అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!

పరిచయాలు అక్కర్లేని మన వాడు...అక్కడెక్కడి నించో...!



చిత్రంగా మనం గదులు కట్టుకున్నట్టే
నదులకూ తాళాలు వేస్తాం కదా,
అన్నాడు అఫ్సర్ అప్పుడెప్పుడో పదిహేనేళ్ళ క్రితం తెనాలి ప్రయాణంలో....కృష్ణా నదిలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే బకింగ్ హామ్ ప్రధాన కాల్వపై దుగ్గిరాల దగ్గిర లాకులను చూసి.
“ఆ తాళాల సందుల్లోంచి
నురగలు కక్కుతున్న నీళ్ళలో “ కన్నీళ్లను కూడా చూశాడు తను.

అందుకే, గదుల గోడల్ని కూల్చేసి, ఇప్పుడు ప్రపంచం సరిహద్దుల్ని చిత్రంగా చెరిపేస్తున్నాడు అఫ్సర్. అచ్చమయిన తెలుగు బిడ్డడిగా పరదేశంలో మన మాతృభాషకి సమున్నత పట్టం కట్టాడు. మన భాషా సౌరభాల్ని దశదిశలా వ్యాపింపజేస్తున్నాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఆచార్యునిగా తనవైన విజయ బావుటాల్ని ఎగరేస్తున్నాడు. చిన్నప్పుడు సంప్రదాయ బద్ధంగా అరబ్బీ, ఉర్దూ చదువుతూ ఆంగ్లంలో కవితలల్లుతూ తెలుగులోకి ట్రాన్స్ లేటయిన అఫ్సర్ ఇప్పుడు ఆసియన్ స్టడీస్ అధ్యాపకునిగా తెలుగు పలుకుబడికి అమెరికాలో పీఠం వెయ్యడం ఎంత గర్వకారణం!
సీనియర్ జర్నలిస్టుగా ఎప్పుడూ చెరో పక్క ఇద్దరు సహచరుల భుజాల మీద చెయ్యేసి, బెజవాడ వీధుల్లో నవ్వుతూ అలపురాని కబుర్లెన్నో చెప్పిన అఫ్సర్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్తసముద్రాలూ దాటేశాడు. కవిగా మనకెంత దగ్గిరవాడో దూరమెళ్లినా స్నేహితుడిగా అంత ఆత్మీయుడు. సున్నిత మనస్కుడు. చలించే, చెమ్మగిలే గుణాలే అఫ్సర్ ని తాజాతాజాగా రీఛార్జ్ చేసే సాధనాలు. అల్లకల్లోల అంతర్లోకాలను చుట్టేసి ప్రతిభావంతంగా అనుభూతులను అక్షరబద్ధం చేసే అఫ్సర్ నిజానికి పరిచయం అక్కర్లేని కవి, సాహితీ విమర్శకుడు. ఇప్పుడేం చేస్తున్నారో తెలియని ఏ నలుగురి కోసమో ఈ కాస్తా...

నిరంతర అధ్యయనశీలిగా, అంతర్జాతీయస్థాయి పరిశోధకునిగా, భాషావేత్తగా, వచన రచననూ కవితామయం చేసి అందంగా మనతో చదివించే అఫ్సర్ ఏకంగా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆప్షనల్ గా అవకాశమివ్వని ద్వితీయ భాషగా తెలుగుని కంపల్సరీ బోధనకు ప్రవేశపెట్టి వినుతికెక్కాడు. విస్తృత సాహితీ సేద్యం చేసే అఫ్సర్ ఏ అనుభవాన్నయినా కవిత్వంగా మలచుకునే పదసంపన్నుడు. ఎక్కడున్నా అస్తిత్వ అన్వేషణే వస్తువుగా ఆయన కవిత అలా అలా సాగిపోతూనే .....మనకి మరో “విశ్వకవి”ని చూపుతుందేమో వేచి చూద్దాం. బెజవాడ బుక్ ఫెస్టివల్ గుర్తుకు రాగానే ఏదో కోల్పోతున్న వెలితి భావనతో ఆంధ్ర భూమి “మెరుపు” కోసం ప్రత్యేకంగా తన అనుభూతుల్ని అక్షరీకరించాడు మన అఫ్సర్!
- పాషా, ఆంధ్ర భూమి "మెరుపు", జనవరి 1, 2012.


అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!




బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా -

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది...అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ....అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.


కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి...

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

Category: 5 comments

ఇరవయ్యో శతాబ్ది /ఇద్దరు కవులు

ఎడోనిస్ కవితలు




ఇద్దరు కవులు

వొక ప్రతిధ్వనికీ, ధ్వనికీ మధ్య ఇద్దరు కవులు.

ముక్కలయిన చంద్రుడిలా మాట్లాడ్తాడు వొక కవి,


ఇంకొకడు
పిల్లాడిలా నిశ్శబ్దం,

వో అగ్నిపర్వతం చేతుల్లో వూయలూగుతూ
నిద్రిస్తూ.


అద్దంలో ఇరవయ్యో శతాబ్ది


శిశువు ముఖాన్ని ధరించిన
శవపేటిక
వొక కాకి గుండెల్లోంచి రాసిన
పుస్తకం



పువ్వు చేతబట్టి
ముందుకు లంఘిస్తున్న మృగం

వొక పిచ్చివాడి వూపిరిలోపల
శ్వాసిస్తున్న బండ రాయి

అంతే.
ఇదే ఇరవయ్యో శతాబ్ది.



(మొదటి కవిత : Two poets
రెండో కవిత: A mirror for the twentieth century)
Category: 1 comments

అవతలి గట్టు మీది చీకటి గురించి...

స్కైబాబా కొత్త కథా సంపుటి "అధూరే" కి ముందు మాట ఇది. "ఆంధ్రజ్యోతి" సాహిత్య అనుబంధం "వివిధ"లో కూడా ఇది అచ్చయ్యింది.




There is always the other side, always.
-Jean Rhys


సాధారణ తెలుగు కథ నించి తెలంగాణ కథని విడిగా ఎట్లా నిర్వచించుకోవాలనే సాంప్రదాయ విమర్శకుల సందిగ్థం తేలక ముందే, తెలంగాణ ముస్లిం కథకులు మరో కొత్త సవాలు మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇక తెలంగాణ కథని మాత్రమే కాకుండా, తెలంగాణ ముస్లిం కథని కూడా ఎట్లా విడిగా నిర్వచించుకోవాలో తేల్చుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే తేలే సంగతి కాకపోవచ్చు, కానీ, ఈ చర్చ మొదలు కావాల్సిన అవసరం వుందని ఇటీవలి తెలంగాణ ముస్లిం కథలు వొత్తిడి పెడ్తున్నాయన్నది నిజం. అయితే, తెలంగాణ కథని నిర్వచించడం కంటే, తెలంగాణ ముస్లిం కథని నిర్వచించడం కష్ట తరం అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. తన లెజిటిమసీ కోసం తెలంగాణ కథకుల కంటే, తెలంగాణ ముస్లిం కథకులు ఎక్కువ సవాళ్లని ఎదుర్కోవాల్సి వుంటుందన్న సాహిత్య సామాజిక సాంస్కృతిక చేదు వాస్తవికతని కూడా మనం గుర్తించాలి.

ఈ సంపుటిలోని కథల్ని పునకథనం చేసి, వాటిని చేతులారా ఖననం చెయ్యడం కంటే - ఈ కథల రక్తమాంసాల్లోంచి, స్కై బాబా మౌలికంగా ప్రతిపాదిస్తున్న ముస్లిం సాంస్కృతిక చర్చకి తలుపు తీసే ప్రయత్నం ఈ నాలుగు మాటలు. ముఖ్యంగా, మూడు ప్రధానమయిన అంశాల చుట్టూ ఈ చర్చ జరగాల్సి వుంది. అందులో మొదటిది: మెజారిటీ సాహిత్యం అంటూ వొకటి వున్నప్పుడు అది నిర్మించి పెట్టిన మూసల్లో మైనారిటీ భావన ప్రతిఫలనాలు ఎట్లా సాహిత్యమవుతాయి? వాటి ప్రాతినిధ్యాన్ని ఎట్లా చూడాలి? ; రెండోది: వొక స్థానిక అంశంగా తెలంగాణ, అందులో ముస్లింల పాత్ర,; మూడోది: కథా వస్తువు- శిల్ప పరిధుల్లో ఆ రెండు అంశాలు ఎట్లా కలిసి పనిచేస్తాయి? కథా వస్తువులోనూ, శిల్పంలోనూ స్కైబాబా ఈ కథల్లో చేస్తున్న ప్రయత్నానికి ఈ మూడు అంశాల చుట్టరికం వుంది.

వాస్తవానికి సాహిత్య సంస్కృతిలో మెజారిటీ- మైనారిటీ అన్న భావన ఎలా పనిచేస్తుందో, దాని కదలికలు ఏమిటో ఇంకా మనకి వొక పూర్తి అవగాహన ఏర్పడలేదు. అసలు ఆ సామాజిక భావన సాహిత్యంలో నిజంగా పనిచేస్తుందా అన్న “సత్సంశయాలు” కూడా దురదృష్టవశాత్తూ కొందరిలో వున్నాయి. ఈ సత్సంశయాల మబ్బులు తొలగితే తప్ప, మెజారిటీ-మైనారిటీ అన్న భావన ఆచూకీ దొరకదు. సంవాద రూపంలో (discourse level) తెలుగు ముస్లిం రచయితలు తరవాతి దశలో మైనారిటీ అన్న “అధికారిక” భాషని వదిలించుకునే ప్రయత్నం చేసినా, సాంస్కృతిక రూపంగా మైనారిటీ అనే భావన పని చెయ్యక మానదు. సామాజికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా అనేక విధాన నిర్ణయాలు ఈ చట్రంలోనే పని చేస్తాయి కనక. ఈ మైనారిటీ సాంస్కృతికత అనేది ఎట్లా నిర్మించబడుతుందో, ఎట్లా కొనసాగించబడుతుందో స్కైబాబా కథలకి ప్రధాన నేపధ్యం.

మిగిలిన అస్తిత్వాల కంటే ముస్లిం అస్తిత్వానికి కొంత అదనపు చరిత్ర వుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అది ఇస్లామిక్ అస్తిత్వ సమస్య అయితే, ప్రాంతీయ స్థాయిలో అంటే తెలుగు రాజకీయాల పరిధిలో అది తెలంగాణ అస్తిత్వంతో , ఆ పైన తెలంగాణ ముస్లిం రాజకీయ వునికితో, కొంత గత అధికార రాజకీయాలతో ముడిపడిన అస్తిత్వ సమస్య. ఇది మూడంచెల అణచివేత కింద నలుగుతున్న అస్తిత్వం. ముస్లిం లకి సంబంధించిన ఏ చర్చ అయినా, ఇలాంటి మూడంచెల అణచివేత సవాళ్లని ఎదుర్కొక తప్పడం లేదు. సమకాలీన రాజకీయ చర్చల్లో, సాంస్కృతిక సంవాదాల్లో ముస్లింలు ఇప్పటికీ అన్ని విధాలా పరాయీ వాళ్ళే. ముఖ్యంగా, తెలుగు సాహిత్య సాంస్కృతికతలో ఇంకా వాళ్ళ వాటా వాళ్ళకి దక్కనిచ్చే స్థితి లేనే లేదు. తెలంగాణ ముస్లిం కథకులు – ఈ పుస్తకం విషయానికి వస్తే స్కైబాబా లాంటి వొక తెలంగాణా ముస్లిం రచయిత - సంప్రదాయ తెలుగు కథావిమర్శ ప్రమాణాల బెంచ్ మార్కు దృష్ట్యా చూస్తే, తనని తాను వొక మంచి వచన రచయితగానో, కథకుడిగానో నిలబెట్టుకోవడానికీ ఇప్పుడున్న పరిస్తితుల్లో నరక యాతన పడాల్సిందే- దీనికి బలమయిన కారణం మొత్తంగా తెలంగాణా కథా సాహిత్యమే అనుభవిస్తున్న రెండు రకాల పీడన: సాహిత్య సాంస్కృతిక చరిత్ర, కథా శిల్పం పేరిట కనిపించని సంకెలల అధిక బరువు. ఈ రెండు రకాల బరువుల కింద నలిగిపోతూ తెలంగాణ ముస్లిం కథ ఇంకా తన సాహిత్య ఉనికికి తగ్గట్టుగా విమర్శ సాధనాలు సమకూర్చుకోవాల్సి వుంది. ఈ రెండు రకాల పీడనల్ని శక్తి మేరా వుపయోగించే ప్రధాన స్రవంతి – అలాంటిది వొకటి వుందని భ్రమింపజేసే- తెలుగు కథా సాంస్కృతికత స్కైబాబా కథలకి అంత తేలికగా రాజముద్ర వెయ్యదన్నది నిజం. బహుశా, ఇది స్కై బాబా వొక్కడి సమస్య కాదు, ఎక్కువగా తెలంగాణ కథకులకు, అంత కంటే మరీ ఎక్కువగా తెలంగాణా ముస్లిం కథకులకు వర్తించే విషయం.

ఈ నేపధ్యంలో స్కై బాబా కథా సంకలనం “అధూరే” వొక సాంస్కృతిక అస్తిత్వ ఘోష. సొంత గొంతు కోసం గొంతు చించుకునే ప్రయత్నం. ప్రధాన స్రవంతి రాజకీయ శిబిరాల పద్మవ్యూహంలోంచి సజీవంగా/ సశరీరంగా బయట పడాలన్న తీవ్ర వాంఛతో పెగలివస్తున్న కేక. ఆ కేక చరిత్రని వెతుక్కుంటూ, స్కైబాబా కథల్ని దగ్గిర పెట్టుకున్నప్పుడు, తెలంగాణా ముస్లిం కథ గురించి- కొంత దూరంగా -భవిష్యత్తులోకి ఆలోచించే ప్రయత్నం కూడా అవసరమే.
*
దృక్పథం వున్న ప్రతి రచయితా తన రచనలో కాలాన్ని పునర్నిర్మించుకుంటాడు. గతంలోకి వెళ్ళే ముందు ఆ గతం తన వర్తమానంలో, తన భవిష్యత్తులో ఎట్లా రూపాంతరం చెందుతుందో తరచి చూసుకుంటాడు. ఈ ధోరణి మైనారిటీ సాహిత్యంలో బలంగా కనిపిస్తుంది. మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే కాదు, ప్రధాన స్రవంతి-కేంద్రిత సాహిత్యంలో వోదగని ప్రతి ధోరణీ – ముఖ్యంగా స్త్రీ, దళిత, స్థానిక – సాహిత్యం కూడా. ఈ ధోరణి రచయితలు కాలాన్ని దర్శించే తీరు వాళ్ళు ఆధునికతని ఎట్లా నిర్వచించుకుంటారన్న పునాది మీద ఆధారపడి వుంటుంది. ఆధునికత చర్చలో కాలం పాత్రని తిరిగి నిర్వచిస్తూ, రచయితకి అది చరిత్రని సొంతం చేసుకునే (historical reclamation) ప్రక్రి య అంటాడు వాల్టర్ బెంజమిన్ “Thesis on the Philosophy of History” అనే ప్రసిద్ధ వ్యాసంలో(1968).

వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించే మిధ్యావాస్తవికతని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత. తన కాలంలో వున్న అన్ని గత వ్యక్తీకరణల్ని/ వాటి వర్తమాన వక్రీకరణల్ని విమర్శించడం ద్వారా మైనారిటీ రచయిత ఇంకో వర్తమానం నిర్మిస్తాడు. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమయిన సైద్ధాంతిక సాధనం. స్థానికతని సాహిత్యంలో బలమయిన భావనగా నిలబెడ్తున్న ఇప్పటి తెలంగాణ రచయితలు ముఖ్యంగా చేస్తున్న పని కూడా ఇదే. అయితే చరిత్ర మీద వున్నంత దృష్టి మనకి ఆ చరిత్రలో అంతర్భాగంగా పని చేసే ఈ కొత్త వాస్తవికత మీద కూడా వుంటే తెలంగాణ సాహిత్యం తొవ్వలే మారిపోతాయి.

చాలా మంది తెలంగాణ కథకుల మాదిరిగానే, స్కైబాబా కథా గతం , వర్తమానం కేవలం గత, వర్తమాన సమస్య కాదు, కేవలం సాహిత్య సమస్యా కాదు. ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి కొంత గతంలోకి వెళ్ళక తప్పదు. కొన్ని అసాహిత్య/ సాహిత్యేతర విషయాలూ చర్చించక తప్పదు. ఆ గతంలో తెలంగాణ కథ ఏమిటో, అందులో తెలంగాణ ముస్లిం ఎవరో కొంత వెతుక్కోవాలి.

పుట్టిన వెంటనే వలస వాద ఆధునికత చేత అపహరించబడిన శిశువు తెలుగు కథ. తెలుగు కథ పుట్టుకా పెరుగుదలా అంతా ఆ తరవాత వలస వాద పెంపుడు వారసత్వాల నించి మాత్రమే చూస్తూ వచ్చాం. ఆధునిక కథకి జన్మస్థలం కోస్తా తీరం వెంట చూపిస్తూ, ఆ స్థానికతలోని వలసవాద, లేదా ఆంగ్ల –కేంద్రిత మూలాల్లో తెలుగు కథని చరిత్రీకరించడంలోనే ఈ వారసత్వం దారి మళ్ళింది. తెల్ల వాళ్ళ పాద ధూళితో పావనం అయితే కానీ, మనకి సాంస్కృతిక చరిత్రా లేదు, సాహిత్య చరిత్రా లేకపోయింది. తెలుగు కథ ఇంగ్లీషు మూలాల్లోంచి పుట్టలేదనీ, దాని అసలు మూలం మన ఆదిమ సాహిత్య చరిత్రలో వుందని ఇప్పటికీ గుర్తించలేని స్థితిలోనే వున్నాం. దానికి ప్రధాన కారణం: బ్రిటిష్ ఆంధ్రా కథ వలసవాద ఆలోచనల్లోంచి, శిల్పంలోంచి నేరుగా దిగుమతి అయిన సరుకు.

అలాంటి దిగుమతిని సరుకుని ధిక్కరించడంతో మొదలయ్యింది తెలంగాణ కథా చరిత్ర . ఇటీవలి కాలంలో ముస్లిం రచయితలు తిరిగి ఆ చరిత్రలోకి ప్రయాణిస్తూ, ఆ సాంస్కృతిక వాస్తవికతని ఆవిష్కరిస్తూ వుండడంతో ఈ ధిక్కారానికి శక్తి తొడయ్యింది. ఉర్దూ అనేది రాజభాష కాదనీ, అది ప్రజల భాష అన్న గుర్తింపు కలిగించడం ద్వారా మాత్రమే ఈ సాంస్కృతిక చరిత్రకి న్యాయం జరుగుతుంది. ఈ చరిత్ర పునర్నిర్మాణం ప్రక్రియలో భాగంగానే స్కైబాబా గాని, ఇతర తెలంగాణ ముస్లిం రచయితలు గాని ఉర్దూ పదాల ద్వారా ఇప్పటి దాకా అస్పృశ్యంగా మిగిలిపోయిన ముస్లిం సాంస్కృతిక భావనలని తిరిగి వెతుక్కుంటున్నారు. తమ జీవితాల్లోని ఈ ముస్లింతనాన్ని ఆవిష్కరించే ముందు దానిని కప్పేస్తున్న/ లేదా ఇతరేతర సాధనాలతో దానిని అవాస్తవీకరిస్తున్న చరిత్రని reclaim చేసుకోవాల్సిన అవసరం ముస్లిం రచయితలకు వుంది. స్కైబాబా కథల్లో ఈ అవసరం భాషతో మొదలై, సామాజిక ఉద్యమాల పునర్ నిర్వచనం దాకా కొనసాగుతుంది. తెలుగు కథల్ని ఉర్దూ పదాల మాలిన్యం నించి కాపాడాలనుకునే వృధా ప్రయత్నంలో సంస్కృత దాస్యానికయినా వెనకాడని నవీన సాంప్రదాయ వాదులకి ఈ కథలు చదివీ చదవక ముందే వొక పెద్ద సవాల్ అవుతాయి; ఈ “తెలుగుర్దూ” భాష లేదంటే తురకం వినినంతనే మన conditioned చెవులకి అపచారమనిపిస్తుంది. అధికారిక భాష అనేది మన ఆలోచనల్ని ఎట్లాంటి చట్రాల్లో బంధించి పెడుతుందో, అట్లాంటి చట్రాల్ని పగలగొట్టే పనితో ఈ కథకుడి యాత్ర మొదలవుతుంది.
*
ఈ కథల సంపుటికి స్కై పెట్టుకున్న పేరు “అధూరే” అంటే “పూర్తి కానివి” అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే, ఈ సంపుటిలో చాలా మటుకు కథలు జీవితాన్ని అంటిపెట్టుకుని వుండే వొక పూర్తికాని తనాన్ని చెప్పుకుంటూ వెళ్తాయి. ఈ కథల్లోని కొన్ని జీవితానుభవాలు నిజంగా పూర్తయ్యాయా అన్న సందేహంలో ‘ముగుస్తాయి.’ ఒక ముగింపు రాహిత్యం ప్రతి కథనీ, ఆ కథలోని పాత్రల్నీ, వాటి అనుభవాల్నీ వెంటాడుతుంది. కథలన్నీ చదివాక రచయిత ఈ కథలు చెప్పడానికి వాడిన రెండు భాషలు కూడా ఆ అనుభవాల భాషని విప్పలేకపోయాయన్న క్షోభ మనకి మిగుల్తుంది. కథ మళ్ళీ మొదటికి – అంటే భాషకి- వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఈ కథలు తెలుగు కథ స్థాయి నించి తెలంగాణ కథకీ, అటు తరవాత తెలంగాణ ముస్లిం కథకీ పరిణతి చెండానికి వెనక ఈ రెండు అంశాలు – సాధారణ భాష, అనుభవ వాహిక- బలమయిన పునాదులు. ఈ పునాదులు రెండూ అసంపూర్ణంగా మిగిలి వున్నాయన్న అస్తిత్వ క్షోభని శీర్షికే చెబ్తుంది.

తెలంగాణ ముస్లిం అనుభవాన్ని తర్జుమా చేయగలిగే శక్తి ఈ సాధారణ భాషకి వుందా? అన్న శంకతో ఈ కథా రచయిత బయలుదేరుతాడు. ఇప్పటికే ఏర్పడి వున్న తెలుగు సాహిత్య భాష ఎంత వరకూ తెలంగాణ భాష అన్న సందేహమూ ఇందులో కలిసి వుంది. ఆ సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పాలన్న తపన శీర్షికలో వుంది, తరవాతి కథల్లో వర్ణనల్లోనూ, పాత్రల సంభాషణల్లోనూ అది కొనసాగి, పఠితని కాసేపు సందిగ్ధంలో పడవేస్తుంది. ఆ సందిగ్ధత అలవాటు పడిన కొద్ది సేపటికి ఇందులోని ముస్లిం జీవితం సందిగ్ధత రెండో దశకి తీసుకు వెళ్తుంది. మొత్తంగా తెలుగు ముస్లిం సాహిత్యం ముందు వున్న పెద్ద సాంస్కృతిక సమస్య – ఈ సందిగ్ధతతో సహా తన పాఠక వర్గాన్ని ఎట్లా సృష్టించుకోవాలా అన్నది. తెలుగు కథలకు ఇప్పటికే ఏర్పడి వున్న పాఠక వర్గం కాక, అదనంగా కొత్త పాఠకులని అందుకోవడానికి ఈ కథలు వుపయోగపడతాయి.

కానీ, స్కై బాబా ఈ కథల్లో కొన్ని సాంస్కృతిక సంక్లిష్టతల్ని ఒక శిల్ప విధానంతో తేలికగానే నెగ్గుకొచ్చాడు. కథల్లోని ఒక వర్ణనా సారళ్యం, ఒక విధమయిన understatement వ్యూహం, సూటిగా అనుభవంలోకి తీసుకు వెళ్ళే నిర్మాణ సౌందర్యం, అన్నిటికీ మించి ఇంతకు ముందు ఎక్కడా చెప్పబడని తాజా తనం.... వుస్మానియా బిస్కట్ తో ఇరానీ చాయి తాగినట్టుగా అనిపిస్తాయి. మొదటి కథ నించి చివరి కథ దాకా వెళ్లడానికి పఠితకి కొంత వ్యవధి పట్టినా సరే, ముస్లిం అనుభవంలోని సాధారణ అంశాలు, వర్తమాన అంశాలుగా నిలిచే వాటిని కథావస్తువుగా తీసుకోవడం ద్వారా, ఆ అంశాలు ఎంతో కొంత ముస్లిమేతర సమూహాలకి కూడా సమస్యలే అయి వుండడం వల్ల ఇందులోని పాత్రలు మనకి పూర్తి అపరిచితంగా మిగిలిపోయే స్థితి నించి తప్పించుకున్నాయి. అందుకే, ఈ కథల్లోని వర్తమానం పఠితకి వొక తక్షణ వాస్తవికత. పైకి, నిర్దిష్ట ముస్లిం సమస్యలుగా కనిపించేవి – ముఖ్యంగా ముహబ్బత్ కథలో సౌందర్య భావన, “చోటి బహెన్” లో బుర్ఖా, ‘మజ్బూర్” కథలోని గరీబీ, కబూతర్ కథలో ఆడపిల్ల తల్లి వేదన - లాంటివి సాధారణ వర్తమాన అంశాలు. వాటితో మమేకం కావడానికి పఠితకి “ముస్లిం” అనుభవం గాని, ఆ భాష గాని ఆటంకం కావు. ఇక, “దస్తర్” “వతన్” లాంటి కథలు నిర్దిష్టంగా ముస్లిం అనుభవాలు. ఈ రెండు రకాల అనుభవాల మధ్య పఠితని నడిపించడంలో స్కైబాబా సఫలమయ్యాడు. ఆ నడకలోనే ఈ కథల్ని తెలంగాణ ముస్లిం కథగా మలిచిన నేర్పు కూడా వుంది. ఇక ‘జీవం” లాంటి కథలు కొంత ప్రయోగాత్మకత కూడా తోడయి, రచయితలోని అస్తిత్వ వేదనకి సంబంధించిన స్పష్టతని చెప్తాయి.

ఈ కథల్లోని పాత్రలు మన మధ్యనే వుండి, మనకి తెలియకుండా మిగిలిపోతున్న వాళ్ళు. అనేక కారణాల వల్ల మన స్మృతిలోంచి జారిపోతున్న వాళ్ళు. “ముస్లిం’ అనే వర్గీకరణ కింద నలిగిపోతున్న వాళ్ళు. మతపరమయిన ఉనికీ, గుర్తింపూ ముస్లింలకి మాత్రమే పరిమితం కాకపోయినా, మన పక్కన ముస్లిం వున్నాడంటే “అమ్మో” కాస్త భయపడాలనో, జాగ్రత్తగా వుండాలనో అన్నట్టుగా అధికార రాజకీయ వ్యవస్థ వొక అసహజమయిన భయాన్ని నిర్మించింది. మిగిలిన ఈ కుల, మత అస్తిత్వాల్లోనూ లేని సమస్య ముస్లిం అనే వర్గీకరణ కింద సృష్టించబడింది. “దావా’ కథలో స్కైబాబా రాజ్యం సాధారణ స్థాయిలో ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పాడు కానీ, అది ముస్లిం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో అన్న దాకా వెళ్ళలేదు. ఈ కథలో అట్లాంటి రాజకీయ కోణాలు అస్పృశ్యంగా వుండి పోయాయి. తనకి తెలియకుండానే, స్కైబాబా ఈ కథల్లో ముస్లిం సాంస్కృతికత మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. రోజు వారీ ముస్లిం బతుకు, అందులోని ‘దలిందరాగి’, ముస్లిం తల్లులూ, కొడుకులూ, కూతుళ్లూ, కొడళ్ళూ, మాయామయిపోతున్న ముస్లిం బహిరంగ సంస్కృతి, అనివార్యమవుతున్న వలసలూ వీటన్నిటి వెనకా వొక ముస్లిం అనుదిన సాంస్కృతిక వేదన వుంది. వొక విధంగా ముస్లిం ఫెమినిస్టు కోణాన్ని స్కై బాగా ప్రతిబింబించాడు. ఈ కథల్లో మిగతా వేరే కోణాలు వున్నప్పటికీ ఆ స్త్రీ స్వరంలోని తీవ్రతలో అవి కప్పడిపోయాయి. వొక పురుష రచయిత స్త్రీస్వరంతో అంత బలంగా మాట్లాడ్డం విశేషమే!

కానీ, మొత్తంగా ఈ కొత్త తరం ముస్లిం వేదనల పునాది ఇటీవలి మత రాజకీయాలలో వుందన్నది నా అభిప్రాయం. ఆ కోణం లోపించడం వల్ల ఈ కథలు ముస్లిం అనుభవపు అర్థ వలయాన్ని మాత్రమే చూపించినట్టయింది, ఆ రకంగా చూస్తే ఇందులో వున్న ముస్లిం అనుభవం ‘అధూరా”గా మిగిలిపోయిందనీ అనిపిస్తుంది. ఆ కోణం వైపు కూడా దృష్టి పెట్టి, ముస్లిం రాజకీయ కథలు కూడా రాసి, ఆ వలయాన్ని పూర్తి చెయ్యాల్సిన బాధ్యత స్కైబాబా వొక్కడి మీదే కాదు, తెలుగు-తెలంగాణ ముస్లిం రచయితలందరి మీదా వుంది.
*
Category: 2 comments

మరో ఎడోనిస్ కవిత: ఆమె అతను




- ఎవర్నువ్వు?
- ఇల్లూ వాకిలి లేని వో పిచ్చి మార్మికుడిని
ఆకాశం నించి రాలి పడిన రాయిని, దెయ్యం రాయిని.

- ఎవర్నువ్వు?
నువ్వు నా శరీరంలోకి ప్రయాణించావా?
-అనేక సార్లు

- అక్కడ నువ్వేం చూశావ్?
-నా మృత్యువుని.

-అప్పుడు నా ముఖం తొడుక్కున్నావా?
నా సూర్యుడిని నీడగా చూశావా
నా నీడని సూర్యుడిగా చూశావా
నా పక్క కిందకి తొంగి చూసి, నన్ను కనుక్కున్నావా?

- నువ్వు నన్ను కనుక్కున్నావా?

-అవును ఇద్దరం వొకరి కొకళ్లం ప్రతిబించుకున్నామా?
వొక నిశ్చల నిశ్చితాన్ని వెతుక్కునామా?
-లేదు

-నీ గాయాలన్నీ నయం చేశానా, లేదంటే
నువ్వింకా ఆ భయంతోనే వుండిపోయావా?
-లేదు

- పోనీ, నీకు నేను తెలుసా ఇప్పుడు?
-నీకు నేను తెలుసా?
Category: 8 comments

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

ఇవాళ "నమస్తే తెలంగాణ" దిన పత్రిక సాహిత్య అనుబంధం "చెలిమె"లో ప్రముఖ కవి, నాన్-ఫిక్షన్ రచయిత, మిత్రుడు కందుకూరి రమేశ్ బాబు నాతో చేసిన "ఈ-ముఖాముఖీ" అచ్చయింది. అక్షరం మిత్రుల కోసం ఈ బ్లాగులో పెడుతున్నాను.




అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న అధ్యాపకుడు. మన పల్లె బిడ్డే...కానీ ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో సాహిత్యం, సంస్కృతులను బోధిస్తున్న ఆసియన్ స్టడీస్ టీచర్. ‘అడవి, అగ్గి’ వంటి కథలు, ‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’, ‘వూరి చివర’ వంటి కవితా సంపుటులు, ‘ఆదునికత-అత్యాధునికత’, ‘కథ-స్థానికత’ వంటి సిద్ధాంత వ్యాసాలు, ‘దక్షిణాసియాలో హిందూ ముస్లిం సాహిత్య కథనాలు’ వంటి పరిశోధనా పత్రాలు- ఇవన్నీ అఫ్సర్ అంటే ఏమిటో తెలియజెప్పే కొన్ని అక్షరశస్త్రాలు. చిత్రమేమిటంటే, ఆయన మనవాడే, మొదటి ప్రపంచంలోకి వెళ్లినా స్థానికుడే. నవ్వేకళ్ల ఆ మహమ్మద్ మన ఖమ్మం బిడ్డ, ‘కౌముది’ కొడుకు. చిన్ననాడు చందోబద్ధంగా పద్యాలు రాస్తుంటే, ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అన్న స్నేహితుడి వెటకారం తొలి చురక.

తర్వాత విద్యార్థిగా ఉన్నప్పటి క్రియాశీల రాజకీయాల పదును, అటు తర్వాత మిర్రర్, ఇల్లవూస్టేటెడ్ వీక్లీల్లో ఇంగ్లీషులో కవిత్వం రాసేంత ప్రీతి, అటు తర్వాత పాత్రికేయం, విమర్శ, సాహిత్య అనుబంధాల అనుబంధం, ఇప్పుడు అధ్యాపకత్వం. అది ఏ అనుభవమైనా గానీ దాన్ని కవిత్వంగా మలచుకునే లక్షణం- అదే అఫ్సర్-ఏ పని చేసినా జీవన మూలాల్లో వెలుతురు ప్రసరింపజేయడం...చీకటి కరేల్మని కదిలినట్టు వెలుతురు గుప్పిట విప్పడం...ఎక్కడైనా...అక్కడెక్కడున్నా...టెక్సాస్‌లో ఉన్నా... అస్తిత్వ అన్వేషణ...ఊరి చివరి నుంచైనా సరే గొంతు విప్పే తత్వం...ఎక్కడున్నా అడ్డా మీద నిలబడ్డమే అనగలగడం...వూరునూ, తల్లినీ మర్చిపోని ఆర్తి- అదే అఫ్సరసం. ఆయన వృత్తీ, ప్రవృత్తీ, దృక్పథాల అస్తిత్వ ఛాయల్ని పంచుకోవడానికి ఇ-మెయిల్ ఉత్తరాలతో జరిపిన ఆత్మీయ సంభాషణ ‘చెలిమి’కి ప్రత్యేకం.

అక్కడున్నపుడు ‘మీ ఊరేమిటి’ అంటే ఏం చెప్తారు?
పెంచీ చదువు చెప్పించిన వూరు చింతకాని, ఖమ్మం జిల్లా. కని పెంచిన వూరు ఎప్పటికీ మారదు. మనమే బదిలీ అవుతూ వుంటాం, కొత్త బతుకుల్లోకి. వలస అనేది మనిషి జీవితానికి ఇరుసు. వలస అనేది ఎంత బలమయిన వాస్తవికతో ‘వలస’ (2000) కవిత్వంలో తెలుస్తుంది. వలస పోవడం అన్నది అనివార్య వాస్తవికత. వలస పోకపోతే కూడు లేదు. రెక్కల మీద బతికే వాళ్లకి మరీ- పట్టెడన్నం కోసం హైదరాబాద్ వలస వచ్చి, అడ్డాలో నిలబడ్డ కూలీలమే అందరం. నేను ఇంకాస్త ముందుకు వెళ్లి పెద్ద అడ్డాలో కడుపు పట్టుకుని నిలబడ్డా. అంతే! మారింది అడ్డా మాత్రమే. వూరూ మారదు. తల్లీ మారదు. అడ్డా మారినప్పుడల్లా బతుకు మారిందేమో చూసుకోవాలి.

కవిగా, విమర్శకుడిగా అఫ్సర్ అమెరికాలో.. ఏం పని
చేస్తున్నాడు?
కవికి స్థల కాల పరిమితులు లేవు. ఏ స్థలాన్నయినా, కాలాన్ని అయినా తనదిగా మలుచుకోగలిగితేనే కవిత్వం. కానీ విమర్శకుడి పరిస్థితి వేరు. నిరంతర అధ్యయనం ప్లస్ ఆలోచన- అది జీవితమైనా, పుస్తకమైనా- విమర్శకు పదును పెడుతుంది. మనం వేరే సంస్కృతుల్ని చూసే అవకాశం వున్నప్పుడు ఈ ఆలోచన భిన్నంగా ఎదుగుతుంది. టెక్సాస్ యూనివర్సిటీ భిన్న సంస్కృతుల వేదిక. అలాంటి టెక్సాస్ యూనివర్సిటీలో పని చెయ్యడం గొప్ప అవకాశం. ఇది అనేక సంస్కృతుల కేంద్రం. ఎన్ని వాదాలున్నప్పటికీ, అభ్యుదయ భావాలని అంటి పెట్టుకుని వుండే వ్యక్తిత్వం ఈ యూనివర్సిటీది. అదొక కారణం నా లోపలి కవి ఇప్పటికీ బతికే వుండడానికి.

అకడమిక్ గోరీలో పడిపోయాక కొన్నిసార్లు కేవలం అస్థిపంజరంగా మాత్రమే మిగిలిపోతాం. ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. ఏ అనుభవాన్ని అయినా కవిత్వంగా మలచుకునే లక్షణం నా లోపల వుందనుకుంటా. ఇక్కడ విమర్శకుడిగా నేను చేస్తున్న పని నాకు తృప్తిగా ఉంది. నేను చెప్పే కోర్సులు కూడా నా హృదయానికి దగ్గరగా వుండేవే కనుక వృత్తి రీత్యా ఇతర సంఘర్షణ లేమీ లేవు. కానీ, ఇది అనుక్షణిక సవాలు లాంటి వ్యవస్థ. వొక పట్టాన ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇంకా ఇంకా నిన్ను నువ్వు వెతుక్కోమని, తవ్వుకోమని కొత్త కొత్త పనిముట్లను మన ముందు పెడ్తుంది. అమెరికన్ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఇక్కడి పరిశోధనా తీవ్రత. విమర్శనాత్మక ఆలోచన. స్కాలర్షిప్ పట్ల గౌరవం. టీచింగ్ అంటే విపరీతమైన తపన. ఇవి అన్నీ కవిగా, విమర్శకుడిగా, బుద్ధిజీవిగా నన్ను పదును పెట్టాయని గట్టిగా చెప్పగలను.

ఒక కవిగా మీ తాజా కవిత్వం, మీ కవితా పిపాస ఎట్లా వ్యక్తం అవుతున్నది? ఎటువంటి అంశాల చుట్టూ మీ హృదయం గింగిరాలు కొడుతున్నది?
అస్తిత్వ అన్వేషణ ఇప్పటికీ నా కవిత్వ వస్తువు. అందులో భాగమే స్థానికత అనే భావన గురించి ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రతిపాదనలు. శరీరానికి, మనసుకీ, ఆలోచనలకీ ఇప్పటికే అలవాటు అయిన వొక స్థితికి దూరంగా వున్నప్పుడు ఆ స్థితిని కొంత విమర్శనాత్మకంగా, లోతుగా చూస్తాం. వూరు అదే. కానీ, మీరు హైదరాబాద్ వచ్చిన తరువాత ఆ వూరు అలాగే వుంటుందని నేను అనుకోను. కాకపోతే, నేను హైదరాబాద్ కన్నా కాస్త పెద్ద వూరికి వచ్చా. అప్పుడు ఆ వూరి గురించి మన ఆలోచనలు మారతాయి. ఉద్వేగాలు మారతాయి. ఈ కొత్త స్థితిని చెప్పడానికే నేను ‘ఊరి చివర’(2010) కవిత్వంలో ప్రయత్నించాను. అంతర్జాతీయ అస్తిత్వం అనేది ఎంత సాహసమో ఇప్పుడు రోజురోజుకి అర్థమవుతోంది. వొక్కోసారి అది దుస్సాహసం అని కూడా అనిపిస్తుంది. కానీ, తెగింపు లేకుండా జీవితం లేదు. తెగింపు నా బతుకు తత్వం కూడా. బరితెగింపు అంటే మళ్లీ నాకు నచ్చదు. పొట్ట పట్టుకుని వొక్కసారి వూరు విడిచి వచ్చిన వాడికి ఈ తెగింపు ఒక లెక్కకాదు. ఆకలి, దారిద్య్రం అనేది దానికదే వొక దేశం. ఆ దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు రాస్తున్న కవిత్వం అంతా ఈ ఆకలి దేశంలో సంచరిస్తున్న వొక స్థానికుడి ఘోష మాత్రమే.

ప్రధానంగా మీ అధ్యయన అంశాలేమిటి? గతానికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమైనా వున్నదా? ఈ మాట ఎందుకంటే, సుదూరాల నించి మళ్లీ మనకి మాతృకగా వున్న అంశాలను బేరీజు వేసుకుంటూ ఎదగడం; ప్రపంచ పౌరుడిగా ఉంటూ స్వీయ అస్తిత్వాన్ని నొక్కి చెప్పగలిగే అవకాశం రావడం అరుదైనది కదా! అటువంటి అదృష్టవంతుల్లో మీరొకరని అడగడం.....?
నేను ప్రధానంగా మైనారిటీ అస్తిత్వ సాహిత్యం-సంస్కృతి మీద దృష్టి పెడ్తున్నాను. మైనారిటీ అంటే ముస్లిం అని కాదు. ప్రపంచ సాహిత్య దృష్టి నించి చూసినప్పుడు మార్జిన్స్(అంచుల) నుంచి వస్తున్న సాహిత్యం అంతా మైనారిటీ సాహిత్యమే. దళితులు, ముస్లింలు అణచివేతకి గురవుతున్న అందరి సాహిత్యం. కానీ, స్థూలంగా మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు నాకు కేంద్ర బిందువు. గతంలోనూ, ఇప్పుడూ వచ్చిన మార్పు ప్రధానంగా కొత్త విమర్శ సాధనాలు సమకూర్చుకోవడం. తెలుగు స్థానికతని, ప్రపంచ స్థానికతతో పోల్చుకొని చూసుకోగలగడం- సరిహద్దులు చెరిగిపోతున్న కాలంలో స్థానికత- అంతర్జాతీయతల మధ్య సంభాషణ అత్యవసరం అనుకుంటున్నాను. అయితే మీరన్నట్టు ఇదంతా తిరిగి స్వీయ అస్తిత్వ వ్యక్తీకరణ కోసమే.

ఎనభై, తొంభై దశకాల్లో సీరియస్ సాహిత్య విమర్శకుడిగా వుంటూ మీరు అధ్యయనం చేసి, అనుభవించిన పలవరించిన అంశాలు- విమర్శకూ, వాదనకూ పెట్టిన అంశాలు-ఆ క్రమంలో వ్యక్తమైన ఆలోచనలూ-అక్కడి నించి వెనుదిరిగి చూస్తే ఆ మార్పు ఎట్లా అనిపిస్తుంది?
1992లో ‘ఆధునికత- అత్యాధునికత’ విమర్శ వ్యాసాల్లో మొదటిసారిగా అస్తిత్వవాదాల్ని సిద్దాంతీకరించినప్పుడు అది చర్చనీయాంశమయ్యింది. అప్పటికే స్థిరపడి వున్న ప్రధాన స్రవంతి ధోరణుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. ఇప్పుడు ఆ అస్తిత్వ వాదాలే ప్రధాన స్రవంతి అయ్యాయి. అప్పుడు ప్రతిఘటించిన చాలామందే ఇప్పుడు వాటిని తలకెత్తుకునే స్థితి ఏర్పడింది. అప్పుడూ ఇప్పుడూ నాకు అర్థమయ్యింది వొక్కటే. రాజకీయ ఎత్తుగడలు వేరు, రాజకీయ దృక్పథం వేరు. సాహిత్యంలో రాజకీయ కోణం ఇంకా బలంగా వ్యక్తం కావాలన్నది నా స్థిరమైన అభివూపాయం. నేను మొదటి నించీ చేస్తున్న వాదం అదే. ఇప్పటికీ అదే అంటాను. సాహిత్యం నా దృష్టిలో అత్యంత బలమైన రాజకీయ ప్రకటన. ఎనభై, తొంభైల తెలుగు సాహిత్యం మనకి నేర్పిన పాఠం ఇదే.

ఇక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు-ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పోరు పతాక స్థాయికి వెళ్లిన తరుణంలో మొదటి ప్రపంచంలో వుంటూ మూడో ప్రపంచంలో ఈ మలి తెలంగాణ వర్తమాన ఉద్యమ స్రవంతిని ఎట్లా పరిశీలిస్తున్నరు?
ముందు ఆ మొదటి ప్రపంచం, మూడో ప్రపంచం అనే భావనకి ఇప్పుడు అర్థం లేదనుకుంటా. ఇంకెక్కడి మొదటి ప్రపంచం? వర్తమాన రాజకీయార్థిక కోణం నుంచి చూస్తే, అది అస్తవ్యస్తమయ్యింది. ఇక తెలంగాణ అస్తిత్వ పోరు కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితం కాదు. ప్రపంచంలో తెలంగాణ వాళ్లు ఏ మూల వున్నా అక్కడ తెలంగాణ ఉద్యమం వుండి తీరుతుంది. అమెరికాలో దాదాపు అన్ని పెద్ద నగరాల్లో తెలంగాణ ఉద్యమ సంఘీభావం జోరుగా వుంది. అక్కడ జరుగుతున్న నిరసనలన్నీ ఇక్కడా జరుగుతున్నవి. ఇక్కడా రచయితలు సంఘటితమవుతున్నారు. కాబట్టి, ఒక రచయితగా నేను కేవలం పరిశీలకుడిని కాను. ఈ ఉద్యమంలో భాగస్వామిని. ఆనాటి తెలంగాణ పోరాటం కంటే ఈనాటి తెలంగాణ పోరాటానికి అంతర్జాతీయత ఎక్కువ ఉంది. ప్రపంచ సంఘీభావం కూడా ఎక్కువ వున్నది.

మీరు అమెరికాలో చేపట్టిన పనులు, వాటి విజయాలు చెప్పండి?
ఇక్కడ నా పని మూడు రకాలుగా సాగుతుంది. వృత్తి, ప్రవృత్తి, దృక్పథం మూడింటిని కలిపే అధ్యాపకత్వం. ఆస్టిన్ టెక్సాస్ యూనివర్సిటీలో నేను చెప్పే వివిధ సాహిత్య సాంస్కృతిక కోర్సులు ఇదెలా సాధ్యమో చెప్తాయి. దళిత సాహిత్యం- సంస్కృతి మీద నేను మొదటిసారి కోర్సు రూపొందించి, పాఠాలు చెప్పాను. అట్లాగే, దక్షిణాసియా సాహిత్యం-సినిమాలు, ముస్లిం సాహిత్యం, ఆధునిక భారతీయ సాహిత్యం అస్తిత్వాలు, ఇవి నేను రూపొందించిన కోర్సులు. ఇవి బాగా విజయం సాధించిన కోర్సులు కూడా. మొదపూట్టి అయిదేళ్లు అయినా ఈ కోర్సులకు విద్యార్థులు ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్‌లో వుండడం విశేషం. ఈ కోర్సుల స్ఫూర్తితో కొంతమంది విద్యార్థులు తెలుగు సాహిత్య పరిశోధన వైపు మళ్లుతున్నారు. ఇక భాషా పరంగా, ఇక్కడి తెలుగు భాష కోర్సు అమెరికాలోనే పెద్దది. ఏటా నలభైమంది ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు.

పరిశోధన, విమర్శ పరంగా సాహిత్య అనువాదాలు, వాటిమీద విమర్శ ప్రధానమయిన పని. ఈ రంగంలో తెలుగు సాహిత్యానికి వీలయినంత ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు నించి తగినన్ని అనువాదాలు లేనప్పుడు నేనే సొంతంగా అనువాదాలు చేసుకొని, ఈ విమర్శ వైపు దృష్టి పెడతున్నాను. అయితే, సాహిత్య పరిధులని దాటి సాంస్కృతిక అధ్యయనం వైపు మళ్లడం చాలా అవసరం అని నాకు అనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం మీద నేను రాసిన రచనలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో, సంపుటాలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం దళిత, ముస్లిం కవిత్వాల అనువాదాల పనిలో వున్నాను. అమెరికాలోని వివిధ భాషా సాహిత్య సంఘాలలో వున్నాను. కవిత్వ పఠనాలలో పాల్గొంటున్నాను. కవిగా- ఇక్కడికి వచ్చాక ఒక కవిత్వ సంపుటి వేశాను. వొక కవిత్వ సంకలనం ‘అనేక’ సంపాదకత్వం వహించాను. తెలుగు ముస్లిం సాహిత్యం అంతా కొన్ని సంకలనాలుగా తీసుకురావాలన్న ఆలోచన వుంది.

ఆస్టిన్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆసియన్ స్టడీస్‌కి వున్న ప్రాధాన్యం? అక్కడి మీ పాత్ర గురించి చెప్పండి?
అమెరికాలోని అతి పెద్ద ఆసియన్ స్టడీస్ విభాగం టెక్సాస్ యూనివర్సిటీది. ఇది ఇప్పటికే హిందీ-ఉర్దూకి పెద్ద కేంద్రం. ఇప్పుడు ఇదే తెలుగుకు పెద్ద కేంద్రంగా మారుతోంది. ఈ శాఖలో ఆసియా సాహిత్యం, మతం, సంస్కృతికి సంబంధించిన కోర్సులు, పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో కూడా ఇండియా, చైనా, జపాన్‌లది పెద్ద పీట. నేను చెప్పే కోర్సులు మొత్తంగా ఆసియా సాహిత్య సాంస్కృతిక అంశాలకే సంబంధించినవి. నాకు ఇష్టమైన అంశాలు స్థూలంగా- మైనారిటీ మతాల ఉనికి, సాహిత్యం, సంస్కృతి. ఈ పరిధిలో నవల, కథ, కవిత్వం- ఇవి నేను ప్రధానంగా పాఠాలు చెప్పే రంగాలు. ఏమరీ, యేల్, విస్కాన్సిన్, డ్యూక్ తదితర పెద్ద విశ్వవిద్యాలయా లో ఈ అంశాల మీద ప్రసంగాలు కూడా చేశాను. ముస్లిం మౌఖిక కథనాల మీద నా మౌలిక పరిశోధనకి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫెల్లోగా ప్రకటించింది. ఈ కథనాలు ఇపుడు పుస్తక రూపంలో రాబోతున్నాయి. అరబ్-కేంవూదిత కోణాలని స్థానిక ఇస్లాం, ముస్లిం సాంస్కృతిక ఉనికి ఏ విధంగా సవాల్ చేస్తుందో చెప్పడం నా అధ్యయనంలో ప్రధాన అంశం. వివిధ కోణాల నుంచి అంటే - మత కథనాలు, సాహిత్య కథనాల ఆధారంగా నేను ఈ అంశం చుట్టూ నా వాదన పెడుతున్నాను. నేను చెప్పే కోర్సులు కూడా అంతిమంగా ఆ చర్చ వైపు వెళ్తాయి.

అన్నట్టూ అక్కడి మీ పరిచయాలూ, నెట్‌వర్క్స్?
ఆంవూధాలో వుండగా, గుగీ, వోలె సోయింకా, గేరీ సై్నదర్ లాంటి రచయితల్ని కలవగలమా అన్న కల ఉండేది. ఆ కల కొంతలో కొంత అయినా ఇక్కడ నిజమవుతుంది. వివిధ యూనివర్సిటీలకీ, సదస్సులకీ వెళ్లినప్పుడు అట్లాంటి వారితో గడిపే అవకాశాలు బాగా దొరుకుతున్నాయి. సరే, నా నెట్‌వర్క్ అంటారా? నేను అనేక రకాల చర్చా గ్రూపులలో భాగస్వామిని. కానీ టీచింగ్, రచనా వ్యాసంగం వల్ల వీటికి పెద్ద సమయం పెట్టలేకపోతున్నా. చివరికి మిగిలేది కాగితం మీది అక్షరమే అన్న భావం కూడా లోపల బలంగా వుందనుకోండి.

సంస్కృతి, భాషల ఆధ్యయనంలో సినిమా కూడా బలమైన సాధనం అని మీరు భావిస్తున్నట్టుగా మీ యాక్టివీటిస్‌ను బట్టి తెలుస్తోంది?
అవును, సంస్కృతిలో బలమైన భాగం సినిమా, థియేటర్, ప్రజా సంస్కృతి. నేను చెప్పే కోర్సులలో ఇవి మూడూ ముఖ్యమయిన భాగం. సినిమాలుగా మారిన నవలల మీద రెగ్యులర్‌గా వొక కోర్సు చెప్తున్నా. ఆ మూడు వాహికలు మూడు భిన్న భాషలు, వాటి మధ్య సంబంధాన్ని చూసినపుడు ఆధునికత ఎట్లా మారిందో తెలుస్తుంది.

గ్లోబలైజేషన్ మిమ్మల్ని జీవన మూలాలకు అంటి పెట్టుకునేలా చేసింది. అదే రీతిలో అంతర్జాతీయ సమాజంలో ఆత్మీయమైన అంశాలను భోదించే అధ్యాపకుడినీ చేసిందీ అంటే మీరు ఒప్పుకుంటారా?
జీవన మూలాల అన్వేషణే గ్లోబలైజేషన్ నెగెటివ్ ప్రభావాల నుంచి మనల్ని కాపాడుతుంది. గ్లోబలైజేషన్‌కి సమాధానం భిన్న స్థానికతల అన్వేషణలో వుందని నాకు గట్టి నమ్మకం. ‘కథ-స్థానికత’(2010) వ్యాసాలలో నేను చెప్పాలనుకుంది అదే. రచయితగా నా వ్యక్తిత్వానికి కొనసాగింపే నా అధ్యాపకత్వం, నా పరిశోధనా. అది మీరు, చాలామంది మిత్రులు- అక్కడా-ఇక్కడా స్పష్టంగా గుర్తించడం నాకు సంతోషం.
ఒకనాడు ఇంగ్లీష్ కవిత్వం రాసిన మీరు మళ్లీ ఇప్పుడు ఇంగ్లీషులో రచనా వ్యాసంగం వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది?

అవును, నా రచనా వ్యాసంగం ఇంగ్లీష్ కవిత్వంతో మొదలయ్యింది. తెలుగులోకి నేను ఆలస్యంగా అడుగు పెట్టాను. వొక రకంగా తెలుగులో రాయడం అనుకోకుండా జరిగింది. నిస్సిమ్ ఏజెకీల్, కమలాదాస్, రామనుజన్ లాంటివారి ఇంగ్లీష్ రచనల్నీ తెలుగులోకి అనువదించాలన్న ఆలోచనల్తో తెలుగులోకి మళ్లాను. అప్పటికే నా ఇంగ్లీష్ కవిత్వం అచ్చయింది. డిగ్రీలో నా మేజర్ ఇంగ్లీష్ సాహిత్యం. కాలేజీలో మంచి అధ్యాపకుల వల్ల, మంచి స్నేహితుల వల్ల ఇంగ్లీష్ అంటే బలమైన ఇష్టం ఏర్పడింది. శివాడ్డి గారు ఇప్పటికీ అంటారు. అట్లా ఇంగ్లీష్‌లో కొనసాగి వుంటే అద్భుతంగా ఉండేది అని! ఇంగ్లీష్‌లో అయినా, తెలుగులో అయినా నాకు మొదట్లో ఛందోబద్ద పద్యాలు రాసే అలవాటు ఉండేది. ఒకసారి తెలుగులో పద్యం రాస్తే ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అని వొక చిన్ననాటి స్నేహితుడి వెటకారం తెలుగులోకి గట్టిగా తోసింది. ఆ మిత్రుడి వెటకారం నా తెలుగు కవిత్వానికి బలాన్నిచ్చింది, వొక పొగరు నిచ్చింది. ఆ మిత్రుడి వెటకారమే లేకపోతే ఇవాళ నా కవిత్వమూ లేదు. విమర్శా లేదు. ఇక ఇప్పుడు తిరిగి ఇంగ్లీషులోకి రావడం అవసరం అయ్యింది. అంతే! ఇక్కడి నా కోర్సులలో ఎంతో కొంత తెలుగు సాహిత్యం ఉపయోగించాలన్న తపనతో కొన్ని అనువాదాలు చెయ్యడం మొదలుపెట్టాను.

పాఠకుడితో సంభాషించడం అలవడిన మీకు విద్యార్థులకు కమ్యూనికేట్ చెయ్యడం ఎట్లా ఉంది?
అది కొంచెం కష్టమైన మార్పు. కానీ, మనం అంతా మౌఖిక సంప్రదాయం నించి వచ్చిన వాళ్లం, పల్లెల నించి వచ్చిన వాళ్లం. పాటలూ, కథల నుంచి వచ్చి వాళ్లం. మనకి పాఠకుల కంటే ముందు తెలిసేది శ్రోతలే. పాఠకుడు మనకు రెండో దశ. కాబట్టి ముందు దేన్నయినా ‘మాట’లో ఎట్లా పెట్టాలన్నది మనకు కొంత అనుభవం ఉంటుంది. తరువాతి కాలంలో నేను విద్యార్థి రాజకీయాలలో క్రియశీలంగా పనిచేశాను.

పొట్టకూటి కోసం ట్యూషన్లు చెప్పుకున్నాను. ఇవన్నీ గొప్ప అనుభవాలు. ఆ అనుభవాలలో ‘పా లేడు కదా! ఒక పల్లె నుంచి వచ్చిన విద్యార్థిగా విద్యార్థుల సంఘర్షణ ఏమిటో నాకు అర్థమవుతుంది. వాళ్ల బాషా సాంస్కృతిక సమస్యలు సహానుభూతితో వినగలను, అర్థం చేసుకోగలను. లెక్చరు దంచడం కంటే ఇది కష్టమైన ప్రక్రియ అని నా నమ్మకం. ఇక్కడి విద్యార్థులు నాకు రాసే కామెంట్లలో ఎక్కువగా వాళ్లు నా వ్యక్తిత్వం గురించి రాస్తారు. కమ్యూనికేషన్ అనేది మన వ్యక్తిత్వానికి కొనసాగింపు మాత్రమే అనుకుంటాను.
.ఇది మొదటి ప్రపంచానికి.... మూడో ప్రపంచపు కొన్ని పార్శాలను అందజేయ గలగడమా... కొంచెం వివరించండి!

‘నేనే వొక మూడో ప్రపంచాన్ని...’ అనే కవిత నా ‘వలస’ పుస్తకంలో వుంటుంది. మొదటి ప్రపంచమే కాదు. ఏ ప్రపంచమైనా బాగా అర్థం కావాలంటే, మూడో ప్రపంచ కోణమే ఉపయోగపడుతుంది. ఇండియా నుంచో, లాటిన్ అమెరికానించో, ఆఫ్రికా నించో, మధ్య ఆసియా నించో వచ్చిన వాళ్లు అమెరికాని, యూరప్‌ని బాగా అర్థం చేసుకోగలరు. అందుకే, ఇక్కడ బాగా పేరున్న అధ్యాపకులు ముఖ్యంగా ఆ దేశాల నించి వచ్చిన వాళ్లు లేదా ఆ అంశాలని బోధించేవాళ్లు పరిశోధించే వాళ్లు అందుకే స్థానికత కంటే గొప్ప కొలమానం ఇంకోటి లేదని వాదిస్తాను. స్థానికతని చూసే నిశిత దృష్టి వున్నపుడు గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ.
-అమెరికాలో ఉన్న అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు
Category: 16 comments

తూరుపు చెట్టు




నేనొక అద్దానయ్యాను
అన్నీ నాలో ప్రతిబింబిస్తున్నాయి

నీ జ్వాలలో నేను
ఆ నీటినీ, ఆ మొక్కనే మార్చేశాను.

శబ్దం రూపునీ
పిలుపునీ మార్చేశాను

నిన్ను రెండు గా చూడడం మొదలెట్టా
నిన్ను నిన్నుగా
నా ఈ కంటిలో ఈదుతున్న ముత్యంగా

ఆ నీరూ నేనూ ప్రేమలో పడ్డాం

అటు తరవాత
నీరు నా లోపలి నించే పుట్టింది.


ఎంచక్కా మేం కవలలమయ్యాం

మూలం: ఎడోనిస్ (ఆరబిక్ కవి)

ఇప్పుడు ఎనిమిది పదుల వయసు దాటిన ఎడోనిస్ మొన్న నోబెల్ సాహిత్య ప్రైజ్ కి చివరి దాకా వచ్చాడు; అది కొద్దిలో తప్పిపోయింది. అప్పుడు చాలా మంది కవిత్వాభిమానులు నోబెల్ వొక మంచి గౌరవాన్ని కోల్పోయిందని అన్నారు. ఎడోనిస్ అసలు పేరు అలీ అహ్మద్ సయ్యద్ అస్బర్. ఆ పేరుతో కవిత్వం పంపితే అన్ని పత్రికలూ తిప్పికొట్టడంతో అతను ఎడోనిస్ అనే కలం పేరుతో రాయడం మొదలెట్టాడు. ఆధునిక అరబిక్ కవిత్వంలో వొక నవీన సూఫీ యుగానికి నాంది పలికిన వాడు ఎడోనిస్.

చలి రాత్రి వొక వీడుకోలు




వచ్చే సెమిస్టరు నేను ఆసియా భక్తి కవిత్వం మీద వొక కొత్త సెమినార్ కోర్సు చెప్పబోతున్నాను. అందులో భాగంగా చైనా, జపాన్ బౌద్ధ కవిత్వం చదువుతున్నా ఈ మధ్య.

కవిత్వం ఏం చెయ్యాలి? కవిత్వం చేసే పని ఎట్లా వుండాలి? అనేవి రెండు పెద్ద ప్రశ్నలు. వాటికి ఎవరి దగ్గిర వున్న సమాధానాలయినా అవి పూర్తి సమాధానాలు అయి వుంటాయని నేను అనుకొను. కానీ, ఏదో వొక సమాధానం రాబట్టుకొని తీరాలన్న మొండితనం కవికి వుండాలి, పఠితకీ వుండాలి. లేకపోతే, ఇద్దరి అన్వేషణా అధ్వాన్నపుటడవుల్లోకి జారిపోతుంది.

నా మటుకు నాకు ఈ బౌద్ధ కవిత్వ యాత్ర వొక కొత్త అనుభూతి. కొత్త దారి.
తెలియదు, ఈ దారిలో నేను ఎటు మళ్లుతానో?

ఈ కవితలో ఈ చైనా కవి అనేక శతాబ్దాల కిందట వీడుకోలు చెప్పింది నాకేనా?


చలి రాత్రి వొక వీడుకోలు

ఆ మొదటి మలుపు దీపం చూడూ,
అటుగా ఆ వూరి వంతెన మీంచి నేరుగా వెళ్ళు.


ఏటి మీద మొగ్గలు ముద్దలుగా
రాలిపడుతుంటాయి, కరగని మంచు.


ఇంత చలిలో - మరీ కురచని ఈ పగళ్లలో-
నువ్వు వెళ్లిపోవడం దిగులుగా వుంది.


ఈ కొండలేమో అంతులేనివి,
మరి, నువ్వు అందుకోవాల్సిన బాట మరీ దూరం!


(మూలం: chia tao 779-843)

ఎప్పటిలాగే ఆ ఎప్పుడూ!

1
ఆ ఎప్పుడు ఎప్పటిదో తెలిస్తే ఇంకేం లే?

....లాగే...లాగే.. లాగా అన్నది సరేలే!

2

రోజులు అంకెల మొహాలు వేలాడదీసుకొని

అప్పుడప్పుడూ నిన్నమొన్నటి చొక్కాలా గోడకి

వే
లా
డు
తూ.



3
చెప్పేందుకు కొత్తదేమీ లేదు ఖాయంగా

రొటీన్ కోరుకుతూనే వుంది గాయంగా.

4

వైణికుడు వొకే దుక్ఖంలో దూకి

మరేదో రాగంలో తేలిపోతూ.


ఎప్పటికప్పుడు ఏమీ తెలియకుండానే!

5
అలా వున్నామో ఎప్పటిలాగా

ఎలా వున్నామో అప్పటిలాగా

అలా ఎలా వున్నామో అప్పటి ఎప్పటిలాగా.

6

గది మూల వొదిగిపోయాయి అన్నీ

పుస్తకాలూ సంగీతం పెట్టెలూ ఇష్టాలూ

కాసిని ప్రేమలూ కొన్ని మోహాలూ ఇంకా కొన్ని అహాలూ!

7

ఈ పొద్దయినా
వొక్క
దులుపు దులపరా!
Category: 11 comments

నీ పన్నెండో గంట...



నిద్రలో
కల తెగిపోతూ వుండొచ్చు

కలలో
నిద్ర తేలిపోతూ వుండొచ్చు

కలత నిద్ర
అక్కడయినా, ఇక్కడయినా!

అటు నువ్వు చంద్రుణ్ణి కప్పుకుంటావు
ఇటు నేను సూర్యుడి కంటి కింద నలిగిపోతూ వుంటాను

ఎంత కవిత్వమయినా
పగలెప్పుడూ వెన్నెల కాదు,

రాత్రి ఎప్పుడూ సూర్యుడిది కాదు.


కలలు కనే వేళలు మారిపోయాయి మనకి,
అంతే!
Category: 8 comments
Web Statistics