వొక వాన రాత్రి



 

1

రాత్రిని నిలదీసి నువ్వేమీ అడగలేవు

వానలో తడుస్తున్న చీకట్నీ

ఏ కౌగిలి కోసమో  దూసుకుపోతున్న ఈదురుగాలినీ అడగలేవు

వొక గాయం రెండు తలుపులూ  బార్లా తెరిచి

నీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు

నిన్ను

నువ్వు కూడా ఏమీ అడగలేవు.

2

పో

వెళ్లిపో గాయంలోకే

చిన్ని అడుగుల ముద్దు  పాదాల ముద్రలు కొలుచుకుంటూ

3

అటు తిరిగి  ఇటు మెసలి

అటుఇటు ఎటూ తిరగలేని

నోరు మెదపలేని నిద్ర లేని రాత్రి

4

కనురెప్పకి నిప్పుల కాపలా

తెల్లారే దాకా.

5

ఎవరు దుఃఖిస్తున్నారో

ఎవరు ఎవరు దుఃఖాన్ని వూహిస్తున్నారో

పరకాయ ప్రవేశమే తేలిక

పర గాయ ప్రవేశం కన్నా!

6

నదిలోకి పడవ వదిలినట్టుగా

నా శరీరంలోకి కాస్త నిద్ర నొదిలి రాగలవా?

బతిమాలుకుంటున్నా

రాత్రి గడ్డం పట్టుకొని.

7

అందరూ నిద్రపోతున్నారు

నీ కంటి కింద దీపం  పెట్టి,

ఈ రాత్రిని

ఇలా వెలిగించుకో అని శాపం పెట్టి.
 

(ఏప్రిల్ 20... తెల్లారబోతూ....చాలా రోజుల తరవాత నిద్రకి వెలినై...నేనొంటరినై.. పల్లవినై...)

 

 

 
Category: 13 comments

వొక నిండైన వాక్యం కోసం…

కవిత్వంలో అయినా, వచనంలో అయినా వొక వాక్యం ఎలా తయారవుతుందన్నది నాకెప్పుడూ ఆశ్చర్యం! వాక్యం తయారవడం అంటే ఆలోచనలు వొద్దికగా కుదురుకోవడం! లోపలి సంవేదనలన్నీ వొక లిపి కోసం జతకూడడం! అన్నిటికీ మించి – నేను ఇతరులతో , ఇతరులు నాతో మాట్లాడుకోవడం! వాక్యంలోని నామవాచకాలూ, విశేషణాలూ, క్రియల మధ్య ఎలాంటి స్నేహం కుదరాలో నాకూ నా లోపలి నాకూ, నా బయటి లోకానికీ అలాంటి స్నేహమే కుదరాలి. అది కుదరనప్పుడు నేను వాక్యవిహీనమవుతాను. నా బయటి లోకం అర్థవిహీనమవుతుంది. నాకొక వ్యాకరణం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా అర్థమయిన జీవన పాఠం ఏమిటంటే: అసలు వెతుకులాట అంతా ఆ వ్యాకరణం కోసమే! సమాజాలకూ, సమూహాలకు కూడా అలాంటి వ్యాకరణమే  కావాలనుకుంటా.

మిగతా ఇక్కడhttp://www.saarangabooks.com/magazine/?p=1643 చదవండి
Category: 3 comments
Web Statistics