ఆస్టిన్ లో రమణీయం!




ఆస్టిన్ లో ఈ శనివారం రోజంతా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిన టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సులో ఈ సారి ప్రత్యేక ఆకర్షణ ప్రసిద్ధ సాహిత్య బంధువు , అనేక మందికి ఆత్మబంధువు ముళ్ళపూడి వెంకట రమణ గారికి నివాళిగా అర పూట కేటాయించడం! బహుశా, రమణ గారికి ఇంత మంచి నివాళి ఆంధ్ర దేశంలో కూడా దక్కి వుండదు అని నేను సభలోనే అన్నాను, ఇక్కడా రాతలో కమిట్ అవుతున్నాను. ఈ ఆలోచన వచ్చినందుకు బలరామ పురం (ఫ్లూగర్ విల్లి కి ‘సత్య’ నామం) నివాసి, ప్రముఖ రచయిత మందపాటి సత్యం గారిని ముందుగా అభినందించాలి.

మంచి అనుభవాల తలపోత




ముళ్ళపూడి వెంకట రమణ గారిని తలచుకుంటూ టెక్సాస్ రచయితలు తమ అనుభవాలని చెప్పడమే కాదు, రమణ గారి కొన్ని రచనలను వీనుల విందుగా పాఠకులతో పంచుకున్నారు. సత్యం గారు రమణగారితో తనకి వున్న పరిచయానుబంధంతో అందరికీ స్వాగతం చెప్పారు. ‘గుడివాడ” (టెంపుల్) ప్రముఖులు వైవీ రావు గారు రమణ గారి “ఆత్మస్తుతి” నించి కొన్ని భాగాలు వినిపించారు. శేషగిరి రావు గారు మద్రాస్ అనుభవాలని తలచుకున్నారు. గిరిజా శంకరం గారు స్కిట్ వెయ్యాలనుకొని హీరోయిన్ గైర్హాజరీ వల్ల ఏకపాత్రాభినయానికి పరిమితమయ్యారు. వంగూరి చిట్టెన్ రాజు గారు రమణ గారితో వున్న ఆత్మీయానుబంధం గురించి చెప్పడమే కాకుండా, సినారె ని కూడా వీడియో ద్వారా ఆస్టిన్ కి లాక్కు వచ్చారు. రామ్ డొక్కా, ఫణి డొక్కా రమణ గారితో అనుభవాలని చక్కని కథనంగా వినిపించారు. ఈ వ్యాసకర్త కోతి కొమ్మచ్చి గురించి చెప్పాడు. పప్పు సత్యభామ గారు ముళ్ళపూడి కథ “కానుక” ని చక్కగా చదివి వినిపించారు. అలాగే, రమణ గారి పాటని “ఆహా” అనిపించేట్టు తీయగా పాడి వినిపించారు. నిజానికి సత్యభామ గారి గొంతులో రమణ గారి కథల ఆడియో పుస్తకం తీసుకురావచ్చు!

శ్యామ్ యానా/ అనేక
సదస్సు రెండో సెషన్ మెడికో శ్యామ్ కథల సంపుటి “శ్యామ్ యానా” ఆవిష్కరణతో మొదలయ్యింది. ఈ సదస్సుకి చిట్టెన్ రాజు గారు అధ్యక్షత వహించారు. శ్యామ్ కథల గురించి ఆయన మిత్రులు రాచకొండ సాయి గారు మాట్లాడారు. శ్యామ్ మరో మిత్రులు నాగేశ్వర రావు గారు పలికిన ఆత్మీయ వచనాలు సరదాగా ఆర్ద్రంగా వున్నాయి. ఇక శ్యామ్ ఒక సాహిత్య డిటెక్టివు కథ అంటూ తన గురించీ, తన లోపలి కథకుడి గురించీ చెప్పిన ముచ్చట్లు ఆద్యంతం బాగా నవ్వించాయి. ఆయన ప్రసంగం అంతా హాయిగా రీడబిలిటీ వున్న హాస్య కతలాగా సాగింది. చాలా బరువయిన సంగతులు కూడా తేలికయిన మాటల్లో చెప్పుకొచ్చారు శ్యామ్.




అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకత్వం వహించిన పదేళ్ళ కవిత్వ సంకలనం “అనేక” గురించి మద్దుకూరి చంద్రహాస్ వివరంగా ఆలోచనాత్మకమయిన ప్రసంగం చేశారు. అనేకని పరిచయం చేస్తూ “ వస్తుపరంగా చూస్తే - మైనారిటీ వాదం (ఇస్లాం, క్రైస్తవం), దళితవాదం, స్త్రీవాదం, ప్రాంతీయవాదం (తెలంగాణ), ఇప్పటికీ శక్తివంతంగానే ఉన్న వామపక్షవాదం – అవేకాక స్త్రీలు, పురుషులు, మానవసంబంధాల మీద – ఇవేవీ లేకుండా సమకాలీన పరిస్థితుల మీద, ఆధునిక జీవితంమీద – ఇంకా తాత్వికధోరణులలో - ఇలా విభిన్నమైన గొంతుకలు ఇందులో వినిపిస్తాయి. కానీ ఇన్ని భిన్నమైన విషయాల లోనూ ఒక అంతర్లీన ప్రాతిపదిక (inherent idea) ఉన్నది. ఈపదేళ్ళ కాలంలో తెలుగునాట ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల ప్రభావం, ఈ ఆర్థిక విషయాల ప్రతిధ్వనులు ముందు చెప్పుకున్న అనేక అస్తిత్వవాదాలమీద వేసిన ముద్ర, - అది ఈ పుస్తకానికి ముఖ్యమైన ప్రాతిపదిక.” అన్నారు చంద్రహాస్.
ఇక మూడవ విభాగంలో టెక్సాస్ రచయితలూ కవులు స్వీయ రచనలు వినిపించారు. రమణి విష్ణుభొట్ల, యెలేటి వెంకట రావు, రాయుడు, ప్రసాద్ విష్ణుభొట్ల, ప్రసాద్ తుర్లపాటి తదితరులు తమ రచనలు చదివారు.
ఈ సారి టెక్సాస్ సాహిత్య సదస్సులో డాలస్ దండు (చంద్ర కన్నెగంటి, సురేశ్ కాజా, కేసీ చేకూరి, నసీమ్, అనంత్ మల్లవరపు లాంటి వారు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది.

పోయిన సారి గుడివాడ (టెంపుల్)లో అడుగడుగునా నవ్వుల పూలు రువ్విన సుదేశ్, అరుణ్ లేకపోవడంతో ఈ సారి పెద్దగా నవ్వులు పూయలేదు. ఇర్షాద్ వచ్చినట్టే వచ్చి మెరుపులా మాయమయిపోవడం అన్యాయం అనిపించింది.
జపాన్ లో జరిగిన ప్రకృతి వైపరీత్యం గురించి భావన డొక్కా చక్కని తెలుగులో మాట్లాడడం బాగుంది. సభకి ముందే కడుపు నిండా భోజనాలు పెట్టడం బాగుంది. ముఖ్యంగా మైసూరు పాకులు వక్తల ప్రసంగాల కంటే బాగున్నాయి. సభలో మాట్లాడిన వక్తల ముఖ చిత్రాలను అక్కడికక్కడ గీసివ్వడం బాగుంది.


మిత్రులకు మనవిఈ సదస్సు ఫోటోలు మీ దగ్గిర వుంటే పంపండి. ఇక్కడ ప్రచురించ వచ్చు.
Category: 6 comments

6 comments:

తెలుగుయాంకి said...

చస్!! సందడంతా మిస్సైపోయాము.

వంగూరి చిట్టెన్ రాజు said...

సదస్సు సమీక్ష బావుంది. అక్కడికి వచ్చి కూడా, కల్పనా రెంటాల అనే ఆవిడ మాట్లాడకపోవడం బాగా లేదు. ఆవిష్కరించబడిన శ్యామ్ యానా కథల సంపుటి వా వంగూరి పౌండేషన్ వారి నలభై మూడవ ప్రచురణ అని ఇండుమూలంగా తెలియజేసుకుంటున్నాను. ఉన్న రెండు ఫొటోలలో పసుపు చొక్కా తాలూకు మనిషి నేనే! రెండోది ఈ బ్లాగాయనది.

--వంగూరి చిట్టెన్ రాజు వ్రాలు

వంగూరి చిట్టెన్ రాజు said...

సదస్సు సమీక్ష బావుంది. అక్కడికి వచ్చి కూడా, కల్పనా రెంటాల అనే ఆవిడ మాట్లాడకపోవడం బాగా లేదు. ఆవిష్కరించబడిన శ్యామ్ యానా కథల సంపుటి వా వంగూరి పౌండేషన్ వారి నలభై మూడవ ప్రచురణ అని ఇండుమూలంగా తెలియజేసుకుంటున్నాను. ఉన్న రెండు ఫొటోలలో పసుపు చొక్కా తాలూకు మనిషి నేనే! రెండోది చంద్రహాస్....

--వంగూరి చిట్టెన్ రాజు వ్రాలు

Afsar said...

@యంకీ, మీరు వచ్చి వుంటే సందడిగా వుండేది. సందడి మేమే మిస్ అయ్యామ్.
@రాజు గారు; ధన్యవాదాలు.

Jai Telangana said...

Dear Afsar garu,

In your original note you said, "Ramana gaariki bahusa inta manchi nivaali andhra desam lo kooda doriki vundadu". That is very much true. To my knowledge there wasnt anything special done towards rememberance of Sri Ramana garu, here in AP.

-thanks for sharing,

Very much excited to read the details, from hyderabad. Do upload if there are any audio/video recordings, along with photos.

Afsar said...

జై తెలంగాణ:

మీ వ్యాఖ్యకి సంతోషం.

నివాళి రెండు రకాలుగా వుంటుంది. వొకటి: ఆ రచయితని తలచుకోవడం.

రెండు: ఆ రచయిత విలువల్ని ముందు కాలంలో నిలుపుకోవడం.

మొదటి పని మనం కాస్త హడావుడిగానే చేస్తాం, మీడియా వుంది కాబట్టి . కానీ, రెండోది మాత్రం గాలికి వదిలేస్తాము.

మొదటి బాధ కంటే రెండో బాధ గురించి నా అసలు బాధ!

Web Statistics