చేరన్ రుద్రమూర్తి/ వొక తీరం:మూడు మాటలు



1

కెరటమై పైకి ఎగసీ ఎగసీ

నురుగులా చనిపోయింది

నీరు.

2

ఆమె తీరం వైపు దూసుకుపోతోంది;

నేనింకా

కెరటాల్లోనే సతమతమైపోతున్నా.

3

సూర్యుణ్ణి మింగేసింది సముద్రం

చీల్చి, సూర్య రక్తాన్ని

మబ్బులమీదికి రువ్వి.

 

వొడ్డు మీద

ఆరిపోతుంది  పగలు,

నెమ్మదిగా

రాలిపడుతుంది రాత్రి.

 

ఇక కెరటాల మాట అంటావా,

అవి ఇంకా జీరాడుతూనే వున్నాయి

దిగులుగా.

(అనువాదం: అఫ్సర్)

 
Category: 0 comments

చేరన్ రుద్రమూర్తి/ సంచారం


 ఎదురెదురుగా కూర్చుంటాం
నువ్వూ నేనూ.

...
వాన రివ్వు రివ్వున దూసుకుపోతున్నప్పుడు
ఈ కిటికీలు రెక్కలవుతాయ్.

సీతాకోక చిలకలు చెదిరిపోతాయ్
ఎగిరిపోతాయ్.

పొలాలు వస్తాయి, పోతాయి.

ఇక
సముద్రం అందంగా వుంది
కొండలూ అందంగా వున్నాయి

నది కూడా భలే అందంగా వుంది.

అన్నీ
అర్థాలు వెతుక్కుంటాయ్

నీ, నా ఉనికిలోంచే!

(అనువాదం: అఫ్సర్ )
Category: 0 comments

ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో...



(ఆవకాయ నుంచి...మిగిలే క్షణాలు-2 )

 

1

          పుస్తకాలుంటాయి. అందులో అక్షరాలూ వుంటాయి. ఉత్తరాలుంటాయి, అందులో పలకరింతలూ వుంటాయి. కానీ, వొక వ్యక్తి పరిచయం అంతటితోనే ఆగిపోదు. అప్పటి దాకా ఆ అక్షరాల్లోంచీ, ఆ పలకరింతల్లోంచీ చూసిన వ్యక్తిని కలవాలని కూడా అనిపిస్తుంది. అప్పటిదాకా కలిసి పంచుకున్న పరోక్ష అనుభవాల సందోహంలోంచి వొక ప్రత్యక్ష బంధం భిన్నమయిన అనుభవంగా మారుతుంది. దాన్ని స్నేహమో, ఆత్మీయతో, ఆత్మ బంధుత్వమో అనుకోవచ్చు. కానీ, అంతగా కలవాలని కోరుకున్న ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ చూడనే లేదనుకోండి, అప్పుడెలా వుంటుంది?

          వజీర్ రహమాన్ గారిని తలచుకున్నప్పుడల్లా నన్ను ఈ దిగులు ఆవరిస్తుంది. ఆయన కన్ను మూసే సమయానికి (1983) నేనింకా కవిగా సరిగా కన్ను తెరవలేదు. కానీ, కవిత్వం చదవడం, దాన్నే మననం చేసుకుంటూ గడపడం అప్పటికే చాలా ఇష్టమయిన వ్యాపకంగా మారింది.

          ఇస్మాయిల్ గారు ఎప్పుడూ అనే వారు- “మన మధ్య బంధుత్వమూ వుంది, స్నేహమూ వుంది కానీ, అంత కంటే ఎక్కువ ఆత్మబంధుత్వం వుందని నేననుకుంటాను,” అని! వజీర్ రహమాన్ గారితో నా అనుబంధం అలాంటి ఆత్మబంధుత్వంగానే మిగిలిపోయింది చివరికి. ఇస్మాయిల్ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆయన బెజవాడ వచ్చినప్పుడు ఖమ్మం నుంచి పనిమాలా వెళ్ళి కలవడాలూ, ఆయనతో బీసెంట్ రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఆయన హోటల్ గదిలో గంటల తరబడి కబుర్లూ, సాయంత్రాలు ఆయనకిష్టమయిన గాంధీనగర్ లోని ప్రబోధ బుక్ సెంటర్ దాకా నడకలూ..ఈ అన్ని సందర్భాల్లో ఎందుకో నాకు ఇంకో మూడో మనిషి కూడా మా పక్కన వుండే వారని నాకు అనిపించేది. ఆ మూడో మనిషి వజీర్ రహమాన్. ఇస్మాయిల్ గారి తమ్ముడు. ఇస్మాయిల్ గారి కవిత్వం పుస్తక రూపంలోకి రాక ముందే కవిగా తనదయిన దారి వెతుక్కుంటూ వెళ్లారు వజీర్.

          ఇప్పుడు వజీర్ రహమాన్ గారి గురించి తలపోసుకుంటూ వుంటే – అసలు వజీర్ ప్రస్తావన రాకుండా ఇస్మాయిల్ గారితో సంభాషణ ఎప్పుడన్నా ముగిసిందా అనుకుంటే, అలాంటి వజీర్-రహిత సంభాషణ వొక్కటి కూడా లేదని అనిపిస్తుంది. పైగా, నాకు వజీర్ మీదున్న ప్రత్యేకమయిన ఆసక్తి వల్ల ఇస్మాయిల్ గారిని కలిసిన ప్రతి సారీ వజీర్ సంగతులు మా మాటల్లో యేదో వొక విధంగా దొర్లేటట్టు నేను సంభాషణని కొంచెం దారిమళ్లిస్తూ వుండే వాణ్ని.

2

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి?

నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం! రాజకీయాలు ఎలా వున్నా, కవిత్వం విషయానికి వచ్చేసరికి నేను మొదటినించీ అనుభూతి పక్షపాతిని. ఏ అనుభూతీ కలిగించలేని, మిగల్చలేని కవిత్వం అనవసరం. కేవలం నినాదాలు కవిత్వం కాదు- అని అప్పటికీ, ఇప్పటికీ అనుకుంటా. ఈ కోణం నించి చూస్తే, శ్రీశ్రీ కవిత్వం – మహాప్రస్థానం, మరో ప్రస్థానం- వరకూ నాకెప్పుడూ అసంతృప్తిని మిగిల్చేవి. అప్పుడు నేను వెతుక్కున్న ప్రత్యామ్నాయాలు అజంతా, బైరాగి,  ఇస్మాయిల్, వజీర్ రహమాన్! అలా, 1963లో అచ్చయిన “ఎచటికి పోతావీ రాత్రి?” కవిత్వ పుస్తకం నాకు ఎలాగో మా జిల్లా గ్రంధాలయంలో దొరికింది.

అది చదువుతున్న సమయంలోనే ఇస్మాయిల్ గారి తమ్ముడు డాక్టర్  ఖలీల్ రహమాన్ గారు బదిలీ మీద ఖమ్మం వచ్చారు. ఆయన మా ఇంటికి దగ్గిరలోనే వుండే వారు. ప్రతి ఆదివారం డాక్టర్ గారింటికి వెళ్ళి, వాళ్ళ పిల్లలతో (నా ఈడు వాళ్ళే!) కాలక్షేపం చేయడం నాకు అలవాటు అయింది. ముఖ్యంగా, మంజూర్ రహమాన్ తో నాకు బాగా దోస్తీ కుదిరింది. అతని చెల్లి నా తమ్ముడు, ప్రముఖ కవి  ఇక్బాల్ చంద్ కి క్లాస్ మేట్. మంజూర్ కి కాస్త కవిత్వ ఆసక్తి వుండేది. అప్పుడు నేను అతన్ని కూర్చొబెట్టుకుని, వజీర్ కవిత్వం చదివేవాణ్ని. ఎచ్చటికి పోతావీ రాత్రి?” ఎక్కువగా ప్రేమ కవిత్వమే.

దేనికివన్నీ ఉత్త మాటలు

శుష్క ప్రేలాపనలు,

కోరికలేన్నయినా కానీ

దుక్ఖమయినా చెప్పలేని పిరికిని!

వాక్యాలు చదువుతున్నప్పుడు, డాక్టర్ గారు విని, నవ్వుతూ, అవి వాడి ముందు చదివి ఏం లాభం? ఏ అమ్మాయి ముందో చదివితే కనీసం ప్రేమలో పడచ్చు గానీ!” అనే వారాయన! అలా కొన్ని సార్లు మా నెత్తి మీద వొకటిచ్చుకొని, నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయే వారు. ఇస్మాయిల్ గారిలాగానే, డాక్టర్ గారికీ ఆ వొక్క  వాక్యం సైజు జోకులు కట్ చేసే అలవాటు బాగుండేది. అలాంటి సరదా చలోక్తులు విన్నప్పుడల్లా నాకు వెంటనే అనిపించేది – వజీర్ రహమాన్ గారిని కూడా చూసి వుంటే ఎంత బాగుండేది! నిజానికి దుఃఖ సన్నివేశాల కంటే ఎక్కువగా- అలాంటి చిరు జోకులు మిస్ అవుతున్నప్పుడు మనం ఆ మనుషుల్ని నిజంగా మిస్ అవుతున్నామన్న దిగులు పుడుతుంది. ఆ తరవాత కొన్ని  దుఃఖ సన్నివేశాలు కూడా తోడయి, ఆ దిగులు బెంగగా మారుతుంది.

1984 తరవాత నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో లో పని చేసే కాలంలో ప్రసిద్ధ కథకులు   కేతు విశ్వనాథ రెడ్డి గారు పరిచయ మయ్యారు. వజీర్ , కేతు వాళ్ళిద్దరూ కొంత కాలం తిరుపతిలో చదువుకునే రోజుల్లో రూమ్ మేట్లు. వాజీ గురించి ఆయన చాలా కబుర్లూ, జోకులూ చెప్పేవారు.  వాళ్ళిద్దరూ వున్న ఇరుకు గదికి వజీర్ యమ ద పిట్” అని పేరు పెట్టారట.

వజీర్ కి కవిత్వం అంటే ప్రాణమే కానీ, అంత కంటే ఎక్కువగా స్నేహితులంటే ప్రాణం. వాళ్ళతో గడపడం, వాళ్ళకి ఉత్తరాలు రాయడం ఆయనకి ఇష్టమయిన వ్యాపకంగా వుండేదట. ఫోటోగ్రఫీ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకి కాలేజీలో లెక్చరర్ గా పని చేయాలన్న కోరిక వుండేదట. కానీ, జీవితం వొక్కో సారి ఎంత అన్యాయంగా వుంటుందంటే, ఆ వొక్క పని తప్పా, ఉపాధి కోసం ఆయన ఇతర అన్ని టెక్నికల్ పనులూ చేయాల్సి వచ్చింది. “ఎచటికి పోతావీ రాత్రి?” 1963లో అచ్చయ్యే నాటికి ఆయనకి 29 యేళ్ళు. అప్పటికింకా ఆయన ఉద్యోగన్వేషణ కూడా పూర్తి కాలేదు.

 

జీవితాన్ని వొక అందమయిన కళగా పూజించాలనుకున్న ఈ స్వాప్నికుడు వొక స్థిరత్వం లేక, వొక కుదురు చిక్కక సతమతమయిపోతూనే బతికాడు. ఆయనకి దక్కిన వొకే వొక్క అపురూపమయిన స్వప్నసంపద చంపక- చలం గారి కూతురు. ఆవిడని నేనెప్పుడూ చూడలేదు. కానీ, ఇస్మాయిల్ గారికీ, మాకూ బంధువయిన హబీబ్ రహమాన్ (ఇతనిదీ నా వయసే! సాఫ్ట్ వేర్ ఇంజనీరు.) ఆమెని వొక సారి చూశాడట. కాకినాడలో వాళ్ళ ఇల్లు ఇస్మాయిల్ గారి ఇంటికి తరవాతి సందులో వుండేది. నేను ఇస్మాయిల్ గారి కోసం కాకినాడ వెళ్లినప్పుడు హబీబ్ ఇంట్లోనే ఎక్కువ వుండే వాణ్ని.  హబీబ్ చంపక గారితో మాట్లాడడానికి వెళ్ళిన రోజు గురించి చాలా సార్లు చెప్పేవాడు. “వొక రోజు నేను వెళ్ళేసరికి బాబాయ్ గారి ఇల్లు చాలా సందడిగా వుంది. నేను బయట రియాజ్ (ఇస్మాయిల్ గారి అబ్బాయి, ఇతను మాట్లాడ్డమే చాలా పోయేటిక్ గా మాట్లాడే వాడు)తో మాట్లాడుతూ కూర్చొని వున్నా. ఇంతలో ఇంట్లో నించి వొక నవ్వుల జలపాతం వురుక్కుంటూ మా ముందు దూకి వెళ్ళిపోయినట్టనిపించింది. రియాజ్ అన్నాడట- “నయాగరా నిన్ను తడిపివెళ్ళినట్టుందా?  ఆ నవ్వు చంపక గారిది. వజీర్ బాబాయ్ భార్య.”

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వజీర్ గానీ, చంపక గారు గానీ, చాలా అరుదుగా ఇల్లు వదిలి ఇంకో చోటికి వెళ్ళే వారు. ఇస్మాయిల్ గారింటికి కూడా పెద్దగా రాకపోకలు వుండేవి కావు. చలం అనే మహాచెట్టు కింద వొదిగిపోయిన తరవాత వజీర్ కి ఇంకే లోకమూ అక్కరలేకపోయింది. వజీర్ ఇలా చెప్పుకున్నాడు 1963లోనే:

అవును,

నా కవిత్వ సాధనలో చరణ చరణమూ

అతని ప్రభావం, పర్యవేక్షణా.

నా జీవితంలో నిమిష నిమిషమూ

అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు.

అతనిచ్చిన బలంతోనే

చూపిన అతని తోవ వెంటనే

ఈ నడక నాకీ నాడు –

మధురానంద కవితాకాశంలోనూ

దుర్గమ జీవన కీకారణ్యంలోనూ.

చలం చాలా మందిని ప్రభావితం చేసిన గొప్ప శక్తి. అనుమానమే లేదు. కానీ, వజీర్ దగ్గిరకి వచ్చేసరికి చలమే ఈశ్వరుడు. ఇలా ఆలోచించడం సరికాదని నాకూ తెలుసు కానీ, వొక దశలో చలం నీడ వదులుకొని వుంటే, వజీర్ ఇంకో దారి పక్కన ఇంకో పూల చెట్టుగా అందంగా నిలబడి వుండే వాడేమో! చలం వొడిలో అతనొక మొక్కగా మాత్రమే మిగిలిపోయాడేమో! కానీ, ఇది జీవితం కదా! అలా అనుకోనిస్తుందా జీవితం?! ఎవరి దిగుళ్లు, ఎవరి సంతోషాలు ఎలా వుండాలో వాళ్ళకే తెలిసినంతగా మనకి తెలియదుగా!

అంత మహావృక్షం నీడలో కూడా వజీర్ 1963 కవిత్వం నించి 1983 నాటి “సాహసి”దాకా వొక అందమయిన continuity ని సాధించాడు. వజీర్ కవిత్వం మీద పరిశోధన చేసిన నా తమ్ముడు ఇక్బాల్ చంద్ మొన్న అంటున్నాడు: నా దృష్టిలో జీవితాన్ని కవిత్వంలోకి కుదించడం కంటే కవిత్వంగా జీవించడం బాగుంటుంది. వజీర్ అలా కవిత్వంగా జీవించారు. అలా జీవించడం ద్వారా కవులు షరా మామూలుగా బతికే మోసపూరిత జీవనాన్ని ఆయన తిరస్కరించాడు. అందుకే, చివరి వాక్యం దాకా వజీర్ లో ఆ తీవ్రత, ఆ జీవన లాలస!”

3

కవిత్వం విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ కవిత్వ పంక్తులు కొన్ని సీదా మన జీవితాల్లోకి దారి వెతుక్కున్నప్పుడు – అంటే – ఆ వాక్యాలు మననం చేసుకునే సందర్భాలు మన జీవితాల్లో దొరికి, వాటిని మనం తిరిగి చదువుకున్నప్పుడు! అంటే, అనుభవమే కవిత్వానికి కోటబిలిటీ ఇచ్చినప్పుడు! వొక గాఢమయిన అనుభవం తట్టి పలకరించినప్పుడల్లా ఆ వాక్యాలు మనల్ని ముసురుకుంటాయి.

వజీర్  కవిత్వంలో అలాంటి కోటబిలిటీకి కరువు లేదు.

వజీర్ కవిత్వం అప్పుడే కాదు, ఇప్పుడు చదివినా కొన్ని పంక్తులు మన కోసమే రాసిపెట్టినట్టు అనిపిస్తుంది. వొక స్నేహితుడు వెళ్తూ వెళ్తూ మన కోసం కొన్ని వుత్తరాలూ, వాటిల్లో కొన్ని మాటలూ మిగిల్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు వజీర్ రాసిన కొన్ని కవితలతో ఆత్మీయ బంధం వుంది.  నాలోపలి  జీవితాన్ని వెలిగించిన కల్పనతో కలిసి చదువుతున్నప్పుడు వాటి లోతయిన అర్థాలు బాగా తెలిసి వచ్చాయి.  మా దగ్గిర వున్న వజీర్ పుస్తకం చిరిగి శిధిలావస్థలో వున్న స్థితిలో , అందులో  కొన్ని కవితల్ని కల్పన తన చేరాతతో రాసి దాచిపెట్టుకుంది కూడా!

వజీర్ ని తలచుకున్నప్పుడల్లా అతనే రాసుకున్న వొక పంక్తి నాకు భలే గుర్తొస్తుంది:

ఇదేం లేదనుకో

మర్చిపో

నేనేం కాదనుకో

రాలేదనుకో

అని వారిస్తావు కాని,

నువ్వు లేని నన్ను

వూహించడమే

భరింపరాని బాధయి

నేనెట్లా మరవగలను?

 

నీ ఆలోచనే చాలు,

నా నరాలు తిరగబడి

బాధతో పదునెక్కి

ప్రేమతో, మోహంతో

మధుర జ్నాపకాలతో

రౌద్ర సముద్రుడి వలె

విలవిలలాడిపోతాను.

వొక్కో సారి మనకి బాగా ఇష్టమయిన కవి హటాత్ నిష్క్రమణ అనిపించేది అదే కదా! వొక్కటే వూరడింపు ఏమిటంటే ఆ అక్షరాలు మిగిలి వుంటాయి వెచ్చగా!

*

 

 

 

 

 
Category: 3 comments
Web Statistics