నిర్వాణం




1
మెతుకు మెతుకూ పట్టి,
జీవితాన్ని వెతుక్కుంటాను కాబట్టి
నేనెప్పుడూ వొకే భాష మాట్లాడ్తాను.
ఇన్ని కన్నీళ్ళ గాట్లూ చీకట్ల ఆటుపోట్లూ
ఆ వొక్క మెతుకులోనే జీర్ణించుకుపోయాయి కాబట్టి
నేనెప్పుడూ
నిన్ను అన్నమ్మెతుకుల నిలువెత్తు అద్దంలోనే దాచుకుంటాను.

ఇంకో వేరే యే అద్దంలోనూ  నువ్వే కాదు, ఇంకెవరూ దొరకరు
ఇంత కచ్చితంగా, స్ఫుటంగా, పటం కట్టినట్టుగా-

2
నేనెప్పుడో ఎంగిలిపడి పోయాను కాబట్టి
యిప్పుడే వండినంత వేడిగా మెరుస్తూ కనిపించలేను
నా వొంటికేదో పచ్చడి ఎరుపో పెరుగు మెరుపో అంటుకునే వుంటుంది.

వొక్క అన్నమ్మెతుకునే కదా,
నీలోపల ఉరకలెత్తుతూ వుప్పొంగి వచ్చే ఆకలి కెరటాల్ని
నేనేమీ అడ్డుకోలేను నిజమే,
కాని, యీ అరక్షణంలో పరవశమై  వెలిగిపోతాను నీ కళ్ళలో-
నీ వూపిరి కొన మీద ఎగరేస్తానొక వెచ్చని జెండా-

వొక్క మెతుకే కదా అనుకోకు
నా లోపల యేమున్నాయో నీకు తెలుసు,
నేను లేని లోకంలో యేమేం లేవో కూడా నీకు తెలుసు-

3
అన్నమ్ముద్ద వొక్కటే నా కలల్లోకి వచ్చి వెళ్తూ వుంటుంది
నీ ప్రేమలో
నీ నవ్వులో
నీ కన్నీళ్ళలో
నీ నిట్టూర్పులో
వాయిదా పడుతూనే వున్న అనేకానేక ఆనందాల్లో
నేనెప్పుడూ పోగొట్టుకునేది ఆ అన్నమ్ముద్ద వొక్కటే-

నేను నిలకడయ్యే నా తీర్థయాత్రలూ
నన్ను కొట్టుకెళ్ళి ఎక్కడో విస్సిరి కొట్టే రాగద్వేషాలూ అన్నీ
అక్కడే మొదలూ అక్కడే ముగింపూ-

4
అవున్నేను
ఆకలికే పుట్టాను
ఆకల్తోనే ఏ క్షణమైనా రాలిపోతాను
జన్మల్ని నమ్ముతానో లేదో కాని
యింకో పది జన్మల్లో కనీసం ఎంగిలి మెతుకై పుట్టుకొస్తా,
పస్తు పడుకునే యే కడుపులోనో
 హాయిగా సమాధి అయిపోడానికి!
*




Web Statistics