'గాయాల మాల' గుడిహాళం...

పునరపి జననమేమో గానీమరణం మాత్రం ఖాయం –

ఈ వాక్యం రాసిన మూడేళ్ళకే‌ గుడిహాళం మరణ వార్త వినాల్సి వస్తుందని తెలీదు.

కానీ, తనకి ఈ వార్త ముందే తెలిసినట్టుంది. తన మరణాన్ని ముందే దర్శించాడు కనుకనే వొక తెగింపుతో, చావో రేవో అన్న కసితో విసవిసా వెళ్లిపోయాడా రఘు?!

ఇవాళ ఇద్దరు మిత్రుల నోటి వెంట ఈ మరణ వార్త విన్నాక ఏం మాట్లాడాలో తెలీక గుడిహాళం రాసిన కొన్ని కవితల్ని నెమరేసుకుంటూ వుండిపోయాను. “ఒక జననం ఒక మరణం” అనే కవిత మేం “అనేక” కోసం అతని దగ్గిర నించి తీసుకున్నాం. ఆ కవిత మరణం గురించే, అంతకంటే ఎక్కువగా జననం గురించి! అంతకంటే మరీ ఎక్కువగా అది గుడిహాళం రాసుకున్న ఆత్మ కవిత.

గుడిహాళం యుద్ధ కవి.

యుద్ధాలు లేని కాలంలో యుద్ధ కవులు వుంటారా అని తెలుగు దేశపు ఆకుపచ్చ నిర్గుణ కవి పుంగవులు/ నపుంసక విమర్శక శిఖామణులు ఎవరేనా అడగవచ్చు.

ఈ నిర్గుణ అనే మాట గుడిహాళందే! రాజకీయాలు పట్టని ఆకుపచ్చ కవిగాళ్ల గురించి గుడిహాళం ఎప్పుడూ “వాళ్ళు నిర్గుణులేవోయ్” అనే వాడు నిస్సంకోచంగా.

ఉగ్రులమై
ఆగ్రహంతో వణకాలి, వణికించాలి

అన్న గుడిహాళం వాక్యం విన్న వెంటనే ఈ నిర్గుణ కవివిమర్శకులకి జ్వరం పట్టుకుంటుంది. అందులో పదచిత్రాలూ, ప్రతీకలూ, మెటఫర్లూ లేవు లేవని పొర్లి పొర్లి ఏడుస్తారు తాయిలం చిక్కని పసి కాయల్లా.

కవులు పద సౌందర్యానికి బానిసలై పోయిన కాలం లో బాధనీ, ఆగ్రహాన్నీ, నిరసననీ, నిరాశనీ తీవ్ర వాక్యంగా మలచి సావధానమయిన తుపాకిలా గురిపెట్టిన వాడు గుడిహాళం.

మొదటి సారి గుడిహాళం పేరు ఎక్కడ విన్నానో ఎప్పుడు విన్నానో గుర్తు లేదు. ఎన్ని సార్లు అతన్ని కలిశానో కూడా సరిగా లెక్క చెప్పలేను. అజంతానీ అకాడెమీ వేదిక ఎక్కించిన వాడు గుడిహాళమే. సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీ కలిసి ఏర్పాటు చేసిన “కవి సంధ్య”లో అజంతాతో పాటు కవిత్వం చదవడం వొక తీయని జ్నాపకం. ఆ రెండు రోజుల్లో రెండు సార్లు నన్ను వేదిక ఎక్కించాడు గుడిహాళం. మొదటి సభ పోస్ట్ మోడ్రనిజమ్ మీద - ఆ సందర్భంగా దాదాపు వొత్తిడి పెట్టి మరీ నాతో ప్రసంగం ఇప్పించడమే కాకుండా, ఆ ప్రసంగం రాతలో పెట్టేంత వరకూ రంపాన పెట్టాడు మొండి వాడు గుడిహాళం.



గుడిహాళం ముఖ్యంగా బుద్ధిజీవి. అతని కవిత్వం అతని నిగూఢమయిన ఆలోచనలకి కప్పిన ఉద్వేగభరితమయిన దుప్పటి. అతని వాక్యాల నీడలో అనేక రకాల ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటాయి. అందుకే అతను కవిత్వం చదివాక/ లేదా అతని కవిత మనం చదివాక – ఒక ఆలోచనలో నిమగ్నం అవుతాం.

గుడిహాళం సామూహిక జీవి కూడా – అతని కవిత్వం వొంటరీతనపు లోతయిన నిట్టూర్పు లో మొలిచినట్టుగా వుంటుంది. కానీ, ఆ వొంటరి తనం కింద మన విఫలమయిన సామూహికత కనిపిస్తుంది. అందుకే అతని కవిత చదివాక 2000 తరవాత మన లోలోపలే నిమజ్జనమవుతున్న నినాదాల తుంపులు వినిపిస్తాయ్.

ఇప్పుడు – అందుకే – అతని మాటలు అతనికే వినిపిస్తూ..

ఆ బాధ లోంచి మరో బాధకు నడుస్తూండగానే
ఓ కల తరలి పోయింది
ఓ మెరుపు కరిగిపోయింది
ఎక్కడో రెక్క తెగింది
ఎప్పుడో ఏదో స్వరం బతుకు నించి తప్పుకుంది.
Category: 6 comments

డైరీలో హ్యూస్టన్ కి వొక పేజీ!





హ్యూస్టన్ లో సాహిత్య సభకి మూడు నెలల క్రితం మాట తీసుకున్నారు రాచకొండ శాయి గారు.

విపరీతమయిన రాత పనుల వొత్తిడి వల్లా, కాన్ఫరెన్సుల హడావుడి వల్లా, ఈ ఏడాది యూనివర్సిటీ లో రెండు కొత్త కోర్సులు - వొకటి భారతీయ కవిత్వం మీద - చెప్పాల్సి రావడం వల్లా ఇటీవలి కాలంలో ఏ వూరికీ, ఏ సభకీ ఎవరికీ మాట ఇవ్వడం లేదు. కానీ, టెంపుల్ సాహిత్య సదస్సులో శాయి గారు గీతాంజలి మీద చేసిన చక్కటి ప్రసంగపు మత్తులో వుండడం వల్ల, ఆ రోజు ఆయన అడగడమూ, సరే అనేయడం చాలా యాంత్రికంగా జరిగిపోయాయి.

ఆ తరవాత శాయి గారు మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నప్పుడు నిజంగానే చాలా పనుల్లో కూరుకుపోయి, ఇక హ్యూస్టన్ ప్రయాణం వల్ల కాదులే అనుకున్నాం. అలా వెళ్లకుండా వుంటే చాలా మిస్ అయ్యే వాళ్ళమని ఇప్పుడు నిస్సంకొంచంగానే అంటున్నా.
అనుకోని కారణాల వల్ల దారి తప్పి, మూడు గంటల కారు ప్రయాణానికి నాలుగు గంటలు చేసి హ్యూస్టన్ చేరే సరికి, సాయి బాబా మందిరం ఇంకా ప్రశాంతంగానే వుంది. నాలుగయిదు తెలుగు కుటుంబాలే అక్కడున్నాయి. వాళ్ళు కూడా ఏ పూజాకో, ఆరతికో వచ్చి వుంటారులే అనుకున్నాం. కానీ, చూస్తూండగానే ఆ పెద్ద హాలు నిండిపోయింది. వందకి పైగా తెలుగు కుటుంబాలు వొక్క చోట చేరాయి. "నెల నెలా వెన్నెల" మొదలయింది శాయి గారి స్వాగతంతో.




మామూలుగా కాన్ఫరెన్సులలో పవర్ పాయింట్ చేయడం నాకు అలవాటే కానీ, మొట్ట మొదటి సారిగా ఒక సాహిత్య సభలో పవర్ పాయింట్ చేశాను. అలా చెయ్యడం వల్ల ఉపన్యాసం ఆద్యంతం వొక పద్ధతిగా సాగిందని అనిపించింది. మామూలుగా నా ఇతర ప్రసంగాలు విన్న వాళ్ళు కూడా ఇది భిన్నంగా, వివరంగా పూసగుచ్చినట్టుగా, ఆసక్తిగా వుందన్నారు. "ఈ కాలంలో తెలుగు" ఎన్ని ముఖాలుగా విస్తరిస్తుందో, ప్రపంచీకరణ తరవాత తెలుగు సాహిత్యం, సంస్కృతి, భాష అనే మూడు అంశాల చుట్టూ మాట్లాడాను. అన్ని చోట్ల మాదిరిగానే ఈ సభకి వచ్చిన వాళ్ళు కూడా బ్లాగులు, అంతర్జాల పత్రికల మీద చాలా ఆసక్తి చూపించారు. పొద్దు, కౌముది, ఈమాట లాంటి వెబ్ పత్రికలూ, ఆముక్తమాల్యద, తెలుగు పద్యం, నా లోకం, సాహిత్య అభిమాని, కొత్త పాళీ లాంటి బ్లాగుల వివరాలను చాలా మంది అడిగి తీసుకున్నారు. అడిగి తెలుసుకున్నారు.

శ్రీపాద కథల్లో తెలుగుదనం గురించి కల్పన మాట్లాడింది. చానెళ్ల తెలుగు మీద జోకులు గుప్పించారు చిట్టెన్ రాజు గారు.




సభ తరవాత తెలుగు పిల్లలు పాడిన పద్యాలూ, పాటలూ, చేసిన ప్రసంగాలూ నాకు పెద్ద ఆకర్షణ. తెలుగు భాష బతికే వుంటుందన్న గొప్ప భరోసా ఆ పిల్లల తెలుగు పలుకుల్లో ప్రతిధ్వనించింది.



అన్నిటికంటే నాకు బాగా నచ్చిన సంగతి ఇంకోటి వుంది...సాధారణంగా అమెరికాలో తెలుగు సాహిత్య సభల్లో కొత్త తరం కనిపించదు, కొత్త తరం అంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన తెలుగు టీనేజర్లు. హ్యూస్టన్ లో ఈ సారి వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళంతా తెలుగు టీనేజర్లు. ఆరుగంటల పాటు సాగిన కార్యక్రమంలో వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేసింది.

సరే, సభానంతర సంగతులు ఇంకా అనేకం వున్నాయి. కొత్త సాహిత్య మిత్రులతో కబుర్లు, తెలుగు బడి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో మాటా మంతీ, శాయి/లలితా/వరుణ్ / రాఘవేంద్ర గారి కుటుంబ సభ్యుల ఆతిధ్యమూ, పూర్వ విద్యార్థులతో కబుర్లు, నా చిన్ననాటి మిత్రుడు రాముతో వొక రోజంతా కబుర్లూ, ఎన్నాళ్ళకో కలిసిన కల్పన బంధువులతో వొక పూట కాలక్షేపమూ...సాహిత్యంతో పెరిగే సాన్నిహిత్యం గొప్ప అనుభూతులు!
Category: 6 comments

చలి గురించి మూడు ముక్కలు




చలిగాలుల చివర వొక ఎండ తునక
ఎదురొచ్చింది కప్పుకోనా అని!
తనివి తీరా కప్పుకున్నాను.



వొళ్ళు వణికిందీ అంటే
సూర్యుడి రెక్క
వొక పక్కకి వాలిపోయినట్టే.

శరీరం రహస్యం
తెలిసిపోయిందేమో గాలికి,
కూడా కాసిని చినుకులు ఈడూ జోడు.


నాలుగు గోడల్ని వెచ్చబెట్టుకునే రాత్రి
అతను గుర్తొస్తాడు
ముసలి చర్మాన్ని మాత్రమే కప్పుకున్న ఆ వీధి చివర.


వెచ్చని గదుల కవిత్వపు కలవరింతలు
కాసేపు కట్టిపెట్టు
తాత్వికుడు ఎప్పుడో అలసిపోయాడు!


పైవొంటిని కోసే ఈ చలి గాలిని దాటాక
అప్పుడు మాట్లాడు
కవిత్వాన్ని గురించి!

*
Category: 4 comments

కొన్ని తలపోతలు..


(తల్లి వొడిలో చిన్నారి బార్త్)


ఈ మధ్య నన్ను బాగా కదిలించిన పుస్తకం రోలాండ్ బార్త్ "మౌర్నింగ్ డైరీస్" 1977 అక్టోబరు 25 న అతని తల్లి చనిపోయింది. ఈ లోకంలో తనకి "నా" అన్న వొకే వొక్క మనిషి పోయింది. ఆ విషాదంలో బార్త్ రాసుకున్న డైరీ ఇది. అందులో వాక్యాలు కొన్ని అయినా తెలుగు చేద్దామని ఈ విఫల ప్రయత్నం.



అక్టోబర్ 27
-"నీకు స్త్రీ దేహం అంటూ తెలుసా?"
-తెలుసు. వొకే వొక్క స్త్రీ దేహం...అమ్మ దేహం...జబ్బు పడి, చనిపోతూ...


నవంబరు 4
సాయంత్రం ఆరు గంటలు
గది వెచ్చగా దీపకాంతిలో ఆహ్లాదంగా

నేనే పట్టుబట్టి
గదిని అలా మార్చాను (వొక చేదు ఆహ్లాదం)

ఓ, ఇక నించి నేనే నాకు అమ్మని!


నవంబరు 11
ఏకాకితనం అంటే
"బయటికి వెళ్తున్నాను.
ఫలానా టైమ్ కి మళ్ళీ వస్తాను.
లేకపోతే ఫోన్ చేస్తాను"

ఇంటికి వస్తూనే
"వచ్చేశాను.."

అని చెప్పడానికి
ఎవరూ లేకపోవడం!

నవంబరు 26

మరణానంతర విషాదం
మరీ దారుణం
తెగదూ
ముడిపడదూ

జనవరి 16

నా లోకం
బల్లపరుపు

యేమీ వినిపించదు
ప్రతిధ్వనించదు
గడ్డకట్టదు
కరగదు.


మార్చి 22

ఉద్వేగం తగ్గిపోతుంది
బాధ మిగిలిపోతుంది.
Category: 5 comments

సారంగ బుక్స్ తొలి కానుక!



పదేళ్ళ కవిత్వం “అనేక”సారంగ బుక్స్ తొలి కానుక త్వరలో!!


తెలుగు కవిత్వం ఈ పదేళ్ళలో తిరిగిన మలుపులు, దాటుకొచ్చిన చౌరాస్తాలూ, చేరుకున్న అనేక మజిలీలూ...అన్నీ సాక్షాత్కరించే నిలువెత్తు అద్దం “అనేక”. అఫ్సర్, వంశీ కృష్ణల సంపాదకత్వంలో...మీ ముందుకు...!

అక్షరం అనుభవంగా, అనుభవం అలజడిగా, అలజడి ఆందోళనగా మారిన నడుస్తున్న చరిత్రకి కదిలించే పదచిత్రాల డైరీ “అనేక”.

తెలుగు ప్రచురణ రంగంలో ఒకింత వేకువ, రవంత కదలిక, కాసింత స్వచ్చమయిన సాహిత్య పరిమళం లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న “సారంగ బుక్స్” తొలి కానుక “అనేక”.

తెలుగులో మంచి వచనం, మంచి కవిత్వం ఎక్కడ వున్న అది పాఠకుడి మనఃఫలకం మీద బలంగా ముద్రించాలన్న ఆశా, ఆకాంక్షలే “సారంగ”. ఆ దారిలో మొదటి అడుగు “అనేక”

మీలోని చదువరికి మేలుకొలుపు సారంగ
మీ ఆలోచనలూ అనుభవాల పొద్దు పొడుపు సారంగ.

సారంగ బుక్స్ ప్రచురణల వివరాలకు సంప్రదించండి:

www.saarangabooks.com

(ఈ వెబ్సైట్ ఇంకా తయారీలో వుంది...కొంచెం ఓపిక పట్టండి..)

400 పేజీలుదాదాపు 200 మంది కవులూ, కవితల కలయిక అనేక వెల: 199/-




అనేక ప్రతుల కోసం సంప్రదించండి:


Palapitta Books
Flat No: 3, MIG -II
Block-6, A.P.H.B.
Baghlingampally,
Hyderabad-500 044 AP India
Direct: 040-27678430
Mobile Phone: 984 878 7284

Email: palapittabooks@gmail.com
Category: 2 comments

హ్యూస్టన్ లో ఈ నెల వెన్నెల

ఇవాళ హ్యూస్టన్ లో నెల నెలా వెన్నెల!



TCA Telugu Contests 2010 &
Nela Nela Telugu Vennela
(నెల నెల తెలుగు వెన్నెల)
కార్యక్రమ వివరాలు
18-Dec-2010, 12.00 noon to 6.00 pm

Venue (విడిది): Shiridi Sai Jalaram Mandir
(13845 W Bellfort St., Sugar Land, TX 77498)

12.00 noon to 12.45 pm: Registration for various contests
1.00 pm to 2.30 pm: Contests for Reading, Writing, and Vocabulary for Levels 1, 2, and 3
1.30 pm to 3.00 pm: Nela Nela Telugu Vennela

Chief Guest: Sri Afsar

Afsar is a well accomplished poet and a great contributor to Telugu literature. His recent work includes a collection of Telugu poems called ‘వూరి చివర’. He is currently working as a lecturer for the Department of Asian Studies. He teaches courses in Telugu language, South Asian literature, and South Asian religions. Prof Afsar also writes regularly in his blog.

Other Speakers: Smt. Kalpana Rentala

Smt. Kalpana is an accomplished and well known writer. She her contributions to the literary world are far and wide. She writes regularly in her blog.

Sri Chittenraju Vanguri
Sri Chittenraju is a famous writer well known for his sensible humor. He has several books to his credit. He is a publisher and a philanthropist. His services to the world of Telugu literature are invaluable.

3.30 pm to 4.30 pm: Poem Recitation contest

4.30 pm to 5.30 pm Speech contest

5.30 pm to 6.00 pm Distribution of participant certificates and trophies
Category: 0 comments

"అన్నీ ప్రశ్నలే.." అన్న అలజడి పెరగాలి!

మిగిలిన భాషల్లో వచన సాహిత్యం బాగా వస్తోంది. మిగిలిన సాహిత్య ప్రక్రియల కన్నా, ఇప్పటికీ మన వచన కవిత్వం బలంగా వుంది. అందులో అనుమానం లేదు. కానీ, వచనం బలపడనంత కాలం మన సాహిత్యానికి వెలుగు లేదు. సాహిత్యం పరిణతి సాధించాలంటే వచన ప్రక్రియలు బాగు పడాలి. అన్నిటికీ సమాధానాలు దొరికిపోయాయన్న తృప్తీతో మనం ఆగిపోతున్నాం. “అన్నీ ప్రశ్నలే మాకు…అన్నీ ప్రశ్నలే మాకు.” అన్న అలజడి పెరగాలి. అప్పుడు వెతుకులాట మొదలవుతుంది. 50లలో , 70లలో రచయితల్లో ఆ వెతుకులాట వుండేది. ఆ కాలంలో వచ్చినంత వచనం తెలుగులో మరెప్పుడూ రాలేదు. ఇప్పుడు అంత వచనం లేదు. అనువాదాలు పెరిగితే మనం ఎక్కడున్నామో, ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. అస్తిత్వ చైతన్యం గురించి మన ఆలోచనలు ఇంకా సూటిగా వుండాలి. ఇప్పటికీ శుద్ధ మానవతా వాదం, శుద్ధ కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. ప్రపంచ సాహిత్యం ఎంతో కొంత చదివే తెలుగు వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అన్యాయం.

ఇక తెలుగులో వున్నవీ, ఇతర భాషల్లో లేనివి….అంటారా? అది చెప్పడం అంత తేలిక కాదు. ఆ భాషల గురించి నాకు వున్న పరిచయం సరిపోదు. కానీ, literary activism అనేది తెలుగులో ఎక్కువ అనుకుంటాను. శతక కవులూ, గురజాడ నించీ ఇది వున్నా, ఇటీవల స్త్రీ, దళిత, ముస్లిం వాదాల వల్ల ఎక్కువ సాధ్యమయింది. సాహిత్యానికీ, బయటి జీవితానికీ, ఉద్యమాలకూ మనం ఇస్తున్న ప్రాధాన్యం మనల్ని కొంత భిన్నంగా నిలబెడుతుంది.

(మిగతా "పొద్దు" లో చదవండి)
Category: 0 comments

నిజంగా మరణం




ఆకలో
వుప్పెనో
ఆగిన గుండె చప్పుళ్ళో
కాదు మరణమంటే.


ఒక మాట నిలువునా చీలిన చోట
ఒక దృశ్యం నిర్లిప్తంగా నిష్క్రమించిన చోట
ఒక మనిషి నిశ్శబ్దంలోకి వెలివేయబడిన చోట
నిజంగా మరణం.


హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే.

వెంట వచ్చిన విశ్వాసం నిర్దాక్షిణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడూ

ఒక గాయాన్ని గుండెకి గులాబీగా గుచ్చి
ఒక పరిచిత హస్తం
మృత్యుఖడ్గంగా రూపెత్తిన ప్పుడూ

నిజంగా మరణం.

("ఇవాళ" 1990 నించి)
Category: 7 comments

మన నలిమెల దారి...!



నలిమెల భాస్కర్ అంటే నాలుగు భాషల కలయిక. అనేక భాషా సాహిత్యాల వంతెన. తెలుగు సాహిత్యంలో అతనొక ఆశ్చర్యం. తెలుగు సాహిత్యమే సరిగా చదవలేని కాలం దాపురించినప్పుడు, కష్టపడి అనేక భాషలు నేర్చుకొని, వాటి సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసే సత్సంకల్పంతో నాలుగు దశాబ్దాలుగా భాస్కర్ చేసిన కృషి అసాధారణమయింది. ఈ వారం హైదరబాద్ లో ఆయన నాలుగు పదుల సాహిత్య కృషికి సత్కారం జరుగుతోంది. ఈ సందర్భంగా అయినా, భాస్కర్ చేసిన కృషి గురించి సరయిన చర్చ జరగాలని నా కోరిక. భాస్కర్ లాంటి అనేక భాషా సాహిత్యాల అభిరుచి వున్న వారు ఇంకా కొంత మంది తయారయితే అది తెలుగు సాహిత్యానికి బలం! నలిమెలని అభినందిద్దాం. ఆయన దారిని కొన్ని అడుగులు వేద్దాం.
Category: 3 comments

కవిత్వ భాష గురించి ....!

వంశీ:

మీ ప్రశ్నలు బాగున్నాయి, ఎప్పటిలానే చాలా హాస్యస్ఫోరకంగా వున్నాయి. మీ వాక్యం ఢమరుకం అని నేనే ఎక్కడో అన్నాను కదా. సరదాగా/ సీరియస్ గా చదువుకొని ఆనందిస్తున్న/ ఆలోచిస్తున్న సమయంలొ వర్మ గారు "వాటికి సమాధానం ఇవ్వరా? " అని నిలదీశారు.

వాటన్నిటికి సమాధానం ఇచ్చే శక్తిగాని యుక్తిగానీ నాకు వున్నాయని అనుకోను. కాని, వొక ముఖ్యమయిన విషయం మీ ప్రశ్నల్లో వుంది. కవిత్వం చదవడం కచ్చితంగా భిన్నమయిన అనుభవం. ఈ కవిత 1996లో మొదటి సారి "ఇండియా టుడే" సాహిత్య వార్షికలో అచ్చయింది. తరవాత అనేక సంకలనాల్లో చేరింది. కనీసం ఇద్దరు దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక అనువాదం ఇండియన్ లిటరేచర్ ఆంగ్ల పత్రికలొ అచ్చయింది. మరో అనువాదం నా.సి. (కొత్త పాళీ) గారి బ్లాగులో ఆయనే చేసారు. ఇక్కడ దీన్ని పవర్ఫుల్ కవిత అని వ్యాఖ్యానించిన వారు కూడా ఆయనే. ఇప్పటి వరకూ చాలా మంది విమర్శకులు ఈ కవితని ఉల్లేఖిస్తూ రాసారు.

వారెవ్వరూ ఇంత ఆసక్తి కరమయిన ప్రశ్నలు అడగలేదు. రెండు భాషలతో వ్యవహరించవలసిన అనువాదకులు కూడా మీ మాదిరి అర్ధ సంక్షోభంలో పడలేదు.

సాధారణ భాషకీ, సాహిత్య భాషకీ మధ్య ఉన్న వ్యత్యాసం మీకు చెప్పేంత వాణ్ని కాదు. కాని, సాధారణ భాషని వాడుకుంటూనే, ఆ భాషనీ అసాధారణమయిన ఎత్తులకి తీసుకు వెళ్ళడం కవిత్వం చేసే పని అనుకుంటా. ఉదాహరణకి: ఉమ్మ నీరుని ఉమ్మి చేయ్యోద్దంటాను అన్నప్పుడు ఉమ్మ నీరులో ఏమేం ఉంటాయో ఒక శాస్త్రవేత్తగా చెప్పడం వేరు. ఉమ్మ నీరుకి అమ్మతనానికీ మధ్య ఉన్న ఉద్వేగపూరితమయిన ముడిని చెప్పడానికి శాస్త్రవేత్త భాష పనికి రాదు. అందులో పుట్టుకకి సంబంధించిన వేదన కూడా వుంది. ఆ వేదన, ఉద్వేగం ఎంతో కొంత అర్ధం అయ్యింది కాబట్టే, సౌమ్య వెంటనే " ఆర్ద్రంగా వుంది, కళ్ళు చెమర్చాయి" అని రాయగలిగారు అనుకుంటా -- వడ్రంగి పిట్ట కూడా "కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి" అన్నారు. కవిత "పవర్ఫుల్" గా వుంది అని కొత్త పాళీ అనడానికి కూడా ఎంతో కొంత ఈ ఉద్వేగమే కారణం అనుకుంటా.

అంత మంది అలా అన్నప్పుడు వారి స్పందనలోని నిజాయితీని అనుమానించ లేం.. కదా! కాబట్టి ఈ కవితలో సాధారణమయిన మాటలే ఏదో ఒక అసాధారణమయిన శక్తిని చూపిస్తున్నాయి. అదే కవిత్వీకరణ అనుకుందాం. మనలో గొప్ప భాషా శాస్త్రవేత్త కాని, శాస్త్రవేత్త కాని భాషని ఒక స్థాయి దాకా అందుకోగలరు. భాషని అత్యంత తర్కబద్దంగా ఉపయోగించగలరు. కాని, కవిత్వంలో వుండే వ్యాకరణం అర్ధం కావడానికి ఆ ఇద్దరికీ వుండే తర్కం మాత్రమె సరిపోదు. ఉద్వేగాన్ని తర్కించ లేమని బుచ్చి బాబు ఎక్కడో అంటాడు. మరి కవిత్వ భాష బ్రహ్మ పదార్థమా? కాకపోవచ్చు. కొందరి విషయంలో అవునూ అవవచ్చు.

కవిత్వ భాష భిన్నమయింది మాత్రం అనగలను. ఈ భాషని ఇక్షు రసంగా మార్చే వారు కొందరు, నారికేళ పాకం చేసే వారు కొందరు, పాషాణ పాకం చేసే వారు మరికొందరు. కానీ, ఈ కవితలో పాషాణ పాకం లేదని కూడా చెప్పగలను, ఎందుకంటే, కొంత మందికి ఇది అర్ధమయి, స్పందించే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి.


మీ ప్రశ్నలకి సమాధానం ఇంకా వెతకాలి నేను. ఆ వెతుకులాటకి ప్రారంభం ఈ కవిత్వ/ శాస్త్ర వ్యాకరణ వైరుధ్యం, భిన్నత్వం వొక ప్రారంభం మాత్రమే. కాని, ఈ కవితని ఇంకా చక్కగా, అర్ధ వంతంగా వివరించగల/వ్యాఖ్యానించ గల సమర్ధులు వున్నారనే నమ్మకంతో, వారి అభిప్రాయాల్ని సైతం ఆహ్వానిద్దాం.

నాకే జన్మభూమీ లేదు!




శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.

నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
'47 దగ్గిరే ఎలా విరిగానో

మీరెవరూ చెప్పలేదుగా -


దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా -


నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని -

దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.

ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.

అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.

రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!


నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.

నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.


నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.

నాలో సాగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.

నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.

అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.

శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.

ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో ఆంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.

నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.

నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.


విభజించి పాలించే నా శత్రువులారా,

నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.

1996

(ఒక డిసెంబరు ఆరు కి రాసిన కవిత...)
Web Statistics