వణుకుతూ ప్రవహించే గొంతు నీది; జ్వరపడిన పిల్లాడిలాగా
దుప్పట్లో మునగదీసుకునే కలత నది.
కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో
తటిల్లున మెరిసే మెరుపు నువ్వు; దిగులు పడిన గోదారయి,
మౌనంలోకి ముడుచుకుపోయే ఆమెలాగా.
చిదిమిపోతూ నీటి బుగ్గ గొంతులో చివరి సారి
తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో.
2
వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెను వాన
కురుస్తూ వుంది రాత్రి వెలుగుని తోడు పెట్టుకొని
పగలు చీకటిని కడుపులో దాచుకొని,
బండ రాళ్ళ నగరం వొంటి మీద.
3
రాయడానికేమీ లేదు,గుండె కూని రాగం ఆగేంత వరకూ.
భయమో ఏమో తెలియని రైలు దూసుకుపోతున్నట్టే, సొరంగంలోంచి.
4
ప్రాణం వుగ్గబట్టుకున్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకున్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేంత దాకా, నా జహాపనా!