సరిహద్దులు లేని సాహిత్య సంచారి!
వొక వడలిపోని జ్నాపకం –

90లలో అనుమాండ్ల భూమయ్య గారి కొత్త పద్యాలు చదివి ముచ్చటేసి, “ఫ్రెంచ్ మద్యంలాంటి తెలుగు పద్యం” అనే శీర్షికతో నా వ్యాసం అచ్చయిన వొక సాయంకాలం వో పెద్దాయన నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. ఆయనకి అప్పటికే వయసు బాగా మళ్ళింది. కానీ, ఆయన మాట తీరు చూశాక ఆయన ఆలోచనలకి పెద్దగా వయసు మళ్లలేదని అర్ధమయ్యింది. ఆలోచనల నిండా వొక స్వచ్ఛత, ఇప్పుడే కవిత్వ విమర్శలోకి అడుగు పెట్టి, ఆ రూప రహస్యాలు శోధిస్తున్న కంటిలో వుండే తీక్షణత – ఆయనలో కనిపించాయి. అదే మొదటి సారి వడలి మందేశ్వర రావు గారిని చూడడం! మొన్న చనిపోయినప్పుడు వడలి మందేశ్వర రావు గారికి దగ్గిర దగ్గిర తొమ్మిది పదుల వయసు. కానీ, ఆయన విమర్శ పుస్తకాలు వొకొక్కటిగా ఇప్పుడు తిరిగి చదువుతున్నప్పుడు నిజానికి ఆ వయసులోని వార్ధక్యం వొకింత కూడా కనిపించదు. విమర్శకీ వయసుకీ సంబంధం వుంటుందా అన్న ప్రశ్న రావచ్చు. వుంటుందని నాకు అనిపిస్తోంది. వయసు మీద పడే కొద్దీ లోకం మీద ఫిర్యాదులు పెరిగిపోతాయి. విమర్శలో పటుత్వం తగ్గే అవకాశమూ లేకపోలేదు. మినహాయింపులు వుంటాయి. అలాంటి మినహాయింపులు అరుదు. ఆ అరుదయిన మినహాయింపు మందేశ్వర రావు గారు.
మూడు ముఖ్యమయిన విమర్శ పుస్తకాలు మందేశ్వర రావు గారిని ఎప్పటికీ మన ముందు వుంచుతాయి. అందులో మొదటిది ఆయన విశ్వనాథ మీద రాసిన “ఇదీ కల్పవృక్షం”. నాకు తెలిసీ కల్పవృక్షం లోని నిర్మాణ రహస్యాలని శోధించి, వాటి మీదకి దృష్టి మళ్లించే మొదటి ప్రయత్నం ఇదే అనిపిస్తోంది. విశ్వనాథని చదవక్కరలేదు అనుకునే కాలంలో ఎందుకు చదవాలో కొత్త సాహిత్య ప్రమాణాలతో వొప్పించే విధంగా రాశారు మందేశ్వర రావు గారు. వ్యక్తిగతంగా విశ్వనాథకి చాలా కాలం చాలా దూరంగా వున్న నేను “ఇదీ కల్పవృక్షం” చదివాక తిరిగి ఆయన రచనలు ఆసాంతం చదవడం మొదలు పెట్టాను. రచయిత దృక్పథాన్ని కాసేపు పక్కన పెట్టి, రచన ఇంకా ఏం చెప్తుందన్న ఆలోచన మొదలయితే విశ్వనాథ మొత్తం సాహిత్యాన్ని ఇంకో కోణం నించి తప్పక అర్ధం చేసుకోవచ్చని నా అనుభవం. మందేశ్వర రావు గారు విశ్వనాథ కవిత్వ శిల్పం మీద మొదలు పెట్టిన చర్చ ఇంకా కొనసాగాల్సిన అవసరం వుంది.
దీనికి పూర్తి భిన్నంగా రాసిన రెండు పుస్తకాలు: 1) పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు, 2) Modern Poetry in Telugu. 1990 ల తరవాత తెలుగు సాహిత్య రంగంలో పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల మీద వొక కొత్త ఆసక్తి మొదలయ్యింది. మార్క్సిస్టు అనంతర అస్తిత్వ వాదాలు చర్చలోకి వచ్చిన తరవాత మార్క్సిస్టు సాహిత్య విమర్శ ధోరణి మాత్రమే సరిపోదని, ఇతర ధోరణులు కూడా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందని కొత్త తరం గుర్తించడం మొదలయింది. ఆధునికతకి పరిమితమయిన విమర్శ సాధనాలు కొత్త ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేని స్థితిలో అత్యాధునిక సాధనాల అన్వేషణ కూడా ప్రారంభమయింది. ఆ నేపథ్యంలో వెలువడిన విమర్శ పుస్తకం “పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు.”(1994). తెలుగులో మౌలిక సాహిత్య విమర్శ, సిద్ధాంత భావనల గురించి పరిచయమూ, పరిశోధనా తక్కువే. చాలా భావనల్ని మనం వాటి తాత్విక చరిత్రతో సంబంధం లేకుండా మనకి తోచినట్టుగా వాడుతూ వుంటాం. దీని వల్ల సాహిత్య చర్చలు చాలా సందర్భాల్లో అభిరుచి, వైయక్తిక పరిధులని దాటి వెళ్లవు. ఆ రెండు పరిధులని దాటుకుని, వొక దృక్కోణం నించి సాహిత్య విమర్శ జరగాలంటే, మౌలిక భావనల ఆనుపానులు తెలిసి తీరాలి. 1990 తరవాత తెలుగులో అత్యాధునికత చర్చ దారి మళ్లడానికి కారణం ఇదే. అది క్రమంగా పడమటి సాహిత్య సిద్ధాంతాలని ఎలాంటి నిర్దిష్టతా, విమర్శా లేకుండా స్వీకరించే స్థితికి తీసుకు వెళ్లింది. పడమటి సిద్ధాంతాలని శిరోధార్యంగా భావించే వలసాధునికత లోకి తీసుకు వెళ్లింది. “పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు.” పుస్తకం రాస్తున్నప్పుడు గాని, ఆ పుస్తకం వెలువడినప్పుడు గాని మందేశ్వర రావు గారికి ఆ కొత్త పరిణామాల గురించి ఆట్టే అవగాహన లేకపోవచ్చు. కానీ, ఈ పుస్తకం ఆ పరిణామాలతో నిమిత్తం లేకుండానే, కొన్ని సమస్యల్ని పరిష్కరించింది. అసలు పాశ్చాత్య విమర్శని ఎంత వరకు మనం గ్రహించవచ్చన్నది అందులో మొదటి సమస్య. మందేశ్వర రావు గారు గుర్తించినట్టు, ఇప్పటికీ పడమటి సాహిత్య విమర్శలో వినవచ్చే చాలా అంశాలు భారతీయాలంకారికులకి “నూత్నమయినవి” కావు. కానీ, మనలో వున్న పడమటి వలస వాద మొగ్గు వల్ల అవి అన్నీ నవనవలాడుతూ కనిపిస్తాయి. మందేశ్వర రావు గారి ఈ పుస్తకం వెలువడి పదహారేళ్లు దాటింది. రెండు కారణాల వల్ల ఈ పుస్తకం నాకు నచ్చింది: వొకటి, పడమటి విమర్శ సిద్ధాంతాలని విమర్శనాత్మకంగా చూడడం; రెండు, అత్యాధునిక భావనల్ని సైతం చాలా స్పష్టమయిన తెలుగు భాషలో చర్చించడం. ఈ రెండు లక్షణాలూ క్రమంగా దూరమయిపోతున్నాయని వేరే చెప్పక్కరలేదు కదా!
ఇక మందేశ్వర రావు గారి మూడో పుస్తకం – Modern Poetry in Telugu. ఇంగ్లీషులో వుండడం వల్ల ఈ పుస్తకం మీద తగినంత చర్చ జరగలేదేమో అనిపిస్తోంది వొక్కో సారి. ఇది కవుల గురించి పుస్తకం కాబట్టి చాలా మటుకు దీన్ని కవిపరిచయ విమర్శగానే చూసినట్టూ అనిపిస్తుంది. కానీ, మందేశ్వర రావు గారు చాలా మౌలికం అనిపించే కొత్త వాదనలు, ప్రతిపాదనలు ఇందులో చేశారు. ఈ పుస్తకం రెండు భాగాలు – ధోరణులూ, కవిపరిచయాలు. నాకు అమితంగా నచ్చిన భాగం మొదటిదే, ధోరణుల గురించి. శ్రీశ్రీలూ, కృష్ణశాస్త్రులూ, విశ్వనాథల కాలానికీ, ఈ కాలానికి కవిత్వంలో చాలా తేడా వుందన్న విషయం అందరూ ఇట్టే వొప్పుకుంటారు. కానీ, ఆ తేడా ఎక్కడ వచ్చిందో నిర్దిష్టంగా చెప్పడం అంత తేలిక కాకపోవచ్చు. ముఖ్యంగా కవిత్వరంగంలో ఈ విషయం తేలికగా తేలేదీ కాదు. కవి స్థాయీ, విమర్శకుడి అభిరుచీ అక్కడ సంకెల అవుతుంది. నిజానికి “ఇదీ కల్పవృక్షం” లో చేసిన పనే మందేశ్వర రావు గారు ఇక్కడా చేశారు. ఆయన కవిత్వ నిర్మాణంలోకి వెళ్లారు. ఆ నిర్మాణంలోంచి ధోరణుల్ని వీక్షించారు. అలా చెయ్యడం వల్ల ఆయన చూపు అభిరుచి పరిధిని దాటి, కవిత్వాన్ని లోనారసి చూసింది. ప్రతి కవిత్వ ధోరణీ గతాన్ని ఛేదిస్తుందని తెలుసు. కానీ, ఆ ఛేదన స్వరూపం తెలియాలంటే కవిత్వ నిర్మాణంలోకి వెళ్ళాల్సిందే. ఇది ఇప్పటి అస్తిత్వ వాద ధోరణులకి ఇంకా ముఖ్యమయిన విషయం. కానీ, అస్తిత్వవాద సాహిత్య విమర్శ ఇంకా నిర్మాణం జోలికి వెళ్లడానికి సందేహిస్తూనే వుంది. అలాంటి సందేహాలు అక్కరలేదనే మందేశ్వర రావు గారి విమర్శ నేర్పే పాఠం.
దురదృష్టవశాత్తూ మన లోకంలో ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు శత్రు శిబిరాలుగా మారిపోయాయి. గతాన్ని వర్తమాన దర్పణం నించి చూసి, ప్రాచీన సాహిత్యాన్ని అవతల పెట్టే ధోరణి పెరుగుతోంది. ఆధునిక సాహిత్యం చదివే చాలా మంది ఇవాళ దృక్పథం పేరు చెప్పి ప్రాచీన సాహిత్యం జోలికి కూడా వెళ్ళడం లేదు. ఇంకో వైపు నించి ప్రాచీన సాహిత్య పాఠకులలోనూ ఇదే ధోరణి వుంది. సాహిత్య అనుభవానికి కాలం అడ్డు రావడం కొంత విచిత్రమే, సాహిత్య అనుభవానికి కాలంతో నిమిత్తం లేని రచన ముందు కేంద్రం కావాలి. ఆ రచన ప్రబంధం కావచ్చు, శతకం కావచ్చు, పద్యం కావచ్చు, వచనం కావచ్చు. అన్నిటికీ మించి ఇవాళ మనం విస్మరిస్తున్న మౌఖిక కథనం కావచ్చు.
ఈ రకమయిన ప్రాచీన/ ఆధునిక వైషమ్యం. వైమనస్యం వల్ల మన ఆలోచనల పరిధే కుంచించుకు పోతుందన్న ఆత్మ శోధన కూడా ఇప్పుడు లోపిస్తోంది. కానీ, అప్పుడప్పుడూ మనకి ఆ రెండీటీ మధ్యా వారధి కట్టే వాళ్ళు వస్తున్నారు. చూస్తూండగానే వాళ్ళూ వెళ్లిపోతున్నారు. మొన్న సంపత్కుమార గారు, ఇవాళ మందేశ్వర రావు గారు. వాళ్ళ నించి నేర్చుకోవాల్సిన పాఠాలు అయినా మనం మిగుల్చుకోగలిగితే బాగుంటుందని అనిపిస్తోంది. ఈ ఇద్దరి కృషిలో వొక సామ్యం వుంది. ఇద్దరూ సాహిత్య విమర్శని వొక ప్రత్యేక రంగంగా భావించి, ఆ రంగంలో చివరి దాకా పనిచేసిన వాళ్ళే. తక్షణ ప్రయోజనం అనేది తప్పనిసరి కాంక్ష అయిన ఈ కాలంలో సాహిత్య విమర్శ క్రమంగా వొక thankless job గానే మిగిలిపోతున్న మాట నిజం. ఆ రంగంలో నిలకడగా వుండాలని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద కూడా లేదు. కానీ, దానిని వొక రంగంగా భావించి, గౌరవించి, గౌరవించబడిన వాళ్ళు కూడా వొక్కొక్కరే వెళ్లిపోవడం విషాదం.
(ఆంధ్ర జ్యోతి నుంచి)

3 comments:

కామేశ్వరరావు said...

అయ్యో!

ఒకరకంగా విశ్వనాథని నాకు పరిచయం చేసిన పుస్తకమే "ఇది కల్పవృక్షం". అది చదివాకనే నేను కల్పవృక్షం చదవడం మొదలుపెట్టింది. చాలాసార్లు చదివిన అతి కొద్ది పుస్తకాలలో ఈ పుస్తకం ఒకటి. అలాగే "పాశ్చాత్య సాహిత్య విమర్శ- చరిత్ర, సిద్ధాంతాలు" పుస్తకం కూడా. చెప్పే విషయంలో ఒక కొత్త చూపు, స్పష్టత, ఆత్మీయత మందేశ్వరరావుగారి రచనలో నాకు కనిపించిన గొప్ప గుణాలు.

మొన్న సంపత్కుమారగారు, ఇప్పుడు మందేశ్వరరావుగారు. పాతనీరు పోతోంది, కొత్తనీరు కనపడ్డం లేదు!

మాగంటి వంశీ మోహన్ said...

అఫ్సర్ -

మందేశ్వర రావు గారి గురించిన పరిచయానికి ధన్యవాదాలు......ధన్యజీవి.....

ఇప్పటి సంగతే ఎత్తారూ? అరుదు అన్న పదానికి కొన్ని రోజులకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలేమో! లేదా అది కూడా ఎవడికి పడితే వాడికిచ్చే ఈనాటి బిరుదం చేసెయ్యొచ్చేమో!

ఇతరులు, మీతో సహా నాతో విభేదించవచ్చు కానీ విమర్శ అనేది ఎప్పుడూ "థాంక్ లెస్" జాబ్ గానే ఉండాలి. థాంకులు చెబుతూ ఉంటే గుంపులు, భజనలు మొదలవుతాయి....పాత కాలమూ ఇందుకు అతీతం కాదనుకోండి......కాకుంటే ఆనాటి ఆ మహామహుల రచనా ప్రతిభ ముందు విమర్శ ఆవగింజలా చిన్నబోయేది....ఈనాటి మన మహామహుల ముందు - ప్రతిభే చిన్నబోతోంది.

విమర్శ సంగతి అడిగారూ? అందాకా ఎందుకులెండి... ఐతే విరుచుకుపడడం, ఎద్దేవా చెయ్యడం, లేదా పుస్తకం రాసినాయనే ఆశ్చర్యపోయేంత లెవిల్లో ఎత్తి కుదేలెయ్యడం......

మరి తమరు రాసేదేమిటో అని అడిగేరు!! :) :) ....అడిగితే మటుకు నేను ఓ పెన్ను పట్టుకు చించేసి మీ బ్లాగులో బోల్డంత సిరా కక్కించాలి...

Afsar said...

@కామేశ్వర రావు గారు: అవును, 'ఇది కల్పవృక్షం" ఎప్పటికీ మనతో వుండాల్సిన పుస్తకం.

కొత్త నీరు వస్తుందని నాకు కూడా నమ్మకం పోతోంది. అంతా నిలవ నీరు కూడా అయిపోతోంది.

@ వంశీ; చాలా కాలమయ్యింది మీతో మాట్లాడి - నిత్య నైమిత్తిక ఆరాటంలో పడి -

మీరన్నది నిజం - తాంక్లెస్స్ జాబ్ గానే వుండాలి. లేకపోతే వీపు గోకుళ్ళు, చీరుకోవడాలే మిగులుతాయి.

సృజన, విమర్సా రెండూ చిన్నబోతున్న కాలాన, పాడు డిగ్రీలు కూడా చదువు నేర్పలేని కాలాన - వున్నాం. కానీ, సొరంగం చివర ఏదో వొక కాంతి పూస వుండక పోదా?

Web Statistics