ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో మీతో వో కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.
 
సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.http://www.saarangabooks.com/magazine/
Category: 1 comments

1 comments:

శరత్ కాలమ్ said...

సంతోషం. ముందుముందు నేను కూడా నా రచనలని పంపిస్తాను.

వివిధ భావజాలాలతో పాటుగా LGBT భావజాలానికి కూడా ఈ వార పత్రికలో తగినంత చోటు వుంటుందని ఆశిస్తాను.

Web Statistics