రెండు చేతులా పిలిచే జీవితం: అఫ్సర్ 'ఇంటివైపు'



"యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో
అల లోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే, తేలిపో” (178, ఇంటివైపు)
ఎవరైనా ఓ కవి ‘అల లోపలి సంతోషపు కడలి’ గురించి ఆలోచిస్తున్నాడంటే అతను కచ్చితంగా అఫ్సరే అయ్యుండాలి. కవిత్వాన్ని తనలో నిరంతర ప్రవాహంగా చేసికుని, తనలోని ఖాళీని కవిత్వం ద్వారానే నింపుకుని ఐదు సంపుటాల ఎత్తు కెదిగిన విలక్షణ కవి, కధారచయిత, అనువాదకుడు, విమర్శకుడు అయిన అఫ్సర్ గురించి సాహితీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాటి విషయాన్నైనా ఒక ప్రత్యేక దృక్కోణం నుంచీ చూడగల, ప్రత్యేక భాషలో సరళంగా వ్యక్తీకరించగల సున్నితమైన ‘సంక్లిష్ట’ కవి శ్రీ అఫ్సర్.
బాల్యం నుంచీ సాహిత్యం పట్ల మక్కువ, భాష పట్ల ప్రేమ పెంచుకుని అనేక కవితా మూర్తుల బలాన్ని, ప్రేమను తనలో నింపుకున్న ఈ కవితా కౌముది ప్రారంభ కవిత్వం అందరి కవుల్లా విప్లవ స్ఫూర్తి ఛాయలను నింపుకున్నా రాను రాను తన విలక్షణ ముద్రను, భాషను, భావాల్ని పొదువుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎప్పటికప్పుడు ‘ఫలానా’ ముద్రల్ని ధ్వంసం చేసికుంటూ (చూ. అఫ్సర్ తో ఇంటర్వ్యూ ) తన కవిత్వం లోని శక్తిని మరింత ద్విగుణీకృతం చేసికుంటున్న ఇంద్రజాలికుడు అఫ్సర్. ‘రక్తస్పర్శ’ నుంచీ ‘ఇంటివైపు’ దాకా ఎన్నో ముద్రలు, ఎన్నో చిరునామాలు – వీటన్నిటిలోనూ ఎన్నో చుట్టరికాలు. పాత్రికేయుడిగా, కవిగా,కధకుడిగా, అధ్యాపకుడిగా అనేక దశలలో గృహోన్ముఖీనత లోని తీవ్రతను అనుభవించి పలవరించిన దశలో రూపుదిద్దుకున్న కావ్యంగా ‘ఇంటివైపు’ ను గురించి చెప్తాడు అఫ్సర్.
ఇంటివైపు చేసే ప్రయాణమెప్పుడూ తీయనిదే. ఉద్వేగపూరితమైనదే. పరాయి ఆకాశపు దుప్పటి కింద నిద్ర యెంత దుఃఖభరమైనదో,  వేదనాభరితమైనదో, ఇంటివైపు మళ్లే ప్రయాణం ఎంత మధురమైనదో, ఎన్ని కలలను, వుద్వేగ భరిత క్షణాలను పొదువుకుని వస్తుందో చెప్పనక్కరలేదు.
          ‘రేగిపళ్ళ వాసనలోకి’  ‘దూరాల కంటే కదా!’ ‘ఎటో చెదిరిన పడవై’ అనే మూడు భాగాలుగా అమరిన యీ ‘ఇంటివైపు’ కల ఎన్నో బాధా తప్త క్షణాల్ని, బుడగల్లా చిట్లిపోతున్న క్షణికానందాల్ని, సామాజిక సన్నివేశాల్ని, వైయక్తిక అనుభవాల్ని ఒకచోటకు చేర్చి మనసుకు చుట్టుకుపోయే గాఢమైన కవిత్వంలో అందిస్తాడు అఫ్సర్. వ్యక్తిగతమైన సామాజికమైన విషయాలనుంచీ చారిత్రక రాజకీయ సత్యాలను, హింసలను, అణచివేయడాలను అదే లోతైన నిశ్శబ్దపు నది గొంతుకలో చెప్తాడు.  అందుకే ‘ఇంటివైపు’ కవిత్వమంతా ఆత్మ ఘర్షణ, ఆత్మ వేదనా ఘోషై వినవస్తుంది.
          శివారెడ్డి తన ముందుమాటలో చెప్పినట్లు అఫ్సర్ కవిత్వం మొత్తం “Survival of feeling self” గురించే మాట్లాడుతుంది.
          ప్రపంచీకరణ నేపధ్యంలో ఎవరు ఎక్కడైనా వుండచ్చేమోకాని మనసున్న కవికి మాత్రం ప్రతిరోజూ తన ఆత్మ తన వూరిని తన దేశానికి ప్రయాణించి తన వాళ్ళను పలకరించి తిరిగొస్తూనేవుంటాడు.  ఈ అనుక్షణిక ప్రయాణం లో ఎన్నో వేదనలు, పలకరింతలు, పలవరింతలు, తీరని దిగుళ్ళు, గుబుళ్ళు ఎన్నో ‘వుద్వేగాల తొలి ఆనవాళ్ళు’(43)
          తన వూపిరినంతా కూడగట్టుకొని తన ‘ఇంటివైపు’ ప్రయాణం గురించి ఇలా చెప్తాడు.
                   యేమేం తీసుకెళ్తాను ఇంటికి,
                   నా ఊరికి
                   ఆ తొలి రక్తపు సెలయేటికి?!
తనదైన భాష, వ్యక్తీకరణ లతో చాలా తాత్వికం గా, కొత్త తనం తో చెప్తూ మనల్ని తీసుకెళ్తాడు-
‘అవున్నిజంగానే వెళ్తాను నాలోకి /ఆ చిన్న పంటపొలం లో రాలిపడిన /రేగుపళ్ళ వాసనలోకి!’  (45) ఇంత Homesickness లోనూ ‘లోకపు కొలమానాల కానుకల్ని’ అర్దాలు మారిపోయిన విలువల్ని యీసడించు కోవటం మరచిపోడు. ‘నీది కాని వాన’ కవిత పరాయికరించబడిన తన వేదననూ చాలా గాఢమైనదిగా తెలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  తనకే తెలియకుండా పరిగెత్తిస్తున్న తన ప్రపంచం లోకి ఆ వాన ప్రయాణం చూడండి-
                   “తెల్లారు జాము వానలో తడుస్తూ
                   ఇల్లు వూరు వదలి
                  పరిగెత్తుతూ వెళ్తాను, ప్రపంచం వేపు
                   నన్నలా పరిగెట్టించే ఈ ప్రపంచం లో
                   అసలేమైనా వుందో లేదో!
                   ......
                   నా కోసం కురవని ఆ వానలోకి
                   తీక్షణంగా చూసే శక్తి కూడా నాకు వుండదు
                   ఆ మాటకొస్తే, యెన్నో చినుకులు కలిస్తే
                   వాన అవుతుందో కూడా తెలీదు యీ ‘పరాయి’ క్షణం లో    (Quotes mine,47)
చాలా మందికి వాన ప్రతిసారీ ఒక క్రొత్త అనుభవం. ఒక ఆనంద పరవశం. వాన ఎక్కడైనా వానే. వానలో ఇష్టంగా గడపటం కరిగిపోవడమే. ఇష్టం లేనపుడే వాన మనల్ని బాధగా తడుపుతుంది. చికాకుపెడుతుంది. అదిగో అలాగే ఇక్కడ ఈ వాన ఒక బాధాకరమైన తాత్వికతను ప్రేరేపిస్తోంది. కవి అంతరాంతరాలలో పొరపొరగా పేరుకుపోయిన బాధను వెలికి తీస్తోంది. చాలా సరళమైన భాషలో చెప్పినా అఫ్సర్ కవిత్వం ఆవలి తీరాల నుంచీ దిగాలుగా ‘తనదికాని’ వానలో తడుస్తూ, చేజారి పోతున్న అద్భుత క్షణాల్ని అందుకోలేక నిరాశగా చూస్తున్న ఓ బాటసారి కలలను, సంక్లిష్ట క్షణాల్ని మనకందిస్తుంది.
          ఇలాగే ఇలాటిమరో వాన కవిత ‘అన్నీ తెలిసిన వాన’ . ‘ ఎపుడు/ఎలా కురవాలో/తెలుసు వానకి’-అంటూ మొదలై తన మనసులోని నిశ్శబ్ద సత్యాలు చెప్పేస్తాడు ఈ పంక్తుల్లో:
‘అయినా/వొక ఊరో ఇంకొక వూరు ఎప్పుడూ కాదు/ ...
ఆకాశం ఆకాశం కాదు
నేలా మనుషులూ అరుగులూ వాకిళ్ళూ
ఇవేవీ అవి కాదు –
ఏ ఊరూ యింకో వూరు కాదు
అపుడపుడూ ‘వెనక్కి చూడు’
‘దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను’ – (bold letters mine,148) అని మౌనంగా అంతరాంతరాలలో కవి మనసులో కురుస్తున్న దిగులును వెలికి తీస్తుంది. ‘అవీ – ఇవీ’ లలో ‘వొక – యింకొక’ లలో ‘దాటుకొచ్చీ’ , ‘వెనక్కు తిరిగిచూడాల్సిన’ దాగిన అవసరాలను చెప్పిపోతుంది.
ఇలాటి భావననే గమ్మత్తుగా ‘ఓ పొద్దుటి రైలు’ కవిత కూడా చెప్తూనే చివరలో హటాత్తుగా –
‘అన్నీ దాటుకు వచ్చామనుకున్నప్పుడు/అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్ళలేమని/రైలు పాడుకుంటూ వెళ్ళిపోయింది/కూతవేటు దూరంలో’(190) తన సహజమైన సూఫీ తాత్వికతను జోడించి మరీ చెప్తాడు. ఇక్కడ నిరాశ లేదు.  జ్ఞాన సమృద్ధుడైన ఓ తాత్వికుడే కన్పిస్తాడు.
          తనను ‘ చుట్టు ముట్టిన ఈ తెలియని ముఖాల /తెలియని చెట్ల / తెలియని ఆకాశాల, తెలియని గాలుల,/కనిపించని కన్నీళ్ళ ‘ (56) సమూహాల గురించి ‘రాలి పడిన ఆకుల చిందరవందరలో / వాటిల్లో దాక్కున్న ప్రాణాల కొసల్లో/ఏదో వెతుక్కుంటూ ...’ దాటుకొచ్చిన ఊరూ ఏరూ గురించి , ఇల్లూ, వాడా గురించీ , తన ఒంటరితనపు బెంగ గురించీ పదే పదే పలవరిస్తూనే ఉంటాడు. ‘ఎక్కడికని ఎంత దూరమో వెళ్ళనుగానీ / వెళ్ళిన దారంతా బెంగ పడిన పక్షిలా మెలికలు తిరుగుతోంది.’(63) ఈ సంపుటి ఎన్నో అందమైన క్షణాల్ని , పరవశాల్ని ప్రేమ రాగాల్ని చెప్తున్నా సరే అంతర్లీనంగా ప్రవహించే రక్తం లాంటి దిగులు ప్రస్ఫుట మౌతూనే ఉంటుంది. తన లోపలితనం లోకి ప్రయాణిస్తున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని విధ్వంసాన్ని జయించాల్సిన స్థితిని కరుణతో తాకాలనుకున్నప్పుడు అఫ్సర్ శ్రీ వాడ్రేవు చెప్పినట్లుగా ‘ఈ కాలపు సూఫీ’ నే అవుతాడు.
          ఈ ‘ఇంటివైపు’ మార్గం లో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యక్తులతో గడిపిన సందర్భాలున్నై. కోల్పోయిన పసితనాన్ని పొందలేని, పొదువుకోలేని ఆక్రోశాలున్నై. గానామృతాన్ని సేవించిన మత్తులో పాడిన పాటలున్నై.ఇంతకుముందే అనుకున్నట్లు తాత్విక సంవేదనలున్నై. కృతజ్ఞతా ప్రవాహాలున్నై. నిశ్సబ్దంగా తనతోనే నడిచే నిస్ప్రుహలున్నై.      వేటినైనా లలితమైన కవిత్వంగా మార్చగల ప్రతిభ గల ఇంద్రజాలికుడు కాబట్టి అన్నిటినీ అంత అందం గానూ మార్చేస్తాడీ కవి. మరచిపోలేని పసితనాన్ని గురించి చెప్పినా (50) గాలి మోసుకెళ్ళే పాత గురించి చెప్పినా (51) అదే ఒరవడి, అదే సాంద్రత, అదే నిండైన భావన. ఈ వాక్యాల్ని చూడండి:
          ‘ ఈ రెండు చేతులే/గాల్లో ఎగిరితే పక్షులు/నెలన వాలితే రెండు నదులు/రెండిటి మధ్యా గుడి కడితే ఇంద్రచాపాలు’ – ఎంత అందమైన భావన!
అలాగే పసితనాన్ని తాకలేని (మ)/తన దయనీయ స్థితి గూర్చి ఎలా విలవిల్లాడుతాడో ‘తాలియా’, ‘ఆ చిన్ని పాదాలు’ కవితలు చూడండి.

‘ఇప్పటికిప్పుడు/వొక్కటి మాత్రం అర్ధమై పోయింది/నీ దరిదాపులకి ఎన్నటికీ రాలేను,/నన్ను నేనే ఆసాంతం చెరిపేసు కుంటే తప్ప’- ఎంత క్లిష్ట పరిస్థితి గురించి తన బాధను వ్యక్తీకరిస్తున్నాడో చూడండి.
అలాగే ఈ సంపుటిలో సంఘ ద్వేషానికి బలైన వ్యక్తులపట్ల జాతులపట్ల సహానుభూతితో పాటు ధర్మాగ్రహాలున్నై. తన బాధా తప్త హృదయపు ఆక్రోశాన్నేలా చెప్తాడో చూడండి: ‘నేను/యిపుడు విడిచివేయబడ్డ వొట్టి వస్త్రాన్నే/నిజమే కానీ,/ నన్ను హత్తుకుని/తెగిపడిన ప్రాణాల చివరి కేకలు వింటున్నావా నువ్వు’
          కవి కేవలం అంతర్గత స్వరాన్ని వినిపించడమే కాకుండా సామాజిక స్వరం కూడా అయినప్పుడే పరిపూర్ణుడౌతాడు. ప్రపంచపు రాజకీయ రహస్యాల్ని బట్ట బయలు చేసేందుకు చాలా ధైర్యమే కావాలి. అనేక దేశాల్లోని కవుల, రచయితల రచనల్ని పరిశీలిస్తే ఆ యా రచనలు చేసే నిశ్శబ్ద యుద్ధపు ప్రకటనలు, వాస్తవ నిరంకుశ పరిస్థితులను కళ్ళ ఎదుట నిలిపే రహస్య సమాధానాలు, సందేశాలు తేటతెల్లమౌతాయి. అలాటి విప్లవాత్మకమైన , బాధ్యతాయుతమైన గొంతుక కూడా ఈ సంపుటి మనకు వినిపిస్తుంది.
‘ నాకు ఏ దేహమైనా /అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది ఎప్పుడూ
ఏ దేశమైనా/ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగానే కనిపిస్తుంది ఎప్పుడూ
యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ /అక్కడ ఆ గరీబు వొంట్లోనూ
వొకే ఆకలి కేక/వొకే వెతుకులాట’ ఆకలి మీద, అన్నార్తుల మీద అనేక రకాలుగా ముసుగుల్లో జరుగుతున్న కుట్రను ఎలా నిలదీస్తాడో చూడండి.
          ఒక మహా వృక్షం మొలకెత్తినప్పటి నుంచీ అనేకవేల కోట్ల చినుకులను తాగి, మరిన్ని వేల కోట్ల పవనమాలికలను ఆవాహన చేసుకుని కూడా తనదైన రూపుతో రంగు రుచి వాసనతో వటవృక్షంగా మారినట్లుగా ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు మహాకవులను పరకాయప్రవేశం చేసి అనేక కవితాజ్యోతుల దీపఛాయలను సొంతం చేసుకుని తనదైన తేజోకవిత్వాన్ని పంచగల అఫ్సర్ కవిత్వం ఈ సంపుటిలో ఆసాంతం ఆసక్తికరంగా ఓ ఇతిహాస గాధలోని సంభాషణల్లా సాగుతుంది. అక్కడక్కడా ఆంగ్ల పద ప్రయోగ సంవిధానంతో ఒకింత ఆశ్చర్య పరిచినా ప్రస్తుత కాలాన్ని అద్దం పడుతుంది. నిరంతర మానవ జీవిత సంఘర్షణ ను వినిపించే ప్రతిపాటా ఎప్పటికీ వెలుగుతూ మార్గదర్శకకమౌతూనే  ఉంటుంది కదా. ఈ కావ్యమూ అంతే.
                                                                             డా.విజయ్ కోగంటి,
08801823244

0 comments:

Web Statistics