1
రాత్రిని నిలదీసి నువ్వేమీ అడగలేవు
వానలో తడుస్తున్న చీకట్నీ
ఏ కౌగిలి కోసమో దూసుకుపోతున్న ఈదురుగాలినీ అడగలేవు
వొక గాయం రెండు తలుపులూ బార్లా తెరిచి
నీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు
నిన్ను
నువ్వు కూడా ఏమీ అడగలేవు.
2
పో
వెళ్లిపో గాయంలోకే
చిన్ని అడుగుల ముద్దు పాదాల ముద్రలు కొలుచుకుంటూ
3
అటు తిరిగి ఇటు మెసలి
అటుఇటు ఎటూ తిరగలేని
నోరు మెదపలేని నిద్ర లేని రాత్రి
4
కనురెప్పకి నిప్పుల కాపలా
తెల్లారే దాకా.
5
ఎవరు దుఃఖిస్తున్నారో
ఎవరు ఎవరు దుఃఖాన్ని వూహిస్తున్నారో
పరకాయ ప్రవేశమే తేలిక
పర గాయ ప్రవేశం కన్నా!
6
నదిలోకి పడవ వదిలినట్టుగా
నా శరీరంలోకి కాస్త నిద్ర నొదిలి రాగలవా?
బతిమాలుకుంటున్నా
రాత్రి గడ్డం పట్టుకొని.
7
అందరూ నిద్రపోతున్నారు
నీ కంటి కింద దీపం పెట్టి,
ఈ రాత్రిని
ఇలా వెలిగించుకో అని శాపం పెట్టి.
(ఏప్రిల్ 20... తెల్లారబోతూ....చాలా
రోజుల తరవాత ‘నిద్రకి వెలినై...నేనొంటరినై..’ పల్లవినై...)