్తుంది. అందుకే అతని కవిత చదివాక 2000 తరవాత మన లోలోపలే నిమజ్జనమవుతున్న నినాదాల తుంపులు వినిపిస్తాయ్.
ఇప్పుడు – అందుకే – అతని మాటలు అతనికే వినిపిస్తూ..
ఆ బాధ లోంచి మరో బాధకు నడుస్తూండగానే
ఓ కల తరలి పోయింది
ఓ మెరుపు కరిగిపోయింది
ఎక్కడో రెక్క తెగింది
ఎప్పుడో ఏదో స్వరం బతుకు నించి తప్పుకుంది.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago