తోడుకునేవాళ్లకి తోడుకున్నంత

--సిరాశ్రీ

కవిత్వం అంటే ఇది అని ఒక్క ముక్కలో నిర్వచనం చెప్పడం కష్టం. అలా నిర్వచనం అనే చట్రంలో ఇరికిస్తే కవిత్వం కొత్త పుంతలు తొక్కదు. ఎవరు వ్రాసినా ఆ చట్రంలో ఇమిడి రాయాల్సొస్తుంది. ఛందస్సు అనే చట్రం నుంచి బయటకు వచ్చి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నదే వచనకవిత్వం. "కాదేదీ కవితకనర్హం" అని కవితావస్తువుని ఎంచుకునే విషయంలో చెప్పాడు శ్రీశ్రీ. "కాదేదీ కవితాశైలికి అనర్హం.." అని ఆధునిక వచన కవులు ఎందరో చెబుతున్నారు. కొన్ని కవితలు నేరుగా గుండెలోకి దూసుకుపోతాయి. కొన్ని మెదడుతో చెడుగుడు ఆడతాయి. కొన్ని కవి ఏదో చెప్తున్నాడు అది అందుకోవాలి అనే ప్రయత్నాన్ని చేయిస్తాయి. అయితే పాఠకుడి మానసిక స్థితి, పఠనశక్తి, కవితాసక్తి అన్నీ పరిగణనలోకి వస్తాయిక్కడ.
ఈ మధ్యన "అఫ్సర్ కవిత్వం" చదువుతున్నాను. అవును ఇంకా ప్రెసెంట్ కంటిన్యువస్సే. ఏకంగా 660 పేజీల వచన కవిత్వం...అఫ్సర్ అనే కవితాకర్షకుడు నాలుగు దశాబ్దాల పాటు పండించిన పంట. పైన చెప్పినట్టు కొన్ని దూసుకుపోతున్నాయి, కొన్ని మెదడుకి పని పెడుతూ...ఈ కవి భావనాసముద్రపు లోతుల్ని చూసేలా స్కూబా డైవింగ్ చేయిస్తున్నాయి.
పుస్తకం అందుకున్నాక నోట్లు లెక్కపెట్టే టెల్లర్ మేషీన్ లాగ పేజీలని వేగంగా తిప్పి ఒక చోట ఆపాను. నా కంట పడిన పంక్తులు:
"నా కవిత్వపాదానికి విగ్రహం లేదు
నిగ్రహం లేదు
ఆగ్రహం తప్ప...
నా కవిత్వపాదానికి మరణం లేదు
జీవితం తప్ప...
మరణం కడుపులోంచి పుట్టిన యుద్ధం నా కవిత్వం
మరణించలేకపోవడమే కవిత్వం".
సూటిగా ఉన్న ఈ పంక్తులు చైతన్యాన్ని, స్ఫూర్తిని సూచిస్తున్నాయి. మళ్లీ పేజీలు సర్రున తిప్పి ఆపాను. ఇది కనపడింది:
"అందరూ మాట్లాడుతున్నారు
అయినా అందరూ మౌనాన్ని చర్చిస్తున్నారు.
అందరూ తగవులాడుతున్నారు
అయినా అందరూ నిశ్శబ్దాన్ని స్వప్నిస్తున్నారు.
నరనరాల్లో అనుక్షిపణులు తయారవుతున్నాయి
అయినా అందరూ శాంతిని ఘోషిస్తున్నారు"
వర్తమాన చింతన, అధిక్షేపం కలగలిసిన ఈ పంక్తులు ఒక తపస్వినుంచి రాలిపడ్డట్టు అనిపించింది.
ఇక పేజీలని ఒబ్బిడిగా తిప్పుతూ, తీరుబడిగా కూర్చుని చదవడం మొదలుపెట్టాను. ఇంకా కాస్త కాస్తగా చదువుతూనే ఉన్నాను.
ఒక చోట ప్రతి మానవుడికి ఎదురయ్యే నిజమైన మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది.
అఫ్సర్ మాటల్లో..
" హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే..
వెంటవచ్చిన విశ్వాసం నిర్దాక్షణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడు,
ఒక పరిచిత హస్తం
మృత్యు ఖడగంగా రూపెత్తినప్పుడూ
నిజంగా మరణం".
ఇలా వివరణ అవసరంలేని ఎన్నో కవితాపంక్తులు మనసుకి చలనం తీసుకొస్తాయి.
అలాగే ఒకటికి పదిసార్లు చదివించి, చదివిన ప్రతిసారి ఒక్కో సన్నివేశాన్ని ఊహించుకునేలాంటివీ ఉన్నాయిందులో ...
ఇదొక్కసారి చూడండి:
"పద్యం రాద్దామనుకున్నాను
...
ఎన్నో దారుల చీకట్లని తవ్వి తలకెత్తాను
ఎన్నో పరిమళాల మట్టి వాసనల్ని
తడిమి మొలకెత్తాను..
రాని వుత్తరాల నిరీక్షణోద్వేగాన్ని
గుండె మీద భారంగా ఒంపుకున్నాను
మాట మరచిన స్నేహితుడి
నిర్లక్ష్య నేత్రాన్ని ఒక్కసారి తలచుకున్నాను
సంకేత బిందువు దాటిన
ఆమె నిగ్రహాన్ని వూహించుకున్నాను
ఇక రాయడానికి అక్షరం మిగల్లేదు".
ఇక్కడ కవి చెప్పేది విషాదమా? విరహమా? ఆ రెండూ అయితే రాయడానికి అక్షరం మిగలకపోవడం ఏమిటి? ఆ రెండూ కవిత్వంలో పండిచడం తేలికే కదా అనుకున్నాను.
మళ్లీ చదివాను..ఈ సారి కవి చెప్తున్నది నిర్లిప్తత ఏమో అనిపించింది. అవును అది అయితేనే ఏమీ రాయబుద్ధికాదు. అందుకే ఆయనకి అక్షరాలు మిగల్లేదు.
అదీ..అలా ఉంటాయి అఫ్సర్ ప్రయోగాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.
ధారగా పడుతున్న వర్షం శబ్దం బాగుంటుంది. మధ్య మధ్యలో ఉరుములు వినిపిస్తుంటాయి. అఫ్సర్ కవిత్వమూ అంతే...ప్రతి కవిత ధారగా కురుస్తున్న వర్షం అయితే మధ్యలో ఇలాంటి ఉరుములు...మచ్చుకి ఈ రెండూ చూడండి:
"...వెళ్తున్నా నేను
శబ్దానికి
నిశ్శబ్దానికీ మధ్య
నిట్టూర్పుని వూది".
"తరగతి గదుల గోడల మధ్య
ఇంకిపోతున్న చరిత్ర కంఠశోష".
వీటికి వివరణలు అక్కర్లేదు. ఉరుముల్లాంటి ఈ పదాలు పాఠకుల మెదళ్లలో మెరుపులు మెరిపిస్తాయి.
అయితే ఇందులో కొన్ని వచనాలు మరీ భావగర్భితంగా ఉన్నవి ఉన్నాయి. ఏదో తగిలీ తగలనట్టు ఉంటూ రెండు మూడు సార్లు చదివినా లోతు అంతుబట్టదు. ఇలాంటి వాటి మీద బహుశా డాక్టరేట్ పరిశోధనలు జరగవచ్చు. . రక్తస్పర్శ, ఇవాళ, వలస, ఊరిచివర, ఇంటివైపు అనే నాలుగు సంపుటాల్ని "అఫ్సర్ కవిత్వం- అప్పటి నుంచి ఇప్పటి దాకా" అని ఒక కవితాగ్రంథంగా వచనాకవితాభిమానుల ముందుకొచ్చింది. తోడుకునేవాళ్లకి తోడుకున్నంత అన్నంత ఊటగా ఉంది. ఈదగలిగేవాళ్లకి ఈదగలిగినంత అన్నంత విస్తారంగా ఉంది. ఎమెస్కో, అన్వీక్షికి, అమెజాన్ లు ఈ పుస్తకాన్ని పాఠకలులకి అందజేస్తున్నాయి.
ముక్తాయింపుగా ఒక మాట-
ఆయనపేరు అఫ్సర్
ఆయన కవిత్వం అత్తర్
స్వస్తి.
*

అఫ్సర్‌లోని ప్రధాన సంఘర్షణ ఇదే

 -ఎం. నారాయణ శర్మ
బహుశ : ఒక పూర్తి కావ్యంగా కాక ఖండికలుగా వస్తున్నప్పటినుంచే వచన కవిత్వం, పద్య ఖండికల్లో అనేక పొరలు (Multi layer) కలగలిసి ఉంటాయి. సుస్పష్టమైన సామాజిక భూమికను పోషించడం తప్పనిసరైన సమయం కావడంవల్ల ఈ అంశం ప్రతి కవిత్వంలోనూ కనిపిస్తుంది. కాని వ్యక్తి ఆత్మ, కాలపు ఆత్మ ఈ రెండు కవిత్వంలో కవి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. అఫ్సర్ ‘ఇంటి వైపు’ చెబుతున్న ఒకనొక సామాజిక, సమకాలీన సందర్భం ఇదే. ప్రాథమికంగా ‘ఇంటివైపు’ అనే పదం లోపలికి వెళితే అందులోని కవిత్వ వాతావరణం, మార్దవమైన గొంతు, అందులో పలికే సంవేదన ఇవన్నీ ‘నాస్టాల్జియా’ (Nostalgia)గా కనిపిస్తాయి. ప్రాథమికంగా నాస్టాల్జియా ప్రదేశానికి సంబధించిందిగానే చెబుతారు. కాని భాషాపరంగా ఇంటికి ఊరికి వేర్వేరు అర్థాలున్నాయి. ఇంటికి ఉండే మత, కుల, ఆర్థిక, సాంస్కృతిక సంబంధమైన ఉనికి ఊరికి సంబంధించిన ఉనికి ఒకేలా ఉండదు. అందువల్ల . అఫ్సర్ కవిత్వంలో ఇంటికి ఇవన్నీ ఆపాదించుకోవాలి. ఈ కవిత్వంలో అఫ్సర్‌లోని ప్రధాన సంఘర్షణ ఇదే. సమకాలీన సమస్యలు. కోరికలు వగైరాలున్నా. ఇల్లును గురించిన అనేక ఆవేశాల సమాహారమే ఈ కవిత్వాన్ని చర్చకు పెడుతుంది.
Nostalgiadefined as sentimental longing for ones pastis a self-relevant, albeit deeply social, and an ambivalent, albeit more positive than negative, emotion. … Also, nostalgia- elicited meaning facilitates the pursuit of ones important goals
(నాస్టాల్జియా ; ఒక వ్యక్తికి సంబంధించిన భావగర్భితమైన భ్రాంతి, కోరికగా, ఆత్మ సంబంధమైందిగా నిర్వచింపబడింది. అయినప్పటికీ లోతుగా అనేక విషయాలతో కలగలిసిపోయింది. అనిశ్చయమూ, ద్వంద్వ ప్రవృత్తిగలిగినది అయినప్పటికి ఎక్కువగా నిశ్చయమైనది. కొంత అనిశ్చయం, ఉద్వేగం కూడా. నోస్టాలిజియా ఒకరి ముఖ్యమైన లక్ష్యాలు వెంబడించడాన్ని సులభంగా వ్యక్తం చేస్తుంది.)
ఈ నిర్వచనం అఫ్సర్ కవిత్వానికి సరిపోతుంది. అఫ్సర్ రాసిన అంశాలల్లో ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అనేక సాంఘిక, రాజకీయ సంఘర్షణలకు మూలం కూడా. ముఖ్యంగా కొన్ని బహిష్కరణల గురించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అందువల్ల అఫ్సర్ కవిత్వంలోని ఇంటివైపులో ఈ సంఘర్షణలున్నాయి. జ్వాన్ జెల్మన్ (Juan Gelman) కవిత్వంలో ఇలాంటి భావనలు కనిపిస్తాయి. జెల్మన్ కవిత్వంలో ‘ప్రవాసంలో ఉన్న జ్ఞాపకాలు కేవలం విషాద భరితమైనవో, కోరికలో కావు. సమస్యాత్మకమైన ప్రగతి, ఆధునీకరణపై పోరాటం, సమాజం నుండి బహిష్కరింపబడిన సభ్యుడిగా తనను తాను మళ్ళీ సమాజంలో భాగంగా సృష్టించుకునే ప్రయత్నం. అందువల్ల ఈ కవిత్వ(జెల్మన్ కవిత్వ)అధ్యయనం అత్యంత వ్యక్తిగతమైందిగా(highly personal) అంతర్గతవ్యక్తిత్వానికి (Communal) లేదా మత సంబంధమైన ఆత్మల ప్రతిప్సందనగా గమనించాలి’ అని విమర్శకులు భావించారు. అఫ్సర్‌లోనూ ఈ మూలాలున్నాయి
1. అయినా /నా దేశభక్తిని నువ్వు నీద్వేషంతో కొలుస్తావ్/నువ్వు ద్వేషిస్తూనే వుంటావ్/నన్ను ప్రేమిస్తూ ఉండమని చెప్పి/నా చుట్టూ గాలినిఖైదు చేస్తావ్/అప్పటికీ/నేను ప్రేమిస్తూనే వుంటాను/నీ చేతులు ఖడ్గాలై నన్ను ఖండఖండాలు చేస్తున్నా సరే’ -(యింకో ద్వేష భక్తి గీతం.పే.227)
2. నా పేరు చివర మహమ్మదో అహమ్మదుషెకో/సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా/కాగితం తుపాకీని చూసినా /మూర్చపోయే అమాయకుణ్ణిరా/నమ్మరా నన్ను నమ్మరా’ (నా పేరు-పే.151)
3. వాళ్ళెవరో యేమిటో యిప్పుడేమీ గుర్తులేదు నాకు. నామీది యెర్ర మరకల్లాగే వాళ్ళూ నెమ్మదిగా చెరిగిపోతున్నారు. పేర్లూ, ఊళ్ళూ దేశాలూ మరచిపోతున్నాను కాని, నన్ను హత్తుకున్న ఆ వొంటి వెచ్చదనం యిప్పుడూ అంటుకుని ఉంది. అప్పుడప్పుడూ అది కార్చిచ్చులా అంటుకుంటు వుంది -(నెత్తుటి చొక్కా స్వగతం)
4. నేనిలాగే యీ మంచాన్ని అంటి పెట్టుకొని ఉంటాను. జ్వరమేదో నన్ను పొయ్యి మీది రొట్టెలా కాల్చేస్తోందని వొంటి పొరలన్నీ వెతుక్కుంటూ వుంటాను. ఆ సెగని… కాల్చేస్తే కాల్చెయ్యనీ-అని అలా దగ్గిరగా తీసుకుంటూనే ఉంటాను. ఇష్ట ప్రాణంగా-(చెమ్మదీపం.పే.81)
ఇలాంటి వాక్యాలను గమనించినప్పుడు స్పష్టాస్పష్టంగా అఫ్సర్ రాజకీయాల గురించి ముఖ్యంగా మతరాజకీయాల గురించే మాటలాడుతున్నాడని అర్థమవుతుంది. ఇలాంటి వాక్యాలన్నిటిని అది నియంతృత్వ నాస్టాల్జియా (paradictatorial nostalgia) గా పరిశీలకులు భావించారు.‘the poetry of this study is both a highly personal (individual) and intra-personal (communal) response to a present trauma, (ఈ కవితాధ్యయనం రెండు అంశాలతో కూడింది. వర్తమాన గాయాల నుంచి వ్యక్తిగతం, మత సంబంధమైన ప్రతిస్పందన) జెల్మన్‌కు అఫ్సర్‌కు సారూప్యత కనిపించేది ఇక్కడే. అఫ్సర్ కూడా వర్తమాన పరిస్థితుల నుంచి తన వ్యక్తిగత జీవితం వైపుకు వెళ్లి మాట్లాడుతున్నారు. వర్తమానం బలంగా గతానికి ముఖ్యంగా అందులోని సంఘర్షణకు తీసుకు వెళుతుంది. అందువల్ల ఎక్కువ నాస్టాల్జియాగా, ఇంకొంత మత సంబంధమైనదిగా ఈ కవిత కనిపిస్తుంది. శైలి గతంగా అఫ్సర్‌లో సున్నితత్వం ఉంటుంది, గొంతుక దుఃఖంగా ధ్వనిస్తుంది. ధిక్కారమో మరొకటో కనిపిస్తే ఈ కవిత్వం అస్తిత్వ దృష్టితో రాసిందిగా కనిపించేది. కాని సున్నితమైన సంవేదనాత్మక కథనం వల్ల ఇది మరోలా కనిపిస్తుంది అన్ని చోట్లా సుమారుగా ఈ సంవేదన కనిపిస్తుంది. మానసికమైన చింతన కనిపిస్తుంది. కాని వ్యక్తిగతమైన చింతన వల్ల తాత్త్వికమైన జీవితం ధ్వనిస్తుంది. పై భావాంశాలల్లో మొదటి రెండు ప్రత్యక్షంగా మతం గురించి, ఆయా సంఘర్షణల గురించి మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.
వీటిలో వర్తమాన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. మూడు నాలుగుల్లో ఇలాంటి గతం కార్చిచ్చులా అంటుకుని పీడించటం కనిపిస్తుంది. ‘వొంటి పొరలు’ గత జీవితంలోని అనేక సన్నివేశాలను సంకేతిస్తాయి. ‘జ్వరం’ పట్టి పీడిస్తున్న బాధను సంకేతిస్తుంది. మూడులో తాను దేనికి దూరంగా పోయాడో. ఏ ముద్రను తప్పించుకునేందుకు, ఎన్ని మరచిపోయాడో కాని అవన్నీ మరచినా ఆ ఉనికిలోని వెచ్చదనం తనను వెంటాడడం వల్ల మనిషిగా ఎటు నిలబడుతున్నాడని చెప్పడం కనిపిస్తుంది. అఫ్సర్‌లోని నాస్టాల్జియా కేవలం జ్ఞాపకాన్ని ఆనుకుని ఉన్నదికాదు. ఆ జ్ఞాపకాల తాలూకు దుఃఖాన్ని విషాదాన్ని మోస్తున్నది కూడా. అందువల్లే కొంత చిటపటగా ఉండడం, వ్యాకూలంగా ఉండడం, మొరటుగా మాట్లాడడం నిరాశగా మాట్లాడడం కనిపిస్తాయి. ఈ నిరాశలోంచి తాత్త్వికంగా కనిపించడమూ ఇలాంటిదే. కవిత్వం దానికి ఆకారమైన భౌతిక జీవితం, దాని సమస్యలు వాటి వెనుక సంవేదన అవి కవిత్వమౌతున్న తీరు మీద జరగాల్సినంత చర్చ జరుగలేదు. ఇంటివైపులో జీవితం, దానిని అనుకున్న సమస్యలు, వాటిని వ్యక్తం చేసేందుకు ఎన్నుకున్న మార్గం అన్నీ స్పష్టం. అయితే వచనంలోని నిస్పృహ వల్ల తాత్వికంగా పరిమళించడం కనిపిస్తుంది. ఇది ఎంతవరకంటే కొన్ని సార్లు ఈ వ్యాకూలతకు నిస్పృహకు కారణమైన జీవితాన్ని అస్పష్టం చేసేదాక కూడా.
1. యింకా కొంత అలవాటుపడని రహస్యమో/నిన్నొక మిస్టరీ వరదగుడి చేసేదేదో ఉంది నీలో//తోవ పొడవునా తవ్వుకుంటూనే ఉంటావే/యింకా బయట పడని నిక్షిప్తత ఎదో తవ్వుతూనే ఉంది నిన్ను//ఒకే ఒక్క చిన్న అనుమానమై /నిన్ను నువ్వుపగలగొట్టుకుంటూ వుంటావ్, పగలూ రాత్రీ’
2.పెద్దపెద్ద సముద్రాల్ని మరీ చిన్న చిన్న పడవల్తో తోడేద్దామని అనుకుంటావే గానీ/నీ పడవనే వంచించిచే నీటి చుక్కలు ఉంటాయని/మరచిపోతావ్ యెప్పుడూ-/యెప్పటికప్పుడు మునిగిపోవడమే/తిరగదోడుకునే బతుకు పాఠమైనప్పుడు/యే అనుభవన్నీ నువ్వు ప్రేమించలేవు/యే క్షణంలో నైనా తలమునకలై బతకలేవు’
3.అయినా సరే/కింద ఏ మాత్రం నిలబడనివ్వని నేల మీదికి కాళ్ళని దూస్తూ వుంటావ్/ఎప్పుడూ వోడిపోయే యుద్దానికి-(అలవాటు పడని తనమేదో.పే.244/245)
ఒక మెలాంకలిక్ భావన, సాంద్రమైన తలపోత, తనలో తాను మాట్లాడుకున్నట్టుగా ఉండే కథనం ఇవన్నీ కవితను మలిచాయి. ఇదంతా అఫ్సర్‌లోని విశ్వమానవుడికి, అస్తిత్వ మానవుడికి మధ్య సంఘర్షణ. ఇందులో అంసాన్ని చెప్పేవి. ‘మిస్టరీ వరద గుడిని చేసేది ‘అంటే దుఃఖమయంగా చేసేది. గతం. దొవ పొడగునా దాన్ని తవ్వుకుంటూ పోతూనే ఉంటుంది. కాని నిక్షిప్తమైందేదో అంతు చిక్కదు (బహుశః చిక్కిన అంగీరించే స్థితి లేదు). సముద్రాలు సమస్యకు కారణమైన విషయం. దాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నాలను సంకేతించేవి పడవలు. రెండవ వాక్యంలో వచ్చే పడవ‘నీ పడవనే వంచిచే’ లో ఉన్న పడవ సంకేతించేది జీవితాన్ని.’ఎప్పటికప్పుడు తిగ దోడడమే బతుకు పాఠమవడం‘వర్తమాన సంఘర్షణ.‘నిలబడనివ్వని నేల‘మళ్ళీ భౌతిక ప్రపంచం.
ఇలా ఒక సంఘర్షణ కవితగా మారే సమయంలో చాలా అంశాలు ప్రతీకలుగా, వాక్యాలుగా నిలబడతాయి. అయా వాక్యాలు చెప్పే సారం నుంచే తప్ప,గతంలోని అధ్యయనానికి లోబడి ఆయా స్వాభావాలనుంచి కవితను వ్యాఖ్యానించడానికి వీలవని సృజన ఇది. ప్రతీకలు ఎప్పటికప్పుడు కొత్త స్వభావాన్నికప్పుకోవడం ఇక్కడ కనిఒఇంచే అంశం. అఫ్సర్‌లో వాక్యాలు ప్రకటనాత్మకంగా కదులుతాయి. వాక్యానికి కొన్ని సార్లు భౌతిక, కొన్ని సార్లు కళ,కొన్ని సార్లు ప్రకటనాత్మక ప్రవర్తనలుంటాయి. ఎప్పటికప్పుడు వాక్యం యొక్క స్వభావాన్ని అవి చెబుతుంటాయి. మొత్తంగా ఈ కవిత భారమైన రాజకీయంగా ఎదుర్కొంటున్న జీవితాన్ని స్పష్టంగా వ్యాఖ్యానిస్తుంది. కొంత అస్పష్టంగా కవిత్వీకరిస్తుంది. జీవితం కవిత్వమౌతున్న తీరుపై ఇంకా విశ్లేషణలు జరిగితే ఈ ప్రకటనలోని విషయాలు బాగా అర్థమౌతాయి.

Category: 0 comments
Web Statistics