తెరపి లేకుండా కురుస్తోంది వాన.కాసేపాగితే బాగుణ్ణు కదా అనుకుంటూ ఇంట్లోంచి బయటి కొచ్చాను. అల్లరిపిల్లలా మొరాయిస్తోంది వాన. వొక్కో అడుగూ వేస్తూ నడుస్తూ వున్నా. నిదానంగా చలి తగ్గిపోతూ వుంటుంది కాబట్టి, మార్చి నెల చివరికొచ్చేసరికి మా యూనివర్సిటీ కాంపస్ కొంచెం వెచ్చనైన ఉత్సాహంతో ఉరక లేస్తుంది.చిన్ని సూర్యుడి తునక చాలు ఈ కొద్దిపాటి ఉత్సాహానికి!
విద్యార్థులు గూడువిడిచిన పిట్టల్లాగా కాంపస్‌లో పరుగులు తీస్తూ వుంటారు. ఇవాళ వాన కురుస్తున్నా సరే, వాళ్ళ ఉత్సాహమేమీ ‘‘తగ్గేదే లే’’ అన్నట్టుగా వుంది. నిన్నటిదాకా కాళ్ళకింద ఎండుటాకులు విరుగుతున్న చప్పుడు వినిపించేది. ఇప్పుడు వున్నట్టుండి కాళ్ళ కింద ఆకుపచ్చదనమూ, నీలి పసుపు రంగుల గడ్డిపూల తలలూ మెరుస్తున్నాయి. నా లోపల నేనూ అంతే వుత్సాహంగా వున్నా. కనీసం నలభయ్యేళ్ళ కింద కొత్త యవ్వనపు కాంతిలో చదువుకున్న వాక్యాలని ఇవాళ స్వయంగా కలుసుకుంటున్నాను.
అరవింద్ కృష్ణ మెహెరోత్రా-ఇవాళ్టికి ఆ నిగనిగలాడే వాక్యాల సంపుటి పేరు. ఎనిమిది పదుల వయసుకి చేరుకుంటున్న మెహెరోత్రా ప్రసిద్ధ ఇండో-ఇంగ్లీషు కవి. ప్రాచీన మధ్యయుగాల కవిత్వాల అనువాదకుడు, చరిత్రకారుడు.అధ్యాపకుడు.మొదటి కవిత్వ వాక్యాలు ఆయన టీనేజీ ప్రాయంలో పుట్టాయనుకుంటే,ఈనాటి దాకా వొక్కక్షణం విరామం లేదు. వివిధ ప్రక్రియల్లో భాషా, ప్రాంతీయ బేధాలేమీ లేకుండా సాగిన ఆయన కృషి భారతీయతలోని అనేక కోణాల ప్రతిబింబం. ఇండియన్ ఇంగ్లీషు కవిత్వంలో డామ్ మొరేస్, నిస్సిమ్ ఏజెకీల్, రామానుజన్, ఆగా షాహీద్ అలీ ల సరసన చేరే కవి. సాహిత్య చరిత్ర రచనలో తనదైన పంథాని నిర్మించుకున్నobjectivity ఆయన సొంతం. ఇక అనువాదాల్లో గాథా సప్తశతి నుంచి కబీర్ మీదుగా గాలిబ్ దాకా అనేకత్వంవైపు ఆయన ప్రయాణం. దాదాపు రెండు వందల పుస్తకాలు మంత్రదండం లాంటి ఆ చేతుల్లోంచి వచ్చాయి. మొన్నటికి మొన్న ఆయన Collected Poems, Ghalib: A Diary అ ఈజ్చీటడ అనే రెండు పుస్తకాలు వెలువడ్డాయి. వచనంలోనూ, కవిత్వంలోనూ ఇంత వైశాల్యమూ, లోతూ వున్న వ్యక్తి ముందు నిలబడడానికి కాళ్ళు వణుకుతున్నాయి.
ఆయన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు నా మనసు నిండా గంగమ్మ తల్లికి ఆయన రాసుకున్న పదాలు నాట్యమాడుతున్నాయి. అవి నా ఇంటర్ రోజుల్లో ఇంగ్లీషులో చదువుకున్న ఆయన మొదటి కవితలు. ఆయన్ని నన్ను బాగా దగ్గిరగా పరిచయం చేసిన పాదాలు. అప్పటికి కమలాదాస్, నిస్సిమ్ ఏజెకీల్, రామానుజన్ మాత్రమే నాకు ఇండియన్ ఇంగ్లీషు కవిత్వంలో తెలిసిన పేర్లు.అనుకోకుండా తారస పడ్డాడు ఈ కొత్త కవి. ఆ పొడుగాటి కవితలో గంగమ్మ స్వగతం ఇలా వినిపిస్తున్నారు మెహెరోత్రా:
నేను పురుషుణ్ణి, స్త్రీని కూడా.
పిల్లలు వదిలిన కాయితప్పడవని.
జాలర్లకు మచ్చికైన దాన్ని.
వెంట్రుకల్లేని ముని శిరసు మీది మబ్బుతునకని.
అన్ని కదలికల ప్రతిబింబాన్ని.
- ఇదొక దీర్ఘ కవిత. చిన్ని చిన్ని పదాలతో, చిన్ని చరణాలతో నడుస్తూ మాట్లాడుతున్నట్టుగా వుంటుంది కవిత అంతా. నెమ్మదిగా ఇంకా చాలా దూరం నెమ్మదించి నడుస్తూ చాలా ఆధునికమైన చర్చలోకి అడుగుపెడుతుంది ఈ వొక్క వాక్యంతో:
ఈ మొత్తం ప్రపంచంలోకి వెళ్లిపోతాను
నేనే ప్రపంచాన్ని.
అనేక జాతుల నేను
అనేక నగరాల నేను
అనేకం నేను
బంధనాల్లేని పుస్తకంలోని పుటని నేను.
మెహెరోత్రా కవితల్లో ఇది కొంచెం భిన్నంగా వుంటుంది కానీ చాలా కవితలు మన రోజువారీ జీవితం చుట్టూరా, ఆ జీవితంలో వుండే అనుదిన సామగ్రి చుట్టూరా తిరుగుతూ వుంటాయి. తను పుట్టినప్పటి నుంచీ చూస్తూ వచ్చిన ప్రతి వస్తువునీ కవిత్వంలోకి ఎలా లాక్కు రావాలో ఆయనకి బాగా తెలుసు. ‘ఇస్త్రీ చేసే ఆమె’ అనే కవితలో ఆయనే అన్నట్టు:
అడ్డదిడ్డంగా బట్టలు పడివున్న
మూటలోంచి
బాగా నలిగిపోయిన వొక చేరుమాలు బయటికి తీసి,
ఆమె ఇస్త్రీ చేస్తోంది,
ఆమె చేతి కింద
వాటి ముడతలన్నీ మాయమైపోతున్నాయ్.
కచ్చితంగా ఇదే కవిత్వంలో ఆయన చేసే పని కూడా. మాటల సందర్భంలో ఇలాంటి అనేక ప్రారంభాల గురించి అడిగాను. ‘‘కవిత్వం అదేగా చేస్తుంది. మనకు తెలిసిన వస్తువుల్నే గుర్తుచేస్తుంది. వాటి తెలియనితనాన్ని గుర్తుచేస్తుంది.’’ అన్నారాయన. ఆ మాటతో ఆయన మనఃప్రపంచ ద్వారానికి నాకు తాళంచెయ్యి దొరికినట్టయింది.
2
కాంపస్ లోకి అడుగుపెట్టగానే ముందు ఆయన్ని మా లైబ్రరీలో కలిశాను. అక్కడ అరుదైన పుస్తక ప్రతుల విభాగంలో ప్రతి పుస్తకాన్ని సున్నితంగా పేజీలు తిప్పుతూ వుండగా ఆయన్ని చూశాను.ముగ్గుబుట్ట వంటి తల,మంచు చుట్టుముట్టినట్టున్న గడ్డమూ-మెహెరోత్రా స్వయంగా వొక నిలువెత్తు పెయింటింగ్ లా కనిపించారు. ‘‘ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువగా చదువుకున్న మీరు ఈ తక్షణ వస్తువుల అన్వేషణలో ఎలా పడ్డారు?’’ అన్న ప్రశ్నకు ‘‘చక్రాల కుర్చీలో కూర్చొనున్న మామయ్య గురించి రాయడానికి కోకిలలూ, స్కై లార్క్ పక్షుల పాటలు పనికి వస్తాయా?’’ అని తిరుగు ప్రశ్న వేశారు. కానీ, నిజానికి ఆయన తొలినాళ్ళ కవిత్వమంతా పరదేశీ సాహిత్యం వల్లనే నిగ్గుతేలింది. అదే ప్రశ్నగా అడిగితే, ‘‘కాసేపు నా దారిలో నేను పడడానికి అదొక పక్క దోవ మాత్రమే’’ అన్నారు.
మా సంభాషణ ఆ 1960ల కవిత్వం మీదికి మళ్ళింది, అంటే, ఆయన టీనేజీ వయసు కవిత్వం గురించి- ‘‘అప్పుడేం చేయాలో తెలియక కేవలం రాత వొక్కటే దిక్కయింది. రెండు మూడు చేతి రాత - ఇంగ్లీషు టైపింగ్ పత్రికలుపెట్టి, అందులో కవిత్వమూ, బొమ్మలూ మొదలు పెట్టాం. వొక స్టిల్ లైఫ్ చిత్రంలాంటి కవిత్వంలోకి నా దృష్టి మళ్ళింది. రెండు టైప్ పత్రికలు - ఎజ్రా, Damn You - మొదలుపెట్టాం. అంతే. కవిత్వం టైప్ చేయడం, బొమ్మలు. ఆ పొత్తాలను చేతనైనట్టు మేమే కుట్టుకోవడం! అంటే, పబ్లిషర్ కోసం ఎదురు చూడక్కర్లేదన్నమాట!’’
ఆ ఇరవైల వయసులో ప్రసిద్థ అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ ఆయనకి వొక నమూనా. అందుకే రాతపత్రికకి కూడా అదే పేరు పెట్టారు. ఎజ్రా అంటే ఎంత ఇష్టమంటే, తను ప్రచురించే పుస్తకాలకి ఎజ్రా - ఫకీర్ ప్రెస్ అని పేరు పెట్టుకున్నారు. ఎజ్రా పౌండ్‌తో పాటు, విలియం కార్లోస్ విలియమ్స్, గిన్స్‌బెర్గ్ తోడుగా వచ్చారు. ‘‘మొదట నన్ను బాగా కుదిపేసింది అధివాస్తవిక కవిత్వమే. కానీ, నా కవిత్వం ఏ అమెరికాలోనో, యూరప్ లోనో పుట్టలేదు. నా తక్షణ వాస్తవికత లోంచి పుట్టింది. కాకపోతే, నా చుట్టూ వున్న వస్తువులూ, మనుషుల్ని చూడడానికి ఆ కొద్దిపాటి ఎడం నాకు అవసరమైంది.’’ అన్నారాయన. కవిత్వాన్ని ఆయన రకరకాలుగా నిర్వచిస్తారు. కానీ, ప్రతి నిర్వచనంలో అనేక అర్థాల మడతపేచీ లుంటాయన్న వాస్తవాన్ని వొప్పుకోవాలంటారు. ‘‘అన్నీవుంటాయి కవిత్వంలో! ఆటలూ, పాటలూ, పొడుపు కథలూ, అన్నిటికీ మించీ అనుకోకుండా జరిగేవి! నిజానికి కవిత్వమంతా అట్లాంటి యాక్సిడెంట్స్! కవి కావాలనే చాలా యాక్సిడెంట్స్‌ని సృష్టించుకుంటూ పోతాడు,’’ అంటారు.
భారతీయ సాహిత్యానికి సంబంధించినంత వరకూ ఆయన అన్వేషణ ప్రాకృత ప్రేమ కవిత్వంతో మొదలయిందట. మా ఇద్దరి సంభాషణ ఎక్కువగా ఈ ప్రాకృత ప్రేమ చుట్టూ సాగింది. మేం మాట్లాడుకుంటున్న సమయంలో నా విద్యార్థిని మెహెరోత్రా అనువాదం చేసిన ప్రాకృత కవిత్వం "The Absent Traveler" (1991) కాపీ వొకటి పట్టుకొచ్చింది. నేను ఇప్పుడు పాఠాలు చెప్తున్న వొక సాహిత్య కోర్సులో ఈ కవితల్ని మా విద్యార్థులు చదువుతున్నారు. ఆ విషయాల్ని ఆ విద్యార్థిని ప్రస్తావించింది. వెంటనే ఆయన జ్నాపకాలు ఆ ప్రాకృత కవిత్వ అనువాదాల వైపు మళ్ళాయి. ఆయన అన్నారు:
‘‘బొంబాయిలో వొక మధ్యాన్నం వున్నట్టుండి మిత్రుడు, మరాఠీ కవి అరుణ్కొలాట్కర్ గాథాసప్తశతి పద్యాలు సంస్కృతంలో చదవడం మొదలు పెట్టాడు. నాకు సంస్కృతం రాదు. అరుణ్ వాటిని వెంట వెంటనే ఇంగ్లీషులోకి తర్జుమా చేసి వివరించడం మొదలు పెట్టాడు. అదిగో, అలా మొదలైంది ఈ అనువాదం. ఇది సంస్కృతం, జర్మన్, మరాఠీ భాషల్లో చదవాలన్న కోరిక వుండేది నాకు. కానీ, ఆ మూడు భాషలూ నాకు రావు. కాబట్టి, ప్రాకృతంలోకి వెళ్ళక తప్పలేదు. అనువాదం మొదలు పెట్టాక నిజానికి నేను చేసిందేమీ లేదు. మూలంలో ఏముందో అది ఇంకో భాషలోపెట్టాను దుబాసీ లాగా- ఆ కవిత్వానికే వొక మాంత్రికమైన శక్తి వుంది. వెంటనే అది రీడర్‌ని, శ్రోతని పట్టి లాగేస్తుంది. ఉదాహరణకు గృహిణి నీరు పోస్తున్నప్పుడు దప్పికతో వున్న యాత్రికుడు తన రెండు చేతులూ దగ్గిరకి పొదువుకున్నప్పుడు ఆమె పాత్రకూ, అతని చేతులకూ మధ్య జరిగే సంభాషణ - అదే కదా కవిత్వం! ఎందుకో వొణికే ఆమె చేతులూ, ఆ పాత్ర వొంపిన తీరూ-- జాగ్రత్తగా భాషలో పెట్టడం కవి మాత్రమే చేయగలడు. అనువాదం కూడా అలాంటి అనుభవమే!’’
3
‘‘అనువాదాల్లోంచి మీరు నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్నతో మా సంభాషణ మరో మజిలీ చేరుకుంది. ఈ సంభాషణకు ముందు నాకు తక్షణం గుర్తొచ్చింది గత ఏడాది మెహెరోత్రా కొత్త దీర్ఘ కవిత Ghalib: A diary 1857-1858. ఈ దీర్ఘ కవితలో ఆయన తాత్వికత అంతా నేరుగా ప్రత్యక్షర సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇది గాలిబ్‌కి నివాళి. ముఖ్యంగా ఆ మహాకవిలోని బహుళత్వానికి కవి ఫిదా అయిపోతాడు. ఇందులో వొక చోట:
మనం పువ్వులం
ఏ వేళ్ళకి పుట్టామో తెలీదు.
వొక్క వైపే చూస్తాం చంద్రుడిని
అట్లాగే
పదానికి వొక్క వైపే చూస్తాం
పూల వంటి
చంద్రబింబం వంటి ముఖాన్ని కూడా
వొక్క వైపే చూస్తాం
- అంటారు.
కచ్చితంగా అదే ఆయన జీవన/ సాహిత్య తాత్వికత. నా వైపు సాలోచనగా చూస్తూ ఆయన అన్నారు: ‘‘అనువాదాల్లోంచి ఎక్కువగా నేర్చుకుంది ఆ భాషల బహుళత్వం. గాలిబ్‌ని ఉర్దూ లోంచీ, కబీర్‌ని కేవలం హిందీలోంచి చదవలేము. ఆ కవుల్ని నడిపించిన భాషలు అనేకమున్నాయి. వాటి ఆనుపానులు కూడా మనకి తెలియాలి. మన సాహిత్య చరిత్ర నిర్మాణం కూడా ఈ బహుళత్వమే పునాదిగా జరగాలి. దురదృష్టవశాత్తూ, మనం మన సాహిత్య చరిత్ర నిర్మాణం బాధ్యతని యూనివర్శిటీల భుజాల మీద పెట్టేశాం. సాహిత్యపరమైన సంవేదనలు ఏమైనా వుంటే, వాటిని హతమార్చే ఏకైక పనిలో పడ్డాయి ఈ యూనివర్శిటీలన్నీ! వాటికి సాహిత్యం ఏ మౌలిక పునాది మీద బతుకుతుందో తెలీదు. వాటి దృష్టి అంతా వొకే వొక వైపు వుంటుంది. అది monolingual imagination. ఇవాళ భారతీయ సాహిత్యానికి కావాల్సింది బహుభాషా దృష్టి.’’
ఆ తరవాత ఆయన హైదారాబాద్ దక్కనీ సాహిత్య వారసత్వం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఆయన పాఠాలు చెప్పిన కాలమంతా ఆయన దృశ్యాలుగా వివరించారు. ‘‘అక్కడి ప్రతి రోజూ నా కళ్ల ముందు ఇప్పటికీ నిలిచే వుంటుంది. ఉర్దూ-తెలుగు భాషల మధ్య ఆ స్నేహం ఎప్పటికీ నిలిచే వుండాలని నేను అనుకుంటాను. అది ఇవాల్టి అవసరం,’’ అంటూ ఆ రెండు భాషల మధ్యా (పారశీకం కూడా) వున్న బంధాన్ని గురించి కాసేపు ముచ్చటించుకున్నాం. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి ముఖ్యంగా ఇంగ్లీషులోకి వెళ్తున్న అనువాదాల గురించి ఆయన ప్రత్యేకించి ఆసక్తి చూపించారు.
సంభాషణ ముగిశాక బయటికి వస్తే, వాన కాస్త తెరిపినిచ్చింది. వానలో తడిసిన చెట్లు ఇంకాస్త ఆకుపచ్చగా కనిపించాయి. లైబ్రరీ నుంచి దారికిరువైపులా పేరు తెలియని ఎన్నెన్నో పూలు వాటి వాటి భాషలో పలకరించాయి. వాటిని కవిత్వంలోకి తర్జుమా చేసుకుంటూ నేను ఇంటివైపు మళ్ళాను, మెహెరోత్రా కవిత్వమంతా మరోసారి చదివి తీరాలన్న ఆలోచనతో!

No comments:
Post a Comment