రోహిత్ కోసమే కాదు!


1
నొప్పెడుతుందని చెప్పుకోలేని
వొకలాంటి రాత్రిలోంచి  యింకోలాంటి  రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప
రెండు కలల మధ్య  చావుని మాత్రమే అల్లుకుంటూ పోయావే తప్ప
యెవరి చీకట్లోకి నువ్వు
నీ దేహంతో సహా గబుక్కున దూకేశావో,
యెవరి గోడల్ని
పిడిబాకులాంటి  పిడికిళ్ళతో బాదుకుంటూ వుండిపోయావో
ఆ రాత్రికో ఆ వొంటరి తనానికో
యిప్పుడు నీడగా అయినా  కన్పించని నీకో తెలుసా?

2
మరణంలో మాత్రమే
నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే
పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,
నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ  కన్పించని/ కన్పించనివ్వని
తెలియని/ తెలియనివ్వని
లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ
నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ
యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?

3
అద్దాలు అడ్డం పడుతున్నాయి నిజాలకి,
విదూషకుడి మాయవరణంలో నువ్వొక అబద్దమై రాలిపడుతున్నావ్!
కచ్చితంగా నువ్వు గుర్తు పట్టినట్టే
నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక
నువ్వేదో అంతుపట్టవు యీ  కళ్ళల్లో!

యీ  పూటకి
కాసింత  కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు
యీ  గుడ్డి చూపుల దర్బారులో!
ఏదో వొక దృశ్యమేగా యీ  కంటి మీద  వాలాలి
ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

4
జీవితం యింకాస్త అందంగా
యింకాస్త ప్రశాంతంగా
యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు అనుకొని
నిన్నటి నిద్రలోకి జారిపోతూ యీ  పొద్దుటి కల రాసుకుంటూ వున్నానా
అదే  అరక్షణ శకలంలో  నువ్వు
చివరి పదాల ధిక్కారాన్ని వాక్యాలుగా పేనుతూ వున్నావ్,
కొండని పిండి చేసే ఆగ్రహమై కాసేపూ
అంత ఆగ్రహమంతా నీటి చుక్కయి రాలిపోయే నిట్టూర్పువై ఇంకాసేపూ-

5
యీ పొద్దున్న
యింకో సారి అద్దం కూడా నవ్వింది
నీకు నువ్వు తెలుసా అని!
నీలోపల పేరుకుపోతున్న ఆ పెదవి విప్పని  చీకటి పేరేమిటి అని!

నీ చూపు చివర
వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా  కాచుకునే వుంది, చూశావా? అని-

యింకోలాగా  మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కాని
యింతకంటే నిజం యింకోలా లేనందుకు
యివాళ
యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

జనవరి 21, 2016

1 comments:

PADMAPADMAPV said...
This comment has been removed by the author.
Web Statistics