1
అర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా
శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాంతికి నిద్రాభంగం
కాకూడదన్న ఇంగితం కూడా లేకుండా పెద్ద చప్పుడు చేసుకుంటూ, బాత్ రూమ్ కి
వెళ్తావ్. పజామా కిందికి లాగి, కొంచెం సేపు ప్రయత్నిస్తావ్. కొన్ని
చుక్కలు పజామా మీద పడుతూ వుంటాయి చివర్లో- అది నీకు అసహ్యం. అంత అపరిశుభ్రంగా
ఎప్పుడూ లేవు నువ్వు. మరి ఇప్పుడు?! శరీరం అదుపులో లేదు.
ఆరోగ్యం గాడి తప్పింది. అన్నిటికీ నెపం కాసేపు ఫిలడెల్ఫియా దిక్కుమాలిన బతుకు
మీదకి తోసేస్తావ్ కదా!
వొక పట్టాన నిద్రపట్టదు. నెమ్మదిగా వెనక్కి
వచ్చి, లివింగ్ రూమ్ లోకి వెళ్తావ్. కిటికీ తెరచి, వీధిలోకి చూస్తావ్. అదేమీ నీ
వూళ్ళో వీధి కాదు కదా, రహదారి అంతా ప్రశాంతత పొంగి ప్రవహించడానికి- ఆ వీధిలో నీ కుటుంబానికి
ఎంత గౌరవం! దిక్కుమాలిన ఈ దేశంలో ఈ నగరంలో శాంతి పనిచేసే ఆఫీసుకి దగ్గిరగా వుండాలనుకొని, సిటీలోనే
ఈ బ్లాక్ లోకి వచ్చిపడ్డావ్. మొదటే ఈ చుట్టుపక్కల ఏదీ నీకు నచ్చలేదు. ఇద్దరు
పిల్లలు- సిరికీ, శౌరికీ- ఈ రెండేళ్లలో హైస్కూల్ అయిపోతే
రేపు యూనివర్సిటీకి కూతవేటు దూరంలో వుంటారన్నది తప్పితే. నీ వుద్యోగం విషయానికి
వస్తే న్యూ జెర్సీ, డెలవేర్ నగరాలకు షటిల్ తప్పదు. నిలకడ
లేదు. అన్ని విధాలా శాంతి వుద్యోగమే స్థిరం. కుటుంబం కోసం కొన్ని త్యాగాలు తప్పవ్. ప్రశాంతమైన సబర్బ్ జీవితాన్ని వదులుకోవడం అందులో వొకటి. సబర్బ్ లో
వుంటే మనవాళ్ళ మధ్య బతుకుతున్న ఫీలింగ్. ఇక్కడ.....ఈ నగరం మధ్యలో?! “వచ్చేయ్ వచ్చేయ్..దూరమైనా పర్లేదు. శాంతి డ్రైవింగ్ నేర్చుకుంటుందిలే!”
అని సబర్బ్ దోస్తుల వొత్తిడి. “నేను డ్రైవింగ్ చేస్తా” అని శాంతి భరోసా ఇచ్చినా, నీకు భయం.
అన్నీ భయాలే. అన్నిటికంటే పెద్ద భయం నువ్వు
ఎవరికీ తెలీకపోవడం. ఇన్ని నల్లముఖాల మధ్య వొక గోధుమ రంగు నీడ నువ్వు. శాంతికి ఇలాంటి భయాలు ఎందుకు లేవు? వర్క్ లో బ్లాక్స్, లాటిన్ అమెరికన్స్, మిడిల్ ఈస్ట్ వాళ్లమధ్య తనకి అంత
సఖ్యం ఎలా సాధ్యం?! ఏమో?!
కొంచెం అలసటగా అనిపించి, కంటి మీద రెప్పలు బరువనిపించి, కిచెన్
లోకి వెళ్లావ్. గ్లాసులోకి మంచి నీళ్ళు వొంపుకొని, పైకి
ఎత్తబోతే, పాటియో మొక్కల మధ్య ఏదో చప్పుడు. అప్పుడు చూశావ్ ఆ
రకూన్ ముండని! ఉడతలు తెలుసు, పందికొక్కులు తెలుసు. ముళ్ళ పందులూ తెలుసు. వాటన్నీటి లక్షణాలూ పంచుకొని
పుట్టినట్టు ఈ రకూన్. దీన్ని చూస్తే లోపలేదో భయం నీకు. దాని చూపులో భయంపుట్టించే
తీవ్రత. చేత్తో వారించబోయావ్. నీకూ పాటియోకి మధ్య అద్దాల తలుపు వుందని ఆ క్షణంలో
నీకు గుర్తుండదు. పాటియో మీద రాలిన కొద్దిపాటి మంచు తెల్లదనంలో దాని వొంటి నలుపు, దాని కంటిలోని ఎకసెక్కం నీకు గుచ్చుకున్నాయి. అద్దం తలుపు మీద గట్టిగా కొట్టావ్. దానికే భయమూ
లేదు. కాసేపు తన పని తాను చేసుకొని, అది కిందికి దిగి
వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్లింది? కింది మెట్లు దిగి, బేస్మెంట్ లోకి వెళ్లలేదు కదా?!
అసలే నిద్ర పట్టదు. దానికితోడు ఈ రకూన్. అర్థరాత్రి
రెండున్నర తర్వాత మెలకువ ఈమధ్య నీకు కొత్తేమీ కాదు. కచ్చితంగా ఆరునెల్ల కింద ఆ సమయంలోనే ఫోన్
మోగింది.ఇంటి నుంచి! దూర ప్రయాణాల బాధా, చివరిరోజుల్లో తల్లికి దగ్గిరగా లేవన్న గిల్టీ రెండూ బరువై, నువ్వు ఆదరా బాదరా హైదరాబాద్ లో దిగావు. అట్లా అర్థరాత్రి వొంటి గంటకీ, రెండు గంటలకీ మధ్య మెలకువ రావడం ఆ తర్వాత రోజూ మామూలు అయిపోయింది. అది
వొట్టి మెలకువే అయితే బాగుండేది. దాని చుట్టూరా అమ్మ చివరి ముఖం. చివరి నవ్వూ. తన
వైపే చూస్తూ ఏదో చెప్తున్నట్టుగా చెప్తూ చెప్తూ కిందకి వాలిపోయిన ఆ రెండు కళ్ళూ. “ఎంత
బతుకురా ఇది?! ఆ
కొంత బతుక్కి అంత దూరం వెళ్లాలా?” అన్న అమ్మ మాట ఇప్పుడు ఈ
అర్థరాత్రి వొంటిగంటా- రెండుగంటల మధ్య గంట కొట్టినట్టు వినిపిస్తూ వుంటుంది.
పావు భాగం మాత్రమే తెరిచిన కిటికీ ముందు నిలబడి, కిందికి చూపు వాల్చి, వీధిలోకి
చూస్తున్నావ్. వెన్నెల లాగా వీధిదీపం ప్రశాంతంగా రోడ్డుని కప్పేస్తోంది. అంత
ప్రశాంతత ఆ అర్థరాత్రి సమయంలోనే వుంటుందేమో! ఎందుకో అట్లాంటి ప్రశాంతత కూడా నీకు
నచ్చడం లేదు. వున్నట్టుండి అక్కడ తుపాకులు పేలుతున్నట్టూ,
బ్లాక్ లోని జనమంతా మేలుకొని వీధుల్లోకి దెయ్యాల్లా నడుచుకుంటూ వస్తున్నట్టూ
అనిపిస్తుంది. కాదూ- నిజంగానే కనిపిస్తుంది చాలా సార్లు. “ఈ అలగా జనం వున్న చోట
వొక్క క్షణం ప్రశాంతత వుండదురా” అన్నావు మొన్నామధ్య తమ్ముడితో మాట్లాడుతూ.
ఈ శౌరి నేస్తాలంతా ఎక్కువ నల్లవాళ్లే. వాళ్ళ
అలవాట్లే వీడికి కొన్ని- ఆ స్నేహాలేవో కాస్త తెల్లవాళ్లతో చేయచ్చుగా అని శాంతితో
ఎన్నిసార్లు పోరు పెట్టావో! శౌరిలో కొత్తగా వచ్చిన పొగరుమోత్తనం ఆ నల్ల పశువుల వల్లనే
అని నువ్వు ఖాయంగా అనుకుంటావ్.
కిటికీ ముందు నిలబడ్డావ్, శౌరి ఎప్పుడొస్తాడా
అని. కిటికీ పూర్తిగా తెరవడం నీకు ఇష్టం
లేదు. ఈ ఇంట్లో తెరిచిన కిటికీలు నిషిద్ధం అని నువ్వే ప్రకటించావు ఏడాది కిందట.
ఆ ఏడాది కింద –అంటే డిసెంబర్ ఇరవై. ఇంకా చీకటి పడనే లేదు. ఆ రోజు వర్క్ లో ఆలశ్యమై, సాయంత్రం ఆలస్యంగా వాక్
కి వెళ్లావ్. గంట తరవాత ఇంటికొచ్చావో లేదో మొబైల్ ఫోన్ మీద ఫ్లాష్ న్యూస్. నడి
రోడ్డు మీద వొక టీనేజర్ ని ఎవరో కాల్చి చంపేశారు. ఆ టీనేజర్ నల్లవాడు. అతని శవం
మాత్రమే ఆ రోడ్డు మీద వుంది. కాల్చి చంపిన వాళ్ళు ఎవరో తెలీదు. తను భోజనం కోసం
కూర్చోబోతుండగా, ఫోన్ లో వరసగా హెచ్చరికలు. ఆ ఏరియా అంతా పోలీసులు. పెడబొబ్బలు. ఈ
నల్లవాళ్లు-- చంపడమో, చావడమో అంతే. వీళ్ళ బతుకులో ఇంకోటి
లేదు. ఆ క్షణంలో ఒక్కటే ఆలోచన. నిజానికి నువ్వు ఆ రోడ్డు మీదికి వాక్ కి వెళ్లవు.
ఆ రోజు వెళ్లావు. ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు వాక్ లో వుండి వుంటే....! ఆలోచనలు
బ్లాంక్ అయిపోయాయ్. కానీ, ఆ రోజు అప్పటికప్పుడు భోజనం ఆపేసి, గబగబా కిటికీ తలుపులన్నీ పూర్తిగా మూసేశావ్. తలుపులకి లాక్ సరిగా పడిందో
లేదో అని ఇంకో రెండుమూడు సార్లు చెక్ చేసుకున్నావ్.
శాంతి వైపూ, సిరి వైపు చూస్తూ
“ పొరపాట్న కూడా మళ్ళీ కిటికీలు తెరవద్దు. బయటికి వెళ్ళేటప్పుడు లాక్ మూడు నాలుగు
సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి.” అని గట్టిగా అరిచావ్. “ఏమిటీ...శౌరి ఇంకా రాలేదా?!” అన్నావు కోపం ఆపుకోలేక. వాడి మీద
సందర్భం వెతుక్కొని మరీ ఈ మధ్య నీ అరుపులూ కేకలూ ఎక్కువైపోతున్నాయని శాంతి గొడవ. ఆ
వొక్కడూ సిరిలాగా అమ్మాయి అయివుంటే బాగుణ్ణు అని చాలా సార్లు అనుకున్నావ్. ఇప్పుడు
నువ్వు గట్టిగా అరవడం వెనక కూడా నల్లవాళ్ళ స్నేహంలో వాడేదో అయిపోతున్నాడన్న
ఆక్రోశముంది.
ఆ రోజు తరవాత ఆ ఇంటికి కిటికీలు వున్నాయన్న
సంగతి అందరూ మరచిపోయారు. కానీ, మరుసటి రోజు ఆ హత్య అయిన నల్ల
టీనేజర్ ఫోటో టీవీ వార్తల్లో కనీసం పదిసార్లు చూపించారు. అదిగో- అప్పుడు
గుర్తొచ్చాడు వాడు. పదహారేళ్ళ జాక్సన్.
అంటే, నీ కొడుకు శౌరి తో స్కూలుకి వెళ్తున్నవాడు. శౌరి
అతన్ని వొకటిరెండు సార్లు ఇంటికి కూడా
తీసుకువచ్చాడు. ఆ రోజు నువ్వు అగ్గిమీద గుగ్గిలం అయ్యావ్. నీ వైఖరికి విసుక్కొని, ఆ రోజు కోపంగా బయటికివెళ్లిపోయాడు శౌరి. ఆ రాత్రి వాడు ఇంటికి వచ్చేదాకా
నీకు నిద్రలేదు. శాంతిని నిద్రపోనివ్వలేదు. సిరిని గుచ్చిగుచ్చి అడుగుతూనే
వున్నావ్. “ఎక్కడ తగలడ్డాడో చూడవే!” అని పదిసార్లు
గదమాయించావ్. సిరికి మాత్రం ఏం తెలుసు?! నీలాంటిదే ఇంకో ప్రపంచంలో సిరి బతుకుతూ వుంటుంది. తనలాంటిదే ఇంకో
ప్రపంచంలో శౌరి. తెగి ముక్కలయిపోతూన్న ఈ అన్ని ప్రపంచాల మధ్య దారంలాగా నలిగిపోతూ శాంతి.
ఆ రాత్రి లివింగ్ రూమ్ సోఫాలో కూర్చొని, దిక్కుమాలిన తెలుగు ఛానెల్స్ చూస్తూ, వాటిని
తిట్టుకుంటూ, ఇంకెవరినో తిట్టుకుంటూ...గడిపావ్, మాటిమాటికీ కిటికీ బ్లైండ్స్
పైకి జరుపుతూ, రోడ్డు మీదికి చూస్తూ- అట్లా గడిపే రోజులు
లెక్కపెట్టుకోవడం ఇప్పుడు కష్టమే అయిపోయింది. వారంలో నాలుగు రోజులు శౌరి ముఖమే
కనిపించడం లేదు.
2
ఈ రాత్రి కూడా అంతే. శౌరి గదిలోకి వెళ్ళి చూస్తే, వాడు లేడు. పక్క గదిలోకి వెళ్ళిచూశావు. సిరి అప్పుడే పడుకున్నట్టుగా వుంది.
నిశ్శబ్దంగా కిందికి దిగివచ్చి, తక్కువ వాల్యూమ్ లో టీవీ
పెట్టుకున్నావ్. నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ మంత్ అని చెప్పి,
స్పెషల్స్. ఇక్కడా ఇదేనా? అని విసుక్కున్నావ్. టీవీ ఆఫ్ చేసి, మళ్ళీ ఆలోచనల్లోకి జారుకున్నావ్. శౌరి వస్తే బాగుణ్ణు. మళ్ళీ జాక్సన్ ముఖం కళ్ళల్లో కనిపించింది. సాయంత్రం అందరూ నడుస్తున్న
రోడ్డు మీదనే కూలిపోయిన జాక్సన్ భారీ శరీరం. దాని చుట్టూరా ఆవరించుకున్న నెత్తుటి
మడుగు. జాక్సన్ ని తలచుకుంటే ఆ దృశ్యం వొక్కటే కాదు. హై స్కూల్లో వున్నప్పుడు నువ్వు
అప్పుడే వర్క్ నుంచి వచ్చావ్. లివింగ్ రూమ్ సోఫాలో జాక్సన్ కూర్చొని వున్నాడు.
శౌరి వాడి రూమ్ లోకి దేని కోసమో వెళ్ళినట్టున్నాడు.
ఇంట్లోకి రాగానే ఆ నల్ల బండరాయిని మొదటిసారి చూసినప్పుడు నీ కనుబొమలు అదోరకంగా
ముడిపడ్డాయి. లోపలికి అడుగుపెట్టగానే “హలో
సర్ !” అని చిన్ననవ్వుతో పలకరించాడు జాక్సన్.
“హాయ్” అని అన్యమనస్కంగా అని, నువ్వు కిచెన్ లోకి నడిచావ్. కొంచెం మంచినీళ్లు తాగి, పైకి నీ గదిలోకి వెళ్లిపోయావ్. ఆ రోజు రాత్రి శాంతిని వంద ప్రశ్నలతో
నువ్వు వేధించావు. “ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ నల్లబండ
ఏమిటే!? ఛ ..శౌరిగాడికి ఎట్లా చెప్పాలీ?!” అని-
“నేనేమీ చెప్పను. ఈ నల్ల పిల్లాడు కొంచెం నయం. మిగిలిన
వాళ్లయితే- నేరుగా ఫ్రిజ్ దగ్గిరకి వెళ్ళిపోయి అదీ ఇదీ వెతుకుతూ వుంటారు. వీడు
వచ్చిన వాడు వచ్చినట్టే కూర్చుంటాడు.”
“అదేమీ కాదు, వాడికి
వొళ్ళు కదలడం కష్టం. నల్లబండ. వాడి బాడీ లాంగ్వేజే అస్సల నచ్చదు నాకు!”
“అట్లా మాటాడచ్చా!?శౌరిలాంటి వాడే కదా వీడు కూడా!”
“ఇంకా నయం!” అని విసురుగా నువ్వు మెట్లెక్కి, నీ గదిలోకి వెళ్లిపోయావ్, ఆ “నల్ల బండ” ఇల్లు వదిలే దాకా కిందికి దిగనని
వొట్టు వేసుకున్నట్టు-
ఆ నల్లబండ చుట్టూరా ఆలోచనలు కుమ్మక్కయి పోతాయి. మీ
వూళ్ళో నువ్వు మంచి ఇంగ్లీషు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నావ్. తరవాత బుద్ధిగా
ఎంట్రన్సులవీ రాసుకొని, ర్యాంకులు సంపాయించుకొని, కంప్యూటర్ కోర్సులవీ వంట
బట్టించుకొని, ఇంత దూరం వచ్చావ్. అట్లా అనుకున్నప్పుడల్లా మీ
వూళ్ళో నీతోపాటు కాలేజీకి వచ్చి, ఏదో సమాజాన్ని
ఉద్ధరించేద్దామనుకొని, తమని తాము కూడా ఉద్ధరించుకోలేని
వాళ్ళంతా గుర్తొస్తారు. ప్రభుత్వాలు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చి, యెంత చేస్తే మాత్రం—లోపల అసలు చదువులమ్మ కొలువైలేకపోతే, ఏం లాభం!?! ఏమన్నా అంటే, బిగ్గరగా కేకలేసుకుంటూ తిరగడం- పేరు
చివర కులనామాలు పెట్టుకొని వూరేగడం! ఇక్కడ కూడా అదే చరిత్ర కదా అనుకుంటావ్.
ఇవాళ మళ్ళీ నిద్రపట్టక కిందికి దిగివచ్చావ్.
టీవీ ఆన్ చేయబోతే, కిచెన్ లో నేల మీద ఏదో కదిలిన
చప్పుడు. పాటియో వైపు పరీక్షగా చూశావ్. నాలుగైదు
కూరగాయల మొక్కల మధ్య అంత చీకట్లో కూడా రకూన్ స్పష్టంగా కనిపిస్తోంది. దాని తెలుపూ
నలుపూ చారల వొళ్ళు- అందులోనూ నీకు నలుపే
కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వొక సారి పొద్దున్నే నువ్వు కాఫీ కలుపుకుంటూ
వుంటే, పాటియో ఇనప తీగల కంచె మీద అది నింపాదిగా నిలబడి, నిన్నే తేరిపార చూస్తూ వుంది. నువ్వు గమనిస్తున్నావని తెలిసిందేమో, అది దాని నల్లనల్లని కళ్ళలోంచి చికిలించి చూసింది. ఆ చూపు ఆ క్షణంలో ఆ
నల్లబండ జాక్సన్ గాడి చూపులా అనిపించింది. అసహ్యంగా వుంది. జుగుప్సగా వుంది. దాన్ని
భరించడం కష్టంగా వుంది నీకు.
ఎక్కడ పడితే అక్కడ నల్లవాళ్లు, ఈ రకూన్ ముండలు! కొన్నిసార్లు బేస్మెంట్ లో కూడా ఈ రకూన్
ముండలు తిష్ట వేస్తూ వుంటాయని ఇరుగూ పొరుగూ అంటారు. వెంటనే కింద మొక్కలు
తీసేయించావు. అయినా సరే, పాటియోలో కాస్త అలికిడి అయినా రకూన్
వచ్చినట్టే అనిపిస్తుంది. ఇవాళ ఎందుకో భయమేసింది. వెంటనే పైకి వెళ్ళి, శాంతిని నిద్రలేపావ్.
శాంతి గభాల్న
లేచి, కిందకి వచ్చింది. ముందు తలుపు దగ్గిరా, పాటియోలో లైటు వేసింది. ఆ వెలుగులో కిటికీ రెక్క కొంచెం పైకి ఎత్తి, చూసింది. శాంతికి ఏమీ కనిపించలేదు. పైగా, ఇంటిముందే
స్ట్రీట్ లాంప్ వుంది కాబట్టి, బయట కొంచెం మంచు పొడిపొడిగా
రాలడం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. కిచెన్ లోకి వచ్చి, బయటి
లైట్ వేసి, పరీక్షగా చూసింది. అక్కడా ఏమీ లేదు.
“అసలేమీ లేదు. మీరు పైకివచ్చి పడుకోండి!” అని
విసుక్కుంటూ వెళ్లిపోయింది. కాసేపట్లో బయట చప్పుళ్ళు వినిపిస్తాయని చెవులు
రిక్కించి, లివింగ్ రూమ్ లోనే కూర్చున్నావ్.
3
ఇంకో రాత్రి. కొంచెం త్వరగా పడుకుందామని బెడ్
రూమ్ లోకి వెళ్తే, శాంతి ఏదో పుస్తకం
చదువుకుంటోంది. నిన్ను చూడగానే, టేబుల్ లైట్ ఆఫ్ చేసింది, ఇక పడుకుందాం అన్నట్టు-
కచ్చితంగా అప్పుడే గుర్తొచ్చింది, రాత్రి పదకొండు అయింది. శౌరి ఇంకా ఇంటికి రాలేదు. ఏ
నల్లవెధవతో ఎక్కడ తిరుగుతున్నాడో! నెమ్మదిగా లేచి, వాడి బెడ్
రూమ్ లోకి వెళ్లావ్. పుస్తకాలు, బట్టలూ, షూస్ అన్నీ ఎక్కడపడితే అక్కడ! “అసలు షూస్ బెడ్ రూమ్ లోకి ఎందుకు వస్తాయి
రా!” అని ఎన్నిసార్లు గద్దించావో లెక్కలేదు. “నువ్వసలు నా బెడ్ రూమ్ లోకి ఎందుకు
వచ్చావ్!?” అని కౌంటర్ వేశాడు వాడు. అట్లా ఎదురు ప్రశ్నలు
వేస్తూనే వుంటాడు. అది నీకు అసలు నచ్చదు. నీ తండ్రినే కాదు,
నీ పెద్దన్నని కూడా వొక్క ఎదురు మాట అనలేదు నువ్వు.
“ఈ నల్ల స్నేహాల వల్లనే వీడు ఇంత ధిక్కారంగా తయారయ్యాడు!” అంటావు శాంతితో. చాలా
సార్లు విని వూరుకుంటుంది శాంతి. చెప్పి లాభం లేదని తీర్మానించుకొని వుంటుంది. శాంతికి
చాలా విషయాలు పట్టవ్. అదేదో అంటారు కదా, లిబరల్! సిరి ఏమనుకుంటుందో తెలీదు కానీ, శౌరి స్పష్టంగానే అంటాడు “నీకు భయాలు ఎక్కువవుతున్నాయ్, నాన్నా!” అని-
ఏం తెలుసు వాడికి?! ఎన్ని
కష్టాలు గట్టెక్కి వస్తే ఈ అమెరికా జీవితం దక్కిందో! వాడికివన్నీ వడ్డించిన
విస్తరి కదా! అన్నీ వడ్డించినా, సరిగా తినడం చాతకాని తరం
ఇది.
“పిల్లాడి మీద మీరు అనవసరంగా కోపం
పెంచుకుంటున్నారు. అదొక దశ. కొన్నాళ్లు అట్లా వుంటారు. మనమంతా ఆ దశ నించే వచ్చాం!”
అంటుంది శాంతి.
“అన్నీటికీ అదే మంత్రం చదువుతావ్ నువ్వు! మనం
జాగ్రత్త పడకపోతే, ఆ రకూన్ ముండ తోటని నాశనం
చేసినట్టు, వాడూ కుటుంబాన్ని ముంచేస్తాడు! పైగా, వొక్కడే కొడుకు!” అంటావు నువ్వు. ఇది చాలా పెద్ద మాట. నీకు ఎట్లా
సర్దిచెప్పాలో తెలీక, పైకి వెళ్ళిపోయి,
టీవీ చూసుకుంటూ వుండిపోతుంది శాంతి. మళ్ళీ నువ్వూ నీ లివింగ్ రూమూ! శౌరి ఎప్పుడు
వస్తాడా అని ఎదురుచూపు. వాడు రాడు గాని, ఠంచన్ గా వచ్చి, పాటియోని కలియ తిరుగుతూ వుంది రకూన్.
4
నువ్వు తెలుగు టీవీ కోసం తెగవెతుక్కుంటూ వున్నావ్.
ముందు తలుపు తెరచుకుంది. శౌరి వచ్చాడు.
“ఇంకా పడుకోలేదా, నానా!?”
ఈ మధ్య నీకు సరిగా నిద్ర పట్టడం లేదని వాడికీ
తెలుసు. అయినా అడుగుతాడు. నీ సమాధానం వాడికి అక్కర్లేదు. నిజానికి ఎవరికీ నీ
ప్రశ్నలూ, సమాధానాలు అక్కర్లేదు.
వాడు షూ విప్పకుండానే మెట్లు ఎక్కుతున్నాడు తన
గదిలోకి వెళ్లడానికి-
“కనీసం షూ కింద పడేసి వెళ్లరా!” అన్నావు నువ్వు వాడివైపు చూడకుండానే, టీవీలో తెలుగు ఛానెల్స్ వెతుక్కుంటూ. ఈ వేళలో అదొక్కటే నీకు
రిలీఫ్. చెత్తో చెదారమో కనీసం తెలుగు ముఖాలు కనిపిస్తాయి ఆ స్క్రీన్ మీద అయినా-
ఇంతలో నువ్వు వూహించనిదేదో జరిగిపోయింది. పక్కకి
తిరిగి చూస్తే, సోఫాలో కూలబడి, షూస్
విప్పుకుంటున్నాడు శౌరి. టీవీలో వెతికి వెతికీ అలసిపోయి,
రిమోట్ పక్కన పడేశావ్. అదిగో అప్పుడు అన్నాడు శౌరి. “ఎందుకు నానా, ఆ ట్రాష్ చూస్తావ్ టీవీలో! హ్యాపీగా పడుకో!”
“హ్యాపీ—ఎక్కడి హ్యాపీ?!” అనబోయావ్. వాడితో ఏమీ అనకూడదని నీకు గుర్తొస్తుంది. ఏమన్నా
అరగంట పైనే ఆర్గుమెంట్ వుంటుంది.
అప్పుడే శాంతీ, సిరి
కిందికి దిగివచ్చారు. “ఏమ్మా! డిన్నర్ ఇవ్వనా?” అంది శాంతి.
వద్దని తలూపాడు శౌరి. ఎక్కడో బీఫో, పోర్కో లాగించేసి వుంటాడు ఈ పాటికి అని లోపల్లోపలే
అనుకున్నావ్. సిరి డిన్నర్ టేబుల్ మీద కూర్చొని లాప్ టాప్ తీసింది. శాంతి దాని
ఎదురుగా కూర్చొని, ఈ చలికాలం సెలవులకి ఏం చేద్దామా అని కబుర్లలో
పడింది.
అప్పుడే నీకు పాటియో అద్దం లోంచి మళ్ళీ రకూన్
కనిపించింది. వొక మొక్క మీంచి గభాల్న దూకి, పాటియో టేబుల్ మీద కూర్చొని, కిచెన్ లోకి తొంగి చూస్తూ వున్నట్టుంది. గబుక్కున లేచి, “ఒరే, కాస్త కిచెన్ వైపు పద!” అన్నావ్ శౌరి వైపు
చూస్తూ.
శౌరి లేచి తనతో పాటు కిచెన్ వైపు వచ్చాడు. శాంతి, సిరి కూడా వాళ్ళిద్దరి వెనకే
నడిచారు. అంతమందిని చూసి కూడా అసలేమాత్రం చెక్కుచెదరకుండా నిర్భయంగా నిల్చునే
వుంది రకూన్. వీటికి ధైర్యం ఎక్కువట. మనిషిని కూడా పీక్కు తినేసే దాని చూపు అంతమందిలోనూ
నిన్ను వణికించింది.
“ఆ పాటియో టేబుల్ మీద చూడు- రకూన్!”
“ఎక్కడ?!”
“సరిగా చూడరా!”
“ఎక్కడ నాన్నా?! అక్కడ
టేబుల్ మీద ప్లాంటర్. దాని పక్కన మొక్క నీడ తప్ప నాకేమీ కనిపించడం లేదు!”
నీ శరీరంలో సన్నటి వణుకు వాడికి కనిపిస్తూనే
వుండాలి. అయినా, వాడికి ఆ రకూన్ ముండ కనిపించడం లేదంటాడు
వాడు. ఆ విషయం అర్థమైనట్టుగా వాడే అన్నాడు మళ్ళీ.
“నీ భయం కనిపిస్తోంది కానీ, రకూన్ ఏమీ కనిపించడం
లేదు, నానా!”
ఈసారి కళ్ళు గుచ్చి మరీ పాటియోలోకి చూశావ్.
పాటియో టేబుల్ మీద ఎండిపోయిన ఆకుల మీద వెన్నెల మెరుస్తోంది. ప్లాంటర్ నీడతో సహా
కనిపిస్తోంది. కానీ, నీకు ఆ ప్లాంటర్ పక్కగా రకూన్
కనిపిస్తోందిగా!
“మళ్ళీ చూడండి!” అని శాంతి, సిరి ముఖాల్లోకి చూశావ్. వాళ్ళ ముఖాల్లో ఏ భావమూ లేదు.
నువ్వు చూస్తూ వుండగానే, పాటియో అద్దం తలుపు పక్కకి జరిపి,
బయటికి వెళ్లబోయాడు శౌరి. నువ్వు పెద్దగా కేకేశావ్.
“అరె, వద్దురా! అది పీక్కు తింటుంది!”
ఆ కేకకి వులిక్కి పడ్డారు శాంతి, సిరి.
పెద్దగా నవ్వి, శౌరి అద్దం
తలుపు పూర్తిగా జరిపి, పాటియో మీదకి వెళ్ళాడు. ఆ చలిలోనే అటూ
ఇటూ తిరిగాడు. మొబైల్లోంచి ఫ్లాష్ తీసి, ప్రతి మొక్కా చూపించాడు.
“ఎక్కడ, నానా?!
నువ్వూ వచ్చి చూడు!”
“నాకు కనిపిస్తోంది రా!”
“లేదు, నానా!” అని ఇంకోసారి ఫ్లాష్
చూపించి, ప్రతి మొక్కనీ తాకుతూ చూపించాడు. అంత చలిలో కూడా
అక్కడ మేరిగోల్డ్ పువ్వు నవ్వుతోంది మెరుస్తూ.
ఇంకో మూణ్ణాలుగు నిమిషాలు శౌరి అక్కడే
నిలబడ్డాడు. బయటికి వెళ్లడానికి నీ కళ్ళు వొప్పుకోవడం లేదు.
ఇంతకీ రకూన్ వుందా లేదా?! అన్న ప్రశ్న నీ మెదడు లోపల గింగిరాలు తిరుగుతోంది.
*
చిత్రం: చారి