నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో!


ఇంటర్వ్యూ: పలమనేరు బాలాజి

చనలో మమేకత్వం,ఒక సహజత్వం, ఒక అసాధారణత అఫ్సర్ సాహిత్య లక్షణం.
కథ రాసినా కవిత్వం రాసినా విమర్శ చేసినా ,అనువాదం చేసినా ,పరిశోధన చేసినా, ఏదైనా సరే ఎవరు వెళ్ళని దారిలో వెళ్లడం మనసుపెట్టి పనిచేయటం అఫ్సర్ వ్యక్తిత్వం. గుడిపాటి గారు అన్నట్టు నిజంగా నిరంతరం సాహిత్యజీవిగా ఉండటం అంటే ఏమిటో ఎలానో మనం అఫ్సర్ నుండి నేర్చుకోవాలి.

కవి కథకుడు విమర్శకుడు అనువాదకుడు పరిశోధకుడు సంపాదకుడు సాహిత్య పత్రిక నిర్వాహకుడుగా నిరంతరం సాహిత్య సృజన కొనసాగిస్తూ తన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా తన సాహిత్య ప్రయాణాన్ని తనదైన మార్గంలో కొనసాగిస్తున్న నిగర్వి, స్నేహశీలి అఫ్సర్ కవిసంగమం - కవితావరణం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఈవారం...

*
1.మీ కవిత్వం చదువుతూ ఉంటే సాహిత్యాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా మీరు చాలా సీరియస్ గా అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది. నిష్పాక్షికంగా జీవితాన్ని చూసే పద్ధతి మీకు ఎలా అలవడింది?
*అధ్యయనం మొదటి నించీ జీవితంలో భాగంగా ఇంకిపోయింది. పుస్తకంతో పాటు అనుభవాల అధ్యయనం కూడా కొంత ఆలస్యంగా అలవాటైంది. నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో నాకు ఇంకా తెలీదు. కానీ, వీలైనంత విశాలంగానో, ఓపెన్ గానో వుండడానికి ప్రయత్నించడం అవసరం. అలా ఓపెన్ గా వుంటే, ఎక్కువ నేర్చుకుంటాం. జర్నలిజంలో వున్న కాలం నుంచీ అదే దృక్పథం నన్ను నడిపించిందేమో. అదృష్టం బాగుండి, స్కూలు రోజుల నుంచీ మంచి స్నేహితులు చుట్టూ వుండడం, వాళ్ళకీ నాకూ ఒకే రకమైన అభిరుచులు వుండడం కూడా కలిసివచ్చింది. అమెరికాలో అధ్యాపనం వల్ల ఈ ధోరణి మరింత బలపడింది. ఇక్కడ ప్రతి రోజూ కొత్త తరం విద్యార్థులతో చర్చలూ, సమావేశాలూ నాకు కొత్త పాఠాలు నేర్పాయి.

2. సమకాలీన కవుల సాహిత్యం పట్ల మీరు చాలా సహృదయంతో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. కొత్త కవులను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల వారితో అన్ని వయసుల వారితో మీరు మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక సాహిత్య వ్యక్తిత్వం సాహిత్యకారులలో మిమ్మలను ప్రత్యేకంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ సంస్కారం, స్నేహ స్వభావం మీకు ఎలా అలవడింది?
*ఇది నా గురించి నా అన్వేషణలో భాగమే. సమకాలంలో సమానంగా వుండాలన్న తపన. రచనల ప్రమాణాలు ఎప్పుడూ మారుతూ వుంటాయి. ఆ మార్పుని తెలుసుకోవాలంటే మనలో కొత్త చూపు ఎప్పుడూ వుండాల్సిందే. అది కేవలం మానకాలం రచయితల్ని చదవడం వల్లనే సాధ్యం. Learning process నిరంతరం. ఇవాళ ఒక కొత్త వాక్యం చదివినప్పుడు అది మరింత అర్థవంతమవుతుంది, అర్థమవుతుంది. కొత్తగా రాస్తున్న కవులకి ఈ కొత్త వాక్యాల ఆచూకీ తెలుసు.

3. మీరు అనుకున్నట్టుగా మీ సాహిత్య ప్రస్థానం కొనసాగుతూ ఉన్నదా? ఏవైనా ఆటంకాలను అధిగమించారా? ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందటంలో, నూతన ఉత్సాహాన్ని పొందటంలో మీ కుటుంబ సభ్యుల మిత్రుల స్ఫూర్తి గురించి కొంచెం చెబుతారా?
*సాహిత్య ప్రస్థానం ఫలానా విధంగా వుండాలని నేనేమీ అనుకోలేదు. ఏమైనా అవకాశాలూ, మలుపులూ వచ్చి వుంటే, అవి కేవలం అనుకోకుండా వచ్చినవే. కాకపోతే, ప్రచురించిన ప్రతి పుస్తకం ఎంతో కొంత గుర్తింపు సాధించుకుంది. “రక్తస్పర్శ” కి మంచి సమీక్షలు దక్కాయి, “ఇవాళ” కి ఫ్రీ వర్స్ ఫ్రంట్ తో పాటు ఆ ఏడాది కనీసం పది అవార్డులు వచ్చాయి. “వలస” “ఊరి చివర” “ఇంటివైపు” కూడా మంచి పురస్కారాలు అందుకున్నాయి. సాహిత్య విమర్శలో “ఆధునికత- అత్యాధునికత” తో పాటు “కథ-స్థానికత” కి గౌరవాలు దక్కాయి.

4. కొంతమంది కవిత్వం కొంతమంది కవులు కొంతమంది విమర్శకులు కొంతమంది సంపాదకులు కవులుగా మారాల్సిన పాఠకులను భయపెడుతూ ఉన్నారు. ఈ భయాలతో కొంతమంది తెరచాటునే ఉండిపోతున్నారు. రాసింది పత్రికలకు పంపలేక , పత్రికలలో అంతర్జాలంలో ప్రచురితమైన కవితలను పుస్తకంగా తీసుకు రాలేక ఎంతో మంది నలిగిపోతున్నారు. ఈ స్థితి నుంచి ఈ భయాలనుంచి వారు బయటపడి కవిత్వం రాయటానికి కవిత పుస్తకాలను అచ్చు వేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు?
*ఈ పరిస్తితి తెలుగు సాహిత్యంలో కొత్తేమీ కాదు. “రక్తస్పర్శ” కవిత్వం పుస్తకం వచ్చేనాటికి కూడా మా కవిత్వాలు సరిగా అచ్చుకి నోచుకోలేదు. అప్పటి పత్రికలు “ఇది తెలుగు కవిత్వం కాదు,” అని తిప్పి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. అలాగే, కవిత్వం ఒకే విధంగా చదివే అలవాటున్న విమర్శకులు వాటిని ఒప్పుకోకపోవడమూ వుంది. అప్పటి స్థితితో పోల్చితే, ఇప్పుడు చాలా నయం. కొత్త కవిత్వాన్ని ఇష్టంగా అక్కున చేర్చుకునే వేదికలున్నాయి, కొన్ని అంతర్జాల పత్రికలున్నాయి, కవిసంగమం లాంటివి వున్నాయి. పుస్తకాలు అచ్చు వేసుకోడం కూడా అప్పటికంటే ఇప్పుడు చవక. డిజిటల్ ప్రచురణ చాలా మంచి సాహిత్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. అదేవిధంగా, కొన్ని ప్రచురణ సంస్థలు కేవలం కవిత్వ ప్రచురణకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇది కొండంత ధైర్యం. అయితే, ఎన్ని భయాలున్నా, పరిమితులున్నా, నిజమైన కవులు రాయకుండా వుండలేరు. అలా వుండేట్టు అయితే, ఇవాళ ఇంత కవిత్వ సంపద మన ముందు వుండేది కాదు. నా మటుకు నాకు మంచి కవిత్వమైనా, మంచి సాహిత్యమైనా వేగంగా విస్తరించడానికి మంచి సంపాదకులు అవసరం. వీళ్ళు మాత్రం అరుదైపోతున్నారన్నది వాస్తవం.

5. అనుకరణకు లొంగని శైలి మీ సొంతం. మీది బలమైన సొంత గొంతుక. కథ రాసినా కవిత్వం రాసినా వ్యాసం రాసినా చాలా నిక్కచ్చిగా చిక్కగా వాస్తవికంగా ఉంటుంది.. మీ ధోరణి. రాయడంలో ప్రతి కవికి ఎదురయ్యే అనేకానేక మొహమాటలను ఎట్లా అధిగమించారు?
*మీ ప్రశంసకి చాలా థాంక్స్. రాయడంలో మొహమాటలేమీ వుండవు. అది కవిత్వమైనా, విమర్శ అయినా- రాయాల్సిందే రాస్తాను. అలా నిక్కచ్చిగా వుండడం వల్లనే “ఆధునికత- అత్యాధునికత” (1992) “కథ-స్థానికత (2010) విమర్శ పుస్తకాల మీద విస్తారమైన చర్చ జరిగింది. ఇప్పటికీ వాటి గురించి చాలా మంది అడుగుతూనే వున్నారు, మాట్లాడుతూనే వున్నారు. నా విషయంలో సృజన, విమర్శ రెండూ ఒకే సమయంలో జరిగాయి కాబట్టి, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం కొంత తేలిక అయింది. మొదట్లో నా కవిత్వం మీద వచ్చిన విమర్శలని తలచుకుంటూ అప్పుడప్పుడూ శివారెడ్డి గారు అంటారు “ నువ్వు కాబట్టి ధైర్యంగా నిలబడ్డావయా?” అని- అందులో ధైర్యం నాలోపలి విమర్శకుడు ఇచ్చిన ధైర్యమే! ఇప్పుడు ఆ ప్రయాణం అంతా సాఫీగా అనిపిస్తుంది కానీ, నిజానికి ఏ సాహిత్య ప్రయాణమూ సాఫీగా వుండదు. శివారెడ్డి గారి కవిత్వం మొదటి రోజుల్లో కూడా విమర్శలకు తక్కువేమీ లేదు. అవి కొన్ని సార్లు రచనలో మొహమాటాలకు దారితీయడం సహజం. కొన్ని భయాలూ ఏర్పడతాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పటికీ లోపల ఆ యుద్ధం నడుస్తూనే వుంటుంది. ఈ యుద్ధానికి కొత్త కవీ, పాత కవీ అనే మొహమాటమేమీ లేదు.

6. కొత్త కవులు కొత్త రచయితలు కొత్త విమర్శకులకు సంబంధించి, యువ సాహితీ వేత్తలకు సంబంధించి అంతర్జాల పత్రిక నిర్వాహకుడిగా మీరు గమనించిన ప్రత్యేకమైన అంశాలను గురించి కొంచెం చెబుతారా?
*సారంగ నిర్వహణ కంటే ముందే నేను అక్కడ వున్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమిలో సాహిత్య పేజీలు నిర్వహించాను. అసలు సాహిత్యానికి నిండు పేజీ వుండాలన్న ఆలోచన ఆంధ్రజ్యోతిలో వున్న కాలంలో పెద్ద ప్రయోగం. అప్పటి నుంచీ ఇప్పటి సారంగ దాకా నా దృష్టి ప్రధానంగా కొత్త తరానికి ఏం చేయగలం అన్నదే! అయితే, ఇదేమీ అనుకున్నంత సులువు కాదు. ఇప్పటికీ రాయగానే వెంటనే వాయువేగంతో పత్రికకి పంపించేసే అలవాటు చాలా మందికి వుంది. అలాగే, తమ రచనలే ఎక్కువగా కనిపించాలనే తాపత్రయం కూడా కొంతమందిలో వుంది. పత్రికలో ఇది సాధ్యపడదు. వీలైనంత ఎక్కువ మందికి పత్రిక చోటు ఇవ్వాలి. పత్రిక స్పేస్ కూడా పరిమితంగా వుంటుంది. సారంగ కి ఇప్పుడు ప్రతిరోజూ కనీసం పాతిక మంచి రచనలు వస్తాయి. (ఇక ప్రచురణకి ఏమాత్రం పనికిరానివి పెద్ద సంఖ్యలోనే వుంటాయి). కానీ, సారంగ పది మహా అయితే పన్నెండు రచనలు మాత్రమే ప్రచురిస్తుంది. అలాంటప్పుడు రచన నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అందువల్లనే, ఆ పది రచనలు గట్టిగా వుంటాయి. వాటికి వచ్చే స్పందనలు కూడా గట్టిగా వుంటాయి. రచన చేయడం ఎంత పెద్ద బాధ్యతో, రచనని అచ్చు వేయడం కూడా అంతే పెద్ద బాధ్యత. రచయితలు కూడా పత్రిక పరిమితులు అర్థం చేసుకొని మెలగాలి. ఒక రచన అచ్చు వేసినప్పుడు ఎడిటర్ ని మెచ్చుకొని, ఇంకో రచన అచ్చు కానప్పుడు అదే ఎడిటర్ కి శాపనార్ధాలు పెట్టడం ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఈ ధోరణి పెరుగుతున్నందువల్ల చాలా మంది ఎడిటర్లలో ఒక విధమైన నిరసన భావమూ పెరుగుతుంది. మంచి ఎడిటర్ ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే!

7. ప్రతి కవితలో మీ భాష మీ శైలి భావప్రకటన మెరుగుపడుతూనే ఉంది. అత్యంత మెరుగ్గా కవిత్వ ప్రక్రియ కొనసాగటానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు లేదా మీరు పాటించే సూత్రాలు లేదా మీ కవిత్వరచనా ప్రక్రియ విధానం గురించి..
*రచన పట్ల గౌరవం వుండాలి ముఖ్యంగా- మనం రాసే వాక్యం పట్ల ప్రేమా వుండాలి. చాలా మంది నిరంతర అధ్యయనం గురించి చెప్తూనే వున్నారు. కానీ, దాని కంటే ముఖ్యంగా ఇతరుల రచనలు చదివే సహనం వుండాలి. ఆహ్వానించే మనసూ వుండాలి. కవిత్వ రచనలో నేనేమీ ప్రత్యేక సూత్రాలు పాటించడం లేదు. మొదట రాయాలనుకున్నది రాస్తాను. తరవాత ఎడిటింగ్ చేస్తాను. ఈ ఎడిటింగ్ దశలో వచ్చే ప్రతి మార్పునీ ఆహ్వానిస్తాను. అలాగే రాసిందల్లా అచ్చుకి పంపించాలన్న ఉత్సాహాన్ని అణచుకుంటాను. రాసింది కొన్నాళ్లు నా దగ్గిరే పెట్టుకొని, పదేపదే చదువుకుంటాను. ఇది కవిత్వమైనా, వచనమైనా సరే. అందుకే, నేను ఎక్కువగా రాయలేను. అదీ మంచిదే.

8. కవి సంగమం గురించి..
*కవిసంగమం ఒక మలుపు. సోషల్ మీడియాలో పెడధోరణులు పెరిగిపోతున్న కాలంలో కవిసంగమం వాటిని సవాలు చేస్తూ నడుస్తోంది. కొత్త తరానికి వేదిక. నేర్చుకోడానికి అవకాశం కలిపిస్తున్న పాఠశాల..
Web Statistics