ఇంటివైపుకోసారి...


-భవాని ఫణి 
~

ఎంతటి వారినైనా పసివారిని చేసి ఆడించగలిగేవి వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలేననుకుంటాను. మనల్ని మనమే నిత్యం గమనించుకుంటూ, బేరీజు వేసుకోవడం చేతకాకయితేనేం, మనదైన స్వంత లక్షణంతో బ్రతికేయడం - అప్పుటికి రావడమే అందుకు కారణం కావచ్చు. ఆ ఏమీ తెలీనితనాన్నీ గుర్తు చేసుకోవడమంటే, కోల్పోయిన మనల్ని మనం తిరిగి కలుసుకోవడమే కదా. ఎప్పటికప్పుడు కలుగుతున్న స్పృహలనన్నీ అక్షరాలుగా మార్చి, మనసు తెల్లకాగితం మీద రంగురంగుల్లో రాసేసి, మన 'గతం' మనకందించిన జ్ఞాపకాల ఉత్తరాల కంటే విలువైనవి ఇంకేముంటాయి జీవితంలో! ప్రపంచాన్ని మనకీ, మనల్ని ప్రపంచానికీ పరిచయం చేసిన అమ్మలాంటిదే కదా గతం కూడా. ఆ కమ్మని జ్ఞాపకాల్ని విప్పుకున్నప్పుడల్లా, వింత వింత అనుభూతులేవో కుప్పల్లా రాలి పడి, రాశి కడుతుంటాయి. ఎన్నెన్నో అవన్నీ...కొన్నికొన్ని ఆనందాలూ, ఉద్వేగాలూ, మరికొన్ని కొన్ని దుఃఖాలూ, దిగుళ్లూ.
అప్పుడప్పుడోసారి, ఎవరైనా ఇలా వింత బెంగతో తల్లడిల్లకపోతే, దాని గాఢ పరిష్వంగంలో చిక్కుకుని అల్లాడకపోతే, తమని తామెక్కడో పోగొట్టుకున్నట్టే మరి. అటువంటప్పుడే అఫ్సర్ గారి 'ఇంటివైపు'కోసారి వెళ్ళొస్తే సరిపోతుంది. భుజాలకి విమానం రెక్కల్ని మొలిపించుకు మరీ ఎగిరిపోతూ... ఎప్పటెప్పటివో కలల్లాంటి కొన్ని సీతాకోక చిలుకల్ని వెంబడిస్తూ, ఈ యాంత్రిక ప్రపంచం నుండి దూరంగా తరలిపోయే, ఆయన ఆ అందమైన వాహనంలో, మనమూ ఓసారి ప్రయాణించాల్సిందే. ఇప్పటి వయసు తెచ్చిన జ్ఞానమనే భాషతో, అనుభవం తెరిచిన వేదాంతి మనసుతో, ఆనాటి పసితనపు స్వచ్ఛతనోసారి ఆయనలా ప్రేమగా పలకరిస్తున్నప్పుడు, తేనెను తెచ్చే తేనెటీగా, తేనె తుట్టలో తేనెచుక్కా - ఒకటిగా మారి ఏర్పడే తేనెపట్టులాంటి నిజమొకటి, మన కళ్ళకూ, మనసుకూ కూడా రుచ్యమవుతుంది.
ఈ కవితా సంపుటిలోని 'ఇంటివైపు' కవితే చూడండి...
చాలా ఏళ్ళ తర్వాత, మన బాల్యాన్ని దాచుకున్న ఊరివైపెళుతుంటే, మనసెలా ఉంటుంది! క్షణాలెంత బరువెక్కిపోతాయి! కాలాన్ని చక్రంగా చేసి గిరగిరా తిప్పెయ్యాలనిపించదూ...
"అక్కడందరికీ
అక్కడన్నిటికీ
నా ఈ అలికిడి వినిపిస్తూనే ఉందేమో!"
తనలో కలిగిన ఆ వింత అలజడిని, తను పెరిగిన ఇంటికో, తన స్వంత ఊరు మొత్తానికో ఆపాదించేంత ఉద్వేగం! అంతలోనే, ఎదురుకాబోయే ఆ మధురానుభవాలు కాసినీ, కాలంలో పడి కరిగిపోయే పంచదార గుళికలేనన్న స్పృహ తెచ్చే బెంగ మరోవైపు...
"మనసు కూడా ఇరుకనిపించే సంతోషాన్నో
మళ్లీ వదులుకుని రావాలన్న దిగులునో
కాస్త ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను"
ఇదొక్కటే కాదు, ఈ 'ఇంటివైపు'లోని ప్రతీ కవితలోనూ మనల్ని మనం లీనం చేసుకుంటాం. కాసేపు మనతోనే మనం, ఆ మాటల్ని చెప్పుకుంటున్నట్టుగా భ్రమిస్తాం.
"ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో
అంత తపనగా మళ్లీ ఆ అడుగులన్నీ
జీవితం నుండి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!"
అన్నారు 'చిన్ని పాదాలు' అనే కవితలో ఆయన. అవును... అడిగి అడిగి మరీ తెచ్చుకుంటాం - మనవైన మరి కొన్ని జ్ఞాపకాలని, మరుపు కొండల్ని తవ్వి మరీ, మన గతాల్లోంచి.
ఇంటికి చెందిన జ్ఞాపకాలతో, బెంగల్తో మొదలయ్యే ఈ పుస్తకంలోని పేజీలన్నీ, పోయే కొద్దీ, మరింత క్లిష్టమైన అనుభవాల్నీ, అనుభూతుల్నీ తర్కించుకుంటూ తిరిగిపోతాయి. ఓ పరాయి నేలా, మరో జ్వరమూ, ఇంకో షంషాద్ బేగం స్వరమూ, మరో గజల్ పై మోహమూ, కావేరీ తీరమూ, రాత్రై వెలిగిన పద్యమూ, అన్నం మెతుకు ఆక్రోశమూ, ద్వేష భక్తి గీతమూ...నిజమే, పుస్తకం పూర్తవుతుంది గానీ, నిజానికి మాటల సంచీ ఖాళీ అవనే అవదు. వినాలనుకున్నవింకా మిగిలే ఉంటాయి.
చివర్లో, ఈ కవితా సంపుటి గురించి అఫ్సర్ గారు రాసుకున్న "మా ఇంటి దాకా...!" చదివినప్పుడు, మా అత్తగారంటుండే ఓ మాట గుర్తొచ్చింది.
'చదువుల కోసమని పిల్లల్ని మరీ పసివయసుల్లోనే దూరంగా పంపేసి, వాళ్లాడుకున్న వస్తువులన్నీ సర్దుతున్నప్పుడు, మనిషి పోయినంత ఏడుపొచ్చేదట ఆవిడకి!'. ఎప్పుడో మనం వదిలి వచ్చేసినవన్నీ, ఇప్పటికీ మనల్నింతగా కదిపి కదిలిస్తుంటే, అలా పంపించి మనల్ని దూరం చేసుకున్నవాళ్లంతా, అప్పటికీ ఇప్పటికీ మనకోసమని ఇంకెంతగా తల్లడిల్లుతుంటారో కదా!
*

0 comments:

Web Statistics