చూపుడు వేలు




1

నేనూ ఉమర్ వొకే వయసు. కానీ, అందరిలానే వాణ్ని నాకూ  “ఉమర్ భాయ్!” అనే పిలవడం అలవాటయింది. నేనే కాదు, మా ఆవిడ రజియా కూడా వాణ్ని అట్లానే పిలుస్తుంది. మొదట్లో మా వాడు –సాజిద్, ఇంటర్ చదువుతున్నవాడు కూడా-- వాణ్ని “ఉమర్ భాయ్” అనే పిలుస్తూంటే, “మరీ బాలేదురా, నువ్వు ఉమర్ చాచా అని పిలువు!” అని వాణ్ని కట్టడి చేసేశాం.  

“రంజాన్ ఉపవాసాలు  కూడా మొదలయ్యాయ్. ఉమర్ భాయ్ ఈసారి కనిపించనేలేదు. కొంచెం కనుక్కోండి!” ఆ సాయంత్రం రజియా చాయ్ ఇస్తూ అడిగింది.

ఈ కరోనా లాక్ డౌన్ వల్ల నా ప్రపంచమంతా కొంచెం మారిపోయింది. ఆన్ లైన్ క్లాసులతో మామూలుగా కంటే పనిభారం ఎక్కువ అనిపిస్తోంది. టెక్నాలజీ నాలో యేదో  ఆస్తిమితత్వానికి కారణమవుతోంది. ఆన్ లైన్ పాఠం అయిన ప్రతిసారీ అనిపిస్తుంది, నేరుగా క్లాస్ లో అయితేనే నాకు నచ్చేట్టుగా చెప్పగలనేమో.

ఈ కొత్త హడావుడిలో రంజాన్ చంద్రుడు కనిపించడమూ, ఉపవాసాలూ మొదలు కావడమూ గమనించుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, వాటిని గమనించుకోగలిగే ముస్లింతనానికి తను కొంచెంగా దూరమవుతూ వస్తున్నాడు కొంతకాలంగా-

ఈసారి రోజాలైనా వుంటారా?!” అని రజియా ఆ సాయంత్రం గట్టిగానే అడిగింది. కాస్త నిరాసక్తంగా తల వూపడమో యేదో చేశాను కానీ, కచ్చితంగా యేమీ చెప్పలేకపోయాను. సాయంత్రం చాయ్ సమయానికి ముగ్గురం ఎక్కడున్నా ముందు గదిలో కనీసం అరగంట కలిసి చాయ్ బిస్కట్లు షేర్ చేసుకుంటాం. కబుర్లకి కూడా అదే మంచి సమయం. మామూలుగా అయితే, ఉమర్ యేదో వొక సమయంలో వచ్చి పలకరించే వెళ్తాడు.

“ఉమర్ భాయ్ కి ఫోన్ చేయండి! లాక్ డౌన్ తరవాత అసలు రానేలేదు!”

“అవును, బాబా! కనీసం ఫోన్ చేద్దాం!”

నాకు ఈ పరిస్థితి మరీ అన్యాయంగా అనిపించింది. సాధారణంగా వాళ్ళెవరూ గుర్తు చేయకుండానే ఉమర్ ని నేనే ఒకటికి పడిసార్లు పలకరిస్తూ వుంటాను. లాక్ డౌన్ కి ముందు వాడే వచ్చి వెళ్ళాడు కూడా!

ఇంకో ఆలోచన చేసే లోపే సాజిద్ టేబుల్ మీద వున్న మొబైల్ పట్టుకొచ్చి, నా చేతుల్లో పెట్టాడు. ఉమర్ నంబర్ నొక్కి, వాడి జవాబు కోసం ఎదురుచూస్తున్నా.

రజియా ఈ లోపు నమాజ్ కోసం లోపలకి వెళ్లిపోయింది. సాజిద్ మాత్రం నా ఎదురుగా కూర్చొని ఉమర్ కోసం ఎదురుచూస్తున్నాడు.

“వాడు ఫోన్ ఎత్తడం లేదు, రా!” అన్నాను. సాజిద్ నిరాశగా ముఖం పెట్టుకొని, తన గదిలోకి వెళ్లిపోయాడు.

మరోసారి మొబైల్ ప్రయత్నించి, వూరుకున్నా.

లాక్ డౌన్ కి ముందు ఇంట్లో వాళ్ళకి నేనూ ఉమర్ చెప్పని విషయం వొకటి వుంది. అది ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది కానీ, అసలు ముందు ఉమర్ ని పట్టుకోవాలి యెట్లా అయినా!

ఉమర్ గురించే ఆలోచిస్తూ మేడమీదకి వెళ్ళి, అక్కడ మా చిన్న కూరగాయల తోటకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను.

  రూఫ్ గార్డెన్ నిజానికి ఉమర్ ఆలోచనే.

“మీ డాబా మీద మంచి గార్డెన్ పడుతుందిరా  సాదిక్!” అన్న మరునాడే వాడు రెండు బెండ, రెండు వంకాయ, రెండు టొమోటా మొక్కలు పెట్టేశాడు. చూస్తూండగానే ఆ రూఫ్ నిండా గార్డెన్ పరచుకుంది. నిజానికి ఈ లాక్ డౌన్ సమయంలో మనసుని కొంచెం కుదుటపెట్టుకోడానికి ఈ పచ్చని మొక్కల మధ్య గడపడం, వాటి బాగోగులు చూసుకోవడం...నాకు బాగుంది సరే. ఉమర్ పరిస్థితి యేమిటి?

వాడు అద్దెకి వుండే రెండు చిన్న గదుల్లో ఆ నాలుగు ప్రాణాలు వుండడమే  కష్టమే. అప్పటికీ వాడు ఆ ఇరుకులోనే అక్కడేదో రెండు మూడు కుండీలు పెట్టుకున్నాడు. కానీ, వాడి సాయంత్రాలు ఎక్కువగా ఉర్దూ అరబ్బీ పాఠాలతో గడుస్తాయి. ఈ రెండు మూడు వాడల్లో మంచి అరబ్బీ ఉర్దూ టీచర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో పగలంతా పనిచేస్తాడు. సాయంత్రాలు అయిదారుగురు పేద పిల్లల్ని చేరదీసి, వాళ్ళ చేత తన ఇరుకు ఇంట్లోనే రెండు గంటల దాకా కూర్చోబెట్టి, పాఠాలు చెప్తాడు. వాళ్ళు హోం వర్కులు చేస్తూ వుంటే, దగ్గిర వుండి అన్నీ చెప్తూ వుంటాడు.

“అంత సమయం ఎలా పెడతావ్ రా, వాళ్ళకి?!” అని నేనే ఆశ్చర్యంగా అడుగుతూ వుంటాను అప్పుడప్పుడూ.

“కమ్యూనిటి కోసం నేనింకా  యేమీ చేయలేను కదా! మామూలుగా అయితే ఆ రెండు గంటలు వాళ్ళు ఇంట్లో వుంటే ఆ పనీ ఈ పనీ తప్ప చదువు మీద అయితే పెట్టరు. నా దగ్గిర కూర్చోబెట్టాననుకో, చచ్చినట్టు చదువుతూ కూర్చొంటారు కదా! చదువు వొక్కటే దారిద్ర్యాన్ని ఎదుర్కునే మంత్రం! మనకి తెలిసినంతలో చదువు విలువ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి ,” అన్నాడు చాలా ధీమాగా.

ఆ మాటకొస్తే, నేను ఇంగ్లీష్ వైపు, వాడు అరబ్బీ ఉర్దూ వైపు మళ్లడం కూడా చాలా ఆసక్తిగానే జరిగింది. నిజాయితీగానే చెప్తున్నా- నా ఆలోచనల్లో కమ్యూనిటీకి ఎప్పుడూ పెద్ద చోటు లేదు. నేను బాగా చదువుకోవాలి, లెక్చరర్ కావాలి. మంచి లెక్చరర్ కావాలి అన్నవరకే నా లక్ష్యంగా వుండేది. దానికి తగ్గట్టుగానే ఎమ్మే ఇంగ్లీషు చదువుకోగానే ఇక్కడే లెక్చరర్ గా చేరాను. వాడికి ఇంగ్లీషు, లెక్కలు కూడా బాగానే మార్కులు వచ్చేవి కానీ, ఎందువల్లనో డిగ్రీ తరవాత పూర్తిగా అరబ్బీ ఉర్దూ టీచింగ్ కి ఎంతకావాలో అంత వరకే నేర్చుకొని, ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో కుదిరాడు.

“ఇట్లా అయితే నేను ముస్లిం పిల్లలకు దగ్గిరగా వుంటాను. వాళ్ళ కోసం యెమైనా చేస్తాను. లేదా, యెమైనా చెయ్యాలీ అన్న motivation తో వుంటాను.” అన్నాడు ఆ వుద్యోగంలో చేరిన రోజు-

“ఉమర్ భాయ్ ఫోన్ దొరికిందా?” అప్పుడే మేడపైకి వస్తూ రజియా అడిగిన ప్రశ్నకి నా ఆలోచనలు చెదిరిపోయాయ్.

“లేదు, రజియా! రేపు పొద్దున నేనే వెళ్లివస్తాను” అని లేచి, నీళ్ళతో చేతులు కడుక్కున్నాను.

“గార్డెన్ వర్క్ కూడా లేకపోతే ఎంత కష్టంగా వుండేదో...ఈ టైమ్ లో...?” అన్నాను.

“వర్క్ కావాలా? బోలెడు పని పెడతా...కిందకి రండి!” నవ్వుతూ అంది రజియా. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ మేడ మీది కుర్చీల్లోనే కూర్చుండిపోయాం.

కానీ, తనకి చెప్పాలి. లాక్ డౌన్ కి ముందు ఏం జరిగిందో?! అది ఎక్కడ మొదలు పెట్టాలో ముందు తేల్చుకోవాలి!

రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు కూర్చొన్నాం. సాజిద్ కి ఇది చాలా బిజీ సెమిస్టరు. పాపం, ఏదో తినేసి తన రూమ్ కి వెళ్ళి తన చదువులో తను మునిగిపోతూ వుంటాడు.

వార్తలు వింటున్నాం. అంతా కరోనా గురించే. మర్కజ్ కి వెళ్లివచ్చిన వాళ్ళే పాజిటివ్ కేసుల్లో ఎక్కువమంది వున్నారని మంత్రి అన్న మాటల మీద ఇంకా చర్చలు, చర్యలు జరుగుతూనే వున్నాయి. ఇది ముస్లింలని ఇంకో కొత్త పేరుతో అణచివేసే కుట్ర తప్ప ఇంకేమీ కాదని కొంతమంది ముస్లిం నాయకులు అంటున్నారు. కొన్ని చోట్ల ముస్లింలని దూరంగా వుంచడానికి ఇప్పుడు మర్కజ్ బూచి చూపిస్తున్నారని whatsapp గ్రూప్ లో , ఫేస్ బుక్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి తను ఫోన్ లో చదువుతూనే వున్నాడు. ఆ లోకం రజియాకి తెలియదు కాబట్టి, ఆమెకి టీవీలో చూసేదీ, వినేది మాత్రమే వార్త!

“మన వాళ్ళు కూడా మరీ అన్యాయంగా తయారవుతున్నారు! ఈ మర్కజ్ లూ, జమాత్ లూ లేకపోతే ఏం? మనం బతకలేమా? వాళ్ళ వల్ల మామూలు ముస్లింలకు కూడా కష్టాలు!” అంది వున్నట్టుండి రజియా.

మొబైల్ ఫోనుకీ మధ్య, టీవీ వార్తలకు మధ్య షటిల్ ఆడుతున్న నేను ఆ మాట అన్న రజియా కళ్ళల్లోకి చూశాను. కచ్చితంగా అదే సమయంలో రజియా కూడా నా కళ్ళల్లోకి చూస్తోంది, నేనేం అంటానా అని!

కాసేపు యేమీ అనలేకపోయాను గాని, రజియా వూరుకోదు. కొంచెం గట్టిపిండం మరి!

“అంత తేలికగా లేదు, రజియా! మర్కజ్ లేకపోతే, ఇంకో కారణమేదో ముస్లింలని తిట్టిపోయడానికి వెతికి పట్టుకుంటారు. దేశమంతా ముస్లిం వ్యతిరేకతలో కొట్టుకుపోతోంది!”

“మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు ముస్లిం కాబట్టి మీ క్లాసులకి రాము అనే హిందువులు వుంటారా? లేకపోతే, మీ పేరులో మహమ్మద్ వుందని చెప్పి, మీ హిందూ స్నేహితులు యేమైనా కటాఫ్ చేశారా? మనం బాగుంటే, వాళ్ళు బాగుంటారు మనతో! మనమూ- వాళ్ళూ అనుకుంటే అట్లాగే వుండిపోతాం!”

అవునా? మనమూ- వాళ్ళూ—అని అంటున్నది యెవరో రజియాకి తెలియదా నిజంగా?!

ఇంకేం చెప్పాలో నాకు తెలీలేదు. “దేశం చాలా మారిపోయింది, రజియా! ఏడాది కిందట వున్నట్టు ఇప్పుడు లేదు!” అన్నాను.

“మీరేదో చెప్తారు. సరే, ఇషా నమాజ్ వేళ అయింది. వచ్చాక కాసేపు ఖురాన్ చదువుకొని పడుకుంటాను. మీరెలాగూ రేపు క్లాస్ కి రెడీ అవ్వాలి కదా!” అంటూ లోపలికి వెళ్లిపోయింది.

టీవీలో మర్కజ్ వార్త వస్తున్న సమయంలోనే ఉమర్ సంగతి చెప్పాలని అనుకున్నా. కానీ, ఈ చర్చ తరవాత ఇంకేం చెప్తాను? తన దగ్గిర యేమైనా విషయం దాచి వుంచడం అన్నది ఇంతవరకూ జరగలేదు. ఉమర్ మర్కజ్ కి వెళ్లివచ్చాడని, రాగానే అతన్ని   కరోనా టెస్టింగ్ కి పంపించారని రజియాకి చెప్పాలి.. చెప్పి తీరాలి రేపో మాపో!

ఆ తరవాత మా ఇంట్లో ఉమర్ ఎవరు? రజియా కి అతను “భాయ్”గానే కనిపిస్తాడా?! రజియా స్పందనని వూహించలేకపోతున్నా.

ఆ రాత్రి నాకు నిద్రలేదు. నిజం చెప్పడం అంత తేలిక కాదు, దాని వెనక వచ్చే పర్యవసానాల్ని గురించి ఆలోచన వుంటే! అవేమీ మనసులో పెట్టుకోకుండా తిన్నగా విషయం చెప్పేయాలా?!

“చెప్పేయ్, ఏం పర్లేదు?! నిజం నిజమే. అది చెప్పడం ఆలస్యమైతే అబద్ధం కంటే ప్రమాదకరం కావచ్చు!” అంటున్నాడు ఉమర్ లోపలినించి.

వాడు అంతే...అబద్ధాలు మన ముఖాల్ని మార్చేసే వక్రరేఖలు అంటాడు. కానీ...రేపు యెట్లా అయినా కలవాలి వాణ్ని.

3

“సాదిక్ బాబూ! అంత దూరం వద్దమ్మా! మధ్యలో యేదో స్కూల్ గ్రౌండ్స్ దగ్గిర కలవండమ్మా!” అనేది అమ్మ స్కూల్ రోజుల్లో ఆదివారాలు యెప్పుడైనా నేను సైకిల్ వేసుకొని, ఉమర్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ వుంటే! ఉమర్ వాళ్ళ నాన్న రెహమాన్ ది పెద్ద వుద్యోగమేమీ కాదు. మూసా కిరాణా కొట్టులో పొట్లాలు కట్టేవాడు. ఉమర్  వాళ్లమ్మ చిన్న చిన్న కుట్టు పనులు చేసేది. ఉమర్ తమ్ముడు ఖమర్ మా ఇద్దరి కంటే మూడేళ్లు చిన్న. నా సైకిల్ వాళ్ళింటి ముందు ఆగినప్పుడల్లా రెహ్మాన్ వాళ్లమ్మ బయటికొచ్చి, “సాదిక్ బేటా!” అని ఆత్మీయంగా నన్ను లోపలికి పిలిచేది. అది నాలుగైదు అద్దె ఇళ్ల వాటాలున్న చిన్న కాంపౌండ్. వాళ్ళ ఇల్లు అంటే రెండు చిన్న గదులు.

మా అమ్మ అంత దూరం వద్దు!” అనడంలో కేవలం దూరం మాత్రమే లేదు.  మాటల్లో అమ్మా నాన్న యెప్పుడూ చెప్పలేదు గాని, వాళ్ళ చర్యల్లో అర్థమయ్యేది. ఉమర్ వాళ్ళ స్థాయి మనతో కలవదూ అని! స్కూల్ రోజుల్లో అప్పుడప్పుడూ ఉమర్ గాని, ఖమర్ గాని మా ఇంటికి వచ్చేవాళ్లు. కానీ, నాకు తెలిసీ మా ఇంట్లో యెవరూ వాళ్ళిద్దరినీ అంత మనస్ఫూర్తిగా లోనికి రమ్మని గాని, కాసేపు కూర్చోమని కానీ చెప్పిన గుర్తు లేదు నాకు.

అయినా- ఉమర్ తో నా స్నేహం ఆగలేదు. పెళ్లయ్యాక – రజియాకి అట్లాంటివి పెద్ద పట్టింపులు లేవు. అప్పటికి ఉమర్ భాయ్ స్కూల్ టీచర్ కాబట్టి నా అందరి స్నేహితుల కంటే ఎక్కువ మర్యాదలే దక్కుతున్నాయి. నిజానికి రజియాకి అన్నతమ్ముళ్ళు లేకపోవడం వల్ల ఉమర్ తన మంచితనంతో భాయ్ స్థానంలోకి తేలికగానే వచ్చేశాడు.

4

బైక్ దిగి, ఉమర్ వాళ్ళ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాను. వాళ్లది చివరి వాటా ఇల్లు. మొదటి మూడు వాటాల బయట అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు నన్ను చూసి మాటలు ఆపేశారు. తిన్నగా చివరి వాటా దాకా వెళ్ళి, నిలబడ్డాను. ఖమర్ బయటికివచ్చాడు, “సాదిక్ భాయ్ వచ్చాడమ్మా!” అంటూ-

నన్ను చూడగానే వాళ్లమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంది. “అసలు కన్నెత్తి చూసిన వాళ్ళు లేరు బాబూ!” ఏడుపు వచ్చేస్తోంది ఆమెకి.  రెహమాన్ వున్న పళాన నిలబడి, తన కుర్చీ ఖాళీ చేసి నాకు ఇచ్చాడు. గదిలో వున్న వొకే వొక్క మంచమ్మీద అతుక్కుపోయి వున్నాడు ఉమర్ భాయ్. నన్ను చూడగానే వాడి కళ్ళు మెరిశాయ్. లేవబోయాడు. వద్దని చెబ్తే మళ్ళీ వెనక్కి వాలాడు.

“లాక్ డౌన్ నుంచీ అట్లానే వున్నాడు. జ్వరమూ అవీ చెక్ చేస్తున్నా. మొదట్లో 102 దాకా కనిపించింది. తరవాత నార్మల్ అయింది. కానీ, లేచి కూర్చోడం లేదు. కాసేపు కూర్చున్నా, వెంటనే కూలిపోతున్నాడు,” అన్నాడు ఖమర్.

“ఉమర్ భాయ్, నువ్వు చెప్పు!” అంటూ వాడి చేతులు దగ్గిరకు తీసుకున్నా. ఆ కాస్త స్పర్శకే వాడు కరిగిపోయినట్టు అనిపించాడు. వొక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. నేను వాడి వీపు మీద చేయి వేసి, దగ్గిరకు తీసుకున్నాను. కాసేపు అట్లా వదిలేశాను వాణ్ని. వాడు ఏడిచీ ఏడిచీ కొంచెం నిమ్మళించాడు.  ఇన్నేళ్ల స్నేహంలో అంత బలహీనమైన స్థితిలో వాడెప్పుడూ కనిపించలేదు.  ఉమర్ భాయ్ క్లాస్ లో అయినా, బయట అయినా, రోజువారీ బతుకులో అయినా నన్ను అడిగితే చాలా creative. వాడికి రొటీన్ లైఫ్ లేదు. యేదైనా పనిచేస్తే, మనసుపెట్టి చేస్తాడని అందరూ అంటారు. క్లాస్ లో ఉమర్ భాయ్ చాలా సరదాగా వుంటాడని స్కూల్ ప్రిన్సిపల్ పదేపదే అంటాడు. ఇక పిల్లలకు వాడంటే ప్రాణం.

ఆరునెలలుగా ముస్లిం పేదపిల్లలకు యేదైనా చేయాలని వాడు అందరినీ కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నా లాంటి స్నేహితుల సాయంతో వేరే మతాల పెద్దల్ని కూడా కలుపుకొని వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే కొంతమంది జమాత్ పెద్దలతో కూడా అతనికి స్నేహాలు యేర్పడ్డాయి. అవన్నీ అతను తన శక్తితో సాధించగలిగిన తేలికపాటి విజయాలే! అవన్నీ పక్కన బెడితే, ఇప్పుడు అతన్ని వేధిస్తున్న పెద్ద సమస్య వేరే వుంది.

“నేనెప్పుడూ ఇక్కడ పరాయీవాడిగా నన్ను నేను భావించుకోలేదు. కానీ, మర్కజ్ కి వెళ్ళి వచ్చాక అందరి దృష్టిలో నేను యెవరినో అయిపోయాను.!” అన్నాడు కళ్ల నీళ్ళు కుక్కుకుంటూ.

కానీ, ఇవాళ నేను చూస్తున్న ఉమర్ కీ, ఆ ఉమర్ కీ పోలికే లేదు.

ఆ స్థితిలో నేను వాడితో ఎక్కువసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి, వాడి మనసు బాధపెట్టే కంటే, కొంచెం సేపు కూర్చొని వెళ్లిపోవడమే మంచిదని ఆ రోజుకు అనుకున్నా.

కొద్దిసేపు కూర్చొన్న తరవాత నేను లేచి నిలబడితే వాడే అన్నాడు: “రజియానీ సాజిద్ నీ చూసి చాలా రోజులే అయింది. వస్తా అని చెప్పు!”

అవును, రోజూ అడుగుతున్నారు వాళ్ళు!” అని, నేను బయటికి వచ్చాను. నాతోపాటు ఖమర్ కూడా వచ్చాడు. నేను వొక పక్కగా నిలబడి, సిగరెట్ వెలిగించాను.

“సాదిక్ భాయ్, నెగెటివ్ వచ్చినా సరే వాళ్ళు అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టారు. ముందు ఆస్పత్రిలో తరవాత పోలీస్ స్టేషన్ లో “ఏరా, మర్కజ్ కి వెళ్లకపోతే యెమైందిరా?! ప్రాణాలతో ఆడుకుంటున్నార్రా మీరంతా!” ఇట్లాంటి సూటి పోటీ మాటలు. వారం రోజుల నుంచి ఈ ఇంటి వోనరు గొడవ ఇల్లు ఖాళీ చేయమని! ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో వున్నాం. ఓనర్ కి మేమేమిటో తెలుసు!”

“ఖమర్, ఇప్పుడు మన గతమంతా చెరిగిపోయింది. మన స్నేహాలూ, బాబాయ్, మామాయ్, అన్నయ్యా, అక్కా  అనుకోడాలూ అన్నీ పోయాయ్. ఇప్పుడు నువ్వూ నేను ముస్లిం మాత్రమే!”

కానీ, నా ప్రశ్న అడక్కుండా వుండలేకపోయాను. “మర్కజ్ కి యెందుకు వెళ్ళాడు ఉమర్? వాడికి జమాత్ లూ అవీ నచ్చవ్ కదా!”

“నిజమే, కానీ, ఈ మధ్య ముస్లిం పిల్లల కోసం యేదైనా చెయ్యాలీ అన్న తపన పెరిగిపోయింది. చాలా మంది పేద పిల్లలు—ఈ మధ్య అయితే అనాథలు కూడా – అన్న సాయం కోసం వస్తున్నారు. వాళ్ళకి చేతనైనంత చేస్తూనే వున్నాడు. కానీ, ఎంత చేసినా సరిపోవడం లేదు. అట్లా జమాత్ వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారు!”

“అవునా?! ఇదంతా నాకు తెలీదే!” అన్నాను ఆశ్చర్యంగా-

“జమాత్ లో కూడా అన్న పాత్ర యేమీ లేదు. వాళ్ళు సాయం చేస్తామంటే సరే అన్నాడు. అంతే! అందులోని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, మర్కజ్ కి తీసుకువెళ్లారు. వాళ్ళే అన్నీ ఖర్చులూ పెట్టుకున్నారు!”

ఈ లోపు నా మొబైల్ మోగింది. ఇంటి నించి సాజిద్ ఫోన్. “బాబా! ఉమర్ చాచా కలిశారా?”

“అవును, కలిశాం. అందరూ బాగున్నారులే!” అని పెట్టేశాను.

“ఖమర్, కనీసం నువ్వు నాకు చెప్తూ వుండు. వాడు బాగా హర్ట్ అయినట్టున్నాడు. నేను రెండు రోజుల్లో మళ్ళీ వస్తా!” అని బైక్ ఎక్కాను.

ఇప్పుడు నా ముందున్న ప్రశ్న—రజియాకీ, సాజిద్ కి నిజం చెప్పాలా, వద్దా?!

నిజం చెప్పకుండా వుండడం ఉమర్ కి కూడా నచ్చదు.

కానీ, ఆ నిజం ఎటు వెళ్తుందో?!

నా మటుకు నాకు ఉమర్ ని వొంటరీ వాణ్ని చేయకూడదు అని ఆ క్షణంలో కచ్చితంగా అనిపించింది.  అంతా విన్నాక రజియా, సాజిద్ కూడా అట్లా అనుకుంటారా?! చెప్పలేను!

*
ANDHRA JYOTI SUNDAY MAY 16TH, 2020




13 comments:

Anonymous said...

ఉమర్ ని ఒంటరివాడిని చేయక పోవడమేమంచిది..కథ లోపాత్రే కావచ్చు..,👌👌👍ఉంది కథ afsarji..

wahed said...

అద్భుతమైన కథ... నేటి ముస్లిముల పరిస్థితికి అద్దం పడుతుంది. ముస్లిముల దుఃఖాన్ని, దేశంలో దట్టమవుతున్న మతతత్వాన్ని కళ్ళకు కట్టిన కథ

Anonymous said...

Good Story

Anonymous said...

కథ చాలా బాగుంది. ఇప్పుడు ముస్లింలు ఎదుర్కొంటున్న దుస్థితికి అద్దం పడుతోంది ఈ కథ.
అప్రమేయంగా అవమానం ఎదుర్కొనడం అనే సవాలును ముస్లింలు ఎదుర్కొంటున్నంతగా మరెవరూ ఎదుర్కోవడం లేదు.
ఇప్పుడు వలసకార్మికులు వేల సంఖ్యలో తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నా, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒకేచోట ఐదొందల మంది సూపర్ స్ప్రెడర్స్ పాజిటివ్ అని తేలినా మర్కజీ ముస్లింలే దేశమంతటికీ కరోనా అంటించినట్లు చెప్పుకుంటున్నారు.

మార్పుకోసం ఎదురు చూడాల్సిందే మనమంతా...

Avani said...

కథ బాగుంది

Manpreetam KV said...

కథ బాగుంది సార్.

Anonymous said...

మంచి కథ సార్

సొలోమోన్ విజయ్ said...

క్రూరమైన అవ్యవస్థకు దర్పణం పట్టిన కధ. మనిషిని గుణాన్ని బట్టి కాకుండా మతాన్ని బట్టి తప్పుడు అంచనాలు వేసే అరాచక ఉన్మాదాన్ని ఈ చూపుడువేలు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది.

bonagiri said...

బాగా వ్రాసారు.
మనుషులంతా ఒక్కటే అని అందరూ భావించే రోజు వస్తుందని ఆశిద్దాము.

చంద్ర మోహన్ said...

చాలా బాగా వ్రాసారు. సమకాలీన విషయాలపై బ్యాలన్స్డ్ గా వ్రాయడం చాలా కష్టమైన పని. అభినందనలు!

కృష్ణారావు said...

చూపుడు వేలు ఎవరినీ వదలదు. దానికి విచక్షణ తక్కువ. అహం ఎక్కువ. అది చాలా సార్లు భయంతో కూడిన అహం. మరి ఆ రెండూ కలిస్తే .. భయావహం!

కథ నడుస్తున్న కాలంలో ఈ చూపుడు వేలు ఎవరిని వదలింధి? ఇల్లాలి చూపుడు వేలు ఎవరిని నిలదీయ లేదు? ఇదో విపత్కాలం!

వ్యక్తి సమస్య- సమూహం సమస్యమా విడివిడిగా ఉంటాయా? మార్చి వరకూ ఎవరికీ తెలియని మర్కజీ ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఒక సందర్భం ఒక ముద్ర వేస్తుంది. కుష్టు అంటు వ్యాధి కాదు. కానీ దానికి పడిన ముద్రని ఎవరు చెరపగలిగారు? కరోనా దానికన్నా భయంకరమైందిగా ప్రచారంలోకి వచ్చింది. మందు వదిలినఫ్పుడూ చూపుడు వేలు లేచింది. వలస కార్మికులను రోడ్డెక్కినప్పుడూ లేచింది.
కథలో ఆ భాగాన్ని వదిలితే ... చూపుడు వేలు ఒక సమస్య మీద నిలబడింది. అది అస్తిత్వ సమస్య. అది ఇప్పుడే మొదలవలేదు. అదెటుపోతుందో ఎవరికీ తెలీదు.



Kottapali said...

Well crafted

D. Subrahmanyam said...

చాలా బాగుంది. మనిషి కుల మతాలకు అతీతంగా మానలత్వంతో మెలిగే సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూద్దాం.

Web Statistics