ఫనా


1
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను.
నీ వూహ వొక సాకు నాకు.
తిరిగే విరిగే అలలో గడ్డ కట్టుకుపోతున్నా,
నా లోపలి నీలోకి / నీ లోపలి నాలోకి
నన్నే విసురుకునే ఆటబొమ్మనై.
2
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో,
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి!
3
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిధిలమయిపోనీ నిబ్బరంగా!
(ఫనా వొక సూఫీ భావన. “నేను” అనేది కనిపించనంతగా “నువ్వు” అనే భావనలో లీనమయిపోవడం!)

1 comments:

ప్రసూన said...

అఫ్సర్ జీ. ఏంత బావుందో. మీరు మాత్రమే ఇలా వ్రాయగలరు.

Web Statistics