1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది.
అక్కడ తన కలల్ని నిజం చేసే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ని అతను స్థాపించాడు. ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఒక బుక్‌స్టాల్ ప్రారంభించి, టాల్‌స్టాయ్,దాస్తవస్కీ లాంటి రష్యన్ రచయితలతో పాటు గొప్ప ఉర్దూ పుస్తకాలు తెప్పించాడు. అవి అమ్మగా వచ్చిన కాసినిడబ్బులతో ఏపూటకి ఆ పూట గడిచిపోయేది. అంతటి దుర్భర దారిద్య్రంలోనూ అతని కవితాత్మ రాజీపడలేదు. ఈ ఇరుకుగదిలో ఉండగానే అతనొక మంచి నవల రాశాడు. అదీ దక్కనీ ఉర్దూలో! ఆ రచయిత పూర్తిపేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. అతని కలంపేరు ‘కవిరాజమూర్తి’. అతను ఉర్దూలో రాసిన నవలపేరు ‘మై గరీబ్ హూఁ’. కవిగా మాత్రమే అందరికీ తెలిసిన సర్వదేవభట్ల నరసింహమూర్తి 1926 అక్టోబర్ నెలలో ఖమ్మంలో జన్మించారు. ఖమ్మంలో నూరేళ్ళ పైబడి చరిత్ర ఉన్న ఆంధ్ర బాలాభివర్థనీ గ్రంథాలయం, విజ్ఞాన నికేతనం ఆయన చదువుకున్న బళ్ళు. ఇప్పుడు ఖమ్మంజిల్లాలో ఉన్న పిండిప్రోలు ఆయన స్వగ్రామం.
తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. బాబాయి సర్వదేవభట్ల రామనాథం పెద్ద కమ్యూనిస్టు నాయకుడు. తమ్ముడు విశ్వనాథం ఖమ్మంలో తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన న్యాయవాది, గాంధేయవాది. రెండో కొడుకు నరసింహమూర్తిని కూడా న్యాయవాదిగా చూడాలన్నది తండ్రి కల. కాని, నరసింహమూర్తి లోకమే వేరు. ఇంకా ఇరవయ్యేళ్ళు నిండకుండానే అతనిపైన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పడింది. ముఖ్యంగా బాబా యి రామనాథం గొప్ప స్ఫూర్తి. తరువాత ఉర్దూ అభ్యుదయకవులు నరసింహమూర్తి దారినే మార్చివేశారు. బాబాయి మాదిరిగా ప్రత్యక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లోకి రాలేదు నరసింహమూర్తి. ఉర్దూ కవిత్వం మీద మమకారం పెంచుకుని, ఉర్దూలో కవి త్వం చెప్పడం మొదలుపెట్టాడు.
ఉర్దూలో అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత ‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. కమ్యూనిస్టుల ఏరివేత ప్రారంభమయిన తరువాత ఈ పల్లెటూరి యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అంతకుముందు, అంటే 1944 ప్రాంతాల్లో కవిరాజమూర్తి ఉర్దూ, తెలుగు భాషలలో విస్తృతంగా రచనలు చేసినట్టు తెలుస్తోంది. కాని అవి ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అతికష్టం మీద ఈ వ్యాసరచయితకి అందుబాటులోకి వచ్చిన ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది.
ఉర్దూలో ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి ‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం మాత్రం ఖమ్మం సాహిత్యచరిత్రపై పరిశోధన చేస్తున్న నరసింహారావుగారి ద్వారా లభించింది. (ఉర్దూమూలం కోసం పరిశోధకుడు వెతుకుతూనే ఉన్నారు). “మై గరీబ్ హూఁ నవల మీరు తెలుగులో చదివితే మీకు ఆ జోష్ (ఊపు)రాదు. అది ఉర్దూలో చదవాలి,అందునా మూర్తిగారు చదువుతుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగేవి కావు” అన్నారు కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి. డెబ్బయ్ ఆరే ళ్ళ వరలక్ష్మిగారు ఈ నవల పేరు ప్రస్తావించగానే ఒక గొప్ప ఉత్సాహంతో అప్పటి సాహిత్య విశేషాలు చాలా చెప్పారు. నవలలోని కొన్ని సంభాషణల్ని అలవోకగా వినిపించారు. అంతేకాదు, 1946-1950 మధ్య హైదరాబాద్ తెలుగు- ఉర్దూ రచయితల ఉమ్మడి సాంస్కృతిక జీవన విధానాన్ని గురించి ఆమె చెప్పిన ప్రతి అంశం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి ఒక సాధనమే! అంత వృద్ధాప్యంలో కూడా అప్పటి ఉమ్మడి జీవనశైలి ఎలా ఉండిందో ఆమె అనేక జ్ఞాపకాల మధ్యచెప్పుకుంటూ వచ్చారు.
ఊరు వదిలి భాగ్యనగరానికి…!
’1942, 1946,1949, 1950… ఇవి నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. 1942లో (అంటే అప్పటికి మూర్తిగారికి పదహారేళ్ళు) మూర్తిగారితో నా పెళ్ళయింది. పెళ్ళయిన మూ డేళ్ళు మాత్రమే మా జీవితంలో సంతోషంగా సాగిన రోజులు. 1946లో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆంధ్రమహాసభ జరిగింది. సుందరయ్యగారు వచ్చారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచి వేలకొద్దీ జనం బండ్లు కట్టుకుని వచ్చారు. గొప్ప సభ జరిగింది. కాని మూర్తిగారి జీవితం ప్రమాదంలో పడింది. ఆయన్ని కమ్యూనిస్టు అన్న కసితో ఒక హత్యకేసులో ఇరికించారు. ఇల్లూవాకిలీ ఊరూ వదిలి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ చేరాం. హైదరాబాద్‌లో ఎట్లాబతికామో మాకే తెలీదు. ఈ పూట రొట్టి దొరుకుతుందా,దొరకదా అని ప్రతిపూటా నరకం. కాని మూర్తిగారికి సాహిత్యమే పెద్ద జీవితం. ఆయన ఉర్దూ సాహిత్య జిజ్ఞాస ఎందరినో స్నేహితుల్ని సంపాదించిపెట్టింది.
ఉర్దూ కవులూ,రచయితలతోపాటు బెల్లంకొండ రామదాసు, రెంటాల, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావులాంటి వాళ్ళంతా ఆ ఇరుకుగదికి వచ్చిపోతుండేవాళ్ళు. నేనూ ఒక మూల కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూండేదాన్ని. కొద్దికాలానికి- అంటే 1949లో గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో ‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది. అలా తెప్పించిన పుస్తకాలలో కొన్నాయన నాకు చదివి వినిపించేవారు. ‘అన్నా కెరెనీనా’ ఆయన చదువుతూండగా విన్నవాటిల్లో నాకు నచ్చిన గొప్ప పుస్తకం.
రచన ఒక జ్వరవేదన!
అదే సమయంలో మూర్తిగారు ఉర్దూలో ఏదో రాయడం మొదలుపెట్టారు. ‘ఇది పెద్ద నవల. దక్కనీలో రాస్తున్నా’ అంటూ రోజుకి కొన్ని పేజీలు చదివి వినిపించేవారు. అది రాస్తున్నంత కాలం ఆయన మూర్తీభవించిన అశాంతిలా ఉండిపోయారు; ఏదో జ్వరం వచ్చినట్టే! ఈ నవల ఎప్పుడు పూర్తవుతుందా అని బెంగపెట్టుకునే దాన్ని. కాని ఆయన ఉర్దూలో అది చదువుతున్నంతసేపూ విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యేదాన్ని. ఏదో మంత్రించినట్టుగా కళ్ళప్పగించి వింటూ వుండిపోయేదాన్ని. ఆ భాష, ఆ ప్రవాహం, ఆ వేగం… ‘వినడం కాదు, మాట్లాడు….’ అనేవారాయన. మూర్తిగారు కవిత్వం చాలా రాసినా అది ఎప్పుడూ నాకు వినిపించేవాళ్ళు కాదు. కాని, నవల ప్రతి పేజీ రాసింది రాసినట్టుగా ఏ రోజుకి ఆరోజు వినిపించేవారు.
అలా వినిపించకపోతే ఆయనకి కలం ముందుకి సాగేది కాదు. పైగా ప్రతిపేజీ మీదా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకొనేవాళ్ళం”. ఆశ్చర్యంగా నవలలోని ప్రతిభాగం ఇప్పటికీ ఆమెకి కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ముఖ్యంగా ‘మై గరీబ్ హూఁ’ అనే వాక్యం పునరుక్తి అయిన ప్రతిసారీ ఆ వాక్యం చుట్టూ మూర్తిగారు అల్లిన సన్నివేశాల్ని ఆమె బాగా గుర్తుంచుకొని చెప్పారు. కాని, ఆమె దగ్గర ఈ నవల తెలుగు అనువాదం లేదు. ‘ఒక్క ఊళ్ళోనూ స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కడి పుస్తకాలు అక్కడే పోయాయి. చివరికి ఆయన రచన ఒక్కటీ మా దగ్గర మిగల్లేదు’ అన్నారామె. నా చేతుల్లో ఉన్న ‘మై గరీబ్ హూఁ’ జిరాక్సు ప్రతిని చేతుల్లోకి తీసుకుని, ఆమె కొద్దిసేపు ఆ పుస్తకా న్ని అప్యాయంగా తాకుతూ ఉండిపోయారు.
చాలాసేపు మా ట్లాడిన తరువాత ‘నా దగ్గర మూర్తిగారి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అది మీకు ఇస్తాను. తీసుకెళ్ళండి’ అంటూ లోపలకి వెళ్ళి, అతి శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు ‘మార్పు’. అది 1949లో మూర్తిగారు రాసిన నాటిక. తెలంగాణలోని గ్రామాల్లో ఈ నాటిక ప్రదర్శించేవారనీ, జనం బాగా వచ్చేవారనీ ఆమెచెప్పారు. ‘మై గరీబ్ హూఁ జిరాక్సు నాకు ఇవ్వండి దయచేసి. మా వద్దలేదు’ అన్నారామె. సంభాషణలో చాలాసేపు ఆమె ఈ నవల గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ‘అది ఉర్దూలో సంపాదించి, చదవండి’ అని పదేపదే చెబుతున్నప్పుడు ఉర్దూ మూలరచన ఆమెపై ఎంత ప్రభావం కనబరిచిందో తెలుస్తూనే ఉంది. ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండీ,ఈ నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను. ‘ఆయన ఏం రాసినా ముందు ఉర్దూలో రాసేవారు. కవిత్వం, కథ, వ్యాసం ఏదైనా కానివ్వండి.తన భాష ఉర్దూ అని స్పష్టంగా చెప్పేవారు.
ఆయన తెలుగులో రాయడం మొదలుపెట్టింది చాలా కాలం తరువాత. తెలుగులో రాసినా, అదీ ఉర్దూ ప్రభావం తోనే. ఉర్దూ కవుల గురించీ, లేకపోతే వాళ్ళ అనువాదాలే. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన ఉర్దూలో రాస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేవారని అనిపించేది. ఆయన వ్యక్తిగా ఎంతో ఉద్వేగశీలి. లోపల చాలా అశాంతి ఉండేది. దానికి అనువైన తీవ్రతా, పదునూ ఉర్దూలో ఉండివుండవచ్చు. పైగా, ఇంటికి ఎవరొచ్చినా ఉర్దూలో వ్యవహా రం నడిచేది. తెలుగులో మొదలైనా, కాసేపట్లో ఉర్దూ దానికదే వచ్చేసేది. ఆయన ఉర్దూలోనే ఆలోచించేవారు. అందుకే, ఆయన తెలుగు రచనల్లోని వాక్యనిర్మాణం కూడా ఉర్దూ ప్రతీకలూ పదచిత్రాలతో నిండి ఉండేదనుకుంటా’. ‘ఈ నవల తెలుగు అనువాదం ఎప్పుడొచ్చింది?’ ‘కనీసం ఏడాది తరువాత, 1950లో నవల అచ్చయింది.
నా అంచనా ప్రకారం ఈ నవల 1948 ప్రాంతాల్లో రాసి ఉంటారు. గిడుతూరి సూర్యంగారు ‘పద్మశాలి ప్రింటింగ్‌ప్రెస్’ పెట్టిన తరువాత తెలుగులోకి అనువదించాలన్న ఆలోచన వచ్చింది.’ ‘ఈ నవల ఆయన మిత్రులు చదవడం,చర్చించడం చేశారా?’ ‘లేదు. ఉర్దూ కవిత్వంగురించి చాలాసేపు చర్చలు జరిగేవి. ఈ నవల ఆయన ఒక స్వగతంలాగా రాసుకున్నారు. తన జీవితం, తన సమాజం, తనకి ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం… బహుశా… ఈనవల గురించి ఆయన నాతోనే ఎక్కువగా మాట్లాడి ఉంటారు. తెలుగులో ఈనవల అచ్చులోకి వచ్చిన తరువాత, అంటే 1950లలో మళ్ళీ ఆయన మీద నిర్బంధం పెరిగింది. మళ్ళీ ఊరు మారాం.తాండూరు వెళ్ళిపోయాం. ఏడాది తరువాత పటాన్‌చెర్వులో వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది.అప్పటిదాకా ప్రాణభయంతోనే బతికారు.
1949 ప్రాంతాల్లోనే ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత ఆరునెలలపాటువచ్చింది’. ‘శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన మూర్తిగారు ‘గరీబు’పక్షం ఎందుకు చేరారు?’ ‘కమ్యూనిస్టు పార్టీప్రభావమే! బాబాయి రామనాథం అంటే ఆయనకు ప్రాణం. శ్రీమంతుల కుటుంబంలోపుట్టారన్న మాటేగానీ, ఏనాడూ భోగభాగ్యాలు అనుభవిం చింది లేదు. మేం పిండిప్రోలు నుంచి హైదరాబాద్ పోయేటప్పటికి ఆయనకి ఇరవయ్యేళ్ళలోపే! 1954 వరకూ మళ్ళీ ఖమ్మం మొగమే చూళ్ళేదు. ఇంక ఆ సంపద ఉందో పోయిందో చూసుకున్నదీలేదు. తరువాత ఆయన పార్టీని వదిలివేశారు.కాని,పార్టీభావాల్ని మాత్రం వదల్లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవలలో మీకు ఈ విషయం అతి తేలి గ్గా అర్థమైపోతుంది.అందులో పేదవాడు పడ్డకష్టాలేవీ ఊహల్లోంచి పుట్టినవి కావు. ఆయన అనుభవంలోనివే! ఆకథలోని ప్రధానపాత్రధారి’అపరిచితుడు’ ఆయనే.
‘ఈ నవల తరువాత, మళ్ళీ ఖమ్మంవచ్చాక ఆయన ఎక్కువగా ఏమీరాయలేదా?’ ‘రాశారు.కాని తెలంగాణ ఉద్యమం ముందూ వెనకా ఉన్న రచనల్లోని తీవ్రతవాటిల్లోలేదు. ఆయన రచయితగా ఒక సైనికుడిలాంటివారు. యుద్ధసమయం అయిపోయాక, ఆయన ప్రధానంగా అనువాదాల్లోకి వెళ్ళిపోయారు. మనిషిలో నిదానం వచ్చింది.నిబ్బరంగా కవిత్వం రాసుకున్నారు’ వరలక్ష్మిగారితో మాట్లాడాక, కవిరాజమూర్తి నవలని మరోసారి చదివాను. ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది. ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా అవుతుందో తెలిసివచ్చింది. అన్నింటికీ మించి- ఈ నవల ప్రధానంగా చర్చకిపెట్టిన అంశం:-మతం. ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత ఇస్లాంనీ, నైజాం పాలనలోని ‘ఇస్లామీకరణ’నీ ఎట్లా అర్థం చేసుకున్నాడని వేరే చర్చ.
(ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక, 2007)
గమనిక: ఈ రచయితకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేను చూస్తున్నాను. ఎవరి దగ్గిర అయినా ఈ రచయిత ఇతర రచనలు గాని, ఏ చిన్నపాటి వివరం గానీ వుంటే అందించి సహకరించగలరు)
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
9 comments:
Thanks for the article/info..
"ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది" - భిన్నస్వర సమాజబీజాల ప్రాణశక్తి లో మొలకలెత్తిన రచన గూర్చి తెలిపినందుకు, అపుడెపుడో విన్నదీ ఉర్దూ భాషేతర అంశం - ఆ తరహా ఒక రచయితని ప్రస్తావనకి తెచ్చినందుకు కృతజ్నతలు.
గత కాలం నాటి ఆర్ధిక రాజకీయ సామాజిక స్థితిగతులను వర్తమానంలో ద్రుస్యీకరించడానికి ,విశ్లేషించడానికి ఆ నాటి రచయితల గ్రంధాలు ఉపయోగపడతాయి ఆనాటి స్థితిగతులకు అద్దంపడతాయి. చరిత్రకారులు చిత్రణలో లోసుగులున్డవాచ్చేమో గాని తనకు తానుగా నిర్ధారించుకున్న నిబద్ధత తో...
"సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో , ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా అవుతుందో" తెలిసివచ్చింది.
యీ మాటలు వాస్తవం.
ఆనాటి రచయితలచే చిత్రించబడిన నాటి సాంఘిక, సామాజిక, రాజకీయ,రక్షణ , ఆర్ధిక , ప్రభుత్వ పాలనా విధి విధాన చిత్రీకర ణలు మాత్రమే .చరిత్రకారుల చేతుల్లో పడి వుండి వుంటే రామాయణ మహాభారతాలు మరో కోణంలో చూడవలసి వచ్చేదేమో......గొప్ప రచయితను గ్రంధకారుని పరిచయం చేసారు. ధన్యులం....నూతక్కి రాఘవేంద్ర రావు.
@వంశీ: ధన్యవాదాలు
@ఉష గారు: ఈ నవల మళ్ళీ చదువుతున్నాను. చదివేకొద్దీ ఆశ్చర్యంగా వుంది. ప్రతిభావంతుడయిన రచయిత కాలాన్ని తన రచనలో ఎలా వొడిసిపట్టుకుంటాడో తెలుస్తోంది.
@కనకాంబరం: మీరన్నది నిజం. ఏ రచనని అయినా చరిత్ర నించి, సందర్భం నించీ విడిగా చూడలేమన్నదే నా మౌలికమయిన వాదన. మహాభారతం అనువాదాలు చికాగొ విశ్వవిద్యాలయం వారు వేశారు. వాటికి రాసిన పీఠికలు మీకు వీలుంటే చదవండి. మనం సాహిత్యాన్ని చూసే/చదివే దృష్టి మారాలి. సాహిత్యం కేవలం ఊహాలోకం అన్న అపోహ నించి బయటపడాలి. రామాయణ, భారతాల నించి ఇవాల్టి అత్యాధునిక కవిత్వ పుస్తకం దాకా సందర్భంలోంచి పుట్టిందే!
తెలంగాణకంటూ ప్రత్యేకంగా ఒక సాహిత్యచరిత్ర ఉందా ? అసలలా ఎక్కడైనా ఉంటుందా ? అని !
@Anonumous: తెలంగాణకు విముక్తి లభించకముందు, లభించిన తరువాత కూడ ప్రత్యేకతనే కలిగుంది - అది సాహిత్యానికీ వర్తిస్తుంది.
అఫ్సర్ గారికి, ధన్యవాదాలు - కాలంలో కనుమరుగైపోయిన గొప్ప రచయితని పరిచయం చేశారు - కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి గారి మాటల్లో అప్పటి పరిస్థితులను కాస్తయినా ఊహించుకోవచ్చు.
'ఉర్దూ లోనే ఆలోచించేవారు' అని వరలక్ష్మి గారు చెప్పారంటే...ఆ కవి ఆత్మ లో ఆ భాష ఎంత కలిసిపోయిందో అర్ధమవుతుంది. ఇంత గొప్ప వ్యక్తి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ బుక్ మార్కెట్ లో దొరుకుతుందా? ఎవరైనా పబ్లిష్ చేసారా? ఏ పేరుతో ఉంది తెలుగులో? 'జోష్' తో చదవడానికి నాకు ఉర్దూ రాదని....మొదటిసారి బాధేస్తుంది..!!
saaranga books lo publish cheyoccemo..alaa cheste manchi parichayam avutundi.
Great!. Very nice article. Thanks for sharing.
-telangana blogger
Post a Comment