మెటమార్ఫసిస్

(సాక్షి ఇవాళ సాహిత్య పేజీలో 'మన కవిత్వం- దశ, దిశ" అనే అంశం మీద కొందరి అభిప్రాయాలు ప్రచురించింది. అందులో నా అభిప్రాయం ఇది. మిగిలిన అభిప్రాయాల కోసం చూడండి, సాక్షి

తెలుగు సమాజం అనూహ్యమైన మార్పుల ఉద్రిక్తతలో ఉన్న ఈ సమ యంలోనే వచన కవిత్వం కొత్త రూపంలోకి వలసపోతోంది. ఈ రూపాన్ని ఎట్లా నిర్వచించగలమో ఇంకా తెలియదు. వచనం అనే పూర్వపు పదం ఇప్పుడు అవసరమే లేదు. ఇది అచ్చంగా కవిత్వమే. కొన్ని కొత్త రూప లక్షణాల గురించి మాట్లాడాల్పి వస్తే, ఈ కొత్త రూపం మాటల బరువు తగ్గించుకుంటోంది. సంభాషణల్లోని సజీవమయిన భాషని దగ్గరకు తీసుకుంటోంది. కథనాత్మక నడకని అనుసరిస్తోంది. పదచిత్రాలని పదాల్లో కాకుండా ఆలోచనల్లోకి అనువదిస్తోంది. కవిత్వం ఆవేశాత్మక రూపమని అనుకుంటాం. కాదూ, అది ఆలోచనాత్మక రూప మని కొత్త కవిత్వం చెబుతోంది. తెలంగాణ నించే వచ్చే కొత్త కవిత్వం ముఖ్యంగా ఈ దిశగా వెళుతోంది.

- అఫ్సర్
Category: 0 comments

అమెరికన్ కవిత్వంలో ఒక దక్కన్ కెరటం!




“దక్కన్” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.



2007 అమెరికన్ కవిత్వ సంపుటంలో మొదటి పుటలో కాజిం అలి కవిత్వం కనిపించింది. ఆ కవిత హిందూ-ముస్లిం ప్రతీకల సమాహారం. దక్కన్ ఇండియా- అమెరికన్ అనుభవాల మేలు కలయిక, అచ్చం నేను తాగే కొబ్బరి కాఫి లాగా.

కాజిం అలి హిందూ ధర్మ గ్రంధాలు శ్రద్ధగా చదువుకున్నాడు, పుట్టి పెరిగిన దక్కను ఇస్లాం వాతావరణం అతని జీవితంలో విడదీయలేని భాగం. రోజూ యోగాతో మొదలయ్యే ఇతని దినచర్య కవిత్వ పాఠాలతో కొనసాగి, కవిత్వ రచనతో ముగుస్తుంది. సూఫీ తాత్వికత తన జీవితాన్ని నడిపించే సూత్రం అని నమ్ముతాడు కాజిం. అతని కుటుంబ చరిత్ర వొక విధంగా దక్షిణ భారత ఇస్లాం చరిత్ర. వెల్లూరు నించి అతని కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది. కాజిం బాల్యం హైదరబాద్ పాత బస్తీలో గడిచింది. తన కవిత్వంలో కనిపించే మత ప్రతీకల్లో ఆ హైదరాబాదీ బాల్యపు పునాదులు వుంటాయంటాడు కాజిం. కాజిం ఇప్పటి దాకా రెండు కవిత్వ పుస్తకాలు అచ్చులో చూసుకున్నాడు: వొకటి, “ఫార్ మాస్క్” (దూరపు మసీదు), రెండు: “ఫార్టియత్ డె” (నలభయ్యొ రోజు).

అమెరికాలోని వొక ప్రసిద్ధ కాలేజిలో కవిత్వ పాఠాలు చెప్పే కాజిం అలికి కొంచెం తెలుగు వచ్చు. “తెలుగులో కవిత్వం బాగుందని విన్నాను. యేనాడయినా ఆ కవిత్వం చదవాలని అనుకుంటున్నా” అంటాడు కాజిం.

గ్యాలరి

వొక ఎడారి దాకా వచ్చావు నువ్వు
వొక్క అక్షరమ్ముక్కా లేకుండా
దెయ్యం పట్టినట్టు
ఆకలితొ మాడిపోడానికేగా?

వయొలిన్ మీద సూర్యుడి చెయ్యి
అనంతమయిన దిగంతాన్ని చెక్కుతూ వుంది.

కౌపీన వస్త్రాలు ఎకరాల కొద్దీ
నీలి ధూళీ దూసరితమయిన ఆకాశం నెత్తిన
యెవరో వొక అపరిచిత యువకుడు నీ పక్కన.

విలియం బ్లేక్ కి కలల చిత్రాలు గియ్యడం
నేర్పిన మనిషిలోకి తొంగి చూస్తూ.

బహుశా నువ్వు అనుకుంటూ వుంటావు:
ఆ స్పర్శకి నేను సిద్ధమే.
అతనికి దొరికిపోవడానికీ సిద్ధమే”

బహుశా అతనూ అనుకుంటూ వుంటాడు:
ఇంత మిట్ట మధ్యాన్నం
ఇలా తప్పిపోయానేమిటి?
మరీ అంతూ పంతూ లేకుండా?!”

నీకెప్పుడు తెలుస్తుందో?
ఈ రాత్రి: ఈ చప్పుళ్ళు

వూదా వెతుకులాటలు
వయొలిన్ ఆకలి కడుపు మార్మోగి పోతుంది.

నాలుగు తీగలతొ
బట్ట బయలయ్యే గాయం – సంగీతం.

వొక ఆకలి సైన్యం
రాగాలుగా వణికి పోతుంది.

ఆకలితో
మాడిపోడానికేగా కదా
వచ్చావు, ఈ ఎడారికి!
Category: 1 comments

బచ్ పనా...




ఇన్నిన్ని దుఖాల మధ్య

వొక్క సంతోషపు తునకా

లేదు, లేదనేనా ?



రాత్రి చుట్టపు చూపు కలల్లోనూ

ద్రోహాల వంచనల మోసాల కథల క్లిప్పింగ్స్.

వొక్క స్నేహరాహిత్యం మాత్రమేనా వేల వర్ణాల మాయ?!


కాసింత ప్రేమ ఎప్పుడూ తెలుపు నలుపుల నిర్మోహ చిత్రమేనా?

అప్పుడప్పుడూ
ఆ చిన్నప్పటి తలుపు తీసి
పద,
వెళ్దాం బచ్ పన్..ఆ ప్రాచీన దేశంలోకి!పూర్వ దేహంలోకి!


బచ్ పనా...ఎవరూ ఎల్ల కాలమూ అక్కడే ఆగిపోరు, నిజమే.
వెళ్లిపోవాలి ముందుకే ...అదీ నిజమే.


అట్లా అని ఎంతదూరమో వెళ్లరులే,

వొక మోహం నించి ఇంకో నిర్మోహంలోకి,

వొక లిప్త ఉత్సాహంలోంచి ఇంకో నిర్లిప్తతలోకి.


అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్ర నగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ

వొక లేత గులాబీ కల - బచ్ పనాలోకి.


మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుందా,

అక్కడే ఆగిపోదామనీ, కాసేపు గడ్డకట్టిపోదామని.



ఇంకో నిజం కూడా ఇంతలోనే చెప్పనీ,

ఇంతకూ- ఆ వొక్క కల మాత్రం ఎవరి సొంతం?!
అందులో లేతదనం ఎంత కల?!
Category: 5 comments

Not Home Yet!




చికాగో విశ్వవిద్యాలయంలో ఇస్లాం మీద పరిశోధన చేస్తున్న ఎలిజబెత్ లొస్ట్ ఈ ఏడాది మాడిసన్ లో తెలుగు కూడా నేర్చుకుంది. "నాన్న రాలేదు" అనే కవితని ఆమె ఇంగ్లీషులోకి అనువాదం చేసి, మాడిసన్ లో జరిగిన దక్షిణాసియా సాంస్కృతిక ఉత్సవంలో అద్భుతమయిన కరతాళ ధ్వనుల మధ్య వినిపించింది. ఈ కవితని ఆమె తెలుగులో, నేను ఇంగ్లీషులో చదివాం.


Nanna [Father] has not come home yet
And yet ... And yet ...
He has not come home yet


This city is burning beneath my eyes
This city is burning under my feet


Nanna has not come home yet

Again and again she turns back,
Conversing with the clock on the wall, Amma [Mother]


She stares at the hands on the clock.
Eight ... Nine ... Ten

Nanna has not come home yet


Amma might be counting seconds,
Or counting the bodies
Seen on the TV. I don’t know.

Come, Nanna!

Right now, the smell of roasting rotis
Right now, ground tomato, chilli, chutney
Hunger is screaming, Nanna.

Without your coming, Amma won’t let me touch
A grain of rice.
Come quickly, Nanna!

Amma is glued to the back door
Right now it’s been a long time
Since you said you’d just go and come.
Nanna has not come home yet.

“Amma! I’m hungry!”

“The city’s burning, you know?!
There’s always so much hunger!
Just kill me, cut me up, and eat me.”
Yelling this, she then muttered...

“It’s not finished yet.
It hasn’t burned yet.
Dead bodies heaped in piles,
Blankets of flame still burning,
They are still burning ... since ‘47 ... ”

Nanna didn’t come home that night
This night neither.
Category: 9 comments

నా పేరు ...




నమ్మరా బాబూ నమ్మరా నన్ను ఈ పాస్పోర్టు సాక్షిగా ఇందులో వున్న నా అయిదారేళ్ల కిందటి నెరవని నా మీసాల నా తలవెంట్రుకల సాక్షిగా నమ్మరా, నేనేరా అది!

సరిహద్దులు లేవు లేవు నాకు అని రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని నడుస్తూ పరిగెత్తుతూ వుంటా ఎయిర్ పోర్టుల గాజు అద్దాలు పగలవు నేనెంత ఘాట్టిగా కొండని ఢీ కొట్టినా.

నమ్మరా నన్ను నమ్మరా నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా. కాగితం తుపాకీని చూసినా మూర్ఛపోయే అమాయకుణ్ణిరా నమ్మరా నన్ను నమ్మరా.

భయపెట్టే నీ స్కాను కన్నుల గుండా నడిచెళ్లిన ప్రతిసారీ నా శల్యపరీక్ష లో సిగ్గుతో పది ముక్కలయి నా టికేటు మీద మూడు ఎస్సులు నా నిజాయితీనీ నా నీతినీ నా శీలాన్ని శంకించినా నమ్మరా నన్ను నమ్మరా

దేశాలు లేని వాణ్ణి రా
కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా

తల్లీ తండ్రీ తాతా ముత్తాతా అందరికి అందరూ వున్నా
వొంటి మీది చొక్కా మాత్రమే మిగిలిన వాణ్ణిరా

నమ్మరా నన్ను నమ్మరా
నేనొట్టి ఆవారానిరా
నేనొట్టి పాగల్ గాణ్ణిరా

నిజమేరా
నన్ను చంపి పాతరేసినా
నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకు రారురా.

చచ్చి కూడా సాధిస్తాను రా
నమ్మరా నన్ను నమ్మరా

నా శవం కూడా నీకు మోయలేని భారం రా.

ఈ ఎయిర్పోర్టు దాటాక
ఎవరూ నా మొహం కూడా చూడరు రా.

నమ్మరా నన్ను నమ్మరా.

(ఇది ఎయిర్పోర్టులలో ప్రతి ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం)
Category: 17 comments

దాశరథి యాది.."నమస్తే తెలంగాణ"లో !

(ఆవకాయలో వచ్చిన దాశరథి గారి స్మృతులని ఇవాళ నమస్తే తెలంగాణ సాహిత్య పేజీ "చెలమ"లో తిరిగి ప్రచురించారు. మిత్రుడు అల్లం నారాయణకి షుక్రియా. ఈ రచనకి వేసిన బొమ్మ నాకు నచ్చింది.




‘అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్ళూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ.. వీటితో నీకు దోస్తీ కుదరాలి’. తరవాత చాలా వుత్తరాల్లో /సంభాషణల్లో ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పేవారు. ‘ ఈ మధ్య వెళ్ళావా?లేదా?’ అని గుచ్చి గుచ్చి అడిగే వారు. ‘ ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు ’ అన్నారు ఒక వొకసారి! ఆ రోజుల్లో ఎందుకో , నాకు అటు వెళ్ళాలని అనిపించేది కాదు.

అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా , అది నా మనసులో నాటుకుపోయి ఉండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలాగే వుందని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నాకానీ, దాశరథి గారు చనిపోయారని తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్‌సర్దుకుని కన్నీళ్ళ పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను. ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది. దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్ళాను!

- మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

(మిగతా ఆవకాయ లో చదవండి )
Category: 0 comments

కాస్త అలా లోపలికి వెళ్లొద్దామా?




అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
ఇవాళ వొక్క వాన చుక్కయినా రాలలేదు

- పోనీ, ఎవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు

2
ఇలా వుండనీ కొన్ని క్షణాలు
ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలు

- నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు

3

గది లోపల నా లోపల
ఎక్కడెక్కడి నించో శరీరపు లోచర్మపు లోలోపల నించి

పాడుతూనే వున్నాడు నస్రత్ ఫతే అలీ ఖాన్
- పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా.

4
కిటికీ బయట చెట్ల ఆకుల్లో
కార్డినాల్ పక్షులు కాషాయెరుపులో.

- ఈ క్షణపు నిశ్శబ్దపు అందానికి ఏదో వొక రంగు

5

నా కంటి రెప్పల మీద

వొక నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు

- ఈ వొంటరి క్షణపు నిరీహకి ఏదో వొక శబ్దం!


6

లోయలూ శిఖరాలూ నీ లోపలే.
ఆకాశాలూ అరణ్యాలూ నీలోనే.

- ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం.


(ఈ ఆరు పదాలూ మా జావేద్ కోసం...)

painting: Mandira Bhaduri
Category: 9 comments

అనేక ముంబైల కన్నీళ్ళ తరవాత...




నాన్న ఇంకా ఇంటికి రాలేదు
ఇంకా...ఇంకా...
ఇంకా రాలేదు.

ఈ నగరం నా కళ్ల కింద
నా కాళ్ళ కింద మంట

నాన్న ఇంకా ఇంటికి రాలేదు


చీటికి మాటికి వెనక్కి తిరిగి
గోడ మీది గడియారంతో మాట్లాడుతోంది అమ్మ

దాని ముళ్లలోకి మిర్రి మిర్రి చూస్తుంది
ఎనిమిది...తొమ్మిది...పది...

నాన్న ఇంకా రాలేదు.

అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
టీవీలో చూస్తున్న
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.

వచ్చేయ్ నాన్నా!


ఇప్పుడే కాల్చిన రొట్టెల వాసన
ఇప్పుడే నూరిన గోంగూర పచ్చడి
ఆకలి జమాయించేస్తోంది నాన్నా,

నువ్వు రాకుండా ముద్ద ముట్టనివ్వదు అమ్మ.

తొరగా వచ్చేయ్ నాన్నా!


అమ్మ వీపు తలుపుకి అతుక్కుపోతోంది

ఇప్పుడే ఇదిగో
అనేసి వెళ్ళి చాలా సేపయ్యింది కదా,

నాన్న ఇంటికి రాలేదు.


"అమ్మా! ఆకలే!"

'వూరెలా వుందో తెలుసా?
ఎప్పుడూ ఆకలి ఆకలి
నన్నూ చంపి కొరుక్కుని తిన్రా..."

కేకేసి, ఆ తరవాత అమ్మ ఇలా గొణుక్కుంది

"ఇంకా కాలేదు
ఇంకా కాలలేదు
కుప్పలుగా పోసిన శవాలు
మంటల దుప్పట్లు ఇంకా ఆరలేదు ఆరలేదు
కాల్తూనే వున్నాయి....47 నించీ..."


నాన్న ఇంటికి రాలేదు ఆ రాత్రి
ఈ రాత్రికి కూడా!

(ఈ కవిత "రాలేదు" శీర్షికన 'ఊరి చివర" లో వుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అదే కవిత చదువుకోవాల్సి వస్తున్నందుకు దిగులుగా..)

Painting: Mandira Bhaduri(University of Chicago)
Category: 12 comments

కవిత్వం గీత దాటితే...!

(ఇది ఈ నెల "పాలపిట్ట"లో నా కాలమ్ 'కాలిబాట" నుంచి...)




కవిత్వానికి వొకే రూపం వుండదు. వొకే నడకా వుండదు. వుంటే అది ఏదో వొక దశలో కవిని వూపిరాడనివ్వదు, స్వయం ఖైదులాగా –

ఈ మధ్య కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ఈ ఆలోచన చాలా బలంగా కదిలిస్తోంది. ఎప్పటికప్పుడు ఇది కవిత్వానికి కాలం కాదనో, అసలు కవిత్వం ఇప్పుడు ఎవరు చదువుతారులే అన్న నిరాశా ఈదురు గాలులు వీస్తునప్పుడు కూడా కవిత్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంది, అలుపూ సొలుపూ అన్నది లేకుండా-

కవిత్వానికి వచన కవిత్వం అని పేరు పెట్టిన ముహూర్తం అంత బాగున్నట్టు లేదు. అది చాలా మందికి ఇప్పటికీ వొక విరోధాభాసలా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే వచనం వొక దిక్కూ, కవిత్వం ఇంకో దిక్కూ. ఈ రెండీటీ మధ్యా రాజీ కుదిరేది లేదు అనే వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తారు. కానీ, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ బహిరంగ ప్రకటన ఎంత అసంబద్ధమో తెలుస్తుంది. కథల్లో కవిత్వం రాసే వాళ్ళని, ఆ మాటకొస్తే సాహిత్య విమర్శలో కూడా కవిత్వం రాసిన వాళ్ళని మనం చూశాం. కవిత్వంలో వచనం రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ, అసలు కవిత్వాన్ని కవిత్వం అనుకోవడానికి ఏ ప్రమాణాలూ, కొలమానాలూ వున్నాయని అడిగితే ఎంత కవికయినా, వచన రచయితకయినా పొలమారుతుంది ఖాయంగా.

కాశీభట్ల వేణుగోపాల్ నో, రెడ్డి శాస్త్రీనో, చంద్రశేఖర రావునో, అప్పుడప్పుడూ రమణజీవినో, అప్పుడెప్పుడో నగ్నమునినో, త్రిపురనో, ఇంకా దూరం వెళ్ళి ....ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారినో, బుచ్చి బాబు సరే సరే...అడిగితే వాళ్ళు వచనాన్ని ఎలా నిర్వచిస్తారో వినాలని వుంది నాకు.

ఇక కవిత్వంలో వచనం పండించే సేద్యగాళ్ళకి కొదువే లేదు. అదీ మంచి వచనమా అంటే అది వేరే కథ!
అసలు వచనం అని మనం అనుకుంటున్న దాన్ని గురించీ, కవిత్వం అని తీర్మానిస్తున్న రూపాన్ని గురించి అందరికీ ఎంతో కొంత అసంతృప్తి వుందన్నదే నేను చెప్పాలనుకున్నది! ఈ అసంతృప్తి ఘనీభవించినప్పుడు అటు వచన రచయితా, ఇటు కవీ వాటి వాటి చట్రాలని బద్దలు కొట్టి, ఇంకో కొత్త రూపంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త రూపాన్వేషణ వొక తాత్కాలికమయిన వెసులుబాటు మాత్రమే అనిపిస్తోంది నాకు. కథకులు “కవిత్వ” సీమల్లోకి చొరబడే సన్నివేశాలని కాసేపు పక్కన పెట్టి, కవులు వచనసీమల్లోకి పోలో మని దూసుకొస్తున్న కొన్ని సందర్భాలు కొన్ని ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే, ఇక్కడ కవిత్వమూ, వచనమూ అనే సంప్రదాయిక చట్రాలతో విబేధించడం నా ఉద్దేశం.

ఉదాహరణకి పసుపులేటి గీత ఈ మధ్య రాసిన “దేహం” అనే కవిత చూడండి. ఈ కవితలో గీత చాలా విషయాలు మాట్లాడింది. కొన్ని రాజకీయ స్థాయిలో, కొన్ని జెండర్ స్థాయిలో, కొన్ని భిన్న అస్తిత్వాల స్థాయిలో , ఈ కవితకి అనేక రూపాలున్నాయి. వాటన్నిటిని దేహం అనే బాహ్య రూపం కింద చెప్పుకుంటూ వెళ్లింది. ఆ మాటకొస్తే, దేహం బాహ్య రూపం కాదనుకోండి. ఈ కవిత నిస్సందేహంగా చాలా బలమయిన రాజకీయ ప్రకటన.

ఈ కవితని అలా వొకే పారాగ్రాఫ్ లాగా రాయకుండా మామూలు వచన కవితలాగా పాద విభజన చేసి వుంటే ఎలా వుంటుందా అని వొక సారి ఆలోచించాను. పాద విభజన వుండడమే కవిత్వ లక్షణం కాదని ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కానీ, పాద విభజనని ఈ సందర్భంలో నిరాకరించవచ్చు అనే ఆలోచన కవికి ఎలా వచ్చి వుంటుందన్నది ఆసక్తికరమయిన ప్రశ్న.
ఎంత కాదనుకున్నా పాద విభజనకి వొక లయ వుంది. పాదాల్ని విభజించేటప్పుడు కవి తనకి తెలియకుండానే పఠిత పైన వొక ప్రభావాన్ని కలిగిస్తాడు. ఫలానా చోట కాస్త ఆగి చదవండి అనే సైన్ బోర్డు వేలాడదీస్తున్నాడు. అలా ఆగి చదవడానికి ఆలోచనతో సంబంధం లేదు, అది చాలా మటుకు ఆవేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం.

వచనం చదివేటప్పుడు కూడా పఠిత కొన్ని సార్లు ఆగి చదవాలి. అలా ఆగి చదవడం అనేది కవిత్వంలో వొక మాదిరిగా, కథలో ఇంకో మాదిరిగా, విమర్శలో ఇంకో మాదిరిగా వుంటుంది. కథలో కానీ, విమర్శలో కానీ, అలా ఆగి చదవడం మీద రచయితకి అధికారం లేదు. కానీ, కవిత్వంలో కవి అలా ఆగి చదవడాన్ని నిర్దేశిస్తాడు. కవి నిర్దేశానికి వ్యతిరేకంగా పఠిత తన ఇష్టం వచ్చిన చోటల్లా ఆగితే, కవితలో పాద విభజన ప్రయోజనం దెబ్బ తింటుంది.

కానీ, కొత్త కవి పఠిత స్వేచ్చని నియంత్రించే నిరంకుసత్వాన్ని భరించలేడు/లేదు. దానికి మరో బలమయిన కారణం మామూలు వచనంలో మాదిరిగానే కొత్త కవిత్వంలో ఆలోచన రూపం మారింది. గీత కవిత లో ఆవేశం కంటే, ఆలోచన బలమయిన పాత్ర తీసుకుంది. కొన్ని ఆలోచనల యూనిట్లుగా కవిత నడక సాగుతుంది. ఇలాంటి వస్తువులు కవిత్వానికి పనికి రావనీ, ఆలోచనని ప్రోది చెయ్యడమే ఉద్దేశం అయితే వ్యాసం రాసుకోవచ్చని కొందరు వాదించ వచ్చు. నిజమే, వ్యాసం రాయడం ద్వారా గీత ఈ విషయం మీద ఇంత ప్రభావపూరితమయిన ప్రకటన చెయ్యగలదా అన్నది నా ప్రశ్న. ఇంకో చిన్న మాట: అసలు ఈ కవితలో దేహాన్ని కవితా రూపానికే ఆపాదించి ఇంకో సారి చదవండి. ఈ కవిత ఎందుకు ఇలా పారాగ్రాఫు లాగా మారిందో వొక క్లూ దొరకవచ్చు. కానీ, ఆ విధంగా చదవడం కవితలోని మూల భావానికి దెబ్బ కావచ్చు, అయినా, మన లోపలి పఠితని కట్టడి చెయ్యడం ఎవరి తరం?!

*
Category: 4 comments

కొన్ని పంక్తులు ఇలా కూడా...




1

-ఈ పూటకి వాడి రొట్టి ముక్క గాలికి ఎగిరిపోతూ, వాడి వైపు కనీసం జాలిగా చూడలేదు
-ఆమెని అలా ఆ కరెంటు స్తంభం కింద సాయంత్రం కూడా చూశాను, ఇంకేం వెతుకుతూ వుందో తెలీదు గాని.
-సర్లే అని వెళ్ళిపోయిన పిల్లాడు రాత్రికి కూడా రాలేదు, భరించలేని సన్నివేశాల్లో అతను చిక్కుకోవడం వూహించలేను గాని, నిజం అంత కంటే భయంకరమేమో అన్న వూహ నన్ను నులిమేస్తోంది.

2

- వార్తా పత్రికలూ టీవీలూ సెల్ఫోన్లూ వదంతులూ చెవుల చుట్టూ జోరీగలూ లేని వొకానొక శుద్ధ పరిశుద్ధ క్షణమేదో అతను చెప్పలేదు, కానీ - అతని కవిత్వం నిండా వొక అమాయకత్వపు మాయ.

- విగ్రహాలూ విధ్వంసాలూ ఆత్మహత్యలూ హత్యలూ కరువులూ నిరుద్యోగాలూ ఆకలి కడుపులూ వీధుల మీద పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ చావు కేక వేస్తున్న పసితనాలూ- వొక్క అరక్షణం కూడా నేనొన్టరిని వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావు కేక వెయ్యలేను.

3

దేశమూ మట్టి వాసనా నా నేనూ నేనయిన మీ అందరూ

ప్రేమించలేను దేన్నీ

విడిచీ పెట్టలేను దేన్నీ

సర్లే ఫో అని ముఖమ్మీద తలుపు కొట్టలేను ఎప్పుడూ.


కొన్ని ఎడ్పుల తరవాత

నేలని కొట్టుకునీ కొట్టుకునీ
మట్టికి అతుక్కుపోయిన శరీరమా, నువ్వేమయినా మాట్లాడు!

4

కొన్ని వాక్యాలకి వాక్యాలు ధార పోసానా,

వొక్క పదంలోనూ నేను విరిగిన అద్దాన్ని కాను.

5

ఛ..ఛ..

ఇంకేం రాస్తాం బే, కవిత్వం!

ముసుగు మీద

ముసుగు మీద

ముసుగు మీద ముసుగు.
Category: 11 comments

ఎప్పటిదో ఓ కవిత..."వెలుతురు భాష"!

కవిలె కట్టల్ని తిరగేయ్యడంలో, పాత కవితల్ని మళ్ళా చదూకోడంలో వొక ఆనందమూ, వొకానొక నాస్తాల్జియా తప్పక వున్నాయి. ప్రముఖ కవయిత్రి, ఇప్పటి "విహంగ" ఎడిటర్, చిరకాల మిత్రులు పుట్ల హేమలత గారు తమ పాత పుస్తకాల్నీ, కాయితాల్నీ వెతుక్కుంటూ ఈ కవితని బయటికి తీశారు. ఇది నేను 1993లో రాసిన కవిత.

ఈ కవిత నేను నా ఏ సంకలనంలోనూ పెట్టలేకపోయాను. చాలా కాలంగా ఈ కవిత దొరక్క, నా రచనల్ని వొక చోట పెట్టుకునే క్రమశిక్షణ లేకా!ఇన్నాళ్ల తరవాత ఈ "వెలుతురు భాష" వెతికి పెట్టిన హేమలత గారికి ధన్యవాదాలు.

Category: 6 comments

కవిత్వంలో సంక్లిష్టత: భైరవభట్ల అన్వేషణ

భైరవభట్ల కామేశ్వర రావు గారు ఈ నెల "ఈమాట "లో కవిత్వం మీద మంచి వ్యాసం రాశారు.

అందులోంచి చిన్న భాగం ఇది. ఈ చిన్న భాగం ఇక్కడ అందించడంలో నా స్వార్థం వుంది కానీ, మొత్తం వ్యాసం చదివి, జాగ్రత్తగా దాచుకొదగింది అని నా అభిప్రాయం.



కవిత్వ వస్తువు సంక్లిష్టమయ్యే కొద్దీ దాని అభివ్యక్తిలో కూడా సంక్లిష్టత ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి మరింత పరిశ్రమ సాధన అవసరమవుతాయి. నాకే జన్మభూమీ లేదు! అన్న యీ కవిత దీనికొక ఉదాహరణగా తీసుకోవచ్చు:


శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.

నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
‘47 దగ్గిరే ఎలా విరిగానో

మీరెవరూ చెప్పలేదుగా -

దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా -

నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని -

దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.

ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.

అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.

రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!

నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.

నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.

నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.

నాలో సగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.

నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.

అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.

శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.

ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో అంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.

నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.

నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.

విభజించి పాలించే నా శత్రువులారా,

నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.

ఈ కవిత సాధారణ పాఠకుడికి అర్థమవ్వడం కష్టమే. ఇది వ్రాసిన కవి ఒక భారతీయ ముస్లిం అన్న సంగతి ముందు పాఠకుడికి తెలియాలి. ఈ కవి వ్రాసిన కవిత్వం కొంత చదివి ఉండాలి. అప్పుడే యీ కవితలోని వస్తువు కాస్తంత బోధపడుతుంది. ఒక భారతీయ ముస్లిం అస్తిత్వ వేదన ఇందులోని వస్తువు. ఆ అస్తిత్వం - అనేక దృక్పథాల, అనేక సంఘర్షణల కలగాపులగపు సంక్లిష్ట స్వరూపం. ఆ సంక్లిష్టత కవితలోనూ ఉంది. దానికి తోడు అభివ్యక్తిలో ప్రత్యేకత కోసం వాడిన ప్రతీకలు, ధ్వని, సంక్లిష్టతని మరింత ఎక్కువ చేస్తున్నాయి. అయితే, కవితాభివ్యక్తిని శక్తివంతం చేస్తున్నవి కూడా అవే. సరిగా అర్థం చేసుకుంటే, ఒక భారతీయ ముస్లిం తన అస్తిత్వంలో అనుభవిస్తున్న ఒక శూన్యత, అనేక వైరుధ్యాలు యీ కవితలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. భారతీయ వర్ణవ్యవస్థలో ఇమడనితనమూ, అనుభవిస్తున్న పరాయితనము, దేశంతో పూర్తిగా ముడిపడని అస్తిత్వమూ, మొఘల్ కాలపు మతదౌష్ట్యాలు ఇంకా తనపై ప్రభావం చూపడమూ, మైనారిటీ రాజకీయాలు - ఇలా ఎన్నెన్నో ధ్వనిస్తాయి. ఇందులోని ఆత్మీయత, అభివ్యక్తిలోని నేర్పరితనము, యీ కవితని ఇతర అస్తిత్వవాద ఉద్యమ కవితలనుండి వేరు చేస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే కవి నేపథ్యం తెలియాలి. కవిత్వ వస్తువుపై కొంత అవగాహన, సానుభూతి ఉండాలి. ప్రతీకలని, ధ్వనిని సరిగా అర్థం చేసుకొనే అనుభవమూ ఉండాలి.

*


ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.”


ఈ తత్త్వం తెలిసిన పాఠకునికే ఈ కవిత్వం అర్థమవుతుంది. ఒక రకంగా చూస్తే ఇలాంటి కవిత్వ సృజనలో కవి పాత్ర నూరుశాతం, పాఠకుని పాత్ర కూడా నూరుశాతమే! ఉదాహరణకి మూలా సుబ్రహ్మణ్యంగారి ‘మంచు’ కవిత చూడండి:


చలికాలపు సాయంత్రం
ఎవ్వరూ లేని బాట మీద
ఏకాకి నడక.

రాలిన ఆకుల కింద
ఎవరివో గొంతులు

ఎక్కడో దూరంగా
నిశ్శబ్దపు లోతుల్లోకి
పక్షి పాట

లోయంతా సూర్యుడు
బంగారు కిరణాలు పరుస్తున్నా
కాసేపటికి ఆవరించే చీకటి మీదకే
పదే పదే మనసుపోతోంది

కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.

కురిసే మంచు
నా గొంతులో
ఘనీభవిస్తోంది.

ఈ క్షణం నా పాటకి
మాటల్లేవు!

కొన్ని దృశ్యాలని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఒక సన్నివేశంలో తనకి కలిగిన ఒకానొక అనుభూతికి అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశాడు. ఇందులో అస్పష్టతకి తావులేదు. ఆలోచనకీ విశ్లేషణకీ కూడ తావులేదు. చదివిన పాఠకులకి ఎవరి అనుభూతి వారిదే, పూర్తిగా. అయితే, యీ కవితలో కవి గొంతు కొంత ఉంది. అంటే, కేవలం దృశ్యాన్ని పదచిత్రాలతో వర్ణించి ఊరుకోకుండా, తను పొందిన అనుభూతిని కూడా పదాలలో పెట్టే ప్రయత్నం కవి చేశాడు. అనుభూతికవిత్వంలో పదచిత్రాలు మాత్రమే ఉండాలన్న నియమం లేదు. కవి పొందిన అనుభూతిని వ్యక్తం చెయ్యడానికి పదచిత్రాలు ఒక సాధనం మాత్రమే. అయితే కొన్నిసార్లు కవి పూర్తిగా మౌని అయిపోయి, కేవలం అతను చూసిన దృశ్యాలు మాత్రమే ఉండటం కూడా జరుగుతుంది. అలాటి కవితల్లో పాఠకునికి పూర్తి ఏకాంతం దొరుకుతుంది. ఉదాహరణకి సుబ్రహ్మణ్యంగారిదే మరో కవిత:


ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ

తెరలు తెరలుగా….
సిగ్గు.
Category: 0 comments

తస్వీర్





చిత్ర విచిత్ర వర్ణాలతోనా, వొట్టి నీటితోనా,


ఇప్పుడు నువ్వెలా గీసినా

ఆ పీర్ల చావిడి కూలుతున్న గోడ మీద

అప్పటి గీసిన బొగ్గు గీతల్లోనే నా రెక్కలు!


'ఒరే సాయిబూ కాస్త నవ్వి చావరా, ఏడ్పుగొట్టు మొహమా?"

అంటూనే నా ఏడ్పుగొట్టు ముఖమ్మీద

నువ్వు వొంపు తిప్పిన ఆ నవ్వు

కనీసం ఈ క్షణం దాకా!
Category: 7 comments

"ఇవాళ నేను రావి శాస్త్రి గారిని చూసేనండీ"

అక్షర మిత్రులందరికీ:

"ఆవకాయ"లో నేను రావిశాస్త్రి గారి గురించీ, పురాణం గారి గురించీ రాసిన జమిలి జ్నాపకాలు చదివాక వొక స్పందన ఇది.
చాలా సంతోషంగా అనిపించింది నిజంగా!

అవును,ఇలాంటి స్పందనల కోసమయినా మనం రాయాలి నిస్సందేహంగా!

శర్మగారూ,

మీకు నా ధన్యవాదాలు. మీరు ఆదిభట్ల వారి గురించి రాయొచ్చు కదా!

అఫ్సర్




తాత గారూ, ఇవాళ నేను రావి శాస్త్రి గారిని చూసేనండీ అన్నాను. అలాగా ఈ సారి చూస్తే వారికి నమస్కారం చెయ్యి నాయనా అన్నారు మా తాతగారు.అప్పుడు నావయసు పదునాలుగు.

నేను పాతికేళ్ళవాడినయ ్యేను.గోదావరిలో హైదరాబాదునుంచి వైజాగొస్తునాను. నా ఎదురు బెర్తులో రావి శాస్త్రిగారు.వారి చేతిలో చిన్న సంచి తప్ప మరేమీ లేవు. నాదగ్గరున్న తలగడా(దిండు)వార ికిచ్చి నమస్కారం చేసేను. ఎవరయ్యా నువ్వు అన్నారు. అయ్యా నేను పలానా వారి మనుమడిని, పలానా వారి ముని మనుమడిని అన్నాను.
వారికి నా నమస్కారం చెప్పు బాబూ అన్నారు.
డాబా గార్డెన్శ్ లో వారి ఇల్లు. నడిచి వెళితే మూడు నిముషాలు కోర్టు. ఐనా రిక్శాలో వెళ్ళేవారు.రిక్శావాడికి నాలుగు డబ్బులివ్వాలనేద ి వారి ఉద్దేశ్యం అని నేను చెప్పాలా?
వారు తలక్రింద ఉంచుకున్న దిండు నేను తీసుకుంటే వారి ఆలోచనలు నాకు కలుగకపోతాయా అనే స్వార్ధం నాది.
ఆ పిదప రోజూ వారు కోర్టుకు వెళ్ళవేళ వారిని చూసేవాడిని.ఏదో తెలియని అభిమానం, తెలియని అనుభూతి.
ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు.
శ్రీ అఫ్సర్ గారూ, మీకు అభినందనలు
నా పేరు శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ. మా తాతగారు(మాతామహు లు) బ్రహ్మశ్రీ రాంభట్ల లక్శ్మీనారాయణ శాస్త్రి ముత్తాత శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు.
Category: 3 comments

మంచి యానిమేషన్ సినిమా....ఆమె రహస్యం...పుస్తకాల మౌన వేదన!




“ఈ కాలం పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చెయ్యడం మన తరమా?”

ఇలాంటి ప్రశ్న ఇప్పుడు పఠనాసక్తి వున్న తల్లి దండ్రులకి సహజమే. అనేక రకాల వీడియో ఇంద్ర జాలాల ముందు పుస్తకం ఏ మూలకి?

అలాంటి ప్రశ్నే, ఫ్రెంచ్ దర్శకుడు డొమినిక్ మాన్ఫెరే ని కలచివేసినట్టుంది! అది వొక అందమయిన యానిమేషన్ సినిమాగా రూపు దిద్దుకుంది. ఆ సినిమా పేరు “ఎలియనార్స్ సీక్రెట్”

నిన్న సాయంత్రం మాడిసన్ యూనివర్సిటీ స్క్వేర్లో ఈ సినిమా చూసి వచ్చినప్పటి నించీ పుస్తకాల భవిష్యత్తూ, “పాఠకులు” అనే వర్గం చావు పుట్టుకలూ నా ఆలోచనల నిండా కదులుతున్నాయి.



ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇంకా చదివే వయసు నిండా రాని ఓ చిన్న పిల్లాడికి వాళ్ళ అత్తమ్మ అప్పనంగా ఓ గొప్ప సంపద రాసిపెట్టి వెళ్లిపోతుంది. ఆ సంపద ఆమె ఏళ్ల తరబడి పోగు చేసుకున్న గొప్ప లైబ్రరీ. అందులో అన్నీ అద్భుత జానపద కథల పుస్తకాల మొదటి ఎడిషన్లు మాత్రమే వుంటాయి. అత్తమ్మ ఏం ఇచ్చిందో చూద్దామని ఆ గదిలోకి మహా ఆసక్తిగా అడుగు పెట్టిన ఆ పిల్లాడికి ఈ పుస్తకాలు కనిపిస్తాయి. “అబ్బా, ఇంతా చేస్తే ఇవి పుస్తకాలా?” అనుకుంటాడు ఆ పసివాడు. కానీ, ఆ పుస్తకాలే అతన్ని ఇంకో ప్రమాదంలో పడేస్తాయని అతని ఊహకి రాదు.
అతను ఆ గదిలో నించి బయటపడదామని తలుపు వేపు వెళ్తూండగా – ఆ పుస్తకాలలోని కార్టూన్ పాత్రలు పుస్తకాలలోంచి నడిచి వచ్చి అతన్ని వొక ఆట పట్టిస్తాయి. చివరాఖరికి ఆ పాత్రలే ఆ పిల్లాడి కథని మలుపు తిప్పుతాయి. ఇక్కడే మనకి దర్శకుడు మాన్ఫెరే యానిమేషన్ ప్రతిభ విశ్వరూపం కనిపిస్తుంది. ఆ కొన్ని దృశ్యాల కోసమయినా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడవచ్చు.

కానీ, ఈ సినిమా వెనక వున్న భావన నాకు బాగా నచ్చింది. అసలు ఈ పుస్తకాలు ఎవరికి కావాలి? అన్నది ఆ ప్రశ్న. దానికి సమాధానం వెతకడానికి పడిన పాట్లు బాగున్నాయి. తరాలలో వస్తున్న మార్పు, పుస్తకాలు క్రమంగా పురాతన వస్తువులుగా మారిపోతున్న విషాదం ఈ సినిమాలో చూస్తున్నంత సేపూ సరదాగా వుంటుంది, కానీ – ఆలోచించడం మొదలెడితే దిగులుగా వుంటుంది. అలాంటి దిగులు కలిగించడమే ఈ సినిమా అసలు ఉద్దేశం.

మొన్న “బ్రెత్ లెస్” చూపించినప్పుడు సినిమా హాలులో అందరూ పాతికపై బడిన వాళ్ళే వున్నారు. ఈ యానిమేషన్ సినిమా చూడడానికి పిల్లలు బిల బిల మని వచ్చేశారు. ఆ తల్లిదండ్రులూ పిల్లల మధ్య నేను వొక్కణ్ణీ కాస్త ఎడంగా కనిపించాను. కానీ, సినిమా చూస్తున్నంత సేపూ పిల్లల నవ్వులూ నిట్టూర్పులూ వినిపిస్తూనే వున్నాయి! హాల్లోంచి బయటికి వస్తూంటే వొక పిల్లాడు అంటున్నాడు “ఆ పిల్లాడికి చదవడం రాదు, చదవడం వస్తే కథ ఇంకోలా వుండేది!” అని! ఏమో?!
Category: 2 comments

ఊపిరాడనివ్వని సినిమా : బ్రెత్ లెస్!




ఎండాకాలం మాడిసన్ వచ్చినప్పుడల్లా – బోనస్ లా దొరికే గొప్ప అవకాశం – ఇక్కడి యూనివర్సిటీ థియేటర్ స్క్వేర్లో సినిమాల పండగ. ప్రతి ఎండాకాలం జులై నెల రాగానే విస్కాన్సిన్ యూనివర్సిటీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. దాదాపు ప్రతి వీకెండ్ కొత్త – పాత సినిమాలు చూపిస్తారు. ప్రతి ఫెస్టివల్ కీ వొక థీమ్ వుంటుంది. పోయిన ఎండా కాలం ఆఫ్రికా రాజకీయ సినిమాలు చూపించారు. ఈ సారి కుటుంబం అనే థీమ్ చుట్టూ తిరిగే కథలున్న సినిమాలు చూపిస్తున్నారు. అయితే, కుటుంబం అనేది థీమ్ కి మాత్రమే పరిమితం కాదు, ఈ చిత్రాలని సకుటుంబ సమేతంగా చూసేట్టు ఎంపిక చేశామని, ఈ ఫెస్టివల్ అంతా చూసే సరికి అంతర్జాతీయ సినిమా కళ చరిత్ర గురించి వొక అవగాహన కలగాలన్న ఉద్దేశంతో క్లాసిక్స్ నించి సమకాలీన సినిమాల దాకా ఎంపిక చేశామని ఫెస్టివల్ మొదటి రోజున నిర్వాహకులు ఆశపెట్టారు. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు, నవ తరంగం (న్యూ వేవ్) ధోరణికి శ్రీకారం చుట్టిన గోడార్డ్ సినిమా ‘బ్రెత్ లెస్” చూసి వచ్చాక, అది నిజమే అనిపించింది.



గోడార్డ్ గురించి శ్రీశ్రీ చాలా సార్లు ప్రస్తావిస్తాడు తన వ్యాసాల్లో! గోడార్డ్ గురించి చదివినప్పుడల్లా శ్రీశ్రీ అభిరుచిని మెచ్చుకుని తీరాల్సిందే. శ్రీశ్రీకి గోడార్డ్లో అంతగా నచ్చిందేమిటా అని చూస్తే, చాలా విషయాలు దొరుకుతాయి. ఇద్దరికీ మార్క్స్ అంటే విపరీతమయిన గురి. ఇద్దరిలోనూ అస్తిత్వ వాద చాయలు, ఒక రకం అనార్క్సిస్టు నీడా కనిపిస్తాయి. ఇద్దరికీ సినిమా కళ మీద విపరీతమయిన గురి వుంది. గోడార్డ్ వొక సారి అన్నాడట “ 1950లలో సినిమా అంటే నిత్య ఉపయోగ వస్తువు. రొట్టె తరవాత అదే!” ఈ మాట కవిత్వాన్ని గురించి శ్రీశ్రీ అనడం చాలా మందికి గుర్తుండే వుండాలి.

ఇవాళ “బ్రెత్ లెస్” సినిమా చూస్తున్నంత సేపూ శ్రీశ్రీ వచనం గుర్తొచ్చింది నాకు.

శ్రీశ్రీ వచనంలో ఓ గొప్ప కొరడా ఝుళిపింపు, వ్యంగ్యం, విసురూ వున్నాయని మనకందరికీ తెలుసు. కొన్ని శ్రీశ్రీ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యాలకి అంత పదును ఎక్కడి నించి వచ్చిందా అని విస్మయంలో పడిపోతాం. కానీ, ఇవాళ ఈ సినిమాలో సంభాషణలు వింటున్నంత సేపూ శ్రీశ్రీ వ్యాసాల్లోనూ, కథల్లోనూ, రేడియో నాటికల్లోనూ వుపయోగించిన వచనమే గుర్తొస్తూ వుంది. అంటే, గోడార్డ్ సినిమాల నుంచి శ్రీశ్రీ ఎంత నేర్చుకున్నాడా అనిపించింది. నేను గోడార్డ్ సినిమాలు ఇంతకు ముందు కూడా చూశాను. కానీ, చెత్త సబ్ టైటిల్స్ వల్ల ఎప్పుడూ ఆ సంభాషణల పదును తెలిసి రాలేదు.
ఇప్పుడు నేను చూసిన సినిమా 2010 లో కొత్త సబ్ టైటిల్స్ తో విడుదల అయిన సినిమా. సంభాషణల ప్రాణం తెలిసి సబ్ టైటిల్స్ ఇచ్చారు.

ఈ సినిమా ప్రొడక్షన్ గురించి చాలా కథలు ప్రచారం లో వున్నాయి. ముఖ్యంగా సంభాషణలు గోడార్డ్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు రాసే వాడట. అసలు ఈ సినిమా వొక డాక్యుమెంటరీ లాగా తీయాలని మొదలు పెట్టి, ఓ హాండ్ కెమెరాతో తీశారట. కానీ, సినిమా చూస్తున్నప్పుడు మనకి అలాంటి అనుమానాలే రావు. ఎన్ని రోజులు కష్ట పడితే ఈ సంభాషణ రాసి వుంటాడా, ఎంత కష్ట పడితే వొక్కో ఫ్రేమ్ తయారయ్యిందో కదా అనుకుంటూ వుంటాం. అడుగడుగునా గొప్ప చిత్రీకరణలు, అచ్చెరువు గొలిపే సన్నివేశ కల్పనా కనిపిస్తాయి. వొక గొప్ప కావ్యం చదువుతున్న అనుభూతి కలిగించిన సినిమా ఇది.
Category: 1 comments
Web Statistics